Saturday, May 18, 2013

కాంగ్రెస్‌ చీలికలతో నీలం సంజీవరెడ్డి అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు


నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాలు ఆరంభం కానున్న నేపధ్యంలో....

కాంగ్రెస్‌ చీలికలతో నీలం సంజీవరెడ్డి అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

 (ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను
పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించిన 1969 నాటి పరిణామాలు)

అవి నేను నాగపూర్ లో ఎం. ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న రోజులు. 1969-1971 మధ్యకాలం. ప్రత్యేక తెలంగాణ-జై ఆంధ్ర ఉద్యమాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కళాశాలలు, విశ్వ విద్యాలయాలు మూత బడడంతో డిగ్రీ పూర్తి చేసుకున్న నాలాంటి కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు నాగపూర్ లాంటి ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా తనదంటూ రాజకీయాలలో ఒక ముద్ర వేసుకుంటున్న రోజులు. సిండికేట్ గా పిలువబడే అతిరథ-మహారథులైన కాంగ్రెస్ ఉద్దండ పిండాలను ఆమె మట్టికరిపిస్తున్న రోజులవి. భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి-చివరిసారి, ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత పదవికి తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి వ్యతిరేకంగా తనపార్టీవారినే ఓటేయమని ఇందిరాగాంధి ప్రోత్సహించిన రోజులవి. ఒక విద్యార్థిగా, రాష్ట్రపతి పదవికి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎలెక్టోరల్ కాలేజి అంటే ఏమిటి లాంటి విషయాలతో పాటు, రాజకీయాలలో సమీకరణలు ఎలా వుంటాయో అర్థం చేసుకుంటున్న రోజులవి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై నేను రాసుకున్న నోట్స్ ఆధారంగా ఇప్పుడు రాసిన వ్యాసం ఇది.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలకు ఎంతో విలు వుంది. నిర్ణయాలు మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీసుకున్నవైనప్పటికీ, సంఖ్యా పరంగా అతి కొద్దిమంది ఆలోచనలను, సూచనలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగినప్పటినుంచికూడా, మోడరేట్లనీ-అతివాదులనీ భిన్నాభిప్రాయాలవారున్నప్పటికి, వారందరి ధ్యేయం-లక్ష్యం స్వాతంత్ర్య సాధనొక్కటే. స్వాతంత్ర్యం వచ్చిన పిదప కూడా కాంగ్రెస్ పార్టీలోని భిన్నాభిప్రాయాలవారందరు కలివిడిగా జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో పనిచేశారు. వారిలో అతివాద, మితవాద భావాలవారున్నారు. అతివాద సిద్ధాంతాలకు దగ్గరైన సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పాలన చేసిన నెహ్రూ, పార్టీలోని మితవాద భావాల వారినుండి అడపాదడపా ఎదురైన ప్రతిఘటనలను అధిగమించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. పార్టీని నడిపించారు. నాటి పరిస్థితుల్లో పార్టీపరంగా ఆయన అవలంబించిన మధ్యేమార్గం చక్కగా పనిచేసింది. ఆయన మరణానంతరం, పార్టీలోని బలీయమైన మైనార్టీ మితవాద శక్తులు, అభివృద్ధి మార్గాన్ననుసరిస్తున్న నాటి ప్రధాన మంత్రికి అడ్డంకులు-అవరోధాలు కలిగించడంతో, భారత జాతీయ కాంగ్రెస్ లో చీలి కొచ్చి, దరిమిలా కాంగ్రెస్ (ఐ) ఆవిర్భవించి, ఈ నాటికీ దేశ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని, వర్తమాన రాజకీయాల్లో ఒక అతి ముఖ్యమైన ఘట్టంగా పరిణమించిందనవచ్చు.

అయితే భారత జాతీయ కాంగ్రెస్ లో అంతకుముందు చీలికలు లేవనిగాని-రాలేదనికాని అనలేం. 1907 లో నాగపూర్ లో జరగాల్సిన అఖిలభారత కాంగ్రెస్ సభలు వాయిదాపడి, తర్వాత, సూరత్ లో జరిగాయి. అతివాద భావాల వారికి నాయకత్వం వహిస్తున్న బాలగంగాధర తిలక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికకావడం ఇష్టపడని మాడరేట్లు, సభలను సూరత్ కు మార్చి, రాష్ బిహారీ ఘోష్ కు నాయకత్వం అంటగట్టారు. సభా ప్రాంగణంలో వాగ్యుద్ధాలు తీవ్రస్థాయిలో జరిగాయి. పాత తరం నాయకత్వమని-కొత్తతరం నాయకత్వమని, రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. అతివాద భావాల వారు వేరుకుంపటి లాంటిది పెట్టుకొని, తమను తాము అసలైన జాతీయ వాదులుగా వర్ణించుకున్నారు. ఇక ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాల వరకు పార్టీపై మాడరేట్లే ఆధిపత్యం. దరిమిలా పరిస్థితుల్లో మార్పు కనబడ సాగింది. అతివాదులుగా ముద్రపడిన వారంతా మాతృసంస్థైన కాంగ్రెస్ లో తిరిగి చేరడంతో, భవిష్యత్ లో జరుగనున్న పరిణామాలకు సూచనలు పొడచూపాయి. నాయకత్వంలో కూడా మార్పులు-చేర్పులు చోటుచేసుకోవడం ఆరంభమయింది.


