Wednesday, January 15, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -12:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -12
వనం జ్వాలా నరసింహారావు

దశరథుడికి ఉత్తరక్రియలు చేసిన భరతుడు, రాజకర్తలు అతడిని పట్టాభిషేకం చేసుకొమ్మని కోరినప్పటికీ, ఒప్పుకోక, అరణ్యవాసంలో వున్న శ్రీరాముడిని తీసుకొచ్చేందుకు అడవులకు ప్రయాణమైపోతాడు. పాదచారియైన భరతుడు రామాశ్రమాన్ని వెతికి, ఆయన్ను దర్శించుకుంటాడు. కుశల ప్రశ్నలనంతరం భరతుడు శ్రీరాముడికి దశరథుడు మరణించిన సంగతి తెలియచేస్తాడు. దశరథుడు మరణించిన విధానాన్ని రాముడికి చెప్పడానికి "తరలము" వృత్తంలో పద్యం రాసారు వాసు దాసుగారిలా:


తరలము: నినుఁ దలంచియ యేడ్చుచున్ మరి నీదు దర్శనకాంక్షి యై,
                నినుఁ దలంగకయున్న బుద్ధిని  నేర కేమియుఁ ద్రిప్పఁ గా,
                ననఘ ! నీవిడనాడుటన్, భవ దార్తిపీడితుఁ డౌచు, నీ
                జనకుఁ డక్కట  యస్తమించెను  జాల నిన్నె స్మరించుచున్ -37

ఛందస్సు:      తరలమునకు స-భ-ర-స-జ-జ-గ గణాలు. 12 వ అక్షరం యతి.


తాత్పర్యం:     అన్నా ! నీ తండ్రి నిన్ను తలచుకుంటూ, ఏడ్చి-ఏడ్చి, నిన్ను చూడగోరి అది లభించనందున, నీ పైనే బుద్ధి దృఢంగా నిలిపి, దానిని మరలించ లేక, నువ్వు వదిలి వచ్చిన కారణాన నీ వియోగ బాధవల్ల, కష్ట పడుతు, రామా-రామా అంటూ నిన్నే స్మరించుకుంటు అస్తమించాడు. (దశరథుడి మరణ వార్తను కైక భరతుడికి చెప్పిన విధానానికి, భరతుడు రాముడికి చెప్పిన పద్ధతికి తేడా వుంది. తండ్రి మరణానికి కారణభూతుడు రాముడేనన్న అర్థం స్ఫురిస్తుంది కూడా. ఆయన చేసిన పని సరైందికాదని భరతుడి అభిప్రాయంగా చెప్పించాడు కవి. రాముడవై లోకాన్ని సంతోషపెట్టే బదులు దుఃఖపెడుతున్నావని భావన).

1 comment:

  1. 1934 గోల్కొండ కవుల సంచికలో ప్రచురించబడిన తాతాజీ కవిత్వం గురించిన వివరాలు ఈ కింది టపాలో చూడండి. మీకు సాహిత్యం గురించి మక్కువ కనుక ఈ విషయంపై ఆసక్తి ఉందనే నమ్మకంతో ఈ వ్యాఖ్య రాస్తున్నాను, అన్యధా భావించవద్దు. మీ బ్లాగులో ప్రచారం చేస్తున్నందుకు క్షమించండి.

    http://jaigottimukkala.blogspot.in/2014/01/tatajis-poem-in-1934-compilation_16.html

    ReplyDelete