Thursday, January 30, 2014

WAR ROOM DISCUSSION by 6TV on 29th January 2014

Saturday, January 25, 2014

తెలంగాణ అంశంపై టీవీ 5 నిర్వహించిన ప్రవాసాంధ్రుల ప్రత్యక్ష ప్రసారం: వనం జ్వాలా నరసింహారావు



తెలంగాణ అంశంపై టీవీ 5 నిర్వహించిన ప్రవాసాంధ్రుల ప్రత్యక్ష ప్రసారం: వనం జ్వాలా నరసింహారావు.....
బుధవారం (22-01-2014) రాత్రి టీవీ 5 నిర్వహించిన ప్రవాసాంధ్రుల ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని దేశ విదేశాల నుంచి ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యక్ష ప్రసార వీడియోనే ఇది....
http://www.youtube.com/watch?feature=player_detailpage&v=M-0ZUJo367o

Friday, January 24, 2014

అలనాటి ప్రపంచ స్థాయి మహా నాయకులను మరచిపోతున్నామా?:వనం జ్వాలా నరసింహారావు

మహా నాయకులను మరచిపోతున్నామా?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (26-01-2014)

శాంతి దూత జవహర్‌ లాల్‌ నెహ్రూ, సైనిక పరంగా ప్రతిష్ఠ తెచ్చిన ఇందిర, అమెరికా అధ్యక్షుల్లో కెనడీకి విశేష గుర్తింపు, జర్మనీ ఐక్యతకు కృశ్చేవ్‌ కృషి, చైనా విప్లవ నేత మావో సె టుంగ్‌, వియత్నాం విప్లవ నేత హో చి మిన్‌, తిరుగులేని నాయకుడు ఫిడల్‌ కాస్ట్రో, దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీ- మండేలా 

          అలనాటి అంతర్జాతీయ స్థాయి "రోల్ మోడల్" నాయకత్వం, ఈ రోజుల్లో, ఒకనాటి లీలా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతోంది. ఇక, ఇప్పుడే ఇలా వుంటే, బహుశా భవిష్యత్‍లో వారిని గుర్తుంచుకునే వారు అసలు మిగలరేమో! అలాంటి ఉద్దండ నాయకులు ప్రస్తుతం లేనే లేరని అనలేం కాని, ఆ స్థాయి రాజనీతిజ్ఞత, వారి తరహాలో తమ-తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తీరు, తమ దేశాల వాణినే కాకుండా వారి-వారి ప్రాంతాల గురించి ఆ మహా నాయకులు పడ్డ ఆరాటం, వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తాము పోరాడుతున్న అంశాల విషయంలో వారు ప్రదర్శించిన నిబద్ధత, బహుశా, ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి నాయకుల్లో లోపించిందనడం అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు, రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసే నేటి తరం విద్యార్థులు కాని, వర్తమాన చరిత్ర కారులు కాని, ఆ మాటకొస్తే సాధారణ చదువరి కాని, యువత కాని, గత కాలం నాటి మహా నాయకుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్న దాఖలాలు అంతగా కనిపించడం లేదు. అప్పట్లో, అంతర్జాతీయ స్థాయిలో ఒక గోష్టి కాని, సమావేశం కాని, సదస్సు కాని, ప్రపంచ దేశాల సమ్మేళనం కాని, ఎప్పుడు-ఎక్కడ ఏ మూల జరిగినా, ఆ నిర్వహణలో కనిపించిన హంగూ-ఆర్భాటం, ఆనందం, అంగరంగ వైభవం ఇప్పట్లో లోపించిందనాలి. ఉదాహరణకు, బెల్ గ్రేడ్‌లో 1961 లో, జవహర్లాల్ నెహ్రూ, సుకర్ణో, నాజర్, ఎన్ క్రుమా, టిటో ల సారధ్యంలో పురుడు పోసుకున్న అలీనోద్యమ సదస్సు పేర్కొన వచ్చు. ఆ ఐదుగురు ప్రపంచ నాయకులు, అగ్రరాజ్యాల ఆధిపత్యం తగ్గించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం, అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడానికి తెర పైకి తెచ్చిన అలీనోద్యమం తీరుతెన్నులు, నేటి తరంవారు, కనీసం తెలుసుకోవాలన్న-అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదే? అలానే 1955 నాటి జెనీవా సదస్సు గురించి కాని, ఆ రోజుల్లో జరిగిన ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల గురించి కాని, కామన్ వెల్త్ దేశాధి నేతల సమావేశాల గురించి కాని, బాండుంగ్ సమావేశంగా పిలుచుకునే ఆప్రో-ఏషియన్ సమావేశం కాని, 1954 లో జరిగిన జెనీవా సమావేశం కాని, అలాంటి మరెన్నో అంతర్జాతీయ సమావేశాల గురించి కాని నేటి తరం యువత తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

అలనాటి అంతర్జాతీయ స్థాయి అగ్ర నాయకుల పేర్లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి: జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, జాన్ ఫిట్జ్ గెరాల్డ్ కెన్నెడీ, నికితా కృశ్చేవ్, చార్లెస్ డి గాలె, డేవిడ్ బెన్ గ్యూరియన్, ఆయన వారసురాలు గోల్డా మీర్, మార్షల్ టిటో, గమాల్ అబ్దుల్ నాజర్, చౌ-ఎన్-లై, మావో సేటుంగ్, సిరిమావో బండార నాయికే, విల్లీ బ్రాండ్ట్, సుకర్ణో, క్వామే ఎన్ క్రుమా, ఫిడల్ కాస్ట్రో, హోచిమిన్, నెల్సన్ మండేలా.....లాంటి వారు.