1969నాటి చీలిక, 1951లో సంభవించిన నాసిక్ సంక్షోభం, ఓ మోస్తారు అనాలి. కాకపోతే, అధ్యక్ష పదవికి అతి తీవ్రంగా జరిగిన పోటీలో, ఆచార్య జె. బి. కృపలానీని ఓడించిన పురుషోత్తమ దాస్ టాండన్, దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, రాజీనామా చేశారు. చేసి తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. కాంగ్రెస్ లో చీలికను నివారించారప్పట్లో. 1969లో దీనికి విరుద్ధంగా, నాటి అధ్యక్షుడు నిజలింగప్ప వ్యవహరించడంతో, చీలిక అనివార్యమయింది.

నవంబర్ 1969లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోవడానికి ప్రధాన కారణం, అంతకు కొద్ది నెలలక్రితం, జులై నెలలో, బెంగుళూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తలెత్తిన వివాదమే. అప్పట్లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోను, జవహర్లాల్ నెహ్రూ హయాంలోను, సామాజిక-ఆర్థిక-విధానపరమైన విషయాలలో భేదాభిప్రాయాలు-భిన్న ధృక్ఫధాలున్నవారు అనేకమంది వున్నప్పటికీ, వారంతా కాంగ్రెస్ గొడుగు కింద పనిచేసి, ఐకమత్యంగా పార్టీ బలపడేందుకు ఉమ్మడిగా కృషిచేశారు. నాలుగో సాధారణ ఎన్నికలనంతరం, ముఖ్యంగా 1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత, దేశ రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలోపలా-వెలుపలా, తరచూ, "అతివాద-మితవాద" శక్తుల-వ్యక్తుల ప్రస్తావన రావడం ఆరంభమయింది.

ఇదొక్క కాంగ్రెస్ కే పరిమితమై పోలేదు. అన్ని పార్టీలలోనూ ఈ సంఘర్షణ మొదలైంది. ఆ రోజుల్లో "సిండికేట్" గా సంబోధించబడే కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్. కె. పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు), నీలం సంజీవరెడ్డి లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. బాంకులను జాతీయం చేయడానికి అతివాదులు మద్దతిస్తే, సిండికేట్ వర్గం వారు వ్యతిరేకించారు. బెంగుళూర్ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై వచ్చిన విమర్శల లాంటివి ఇరువర్గాల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలకు దారితీశాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న అతివాద వర్గం, సిండికేట్ వర్గం వారిని "సామ్యవాద-లౌకికవాద" విధానాలను వ్యతిరేకించేవారన్న నిర్ణయానికి వచ్చారు.

ఇందిరాగాంధి తీసుకున్న బాంకుల జాతీయం నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా బలపరుస్తూనే, సిండికేట్ ఒక అడుగు ముందుకు వేసి, నీలం సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాడు నిజలింగప్ప. ఇందిరాగాంధి సూచించిన వి. వి. గిరి పేరును గానీ, జగజీవన్ రాం పేరును గానీ పరిగణలోకి తీసుకోలేదు. ప్రధాన మంత్రిగా తాను సూచించిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తిని పార్లమెంటరీ బోర్డ్ ఎంపిక చేయడాన్ని, దాని వెనుక నున్న ఉద్దేశాన్ని తప్పుబట్టింది ఇందిరాగాంధి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాల్సిన అభ్యర్థి విషయంలో మెజారిటీ నిర్ణయంకన్నా ఏకాభిప్రాయం ముఖ్యమని తేల్చిచెప్పిందామె. దెబ్బకు దెబ్బగా, మొరార్జీ దేశాయ్ ని ఆర్థిక శాఖనుంచి తొలగిస్తూ నిర్ణయం ప్రకటించింది. భవిష్యత్ లో తాను తీసుకోదలచిన ఆర్థికపరమైన విధానాల అమలు బాధ్యతను మొరార్జీ మీద మోపలేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిచేసింది. వేరే శాఖను నిర్వహించడానికి ఇష్టపడని మొరార్జీ రాజీనామా చేశాడు.

