Thursday, May 30, 2013

బీసీలకు అధికారం ఎండమావేనా?: వనం జ్వాలా నరసింహారావు

బీసీలకు అధికారం ఎండమావేనా?
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు విడి-విడిగానే పనిచేసేవి. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చొరవతో, జులై 1957 లో, అల్లూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్ కి రాజకీయ పార్టీకుండాల్సిన లక్షణాలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితీ అంతే. ప్రజల మద్దతున్న పార్టీ అయినప్పటికీ, అందులో అంతా నాయకులే తప్ప సుశిక్షితులైన అనుచరుల (కాడర్) కొరతుందనే అనాలి. ఆవిర్భావం నుంచి, చాలా కాలం వరకు, పెద్ద చదువులు చదువుకున్న పట్టణ ప్రాంతం వారితో ను, అగ్ర కులాలుగా పిలువబడే వారితో ను-అందునా అధిక సంఖ్యా కులు బ్రాహ్మణ కులానికి చెందినవారితో ను, పార్టీ నాయకత్వం పనిచేసేది. పట్టాభి, అయ్యదేవర, ప్రకాశం, ముట్నూరి, దుగ్గిరాల, కొండా, వీవీ గిరి, మాడపాటి, బూర్గుల, నీలం, కాశీనాథుని, పింగళి, వామన్ నాయక్, మెల్కొటె, జమలాపురం, కెవి రంగారెడ్డి లాంటి వారిని ఆ జాబితాలో ఉదహరించవచ్చు. స్వతంత్రం రాక పూర్వం పరిస్థితి అలా వుంటే, ఇక ఆ తర్వాత, బ్రాహ్మణే తర కులాలకు చెందిన ధనిక భూస్వామి వర్గాలలోని కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, వెలమ వారి ఆధిపత్యం మొదలైంది. ఇంకా కొనసాగొతుందిప్పటికీ. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో, ఈ తరగతులకు చెందిన వారిదే పూర్తి పెత్తనంగా మారడం, వారే ముఖ్యమంత్రులు-మంత్రులు-జిల్లా పరిషత్ అధ్యక్షులు-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కావడం మొదలైంది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అప్పటినుంచి కొంత మార్పొచ్చింది.

ఒక గురుమూర్తో, ఒక ముసలయ్యో, ఒక హనుమంతరావో, ఒక సంజీవయ్యో, ఒక అంజయ్యో తప్ప ముఖ్యమంత్రులైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనా, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా, అగ్ర వర్ణాల వారో, ధనిక వర్గాల వారో కావడమే కాని, వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు ఎక్కువగా రాలేదనే అనాలి. ఇందిరా గాంధి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలి కొచ్చిన తర్వాత, జరిగిన మధ్యంతర ఎన్నికలప్పటినుంచి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పు కనబడ సాగింది. వెనుకబడిన వర్గాల వారికి, దళితులకు కొంత ప్రాధాన్యత లభించడం మొదలైంది. సంఖ్యాపరంగా వారు మెజారిటీలో వుండడం, వారి ఓట్లు గెలుపుకు ముఖ్యం కావడం, ఈ మార్పుకు ప్రధాన కారణం. అయితే, జన్మతః అందరు వెనుకబడిన వర్గాలకు చెందిన వారైనప్పటికీ, అవకాశాల విషయానికొచ్చేటప్పటికి, కొందరికే ప్రాధాన్యత లభించింది. సామాజికంగా-ఆర్థికంగా పుంజుకున్న వారు, విద్యాధికులకే పైకి పోయే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి అవసరం రీత్యా పలువురికి అవకాశాలు రాసాగాయి. అయితే, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ నాయకత్వం ధనికుల-అగ్ర వర్ణాల వారి చేతుల్లో వున్నప్పటికి, పార్టీకి మద్దతిచ్చే వారిలో అధికులు దళితులు, వెనుక బడిన వర్గాల వారు, మైనారిటీలు కావడం విశేషం. ఇప్పటికీ, పూర్తిగా అవకాశం చేతికందకపోయినా, 1972 ఎన్నికల అనంతరం, అధిక సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, దళితులు చట్ట సభల్లో ప్రవేశించే వీలు కలిగింది. పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో సగానికి పైగా ఆ వర్గాల వారికే స్థానం లభించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ విభేదాలెంత మోతాదులో వుంటాయో, అంతకంటే ఎక్కువ మోతాదులో కుల-మత విభేదాలుంటాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకొనేటప్పుడు (ఎంపిక చేసేటప్పుడు), శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపకమప్పుడు, ఎన్నికల అనంతరం శాసనసభ పక్షం నాయకుడి ఎన్ని కప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విషయంలో, జిల్లా పరిషత్-మునిసిపల్ చైర్మన్ ఎన్ని కప్పుడు కుల రాజకీయాలకు అధిక ప్రాధాన్యతుంటుంది. ఇంతవరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, అడపాదడపా తప్ప, సర్వసాధారణంగా రెడ్డి, కమ్మ కులస్తులకే ఎక్కువ స్థానాలు ఎక్కువ సార్లు లభించాయి. స్థానిక సంస్థల్లో అంజయ్య పుణ్యమా అని రిజర్వేషన్లు కలిగించడంతో, వెనుకబడిన వర్గాల వారు అధిక సంఖ్యలో ఎన్నిక కాగలుగుతున్నారు. అంతకు ముందు, జిల్లా పరిషత్ చైర్మన్లు గాని, సమితి అధ్యక్షులు గాని ఒక పథకం ప్రకారం అగ్ర వర్ణాల వారే ఎన్నికయ్యేవారు. అందునా, తెలంగాణలో-రాయలసీమలో రెడ్లు, కోస్తాంధ్రలో కమ్మ వారు, ఉత్తరాంధ్రలో క్షత్రియులు ఎన్నికయ్యేవారు.