వివరాల్లోకి పోతే....జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రప్రధమ ప్రధాన మంత్రి. ఆ పదవిలో ఆయన ఆగస్ట్ 15, 1947 నుంచి మే 27, 1964 వరకు-ఆయన మరణించేంత వరకున్నారు. ఐక్య రాజ్య సమితి విధానాలకు ఆయన తన సంపూర్ణ మద్దతిచ్చేవారు. ప్రపంచ వ్యాప్తంగా, శాంతిత్వ వాదనకు, ఆయన పేరు పర్యాయపదం అనవచ్చు. అలీనోద్యమ వ్యవస్థాపకుడిగా, అలనాటి అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించిన వాడిగా, ఆ రెండు దేశాలకు చెందకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు మధ్యే మార్గాన్ని అనుసరిచేట్లు చేసిన వాడిగా, చరిత్రలో ఆయనో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1954 లో పొరుగునున్న చైనా దేశంతో "పంచశీల" పేరుతో శాంతి-సహజీవనం దిశగా ఒప్పందం చేసుకున్నాడాయన. ఆయన కూతురు ఇందిరా గాంధీ కూడా తండ్రి మార్గంలోనే అంతర్జాతీయ స్థాయి నాయకురాలిగా ఆయన తదనంతరం పేరు తెచ్చుకుంది. భారత దేశానికి మొదటి పర్యాయం మూడో ప్రధాన మంత్రిగా 1966-1977 మధ్య కాలంలో, ఆ తరువాత ఆరవ ప్రధాన మంత్రిగా 1980 నుంచి 1984 లో ఆమె హత్యకు గురయ్యేదాకా ఇందిరాగాంధీ పని చేశారు. ఆమె కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశంగా భారత దేశానికి పేరొచ్చింది. రాజకీయ, ఆర్థిక, సైనిక పరంగా దక్షిణ ఏషియా ప్రాంతంలో ఒక గొప్ప రాజ్యంగా అవతరించింది భారత దేశం. బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఆమె నేతృత్వంలో సాధించినవే. అలీనోద్యమానికి కూడా అమె చేసిన కృషి అమోఘం. అలానే పాలస్తీనా విమోచనోద్యమానికి ఆమె ఇచ్చిన మద్దతు మరువరానిది.


జాన్ కెన్నెడీ జనవరి 20, 1961 నుంచి నవంబర్ 22,1963 వరకు, అమెరికా దేశపు 35 వ అధ్యక్షుడుగా, తాను హత్యకు గురయ్యేవరకు పనిచేశారు. ఆయన కాలంలోనే "బే ఆఫ్ పిగ్స్" దాడి, క్యూబన్ మిస్సైల్ సంక్షోభం, బెర్లిన్ గోడ నిర్మాణం, ఆఫ్రికా-అమెరికా పౌర హక్కుల ఉద్యమం తో సహా వియత్నాం పైన యుద్ధంలో అమెరికా మితిమీరిన జోక్యం చోటు చేసుకున్నాయి. అతి పిన్న వయసులోనే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన కెన్నెడీ, అచిర కాలంలోనే ప్రపంచ స్థాయి అగ్రనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కుటుంబం మీద పెరల్. ఎస్. బక్ రాసిన పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఆయన తదనంతరం అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులు వచ్చినప్పటికీ ఆయన కొచ్చిన గుర్తింపు ఇంతవరకు మరెవ్వరికీ రాలేదనవచ్చేమో! అగ్రరాజ్యంగా అమెరికా ఆయన నేతృత్వంలోనూ, ఆ తరువాత కాలంలోనూ వెలుగొందుతున్న నేపధ్యంలో, మరో అగ్ర రాజ్యంగా, అమెరికాకు పోటీగా వున్న సోవియట్ యూనియన్‌కు ప్రధాన మంత్రిగా నికితా కృశ్చేవ్ వుండేవారు. మార్చ్ 14, 1953 నుంచి అక్టోబర్ 14, 1964 వరకు ఆయన ఆ పదవిలో వున్నారు. జర్మనీ ఐక్యత కొరకు కృశ్చేవ్ నిరంతరం కృషి చేసేవారు. నవంబర్ 1958 లో ఆయన ఆ దిశగా అమెరికాకు, ఇంగ్లాండుకు, ఫ్రాన్స్ దేశానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. తక్షణమే, ఆరు నెలలు గడిచే లోపున తూర్పు-పశ్చిమ జర్మనీ దేశాలతోను, సోవియట్ యూనియన్ తోను శాంతి ఒప్పందం చేసుకోమని కోరాడు కృశ్చేవ్. అలా జరగని పక్షంలో, సోవియట్ యూనియన్ తనంతట తానే తూర్పు జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకుంటుందని కూడా హెచ్చరించాడు.

చార్లెస్ డి గాలె ఫ్రాన్స్ ఐదవ గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుడి గాను, ఆ దేశానికి 1959-1969 మధ్య కాలంలో అధ్యక్షుడి గాను, ఫ్రెంచ్ సైన్యాధినేతగాను, ప్రముఖ రాజనీతిజ్ఞుడిగాను, ఆ రోజుల్లో యావత్ ప్రపంచానికి చిరపరిచితుడు. 1958 లో ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపన జరగడానికి చాలా కాలం క్రితమే, ఆ దేశానికి, 1945 లోనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి కారణ భూతుడు డి గాలె. నాటో సైనిక కూటమి నుంచి ఫ్రాన్స్ దేశాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, ఐరోపా సమాజంలో బ్రిటన్ దేశానికి ప్రవేశం కలగకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన వ్యక్తి డి గాలె. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య సమతుల్యం పాటించుకుంటూ, ఒక పటిష్టమైన దేశంగా ఫ్రాన్స్ ను అభివృద్ధి చేయాలన్న విషయంలో డి గాలె ఎన్నడూ రాజీపడలేదు. అలాగే...ఇజ్రాయిల్ కు చెందిన గోల్డా మీర్, బెన్ గ్యూరియన్ లు. ఆ దేశ నాల్గవ ప్రధాన మంత్రిగా మార్చ్ 17, 1969 నుండి జూన్ 3, 1974 వరకు అధికారంలో వున్న గోల్డా మీర్ ను ఇజ్రాయిల్ రాజకీయాలలో "ఐరన్ లేడీ" గా అభివర్ణించే వారు. 1969 లోను, 1970 తొలినాళ్లలోను, గోల్డా మీర్ అనేక మంది ప్రపంచ నాయకులను కలిసి ఆమె కలలు కన్న రీతిలో, మధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేశారు. ఆమెకు ముందు ప్రధానిగా పని చేసిన డేవిడ్ బెన్ గ్యూరియన్ ఇజ్రాయిల్ రాజనీతిజ్ఞుడిగాను, జాతి పిత గాను ప్రసిద్ధికెక్కాడు. ప్రప్రధమ ఇజ్రాయిల్ ప్రధాన మంత్రిగా మే 17, 1948 నుండి జనవరి 26, 1954 వరకు, ఆ తరువాత కొంత విరామం తీసుకుని తిరిగి నవంబర్ 3, 1955 నుండి జూన్ 26, 1963 వరకు బెన్ గ్యూరియన్ పనిచేశారు. 1948 లో జరిగిన అరబ్-ఇజ్రాయిల్ యుద్ధంలో తన దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా, వివిధ జ్యూయిష్ సైనిక సంస్థలను, ఇజ్రాయిల్ సైన్యాన్ని కలిపి సమైక్యంగా పోరు సల్పారు.