జులై 19, 1969న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, 14 భారీ వాణిజ్య బాంకులను జాతీయం చేయాలని నిర్ణయం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించ తల్చుకున్న విధానాలకనుగుణంగా, సమసమాజ నిర్మాణం జరగాలంటే, ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరముందని ఆమె ప్రకటించారు. ఇందిరాగాంధి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీస్తే, వామపక్షాల సంపూర్ణ మద్దతు లభించిందామెకు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సంభవించనున్న భారీ మార్పులకు-రాజకీయ సమీకరణలకు-పునరేకీకరణలకు తొలి సూచనలు కనబడసాగాయి. పార్టీ ప్రణాళికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వారిపై ఇందిరాగాంధి బహిరంగంగానే విమర్శలు చేయడంతో, ఆమెను నియంత్రించే ప్రయత్నాలు జరిగినా, అవేవీ ఫలించలేదు.

వి. వి. గిరి స్వతంత్ర అభ్యర్థిగా-వామ పక్షాల మద్దతుతో, రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారు. ఆత్మ ప్రబోధం మేరకు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయమని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్-శాసనసభ సభ్యులకు ఆగస్ట్ 13, 1969, పిలుపునిచ్చింది ఇందిరాగాంధి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్న నిజలింగప్ప, తమ పార్టీ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్న స్వతంత్ర-జనసంఘ్ పార్టీల నాయకులకు, సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపట్టింది ఇందిరాగాంధి. ఆమె పక్షాన ఫకృద్దీన్ అలీ అహ్మద్, జగ్జీవన్ రాం కాంగ్రెస్ ఓటర్లకు ఆత్మ ప్రబోధం పిలుపివ్వడం జరిగింది. కాంగ్రెస్ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారి మద్దతు కోరడమంటే, ఏదో విధంగా ఎన్నికల్లో గెలుపు సాధించడమేనని, అది తప్పనీ, విలువలకు తిలోదకాలివ్వడమేననీ, ఇందిరాగాంధి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీలో చీలికను నివారించడానికే తాను "ఆత్మ ప్రబోధం" నినాదాన్ని ఇచ్చానని ఆమె పేర్కొంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వున్న కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఆమె ఆగస్ట్ 18, 1969 న లేఖ పంపుతూ, అందులో, "సరళీకృత, సామ్యవాద, ఆర్థిక సంస్కరణలను తేవాలని-అమలుచేయాలని అనుకున్నప్పుడల్లా, స్వప్రయోజన పరులు వాటిని వ్యతిరేకిస్తుంటారు" అని పేర్కొని, వారందరి మద్దతు కోరింది ఇందిరాగాంధి. ఇదిలా వుండగా, పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణ చేస్తూ, జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లకు కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప నోటీసులు పంపాడు. అయితే, పార్టీ విధానాలను పాటించనివారికి క్రమశిక్షణ గురించి మాట్లాడడంలో అర్థంలేదని ఇందిరాగాంధి పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో కొందరు కాంగ్రెస్ నాయకులు తమ స్వప్రయోజనాల కొరకు అవలంబించిన విధానాల వల్ల, ఎలా అభిమానులు పార్టీని వీడిపోయారో వివరించిందామె. జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లు తామే నిజమైన కాంగ్రెస్ వాదులమని, కాంగ్రెస్ వాదులు, ప్రజలు తమ వెంటే వున్నారని అధ్యక్షుడిచ్చిన నోటీసును సవాలు చేశారు. పార్టీకి చెందిన మెజారిటీ పార్లమెంట్-శాసనసభ్యులు ఇందిరాగాంధికి మద్దతు పలకడంతో, వి. వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. పార్టీపై ఆమెకున్న ఆధిక్యత ఋజువైంది.

ఒక వైపు పార్టీలో ఆమెకు లభించిన ఆధిపత్యం, మరోవైపు వామపక్షాల నుండి లభిస్తున్న మద్దతు, ఇందిరాగాంధికి ముందుకు కొనసాగడానికి ధైర్యాన్నిచ్చింది. లౌకిక వాదం మీద, ప్రజాస్వామ్యం మీద, సామ్యవాద సిద్ధాంతాల మీద నమ్మకం వున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపిచ్చిందామె. దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ కొద్దిమంది హక్కుభుక్తం కాదని, పౌరులందరికీ దానిపై హక్కుందని స్పష్ట పరిచింది. మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రూల అడుగుజాడల్లో కాంగ్రెస్ పనిచేస్తుందని-దేశాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేందుకు, ప్రజల-పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు, దేశవ్యాప్తంగా పర్యటించింది ఇందిరాగాంధి.

