సీత
కోసం శోకించిన రామన్న
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
17 వ భాగం - కిష్కింధ కాండ
వనం
జ్వాలా నరసింహా రావు
సూర్య
దినపత్రిక (07-11-2016)
అరణ్య కాండలో దీన సంరక్షణా ధర్మాన్ని శ్రీరాముడు స్వయంగా
అనుష్టించి చూపాడు. కిష్కింధ కాండలో మిత్ర రక్షణను అనుష్టించి చూపనున్నాడు. అరణ్య
కాండాంతంలో, రామ
లక్ష్మణులు, పంపా నదిని చేరుకోవడం గురించి తెలుసుకున్నాం.
వికసించిన కమలాలతోను, ఎర్ర కలువ పూలతోను, వైఢూర్య కాంతి కలిగిన నిర్మల జలాలతోను, రక-రకాల
వృక్షాలతోను నిండి వున్న పంపా నదిని చూసి తాను పడిన సంతోషాన్ని తమ్ముడు
లక్ష్మణుడితో పంచుకుంటాడు రామ చంద్ర మూర్తి. అక్కడ కనిపించిన అనేకమైన సుందర
దృశ్యాలను పరికించిన శ్రీరాముడు, సీతా సమేతంగా పంచవటిలో
వున్నప్పటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. అలా గుర్తుచేసుకుంటూ, తమ్ముడు లక్ష్మణుడితో అంటున్న సందర్భాన్ని మూడు మత్తకోకిలం వృత్తాల్లో ఈ
విధంగా వర్జించారు వాసు దాస కవి:
మత్తకోకిలము:
ఈ మనోహరకోకిలారవ
మీసుపుష్పితకాననం
బై మహిం జెలు వౌవసంతము హర్షదం బిల సీతకు౯(న్)
వామలోచన మంజుభాషిణి బంభరాలకఁ బాసి యిం
కేమికార్య మనుంగుఁ దమ్ముఁ డ యేను జీవముఁ దాల్చియు౯(న్)-70
మత్తకోకిలము: ఏచి పూచినపూవుటీరము లెల్లెడం గన
నౌచు నా
యాచకోరవిలోచనం గనులారఁ గానమిఁ బుష్పనా
రాచజాతవసంతవర్ధిత రాగకారణశోకశు
క్రాచితాత్ముఁ డ నై కృశించెద నయ్యొ యెట్లు
సహింతునో - 71
మత్తకోకిలము:
కానరాక విదేహకన్యక
గ్రాలఁ జేసెను శోకము౯(న్)
కానవచ్చి వసంతుడు౯(న్) శ్రమకాండ
బిందుల మాన్చెడి౯(న్)
మానినీ మణిఁ బాసివేదన మాడుచుండఁ గ నీవసం
తానిలుం డెటువంటిక్రూరుడొ యయ్యొ నన్ను దహించెడిన్ -72
తాత్పర్యం:
వినిపించుతున్న ఈ కోకిల ధ్వనులు, చక్కగా పూసిన ఈ
వనాలు, ఈ వసంత కాలం సీతకు ఆనందాన్నిచ్చేవిధంగా వున్నాయి.
అందమైన కళ్లు, ఇంపైన వాక్కు, తుమ్మెదల్లాంటి
ముంగురులు కలిగిన సీతను ఎడబాసి నేను ప్రాణాలతో వుండి ప్రయోజనం ఏమిటి? సగం శరీరం లేనప్పుడు, మిగిలిన సగం ఏం చేయగలదు?
విస్తారంగా పూసిన పూ పొదలు అంతటా కనిపిస్తున్నవి. చకోరాల్లంటి
కళ్లున్న సీత మాత్రం కనిపించడం లేదెక్కడా ! అనురాగం వల్ల మన్మధ ప్రేరణతో పుట్టి,
వసంతుడు వృద్ధి చేసిన, ఈ శోకాగ్నితో
కమ్ముకున్న మనస్సు కలిగి-శుష్కించు తుంటే, నే నెట్లు
సహించగలను? సీతా దేవి కనిపించనందున నాకు దుఃఖం కలుగుతోంది.
వసంతుడొచ్చి చెమట బిందువులను తొలగిస్తున్నాడు. సీతా దేవి వియోగంతో దహించుతున్న
నన్ను, నిర్దయతో వసంతకాలపు వాయువు మరింత దహించివేస్తున్నాడు.
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
వసంత కాల మహిమను తలచుకుంటూ, ఆ మహిమకు,
మగ నెమలి సమీపం చేరుతున్న ఆడ నెమలిని సీతాదేవితో పోల్చుకుంటున్న
సందర్భంలో, శ్రీరాముడు మనసులో అనుకుంటున్న మాటలను ఒక
మత్తకోకిలం వృత్తంలోను, ఒక మానిని వృత్తంలోను రాశారు కవి
ఇలా:
మత్తకోకిలము: అట్టి నా ప్రియురాలి జానకి హారికుంతలఁ బాసి నే
నెట్టు లక్ష్మణ సంతరింతునొ యీ వసంతముఁ గంటివే
తొట్టుతేనెల మేలిపూవులతో వనంబులు నిండి యి
ప్పట్టున౯(న్) సుమపాళి నాయెడ వ్యర్థమయ్యెడి నయ్యయో -73
మానిని: ఎంతయుఁ గాంతలు దొంతర లారియు నీకుసుమంబులు తేఁ టిగముల్
రంతులు సేయుచు వెన్కొన ధారణి రాలెడి నాయెడ వ్యర్థము లై;
కాంతకలారవముల్ నిగిడించుచుఁ గామము నా కెసఁ గింపఁ బత
త్సంతతి సల్పెడి నొక్కొ పరస్పర సల్లపనంబులు పిల్పులచేన్ -74
తాత్పర్యం: అలాంటి నా ప్రియురాలిని, జానకిని,
తలనిండా కాంతులీనే వెంట్రుకలు గలదానిని, వదిలిపెట్టి
ఈ వసంత కాలాన్ని ఎలా దాటగలను? అడవుల నిండా తేనెలు కారుతున్న
పూల గుత్తులు నాకు సంతోషం కలిగించలేనందున, నాకవి వ్యర్థంగా
కనిపిస్తున్నాయి. పూలన్నీ కాంతిగల వైనప్పటికి, తేనెకొరకు
తుమ్మెదలు వెంట-వెంట వస్తున్నప్పటికి, నా విషయంలో వ్యర్థంగా
రాలిపోతున్నాయి. నాలో కామాన్ని పెంపొందించేందుకొరకు, పక్షుల
గుంపులు, మనోహరంగా-అవ్యక్తమైన ధ్వనులతో, ఒక దానిని మరొకటి పిలుచుకుంటూ, సల్లాపాలాడుకుంటున్నాయి.
ఛందస్సు: మానిని వృత్తానికి ఏడు "భ"
గణాలు, గురువు,
పదమూడింట యతి స్థానం. మత్తకోకిలము
వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో
అక్షరం యతి.
సీతాదేవిని పదే-పదే తలచుకుంటూ, ఒక దశలో,
తమ్ముడు లక్ష్మణుడిని, అయోధ్యకు
పొమ్మని-భరతుడి వద్దకు చేరు కొమ్మని సలహా ఇచ్చాడు. ఆ సమయంలో, అధైర్య పడుతున్న సోదరుడి సంతాపం ఉపశమించే విధంగా, ధైర్యోక్తులు
పలుకుతాడు లక్ష్మణుడు.
No comments:
Post a Comment