యుగోస్లేవియా విప్లవకారుడిగా, ఆ దేశ రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన మార్షల్ టిటో, 1945 నుండి 1980 లో ఆయన చనిపోయేంత వరకు వివిధ హోదాలలో తన దేశానికి ఎనలేని సేవ చేశాడు. నెహ్రూ, నాజర్, ఎన్ క్రుమా, సుకర్ణో లతో కలిసి అలీనోద్యమ ప్రధాన నాయకుడిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. అలీనోద్యమ ప్రప్రధమ సెక్రటరీ జనరల్ గా ఆయన ఎంపికయ్యారు. 1943-1963 మధ్య కాలంలో, సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా ప్రధాన మంత్రిగా, ఆ తరువాత 1953-1980 మధ్య కాలంలో తొలుత అధ్యక్షుడిగా, పిదప యావజ్జీవిత అధ్యక్షుడిగా అధికారంలో వున్న ఆయన అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడని పేరు తెచ్చుకున్నాడు. ఇక గమాల్ అబ్దుల్ నాజర్ విషయానికొస్తే...ఆయన, ఈజిప్ట్ దేశానికి రెండవ అధ్యక్షుడిగా జూన్ 23, 1956 నుండి సెప్టెంబర్ 28, 1970 న చనిపోయేంత వరకు వున్నారు. అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, 1956 లో "సూయజ్‌ కెనాల్ కంపెనీ"  ని జాతీయం చేయడంతో ఈజిప్ట్ లోను, మొత్తం అరబ్ ప్రపంచంలోను తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. సిరియాతో కలిసి "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించాడాయన. ఆయన మరణం ప్రపంచ నాయకులనెందరినో కదిలించింది. యావత్ అరబ్ ప్రపంచానికి చెందిన నేతలు ఆయన అంత్య క్రియలకు హాజరయ్యారు. జోర్డాన్ రాజు హుస్సేన్, పాలస్తీనా విమోచనోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ బహిరంగంగా కంట తడి పెట్టుకున్నారు. లిబియాకు చెందిన కల్నల్ గడాఫి ఉద్వేగంతో రెండు పర్యాయాలు స్పృహ తప్పి పడిపోయాడు!

"పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" ప్రప్రధమ ప్రధాన మంత్రిగా చౌ-ఎన్-లై అక్టోబర్ 1949 నుండి జనవరి 1976 లో చనిపోయేంతవరకు పదవిలో కొనసాగారు. కొరియా యుద్ధం నేపధ్యంలో, పశ్చిమ దేశాలతో శాంతి కొరకు ఆయన పాకులాడాడు. 1954 లో జరిగిన జెనీవా సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. అమెరికాతో, తైవాన్‌తో, సోవియట్ యూనియన్‌తో, భారత దేశంతో, వియత్నాంతో తలెత్తిన సంఘర్షణల నేపధ్యంలో, చౌ-ఎన్-లై సామరస్య పూరకంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కొన్ని విధాన పరమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆయన మెంటర్...నాయకుడు, మావో సేటుంగ్ 1949 లో "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" వ్యవస్థాపకుడు. 1921 లో ఆవిర్భవించిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులలో మావో ఒకరు. మార్క్స్, లెనిన్‌ల సరసన కమ్యూనిజాన్ని వ్యాపింప చేయడంలో కృషి చేసిన త్రిమూర్తులలో ఆయనొకరు. ప్రపంచ చరిత్రకు ఆయన చేసిన తోడ్పాటు చరిత్ర గతినే మార్చిందనాలి. పాలస్తీనా నాయకుడిగా, పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడిగా యాసర్ అరాఫత్ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. పాలస్తీనా జాతీయ అథారిటీకి ప్రధమ అధ్యక్షుడిగా ఆయన జులై 5, 1994 నుండి నవంబర్ 11, 2004 వరకు పనిచేశారు. పాలస్తీనా స్వయం ప్రతిపత్తి కొరకు తన జీవితాంతం ఇజ్రాయిల్‌తో ఆయన పోరాటం సాగించాడు. అసలు ఇజ్రాయిల్ ఉనికే వద్దన్న అరాఫత్ ఆ తరువాత రాజీపడి, ఐక్య రాజ్య   సమితి తీర్మానానికి అనుగుణంగా తన విధానాన్ని 1988 లో మార్చుకున్నాడు. శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయిక ఎన్నో సార్లున్నారు. 1960-1965, 1970-1972, 1972-1977, 1994-200 మధ్య కాలంలో ఆమె ప్రధానిగా పనిచేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