ఆమె తమిళనాడు పర్యటనకు కొద్దిరోజుల ముందు, కాంగ్రెస్ అగ్రనాయకుడు నిజలింగప్ప అనుకూల వాది కామరాజ్ నాడార్ తో వచ్చిన విభేదాలవల్ల, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధి మద్దతుదారుడైన సి. సుబ్రహ్మణ్యం రాజీనామా చేశాడు. దాన్ని సాకుగా చూపి, ఆయన్ను వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగే విషయంలో పేచీ పెట్టాడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప. ఇరువర్గాలు కొద్దిరోజుల కింద కుదుర్చుకున్న ఐక్యతా ఒప్పందానికి నిజలింగప్ప తీసుకుంటున్న చర్యలు విరుద్ధమైన వని పేర్కొంటూ, ఇందిరాగాంధి, వై. బి. చవాన్, జగ్జీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్, ఉమాశంకర్ దీక్షిత్, సి. సుబ్రహ్మణ్యంలు సంయుక్తంగా అధ్యక్షుడికి లేఖను పంపారు. ఇందిరాగాంధి, నిజలింగప్ప మద్దతు దారుల మధ్య విభేదాలు ముదిరిపోవడంతో, అక్టోబర్ 18, 1969, గడువుకంటే ముందే, నూతన అధ్యక్షుడు ని ఎన్నుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వర్కింగ్ కమిటీకి విజ్ఞప్తిచేశారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాసిన లేఖలో, గతంలో పార్టీ చేసిన తీర్మానాన్ని ఉదహరిస్తూ, సామ్యవాద-లౌకిక-అభివృద్ధికర విధానాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు జరిపేందుకు పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనీ-అందుకు పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలనీ, అందుకే అధ్యక్ష ఎన్నిక జరగాలనీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడానికి ఒకరోజు ముందర, నవంబర్ 1, 1969, సి. సుబ్రహ్మణ్యం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లను సభ్యులుగా తొలగిస్తూ నిజలింగప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో, ఇందిరాగాంధి మద్దతు దార్లు సమావేశానికి హాజరు కాలేదు. ఏ. ఐ. సి. సీ సమావేశం జరపాలని లేఖ పంపిన వర్కింగ్ కమిటీ సభ్యులందరూ ఇందిరాగాంధి ఇంట్లో సమావేశమయ్యారు. మెజారిటీ ఏ. ఐ. సి. సీ సభ్యుల అభ్యర్థన మేరకు నవంబర్ 22--23,1969న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించాలని తీర్మానం చేశారా సమావేశంలో. నవంబర్ 12న ఇందిరాగాంధిని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్టడంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. అత్యధిక సంఖ్యాకులైన ఇందిరాగాంధి మద్దతు దారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తప్పుబట్టి, నవంబర్ చివరి వారంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించి, సి. సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది.

ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించింది. అలా, అలనాడు, నీలం సంజీవరెడ్డి కారణాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చీలిపోయి, దరిమిలా కొన్నాళ్లకు, నేడు యుపిఎ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ (ఐ) గా అవతారమెత్తింది. ఆ తరువాత కాలంలో అదే సంజీవరెడ్డి ఏకగ్రీవ అభ్యర్థిగా రాష్ట్రపతి కాగలిగారు.

2 comments:


  1. ఇందిరాగాంధి తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచివి;కొన్ని తప్పు నిర్ణయాలు.1985లో రాజీవ్ communications రంగంలో తీసుకొన్న నిర్ణయాలు ,పీ.వీ.గారు ఆర్థిక,పారిశ్రామికరంగంలో తీసుకొన్న నిర్ణయాలు ఇందిరాగాంధి 1972-1975 మధ్యతీసుకొనివుంటే మనదేశం ఈపాటికి చైనాను మించిపోయివుండేది.సమష్టి నిర్ణయం గా నిలబెట్టిన సంజీవరెడ్డికి వ్యతిరేకంగా గిరిగారిని నిలబెట్టడం కూడా తప్పే.
    ఇంక సంజీవరెడ్డిగారిని గురించి చెప్పాలంటే ఆయన సమర్థుడని పేరు పొందాడుగాని ఎప్పుడూ పాపులర్ లీడర్ కాలేదు.తమిళులతో కలిసి మద్రాసులో ప్రకాశంగారిని పదవీ చ్యుతుణ్ణి చెయ్యడం,విశాఖ ఉక్కుకర్మాగారాన్ని రాకుండా చెయ్యడం,వంటి పనులవలన ప్రజల్లో చెడ్డ అభిప్రాయం కలిగింది.(ఈ ఆరోపణలు నిజమో కాదో కాని ఆ అపప్రథ మాత్రం ఆయన్ని చుట్టుకుంది.) తన స్వంత జిల్లా ఐన అనంతపురంలోకూడా ఆయనకి వ్యతిరేకత ఎక్కువగా ఉండేది. ఏది ఏమైనా,రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించిన ఒక ఆంధ్రునిగా,సమర్థుడైన పరిపాలకునిగా ఆయనకీ సందర్భంలో నివాళి నర్పిద్దాము.

    ReplyDelete
    Replies
    1. Sanjeeva Reddy is also widely unpopular in Telangana as he violated gentlemen's agreement

      Delete