కాంగ్రెస్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అవతరించిన మరో రాజకీయ పార్టీ జనత పార్టీ. అంతకు ముందే కమ్యూనిస్ట్, ప్రజా సోషలిస్ట్, స్వతంత్ర లాంటి పార్టీలున్నప్పటికీ, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ నేపధ్యంలో మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జనత పార్టీకి ప్రాధాన్యముందనాలి. ఆ పార్టీ కూడా అగ్ర కులాల ఆధిపత్యంలోనే పనిచేసింది. నీలం సంజీవరెడ్డి జనత ఆంధ్ర విభాగం ఏర్పాటును లాంఛనంగా ప్రకటించి, దాని అధ్యక్షుడుగా తెన్నేటి విశ్వనాథంను నియమించారు. ఇప్పటి జాతీయ స్థాయి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అప్పట్లో విద్యార్థి విభాగం కన్వీనర్. జనత పార్టీ రాష్ట్ర కమిటీలో కేవలం ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారుండగా, మిగిలిన 85% మంది ఇతరులున్నారు. కాకపోతే, వారిలో ఒక ముస్లిం, ఇద్దరు మహిళలు కూడా వున్నారు. 1977 ఎన్నికల ముందు ఏర్పాటుచేసిన అడహాక్ కమిటీ పరిస్థితి కూడా అంతే. అందులో షెడ్యూల్డ్ కులాల వారు, తెగల వారు, వెనుకబడిన వర్గాల వారందరు కలిసి కేవలం 23% మంది మాత్రమే సభ్యులయ్యారు. ఆ తర్వాత కొన్ని మార్పులు-చేర్పులు చేసినా, అవన్నీ రాజకీయ కోణం నుంచే కాని వెనుకబడిన వర్గాల వారి ప్రాధాన్యతను పెంచేందుకు కాదు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు వెనుకబడిన వర్గాల వారు, ఒక్క ముస్లిం అభ్యర్థి తప్ప మిగిలిన అందరూ ఇతరులే. ప్రజల-ఓటర్ల మద్దతు పొందేందుకు 1978 శాసనసభ ఎన్నికల్లో సుమారు 40% స్థానాలను ఆ వర్గాల వారికి కేటాయించింది జనత పార్టీ నాయకత్వం.