విల్లీ బ్రాండ్ట్ జర్మనీ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. 1969-1974 మధ్య కాలంలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్స్ లర్‍ గా పనిచేశారు. పశ్చిమ జర్మనీ, సోవియట్ అనుకూల దేశాల మధ్య సయోధ్య కుదిరించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 1971 సంవత్సరానికి విల్లీ బ్రాండ్ట్ కు నోబెల్ శాంతి బహుమానం లభించింది. ఇండోనేషియా ప్రధమ అధ్యక్షుడిగా పనిచేసిన సుకర్ణో, ఆ పదవిలో 1945 నుండి 1967 వరకు, అంటే 22 సంవత్సరాల పాటు కొనసాగారు. 1960 వ దశకంలో ఇండోనేషియాను వామపక్ష భావాల దిశగా మళ్లించి, ఇండొనేషియన్ కమ్యూనిస్ట్ పార్టీకి తన పూర్తి మద్దతిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాముఖ్యత-గుర్తింపు తెచ్చేందుకు, సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాలను కూడగట్టాడాయన. అలీనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. క్వామే ఎన్ క్రుమా ఘనా దేశానికి తిరుగులేని నాయకుడుగా వుండేవారు. బ్రిటీష్ వలస రాజ్యంగా వున్న ఘనాకు 1957 లో స్వాతంత్ర్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్ క్రుమా ఆ దేశానికి ప్రధమ అధ్యక్షుడి గాను, ప్రధమ ప్రధాన మంత్రి గాను పనిచేశారు. ఆఫ్రికన్ యూనిటీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. 1963 సంవత్సరంలో లెనిన్ శాంతి బహుమతిని అందుకున్నారు ఎన్ క్రుమా. వియత్నాం కమ్యూనిస్ట్ విప్లవ నాయకుడిగా ప్రసిద్ధికెక్కిన హో చి మిన్ ఆ దేశాధ్యక్షుడిగా 1945-1969 మధ్య కాలంలోను, ప్రధాన మంత్రిగా 1945-1955 మధ్య కాలంలో పనిచేశారు. వియత్నాం స్వాతంత్ర్యం కొరకు 1941 నుంచి పోరాటం సాగించిన హో చి మిన్, కమ్యూనిస్ట్ పాలనలోని వియత్నాం ప్రజాస్వామ్య రిపబ్లిక్ ను 1945 లో స్థాపించారు. 1954 లో ఫ్రాన్స్ దేశాన్ని ఓడించిన ఘనత ఆయనదే.

ఎలిజబెత్ రాణి తర్వాత బహుశా ఎక్కువ కాలం అధికారంలో వున్న వ్యక్తి ఫిడల్ కాస్ట్రోనే. లాటిన్ అమెరికాలో కాస్ట్రోను మించిన కమ్యూనిస్ట్ నాయకుడు మరొకరు లేరు. కమ్యూనిస్ట్ విప్లవ పంథాపై ఆయనకు గట్టి పట్టుంది. జనవరి 9, 1959 నుండి ఫిబ్రవరి 19, 2008 వరకు ఆయన క్యూబాకు తిరుగులేని నాయకుడు. అప్పటి నుంచి తానే పదవిని ఆశించనని, చేపట్టనని ప్రకటన చేశారు. ఇటీవలే చనిపోయిన నెల్సన్ మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీగా ఆయన్ను పిలిచేవారు. అలాంటి మహా నాయకులు అరుదుగా వుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, గత కాలంలో ఇలాంటి మహా నాయకులు మరికొందరుండవచ్చు....ఏరీ అలాంటి నాయకులిప్పుడు?


Tuesday, January 21, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -13:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -13
వనం జ్వాలా నరసింహారావు

అయోధ్యకొచ్చి రాజ్యమేలమన్న భరతుడి ప్రార్థనను తిరస్కరించిన శ్రీరాముడు, తనకు బదులుగా తన పాదుకలను ఇచ్చేందుకు అంగీకరించాడు. అవి తీసుకొని భరతుడు అయోధ్యకు ప్రయాణమై పోతూ, దారిలో యమునా నదిని, గంగను దాటి శృంగిబేరి పురం గుండా సాగిపోతూ, అన్న-తండ్రి లేని, సంతోషహీనమైన అయోధ్యను వర్ణించడానికి "నిరానందయైన అయోధ్యాపురి వర్ణన" అన్న పేరుతో "మధురగతిరగడ" లో పద్యాన్ని రాసారు కవి ఇలా:



