Sunday, January 12, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -11:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -11
వనం జ్వాలా నరసింహారావు

శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి అరణ్యవాసానికి పోయిన కొన్నాళ్లకు దశరథుడు దుఃఖంతో మరణించాడు. ఆయన మరణానికి అంతఃపుర స్త్రీలు ఏడుస్తారు. రాజకీయ వ్యవహారాలు తెలిసినవారు ఏడుస్తున్న కౌసల్యను ఓదార్చి, మృత దేహానికి చేయాల్సిన ధర్మ విధులగురించి తదుపరి చర్యలు చేపట్తారు. అంత దుఃఖంలో అంతఃపుర స్త్రీలు కైకను దుర్భాషలాడుతారు. భవిష్యత్ లో కైక పెత్తనంలో తామెలా అక్కడ వుండగలమోనని పొరలి-పొరలి ఏడుస్తుంటారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, కాంతిహీనమైన అయోధ్యాపురుని గురించి, అక్కడి పరిస్థితి గురించి మూడు పద్యాలు - మాలిని, కలితాంతము, మానిని వృత్తాల్లో- రాసారీవిధంగా కవి:

మాలిని:              కలయఁ గ జను లెందుం గార్పఁ గన్ బాష్పవారిన్
                        గులతరుణులు హాహా  ఘోషముల్ నించు చుండన్
                        లలి నలుకులు మ్రుగ్గు  ల్గానరా కెట్టి యింటన్
                        బొలుపు దొరఁ గి  యుండెం బ్రోలు గుర్తింపకుండన్ -34

ఛందస్సు:      మాలిని వృత్తానికి న-న-మ-య-య గణాలు. 9 వ అక్షరం యతి.

కలితాంతము:          భూమీశ్వరుఁ డేడ్చుచు బొంది విడన్
                        భామాజన  మార్తిని వ్రాలనిలన్
                        శ్రీమద్రవి యస్తముఁ జేర జనెన్
                        భూమిం బెనుఁ జీఁ కటి పొల్పెసఁ గెన్ -35

ఛందస్సు:      కలితాంతమునకు త-ట-జ-వ గణాలు. 8 వ అక్షరం యతి.


మానిని:        తామరసాప్తుఁ డు  లేనినభం బనఁ దారలు లేని త్రియామ యనం
                గా  మహితాత్ముఁ డు  భూపతి లేమిని గద్గదకంఠసమాకులితా
                యామమహాపథచత్వరసంఘము  నై పురి  యొప్ప  నరుల్ సతులున్
                స్తోమములై చెడఁ దిట్టుచు నుండిరి ద్రోహి  మొనర్చినకై కయినిన్ -36

ఛందస్సు:      మానిని వృత్తానికి ఏడు "భ" గణాలు, గురువు, 13 వ అక్షరం యతి.

తాత్పర్యం:    
ఎక్కడ చూసినా ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కుల స్త్రీలు హాహా కారాలు చేస్తుంటే, ఎవరి ఇంటి ముందు కూడా అందంగా అలకడం గానీ-ముగ్గులు వేయడం గానీ లేకుండా, ఇది అయోధ్యా పురమా అని గుర్తించ లేకుండా వుండి సౌందర్యం లేనిదయింది. పుడమి రాజు ఏడుస్తూ శరీరాన్ని వదిలి పెట్టగా, భార్యలందరు దుఃఖంతో నేలగూలారు. శోభాయమానంగా వుండే సూర్యుడు అస్తమించాడు. భూమంతా పెనుచీకటి వ్యాపించింది. సూర్యుడు లేని ఆకాశం-నక్షత్రాలు లేని రాత్రి అన్నట్లుగా, గొప్ప మనస్సు గల రాజు లేనందువల్ల, వ్యసనంతో డగ్గుత్తిక పడిన కంఠాల వారితో కలత చెందిన రాచ బాటలు, నాలుగు త్రోవలు కలిసే ప్రదేశాలు కనిపించాయి. స్త్రీ-పురుషులు గుంపులు-గుంపులుగా చేరి రాజద్రోహం, భర్తృ ద్రోహం, పుత్ర ద్రోహం, ప్రజా ద్రోహం చేసిన కైకేయిని నాశనమై పోవాలని నోటి కొచ్చినట్లు తిట్టారు.  



No comments:

Post a Comment