కమ్యూనిస్టు రాజకీయాలపై కూడా కుల ప్రభావం పడిందనాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ-సామాజిక-ఆర్థిక నేపధ్యంలో అవి తప్పవేమో! స్వతంత్రం రాక పూర్వం రాష్ట్రంలోని జాతీయోద్యమం బ్రాహ్మణుల నాయకత్వంలో చాలావరకు నడి చేది. రాయలసీమలోని రెడ్లు, కోస్తాలోని కమ్మ వారు, ఆధిపత్యం కొరకు బ్రాహ్మణులపై పోరాడారు. కోస్తాలోని కమ్మ వారికి, బ్రాహ్మణులను ఎదిరించేందుకు సరైన ఆయుధం కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లభించింది. అలానే రాయలసీమ రెడ్డి వారు కూడా. నిజా-నిజాలెంతో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో, కమ్యూనిస్ట్ వ్యూహం కాంగ్రెస్ పార్టీలోని కమ్మ-రెడ్డి విభేదాలను ఉపయోగించుకునే రీతిలో వుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కమ్యూనిస్టుల్లో కులం ముఖ్యమైనా-కాకపోయినా, చాలా కాలం వరకు అగ్ర కులాల వారి ఆధిపత్యంలోనే నాయకత్వం కొనసాగింది. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ పంథాకు అలవాటు పడి, బూర్జువా పార్టీల ధోరణులన్నీ వంటబట్టించుకున్న అతివాద-మితవాద-తీవ్రవాద కమ్యూనిస్టులు, కులం విషయంలో కూడా ఏమీ తీసిపోలేదనిపిస్తున్నారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ వారంటూ, ఆ పార్టీని ఓడించి, నేల నాలుగు చెరగు లా తెలుగు వాడి సత్తా నిరూపించాలని పిలుపిచ్చారు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు ఎన్ టీ రామారావు. ఆయన పిలుపునందుకొని వారు-వీరన్న తేడా లేకుండా ఆబాల గోపాలం ఆయన వెంట నడిచింది. కులమతాలకు అతీతంగా పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతి వారినీ విజయం వరించింది. అవినీతికి, అన్యాయానికి, వెనుకబడిన తనానికి వ్యతిరేకంగా ఎన్ టీ రామారావు మాట్లాడని రోజు లేదు. అంతవరకు బాగానే వుంది. మొదట్లో అవన్నీ పనికొచ్చాయి. క్రమంగా "ఆత్మగౌరవం" నినాదం స్థానంలో "రాజకీయ గౌరవం" ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్ టీ రామారావు ఆదర్శాలకు ఎదురుదెబ్బ తగిలి ప్రజాస్వామ్యం పరిహసించబడింది. ఆయన ప్రభుత్వాన్ని కూల దోసే నేపధ్యంలో కుల రాజకీయాలకే ప్రాధాన్యతుందనాలి. ఎన్ టీ రామారావును గెలిపించినప్పుడు కొందరు ఆయనను తమ కులానికి ప్రతినిధిగా మాత్రమే చూశారు. ఎప్పుడైతే అది కుదరలేదో, ఆ కులానికి చెందిన మరొకరిని ఆ పీఠంపై కూర్చొబెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వ్యక్తులే, అదను చూసుకుని ఆయన అధికారంలో కొనసాగడం మంచిది కాదనుకుని నాయకత్వం చేపట్టారు. తెలుగు దేశం పార్టీ కూడా కుల ప్రాధాన్యత విషయానికొచ్చే సరికి అన్ని రాజకీయ పార్టీల మార్గాన్నే అనుసరించిందనాలి. లెక్కలు పక్కన పెట్టి తే, మూడు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలలో కాని, మంత్రులలో కాని వెనుక బడిన వర్గాల వారి ప్రాధాన్యత మిగిలిన వారితో పోల్చి చూస్తే చాలా తక్కువే. నాయకత్వం సరిపడక పార్టీని వదిలి వెళ్ళి తిరిగొచ్చిన దేవేంద్ర గౌడ్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల వారి వాణిగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో ధనవంతులైన కొందరు బీసీ నాయకులు పార్టీ పెట్టి తమ వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ గా కూడా గెలిచారు. ఏమైందో-ఏమో, మళ్ళీ అవే రాజకీయాలు. కాంగ్రెస్ గూట్లో చేరారు. ఇలా ఉన్న ఒకటి-రెండు ఆశలను కూడా ఆ వర్గానికి చెందిన వారే అడియాసలు చేస్తుంటే ఎలా?

ఇవిలా వుండగా, కాంగ్రెస్ పార్టీని వీడిన వారు, అలిగి పోయిన వారు, రాజకీయ కారణాలతో కొంతకాలం బయటున్న వారంతా అగ్ర కులాల వారే. ఎన్జీ రంగా కేఎల్పీ పార్టీ, బ్రాహ్మణుల నాయకత్వంలో వెలిసిన కే.ఎం.పీ.పీ, మర్రి చెన్నా రెడ్డి డెమోక్రాటిక్ పార్టీ, స్వతంత్ర పార్టీ అలాంటివే. ఆధిపత్య పోరు కొరకే అవన్నీ. అందునా కుల ప్రాతిపదికన జరిగిన ఆధిపత్య పోరే అది. ఎదేమైనా-ఎవరెన్ని చెప్పినా, వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ పెత్తనం అప్పగించడం ఇప్పటికీ ఇంకా మాటల్లోనే కాని ఆచరణలో కానే కాదు. ఒక వేళ వీరిలో ఎవరన్నా ఉన్నత స్థాయికి చేరుకోగల వారుంటే, వారికి కూడా ధన బలం తప్పని సరి. అది లేకపోతే, వారి వారే వెనక్కు పడవేయడం ఖాయం.


1 comment:

  1. బిసి లలో ఐక్యత రానంతకాలం ఎంత సంఖ్య ఉన్నా వారికి అధికారం నిండుసున్నా!ఎండమావి!వాళ్ళ మధ్య dynamolu తిరగాలి dynamytes పేలాలి!అప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఒక్కతాటి మీద నడుస్తారేమో చూద్దాం!

    ReplyDelete