మధురగతిరగడ:      
పిల్లలు గూబలు పెల్లవుదానిని, మల్లడిగొను కరి మనుజులదానిని
శ్రీ లరఁ జిమ్మని చీఁ క ట్లలమఁ గఁ , గాలనిశాగతిఁ , గ్రాలెడిదానిని
గ్రహపీడితశశి కాంతారీతిని, మహమరి తేజము మలిగినదానిని
నిగిరిన క్రాఁ గిన యించుకనీళ్లను, సెగలను బొగిలెడి చిరువిహగములను
విలయముఁ గాంచువి విధమత్స్యములను, సెలయే రనఁ గను జెలఁ గెడిదానిని
సవమున బంగరు చాయల మండుచు, హవిసున నణఁ గిన యగ్నిని బోలుచుఁ
జెదరినగజములు జిట్లినధ్వజములు, బదరినవాజులు బగిలిన తేరులుఁ
గలిగి విరోధులు కలఁ చిన బెగ్గిలి, కలఁ గినదం డనగా దగుదానిని
ఫేనము ధ్వానము పెల్లయి పెద్దతు, పానును గాలియు బరిశాంతముగా
స్తిమితతఁ గాంచిన సింధుతరంగము, గుమి నా మ్రోఁ తలు గూడనిదానిని
యజనాంతంబున యాజకయూథము, యజనాయుధములు నన్నియుఁ బాయగ
వీతరవం బగు వేదిని బోలుచు, వాతతజనశూన్యం బవుదానిని
దినఁ బచ్చికఁ దలదిరముగ వ్రాల్పక, పెనుగోడియచన వెతలం గొనియెడి
గోవులమందనఁ గూడినదానిని, శ్రీవిలసితమయి స్నిగ్దతరం బయి
తేజును గూడుచు దివ్యతరం బయి, రాజిలునుత్తమ రత్న శ్రేణులు
తీరఁ గ రాలినఁ దేజము దూలిన, హార మొయనఁ గొమ రారినదానిని
జలిపినపుణ్యము క్షయ మయి పోవఁ గ, నిలఁ బడు చుక్కను నెనసినదానిని
బంభర కోటులఁ బలుసూనంబుల, సంభరిత మయి వసంతముకడపలఁ
గారున నగ్గికి గమరినతీఁ గల, తీరునఁ గాంతులు దీరిన దానిని
బేరము సారము పేరును లేమిని, ద్వారము తెరవని పణ్యస్థలమై
మరుఁ గఁ గఁ జుక్కలు మబ్బున శశితో, నెరిమాసినయా నిశ నగుదానిని
నుత్తకడవలును నుత్తపిడుతలును, గత్తరఁ గెడసిన కలుమందిరమున
దొరలెడికుండలుఁ దూలెడి గోడలు, జరుగుచుఁ బాడరు చలిపందిలి యన
వీరుని బెడిదపు వింటను నెక్కిడ, నారసమో యన నరకఁ గ వైరులు
బిగి చెడి నేలను వ్రీలినజ్యాలత, వగ వగ చెడి జిగి పాసినదానిని
నాహవశూరుం డశ్వవిభాండస, మూహంబులచేఁ బొలుపుగఁ దీర్చియుఁ
గలనికి నుపయోగము గా కుండుట, తొలఁ చు కిశోరము తోఁ బో ల్దానిని
గఛ్చపమత్స్యని కాయములొప్పఁ గ, నఛ్చం బయి శుష్కాంబుక మగుచును
గూలము దొరలగ గువలము వెడలఁ గ, హాళి చెడినకూ పాళిని బోలుచు
వగపునఁ జిర్చా భరణ విహీనుని, జిగిచెడు మే ననఁ జెలఁ గిన దానిని
జడికారున బహు జలధరసంతతి, విడువక క్రమ్మ ర విప్రభ నాఁ గను
నొప్పుచు నున్నయయోధ్యనుగనుగొని, యప్పుడు భరతుండలమటఁ జొచ్చెను                                                                                -38

ఛందస్సు:      నాలుగు మాత్రలు నాటిన గణములు, నాలుగు రెంటికి నలి విరమణలు గలసి మధురగతి కనలును జగణము, తొలగిన ధృతకౌస్తుభ కవిరమణము.



Wednesday, January 15, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -12:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -12
వనం జ్వాలా నరసింహారావు

దశరథుడికి ఉత్తరక్రియలు చేసిన భరతుడు, రాజకర్తలు అతడిని పట్టాభిషేకం చేసుకొమ్మని కోరినప్పటికీ, ఒప్పుకోక, అరణ్యవాసంలో వున్న శ్రీరాముడిని తీసుకొచ్చేందుకు అడవులకు ప్రయాణమైపోతాడు. పాదచారియైన భరతుడు రామాశ్రమాన్ని వెతికి, ఆయన్ను దర్శించుకుంటాడు. కుశల ప్రశ్నలనంతరం భరతుడు శ్రీరాముడికి దశరథుడు మరణించిన సంగతి తెలియచేస్తాడు. దశరథుడు మరణించిన విధానాన్ని రాముడికి చెప్పడానికి "తరలము" వృత్తంలో పద్యం రాసారు వాసు దాసుగారిలా:


తరలము: నినుఁ దలంచియ యేడ్చుచున్ మరి నీదు దర్శనకాంక్షి యై,
                నినుఁ దలంగకయున్న బుద్ధిని  నేర కేమియుఁ ద్రిప్పఁ గా,
                ననఘ ! నీవిడనాడుటన్, భవ దార్తిపీడితుఁ డౌచు, నీ
                జనకుఁ డక్కట  యస్తమించెను  జాల నిన్నె స్మరించుచున్ -37

ఛందస్సు:      తరలమునకు స-భ-ర-స-జ-జ-గ గణాలు. 12 వ అక్షరం యతి.


తాత్పర్యం:     అన్నా ! నీ తండ్రి నిన్ను తలచుకుంటూ, ఏడ్చి-ఏడ్చి, నిన్ను చూడగోరి అది లభించనందున, నీ పైనే బుద్ధి దృఢంగా నిలిపి, దానిని మరలించ లేక, నువ్వు వదిలి వచ్చిన కారణాన నీ వియోగ బాధవల్ల, కష్ట పడుతు, రామా-రామా అంటూ నిన్నే స్మరించుకుంటు అస్తమించాడు. (దశరథుడి మరణ వార్తను కైక భరతుడికి చెప్పిన విధానానికి, భరతుడు రాముడికి చెప్పిన పద్ధతికి తేడా వుంది. తండ్రి మరణానికి కారణభూతుడు రాముడేనన్న అర్థం స్ఫురిస్తుంది కూడా. ఆయన చేసిన పని సరైందికాదని భరతుడి అభిప్రాయంగా చెప్పించాడు కవి. రాముడవై లోకాన్ని సంతోషపెట్టే బదులు దుఃఖపెడుతున్నావని భావన).

