బయ్యారం
గనుల వ్యవహారంలో తెలియని కోణాలు
వనం జ్వాలా నరసింహారావు
వైఎస్ హయాంలో
రక్షణ స్టీల్స్ కు కేటాయించిన బయ్యారం గనులను, రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసి,
విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడంతో వివాదం చెలరేగింది.
"బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు" అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు, వారితో సహా
పలువురు ఇతర పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు
పట్టడమే కాకుండా, ఎట్టి పరిస్థితుల్లోను అక్కడి నుంచి
ముడిసరుకు తరలి పోకుండా అడ్డుకుంటామని సవాలు విసిరారు. ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లా
వాసిగా, బయ్యారం గనుల గురించి చిన్నతనం నుంచే వింటున్న
వ్యక్తిగా, ఎప్పుడో 60 ఏళ్ల కిందే అక్కడ గనుల
నుంచి ముడిసరుకు వెలికి తీసి విదేశాలకు రవాణా చేశారని ఆ నోటా ఆనోటా తెలుసుకున్న
వాడిగా కొన్ని విషయాలు పాఠకులతో పంచుకునే ప్రయత్నమే ఇది.
ఖమ్మం జిల్లాలో
స్వర్గీయ మూల్పూరి అక్కయ్య చౌదరి గురించి వినని వారు లేరు. ఆయనో వ్యాపార వేత్త.
ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లితో సహా జిల్లాలోని పలు ప్రదేశాలలో రకరకాల వ్యాపారాలు
చేసేవారు. కవి, రచయిత కూడా. ఆయనగారికి మైనింగ్ మీద అమితమైన మక్కువ.
ఖమ్మం జిల్లాలో అనేక ప్రదేశాలలో రకరకాల గనులున్నాయని, అపారమైన
ఆ ఖనిజ సంపదను వెలికి తీసి వ్యాపారం చేయాలని అనుకునే వ్యక్తుల్లో ఆయన ప్రథముడు. 1909 జులై నెలలో జన్మించిన
ఆయన తన 80 వ ఏట 1989 నవంబర్‌లో మరణించారు.
నిజానికి "బయ్యారం అంటే అక్కయ్య చౌదరి అని, అక్కయ్య
చౌదరి అంటే బయ్యారం అని" ఆ ప్రాంతంలో అనుకునే వారు ఆ రోజుల్లో. ఆయన నేపధ్యం, అభిలాష
తెలుసుకున్న బయ్యారం చుట్టుపక్కల గ్రామస్థులు కొందరు, వాళ్ల
వూళ్లో కాకి రాయి, ఎర్ర రాయి వుందన్న విషయాన్ని ఆయన దృష్టికి
తీసుకొచ్చారు 1953
ప్రాంతంలో. అక్కయ్య
చౌదరి వెంటనే తనకు తెలిసిన కొందరు శాస్త్రవేత్తలతో ఆ పరిసరాలను అధ్యయనం చేయించి,
అక్కడ లభించే ముడిసరుకుని విశ్లేషణ చేయించారు. అక్కడ రాయిలో 62%-64% వరకు ఫెర్రిక్
కన్టెన్ట్ వుందని తేలడంతో, నాటి హైదరాబాద్ ప్రభుత్వానికి చెందిన గనుల
శాఖాధికారులను కలిశారు. బయ్యారం గ్రామంలోని 1500 ఎకరాలను, పక్కనే
వున్న ఇర్సలాపురం గ్రామంలో 986 ఎకరాలను ఖనిజం తవ్వేందుకు లీజుకు తీసుకున్నాడాయన.
అంటే ఎప్పుడో 60 ఏళ్ల
కిందే అక్కడ గనులను ప్రభుత్వం లీజుకిచ్చింది అన్న మాట. అక్కయ్య చౌదరి ప్రభుత్వ
దృష్టికి తీసుకొచ్చేంతవరకు బయ్యారంలో ఉక్కు ఖనిజం వుందన్న సంగతే ఎవరికీ తెలియదు. ఆ
తరువాత సుమారు పదేళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖకు చెందిన భూవిజ్ఞాన
శాస్త్రజ్ఞులు ఎస్సార్ శర్మ, అప్పావధానులు అక్కడ అధ్యయనం
చేసి సుమారు నూట పది లక్షల టన్నుల ఇనుప ఖనిజం అక్కడ లభ్య్యమవుతుందని అంచనా వేశారు.
ఈ నాటికీ అదే శాస్త్రీయ అధ్యయనం. కాకపోతే
అందులో సగం మాత్రమే 62%-64% ఫెర్రిక్ కన్టెన్ట్ వుంటుందని అంచనా వేశారు
వాళ్లు.