Sunday, January 12, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -11:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -11
వనం జ్వాలా నరసింహారావు

శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి అరణ్యవాసానికి పోయిన కొన్నాళ్లకు దశరథుడు దుఃఖంతో మరణించాడు. ఆయన మరణానికి అంతఃపుర స్త్రీలు ఏడుస్తారు. రాజకీయ వ్యవహారాలు తెలిసినవారు ఏడుస్తున్న కౌసల్యను ఓదార్చి, మృత దేహానికి చేయాల్సిన ధర్మ విధులగురించి తదుపరి చర్యలు చేపట్తారు. అంత దుఃఖంలో అంతఃపుర స్త్రీలు కైకను దుర్భాషలాడుతారు. భవిష్యత్ లో కైక పెత్తనంలో తామెలా అక్కడ వుండగలమోనని పొరలి-పొరలి ఏడుస్తుంటారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, కాంతిహీనమైన అయోధ్యాపురుని గురించి, అక్కడి పరిస్థితి గురించి మూడు పద్యాలు - మాలిని, కలితాంతము, మానిని వృత్తాల్లో- రాసారీవిధంగా కవి:

మాలిని:              కలయఁ గ జను లెందుం గార్పఁ గన్ బాష్పవారిన్
                        గులతరుణులు హాహా  ఘోషముల్ నించు చుండన్
                        లలి నలుకులు మ్రుగ్గు  ల్గానరా కెట్టి యింటన్
                        బొలుపు దొరఁ గి  యుండెం బ్రోలు గుర్తింపకుండన్ -34

ఛందస్సు:      మాలిని వృత్తానికి న-న-మ-య-య గణాలు. 9 వ అక్షరం యతి.

కలితాంతము:          భూమీశ్వరుఁ డేడ్చుచు బొంది విడన్
                        భామాజన  మార్తిని వ్రాలనిలన్
                        శ్రీమద్రవి యస్తముఁ జేర జనెన్
                        భూమిం బెనుఁ జీఁ కటి పొల్పెసఁ గెన్ -35

ఛందస్సు:      కలితాంతమునకు త-ట-జ-వ గణాలు. 8 వ అక్షరం యతి.


మానిని:        తామరసాప్తుఁ డు  లేనినభం బనఁ దారలు లేని త్రియామ యనం
                గా  మహితాత్ముఁ డు  భూపతి లేమిని గద్గదకంఠసమాకులితా
                యామమహాపథచత్వరసంఘము  నై పురి  యొప్ప  నరుల్ సతులున్
                స్తోమములై చెడఁ దిట్టుచు నుండిరి ద్రోహి  మొనర్చినకై కయినిన్ -36

ఛందస్సు:      మానిని వృత్తానికి ఏడు "భ" గణాలు, గురువు, 13 వ అక్షరం యతి.

తాత్పర్యం:    
ఎక్కడ చూసినా ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కుల స్త్రీలు హాహా కారాలు చేస్తుంటే, ఎవరి ఇంటి ముందు కూడా అందంగా అలకడం గానీ-ముగ్గులు వేయడం గానీ లేకుండా, ఇది అయోధ్యా పురమా అని గుర్తించ లేకుండా వుండి సౌందర్యం లేనిదయింది. పుడమి రాజు ఏడుస్తూ శరీరాన్ని వదిలి పెట్టగా, భార్యలందరు దుఃఖంతో నేలగూలారు. శోభాయమానంగా వుండే సూర్యుడు అస్తమించాడు. భూమంతా పెనుచీకటి వ్యాపించింది. సూర్యుడు లేని ఆకాశం-నక్షత్రాలు లేని రాత్రి అన్నట్లుగా, గొప్ప మనస్సు గల రాజు లేనందువల్ల, వ్యసనంతో డగ్గుత్తిక పడిన కంఠాల వారితో కలత చెందిన రాచ బాటలు, నాలుగు త్రోవలు కలిసే ప్రదేశాలు కనిపించాయి. స్త్రీ-పురుషులు గుంపులు-గుంపులుగా చేరి రాజద్రోహం, భర్తృ ద్రోహం, పుత్ర ద్రోహం, ప్రజా ద్రోహం చేసిన కైకేయిని నాశనమై పోవాలని నోటి కొచ్చినట్లు తిట్టారు.  



Saturday, January 11, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -10:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -10
వనం జ్వాలా నరసింహారావు

సీతా రామలక్ష్మణులు గంగానదీ సమీపంలో మిత్రుడు గుహుడిని కలుస్తారు. సీతాదేవిని, అన్నదమ్ములను విశ్రాంతి తీసుకొమ్మని-నిదురించమని, నిద్రాభంగం కాకుండా తాను రక్షణగా వుంటానని అంటాడు గుహుడు. శ్రీరామ వనవాసంవల్ల అయోధ్యలో కలుగనున్న పరిణామాల గురించి లక్ష్మణుడు గుహుడికి చెప్పుతాడు. ఆ తర్వాత శ్రీరామ లక్ష్మణులు, సీత గంగను దాటడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ గుహుడు చేస్తాడు. తమవెంట ఇంతదూరం వచ్చిన సుమంత్రుడిని అయోధ్యకు మరలిపొమ్మంటాడు శ్రీరాముడు. భరతుడు రాజ్యమేలుతున్న రాజ్యాన్ని కైక అనుభవించాలన్నదే తన ముఖ్యాభిప్రాయంగా దశరథుడికి ప్రియమైన విధంగా తెలియచేయమని సుమంత్రుడిని కోరుతాడు రాముడు. శ్రీరామ లక్ష్మణులు జడలు ధరిస్తారు-మునుల మాదిరిగా కనిపించారప్పుడు. గంగనుదాటేందుకు నావ ఎక్కిన పిదప సీతాదేవి తమనందరిని రక్షించమని గంగను ప్రార్తిస్తుంది. నావ అవతలి ఒడ్డుకు చేరిన తదుపరి అందరు కిందకు దిగుతారు. నిజమైన అరణ్యవాసం ఇక అప్పటినుండి మొదలవుతుంది. ఆ సమయంలో శ్రీరాముడు తల్లిదండ్రులను తలచుకొని దుఃఖిస్తుంటాడు. తనను గర్భంలో ధరించిన కౌసల్య నిర్భాగ్యురాలని బాధపడ్తాడు. అలా శ్రీరాముడు బాదపడడం, ఆయన్ను తమ్ముడు లక్ష్మణుడు ఓదార్చడం జరుగుతున్న క్రమంలో నాలుగు పద్యాలను (తోటకము, తోదకము, ఉత్సాహము, మత్తకోకిలము) రాసారీవిధంగా:


తోటకము:         అని పెక్కు తెరంగుల నశ్రుయుతా
                                ననుఁ డై విజనంపు వనంబున నా
                                యనఘాత్మకుఁ డేడిచి యానిశ యం
                                దొనరన్ మునిపోలికి నున్న యెడన్ -30

ఛందస్సు:      తోటకమునకు నాలుగు "స" గణాలు 9వ యింట యతి

తోదకము:         అలలు చలింపని యంబుధినామం
                                టల పెను పార ధనంజయు నట్టుల్
                                నిలిపి విలాపము నివ్వెర నుండన్
                                లలివచనంబుల లక్ష్మణుఁ డాడెన్ -31

ఛందస్సు:      తోదకమునకు న- జ- జ- య గణాలు. పాదమునకు 12 అక్షరములుంటాయి. ప్రాస నియమం వుంది.

ఉత్సాహము: నిక్కమింత రామచంద్ర నీవు వీడి వచ్చుటన్
                దిక్కుమాలి యాయయోధ్య తేజు మాసి యుండెడిన్
                జుక్కరేఁ డు లేని రేయి చొప్పునన్; వ్యథామతిన్
                న్రుక్కఁ దగునె నేను సీత న్రుక్కమే నినుం గనన్ -32

ఛందస్సు:      ఉత్సాహమునకు ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి. ఇందులో అన్నీ "హ" గణాలే అవుతే అది "సుగంధి" వృత్తం అవుతుంది. సగణ-హగణాలకు సూర్య గణాలని పేరు.

మత్తకోకిలము:          నిన్నుఁ  బాసి ధరాతనూజయు నేను నొక్క ముహూర్తమే
                        ని న్ని లం గలవారమే తమ నీటి బాసిన చేఁ పల
                        ట్లన్న! యాజనకాఖ్యుఁ డేటికి నంబ యేటికిఁ దమ్ముఁ డేన్
                        నిన్నుఁ వాసిన స్వర్గమేటికి నిక్క మియ్యది రాఘవా -33

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం:    

తన (రాముడి) వలన తల్లికి, లోకులకు కలిగిన దుఃఖాన్ని తలచుకొని అనేకవిధాలుగా పరితపించి, కన్నీళ్లతో కూడిన కన్నులు కలవాడై, ఓదార్చేందుకు జనులెవరూలేని అడవిలో ఏ పాపం ఎరుగని శ్రీరామచంద్రుడు ఆ రాత్రంతా ఏడిచి మౌనవ్రతం పూనిన వాడివలె వుండిపోయాడు. అలలు కదలని సముద్రంలాగా, మంటలు చల్లారిన అగ్నిహోత్రం లాగా ఏడుపును ఆపుచేసి కొంచెం కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పుడు, తమ్ముడు లక్ష్మణుడు "ఉత్సాహకరమైన" మాటలు చెప్పుదామనుకుంటాడు అన్నకు. ("నిలిపి విలాపము" అనడమంటే, తనంత తానే ఉపశమించుకున్నాడని భావం. "అలలు చలింపని అంబుధి" అంటే, వాయువు ప్రేరితమైనప్పుడే అలలు ఎగిసినట్లు, దుఃఖం ప్రేరించు వారెవరూ లేనప్పుడు ఉపశమనమే దారి అని భావన. ఒక విధంగా ఈ ఉపమానం పూర్తిగా శ్రీరాముడికి అన్వయించక పోవచ్చు). ఇలా అంటున్నాడు రాముడితో: రామచంద్రా ! నీవు చెపుతున్న మాటల్లో కొంత నిజం లేకపోలేదు. నువ్వు వదిలివచ్చిన కారణాన దిక్కులేనిదైన ఆ అయోధ్య, కాంతిహీనమై, చంద్రుడు లేని రాత్రిలాగా వుంటుందనడంలో సందేహం లేదు. కాని, వనవాసానికి రాకముందు చేయాల్సిన ఆలోచన, వనవాసం చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత, ఇప్పుడు-ఇక్కడ ఆలోచించి దుఃఖపడడం తగిన పనికాదు. ముందు చేసిన కార్యం గురించి వెనుక ఆలోచించేవాడు బుద్ధిమంతుడనిపించుకోడు. వెనుక చింత వెర్రితనం లాంటిది. నువ్వు ధైర్యంగా వున్న కారణాన, ఆయనే ధైర్యంతో వుంటే మనమెందుకు దుఃఖించి ఆయనకు కష్ఠం కలిగించాలనుకొని, నీ కొరకు మేము నిబ్బరంగా వున్నాం. నువ్విలా దుఃఖపడితే, నీ కోసం మేమెంత దుఃఖపడాలో ఆలోచించు. రాఘవా ! నువ్విక్కడ దుఃఖపడుకుంటూ నన్ను వూరికి పొమ్మన్నావుగాని, నా మనస్స్థితిని ఆలోచించలేదు. నేనుగాని, సీతగాని మా సుఖం కొరకు నీ వెంట రాలేదు. సుఖపడాలనుకుంటే అయోధ్యలోనే వుండిపోయేవాళ్లం. అయోధ్య నుంచే ఆ సేవ చేసేవాళ్లం. అడవిలో వున్నా చేసేవాళ్లం. కాల దేశాలు మాకు ప్రధానం కాదు. ( ఆ తర్వాత రాముడామాటలకు సంతోషించాడు).