అక్కయ్య చౌదరి 1954 లో గనులను లీజుకు
తీసుకుని,
మైనింగ్ చేసి, ముడిసరుకును సరాసరి జపాన్ కు
ఎగుమతి చేసేవారు. అప్పట్లో చౌదరి మైనింగ్ కంపెనీ పేరుతో సగటున ఏడాదికి 20,000
టన్నుల
ముడిసరుకును ఎగుమతి చేసేవారట. బయ్యారం నుంచి విజయవాడ వరకు లారీలలో, అక్కడినుంచి
బందర్ (మచిలీపట్నం), కాకినాడలకు పడవలలో తీసుకెళ్లి, బందర్-కాకినాడలనుంచి జపాన్ కు పంపేవారు. అక్కయ్య చౌదరికి చెందిన చౌదరి
మైనింగ్ కంపెనీకి 50% వాటా, మిగిలిన
50% వాటా గూడూరు
మైకా మైనింగ్ కంపెనీకి చెందిన గోగినేని వెంకటేశ్వర రావుకు వుండేది. ఇంతలో 1958 లో "మినరల్స్
అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్" (ఎం.ఎం.టి.సి) స్థాపించింది కేంద్ర
ప్రభుత్వం. ప్రభుత్వ మైనింగ్ విధానం మారింది. మైనింగ్ కంపెనీలు సరాసరి ముడిసరుకును
విదేశాలకు ఎగుమతి చేయరాదన్న నిబంధన విధించింది ప్రభుత్వం. ఎం.ఎం.టి.సి ద్వారానే ఎగుమతి జరగాలని స్పష్టం చేయడం
జరిగింది. దానికి తోడు అనేక ఇతర నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. ఇంతకు ముందున్న
ధర కంటే తగ్గించి, టన్నుకు రు. 21 లుగా విధించారు. ఆ ధర
కూడా బయ్యారం సమీపంలోని గుండ్రాతిమర్గు రైల్వే స్టేషన్‌కు చేర్చిన తరువాతే నని
చెప్పారు. అంతే కాకుండా ఏడాదికి 10, 000 టన్నుల కంటే ఎక్కువగా
ఎగుమతి చేయరాదని మరో నిబంధన విధించారు. ఆ విధంగా టన్ను ధర తగ్గించడం, లేబర్
ధరలు పెరిగి పోవడం, డీజిల్ ధర పెరగడం, అప్పుడప్పుడే
పుట్టుకొచ్చిన నక్సలైట్ సమస్య తలెత్తడం లాంటి అడ్డంకులు కలగడంతో 1969 లో, దాదాపు 15 సంవత్సరాల పాటు చేసిన మైనింగ్‌ను
వదులుకున్నారు అక్కయ్య చౌదరి. వాస్తవానికి నక్సలైట్ సమస్యను అధిగమించడానికి పోలీస్
రక్షణ కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. ప్రభుత్వానికి లేఖ
రాసి మైనింగ్ నుంచి విరమించుకున్నారు. ఇక నాటి నుంచి రక్షణ స్టీల్స్ కు లీజుకు
ఇచ్చేవరకు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూనే వుంది. ఇది జగమెరిగిన సత్యం.
ఈ
విషయాలను, బయ్యారం గనులకు సంబంధించిన మరిన్ని విషయాలను,
అక్కయ్య చౌదరి కుమారుడు 75 సంవత్సరాల ఆచార్య ఎం.
వెంకటేశ్వర రావు వివరిస్తూ ఇనుప ఖనిజం గురించి ఆసక్తికరమైన సంగతులు చెప్పారు.