Thursday, January 9, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -9:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -9
వనం జ్వాలా నరసింహారావు

శ్రీరామ లక్ష్మణులు సీతతో గూడి అడవులకు బయల్దేరుతారు. వెంట వస్తున్న పురజనుల కంటబడకుండా వారిని ఏమరిచి ఉత్తరాభిముఖంగా ప్రయాణమై పోతారు. అలా వెళ్తూ, ఉత్తర కోసలదేశాన్ని దాటి పోతారు. మార్గమధ్యంలో కనిపించిన వేదశ్రుతి నదిని, గోమతి అనే నదిని దాటుతారు. ఆ తర్వాత గంగానది కనిపిస్తుంది. గంగను వర్ణిస్తూ "లయగ్రాహి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు ఈ విధంగా:

లయగ్రాహి:
అంగుగ దినేశకుల పుంగవుఁ డు మోద మలరంగను గనుంగొనె నభంగతరభంగో
త్సంగను శివాంబుచయ రంగను మహాఋషినిషంగను శుభాశ్రమచ యాంగను సురీవ్యా
సంగనుత సుందరవిహంగకుల  రాజిత తరంగకజలాశయవిభంగను సరౌఘో
త్తుంగభవభీహనన చంగను నభంగురశుభాంగను దరంగముఖరంగ నలగంగన్ - 29

ఛందస్సు:      లయగ్రాహికి భ-జ-స-న-భ-జ-స-న-భ-య గణాలుంటాయి. తొమ్మిదో అక్షరం ప్రాసయతి. ఇలాంటివి పాదానికి నాలుగుండాలి.


తాత్పర్యం:     పెద్ద-పెద్ద అలలు గలదైన, స్వఛ్చమైన జలాలు గలదైన, మహర్షుల సంభంధం కలదైన, పుణ్య కార్యాలు చేయాల్సిన ఆశ్రమాలను తనతీరంలో కలదైన, స్నానం చేసే దేవతాస్త్రీలు గలదైన, పొగడదగిన అందమైన పక్షిజాతులతో ప్రకాశించే అలలుగల మడుగులను అక్కడక్కడా కలదైన, మనుష్య సమూహాల అతిశయమైన జనన-మరణాలనే భయాన్ని పోగట్టే సామర్థ్యం కలదైన, అధిక శుభాన్నిచ్చే అవయవాలు కలదైన గంగ అనే పేరున్న ప్రసిద్ధ నదిని శ్రీరాముడు సంతోషంతో చూసాడు. 

Wednesday, January 8, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -8:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -8
వనం జ్వాలా నరసింహారావు

ఎవరెన్ని మాటలు చెప్పినా గౌరవంగా అవన్నీ తిరస్కరించి, అరణ్యవాసం చేయడానికి సిద్ధమౌతున్న సీతారామ లక్ష్మణులకు నారచీరెలిచ్చి కట్టుకోమంటుంది కైకేయి. ఆమె ఇచ్చిన నారచీరెలను సంతోషంతో రామ లక్ష్మణులిద్దరూ కట్టుకుంటారు మొదట. పట్టు వస్త్రాలను కట్టుకొని వున్న సీత వాటిని తీసుకొని ఎగా-దిగా చేతిలో పెట్టుకొని చూస్తూ, అవెలా కట్టుకోవాలోనని ఆలోచిస్తుంటుంది. ఆ సమయంలో సీత నారచీరెలు కట్టకూడదని వశిష్ఠుడు నిషేదిస్తాడు. కైకను దుర్భాషలాడుతాడాయన కొంతసేపు. ఆమె నారచీరెలు కట్టరాదనీ, శ్రీరాముడికి బదులుగా మగడెక్కవలసిన సింహాసనాన్ని అధిష్టించాలనీ సూచిస్తాడు. సీత దానికొప్పుకోకుండా మగనివెంట అడవులకు పోవడానికే సిద్ధమౌతే, యావత్తు అయోధ్యా నగరమే శ్రీరాముడి వెంట పోతుందని అంటాడు వశిష్ఠుడు. చివరకు కైక కొడుకు భరతుడు కూడా వెళ్తాడని అంటాడు. ఇవేమీ పట్టించుకోకుండా సీత సంతోషంగా నారచీరెలు ధరిస్తుంది. అందరూ అది చూసి దశరథుడిని ఈసడించుకుంటుంటే, కైకనుద్దేశించి ఆయన అన్న మాటలను "మత్తకోకిలము" వృత్తాల్లో రెండు పద్యాలుగా రాసారు వాసు దాసుగారిలా:


 మత్తకోకిలము:         భూపచంద్రముపుత్రి యై ధరఁ బుట్టి సాధుచరిత్ర యై
                పాపమెద్ది  యెరుంగ  నట్టిది  బాల శ్త్రీమతి  యేరి  కే
                పాపముం  బచరించెనే  యిటు వల్కలంబులతోడుతన్
                దాపసిం  బలె  నెల్లరుం  గనఁ దా సభాస్థలి  నిల్వఁ గన్ ! -27

మత్తకోకిలము:   చేసినాఁ  డనె నీకు  బాసను  సీత  నారలతో  వనీ
         వాసముం  బచరింప, నీగతి బంది పెట్టెద  వేటికే ?
         తా  సుఖంబుగ  సర్వరత్న వి తాన సంయుత యై చనున్,
         గాసి  యేటికి  నొంద ? నారలు  గట్ట  కుండెడుఁ గావుతాత్న్- 28

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.


తాత్పర్యం:     మహారాజు కూతురై లోకంలోని వారివలె కాకుండా, భూమిలో పుట్టి, పతివ్రతై, ఏ పాపం ఎరుగని బాలశోభావతి సీత, ఈ ప్రకారం తాపసిలాగా నారచీరెలు కట్టి, అందరు చూస్తుండగా సభాప్రదేశంలో నిలబడడానికి, ఆమె చేసిన పాపం ఏంటి ? ఓసీ, సీతను నారచీరెలతో వనవాసానికి పంపుతానని నీకేమైనా నేను ప్రమాణంచేశానా ? ఎందుకిలా నిర్భందిస్తున్నావు ? యథా సుఖంగా, సమస్తాభరణాలతో పోవాల్చిందే. ఎందుకామె నిష్కారణంగా ఇబ్బందుల పాలుకావాలి ? కాబట్టి ఆమె నార చీరెలు కట్టుకోకూడదు.