అక్కయ్య చౌదరికి గనులన్నా, మైనింగ్ అన్నా ఎంత ఇష్టమంటే, తన
కుమారుడిని, ఇంజనీర్-డాక్టర్ చేయకుండా
జియాలజిస్ట్ చేయాలనుకున్నాడు. డిగ్రీ జియాలజీతో, ఫీజి
జియాలజీతో చేశారు వెంకటేశ్వర రావు. పీజీ
తరువాత, బయ్యారం గనులపైనే పిహెచ్. డి చేశారాయన. ఆ తరువాత
కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కొంతకాలం కొత్తగూడెం పీజీ
కేంద్రంలో గనుల విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారాయన. ఆయన చెప్పినదాన్ని బట్టి,
భారత దేశంలో నాణ్యమైన ఇనుప ఖనిజం జార్ఖండ్‌లోను, ఛత్తీస్‌ఘడ్ లోను, ఒరిస్సా రాష్ట్రంలోను
లభ్యమవుతుందన్నారు. జగ్దల్‍పూర్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సరఫరా అవుతున్న
ఖనిజం కూడా మంచిదే అన్నారు. బయ్యారంలో లభ్యమయ్యే ఖనిజం అటు వైజాగ్ ఉక్కు
కర్మాగారానికి కాని, ఆ ప్రాంతంలోనే నెలకొల్పే కర్మాగారానికి
కాని అంతగా పని కొచ్చే నాణ్యమైన సరుకు కాదని ఆయన అభిప్రాయం. పరిమాణం కోణంలో
ఆలోచించినా తనకు తెలిసినంతవరకు దీర్ఘకాలం సరిపోయేది కాదంటారాయన. తక్కువ నాణ్యత
నుంచి ఎక్కువ నాణ్యతకు పెంచడానికి పని కొచ్చే పెల్లిటైజేషన్ ప్లాంట్ బయ్యారంలో
నెలకొల్పితే మంచిదని వెంకటేశ్వర రావు అంటారు. వాస్తవానికి 1969 లోనే పాల్వంచలో
పెల్లిటైజేషన్ ప్లాంట్ పెట్టడానికి అక్కయ్య చౌదరి ప్రయత్నం చేశారు. ప్రభుత్వంతో
సంప్రదింపులు కూడా చేశారు. అప్పట్లో, ఐక్య రాజ్య సమితి అభివృద్ధి
సంస్థ కార్యక్రమం కింద దానిని చేపట్టే ఉద్దేశంతో, ఆ సంస్థ
అధ్యయన బృందం బయ్యారం పర్యటించింది కూడా. నాటి ఖమ్మం కలెక్టర్ ఆర్. పార్థసారథి,
నాటి రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ రంగ సాయి బయ్యారం వచ్చిన బృందంలో
వున్నారు కూడా. దురదృష్టవశాత్తు ఆ బృందం కేవలం బయ్యారం గ్రామం వరకే పోగలిగింది
కాని, ఖనిజం లభ్యమయ్యే స్పాట్‌కు వెళ్లలేక పోయింది. దానికి
కారణం ఆ ప్రాంతంలో ఆనాడు చోటుచేసుకున్న నక్సలైట్ సమస్యే. అప్పట్లో జిల్లా ఎస్. పీ
గా ఆర్. కె. రాగాల వుండేవారు. ఏదేమైనా పెల్లిటైజేషన్ ప్లాంట్ మాత్రం స్థాపించడం
జరగలేదు. కాకపోతే స్టీల్ ప్లాంట్ లాంటిది ఒకటి పాల్వంచలో 1970 ప్రాంతంలో
నెలకొల్పబడినప్పటికీ తొందరలోనే పనిచేయకుండా పోయింది.
బయ్యారం
గనులపై శాస్త్రీయ అధ్యయనం చేసిన వారిలో ఏ. ఎం. హేరాన్ ఒకరు. ఆయన ఐదు దశాబ్దాల
క్రితం హైదరాబాద్ జియలాజికల్ సర్వే శాఖలో సూపరింటెండెంట్ గా పని చేసేవారు. ఆయన
బయ్యారం గనులపై ఓ పుస్తకం రాశారు కూడా. అలానే ఎస్సార్ శర్మ, అప్పావధానులు
కూడా అధ్యయనం చేశారు. వాస్తవానికి ఖమ్మం పరిసరాలలో అన్ని రకాల ఖనిజ నిల్వలున్నాయి.
కాకపోతే అందులో చాలా భాగం రెండో రకానికి చెందినవే. తవ్వగా-తవ్వగా ఏదో ఒక చోట ఒక
చిన్న ముక్క నాణ్యమైంది దొరుకుతుంది అంటారు వెంకటేశ్వర రావు. ఆయన పి. హెచ్. డి
అధ్యయనం కూడా ఆసక్తికరంగానే వుంటుంది.
వేంకటేశ్వర రావు గారి
మాటలను అర్థం చేసుకుంటే, ఒక విషయం స్పష్టమవుతుంది. నాణ్యత
దృష్ట్యా, లభ్యమయ్యే మోతాదు దృష్ట్యా, స్థానిక
అవసరాల దృష్ట్యా, రవాణా-ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే,
బయ్యారం సమీపంలోనే ఉక్కు కర్మాగారాన్ని కాని, శుద్ధి
కర్మాగారాన్ని కాని ఏర్పాటు చేయడం మంచిది. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు ఇక్కడ నుంచి
రవాణా చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా
బయ్యారం పరిసరాలలోనే కర్మాగారం నెలకొల్పి "బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు"
అన్న నినాదాన్ని కార్యరూపంలో తేవడం ప్రభుత్వ కనీస బాధ్యత.
No comments:
Post a Comment