ఆంధ్ర వాల్మీకి అద్భుత
సృష్టి
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రజ్యోతి
(నివేదన)...(04-11-2016)
వాల్మీకి సంస్కృత
రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా
ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ
వావిలికొలను సుబ్బారావు. ఆయన సొంత-స్వతంత్ర
రచన అనిపించుకున్న శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం తెలుగునేల నాలుగు చెరగులా విశేష
ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకుంది. ఇరవై
నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన
శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్
వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు.
1909 వ సంవత్సరంలో నాటి చెన్నపురి (నేటి చెన్నై) లోని "శ్రీ వైజయంతీ
ముద్రా శాల" లో ముద్రించబడి, ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా
"కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్
లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ"
డిజిటలైజ్ చేసిన అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి
నుంచి సేకరించిన విషయాలను నేను రాసిన "ఆంధ్ర వాల్మీకి
రామాయణం, బాల కాండ మందరం లఘుకృతి “మందర
మకరందం” లో పొందుపరిచాను. అపురూపమైన అలనాటి గ్రంథకర్త అభిప్రాయాలు అక్షర
లక్షలు చేసే ఆణిముత్యాలు. ఆయన మాటల్లోనే...ఆ విషయాలు కొన్ని....
శ్రీ రామాయణం, భారతం, భాగవతం అద్వితీయమైన
గీర్వాణ భాషా గ్రంథాలు. ఈ మూడింటి లో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం.
కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో ఆదికావ్యమైంది. "శ్రీ రామాయణం"
అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన
శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి
చరిత్రనీ అర్థం. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా
తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీ రామాయణం మహాకావ్యం.
పుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిది. దానిలోని గుణాలు, రహస్యాలు తెలుసుకోవాలంటే వాల్మీకికి గాని, సర్వజ్ఞుడికి
గాని మాత్రమే సాధ్యమవుతుంది. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో
వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. శృంగారం లాంటి నవ రసాలున్నాయి. వాల్మీకి శ్లోకాల
(ఆంధ్ర వాల్మీకి పద్యాల) భావం మాత్రమే కాకుండా, అందులోని
కొన్ని పదాలు ఎంత అర్థ గాంభీర్యం గలవిగా, రసవంతంగా వుంటాయో చెప్పలేం.
అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ
వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణంలో వున్నాయి. వాల్మీకి
అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా,
వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. పాత్ర గుణ
మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు
భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో. వాల్మీకి
రామాయణమనే "కలశార్ణవం" లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా
తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే,
చీకట్లో తారాడినట్లే.
వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం "ధ్వని
కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని
కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం
వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. వాల్మీకి
రామాయణంలో, సాధారణంగా, సర్గ మొదట్లో- చివర్లో, మొదలు చెప్పిన కథనే సంగ్రహంగా తిరిగి
చెప్పడం జరిగింది. శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతెందుకు ! కాళిదాసు, భవభూతి అంత గొప్ప వాళ్లు కావడానికి రామాయణమే కారణం. ఒక్క ఏరునో-నదినో చూసిన
మాత్రాన అదెంత గొప్పగా వుందో అనుకుంటాం. అలానే కాళిదాసు లాంటి వారిని గొప్ప
కవులంటాం. అలాంటప్పుడు అన్ని నదులకు ఆధారమైన సముద్రాన్ని ఏమనాలి? అలానే, కాళిదాసాదులకు జీవనదమైన రామాయణాన్ని ఏమని
వర్ణించాలి? వాల్మీకి రామాయణం నుంచి కాళిదాసు లాంటి వారు
గ్రహించినవి ఎన్నో వున్నాయి. వేదవ్యాసుడంతటి వాడు వాల్మీకి శ్లోకాలను అనువదించగా
లేంది, వేరేవారి సంగతి చెప్పాలా !
శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని
రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా
ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు
ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా
తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం
మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా
సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రామాయణంలో
సూక్ష్మంగా చెప్పబడిన ధర్మాలను, కథలు-కథలుగా కల్పించి వ్యాస
భగవానుడు ఇంతకు నాలుగింతలు గ్రంథాన్ని తయారు చేశాడు. భగవద్గీతంతా కూడా రామాయణ సారమేనని గ్రహించాలి.
శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు
ఉద్ధరించబడి వున్నాయి. రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి
వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలో,
యజుర్వేదంలోని 1 29 290 పదాలే
కాకుండా, రుగ్వేదం, సామవేదం, అధర్వ వేదాలలోని పదాలు కూడా అనులోమ-విలోమంగా కూర్చబడిందన్న రహస్యం
తెలుసుకోవచ్చు. ఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగింది. ఈ గాయత్రీ
విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో
పాటే ఉపదేశించాడు. "తప స్స్వాధ్యాయ నిరతం, తపస్వీ
వాగ్విదాంవరమ్, నారదం పరిపప్రఛ్చ, వాల్మీకిర్మునిపుంగవమ్"
అని గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి, "జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్" అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను
ముగించాడు వాల్మీకి. అంధ్ర వాల్మీకంలో, మూలంలో వున్నట్లు "తపమున స్వాధ్యాయంబున, నిపుణుని... ..... తమి గావించెన్" అన్న పద్యంతో ప్రారంభించి,
"యథావిధి విన్న బఠింప నారయన్" అని ముగించబడింది. కామ్యార్థమైనా,
మోక్షార్థమైనా, రామాయణం పారాయణం చేసినవారి
కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం,
అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి (ఆంధ్ర
వాల్మీకి) కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే.
శ్రీరాముడు సామాన్య ధర్మాలన్నీ ఎలా అనుష్టించింది, కష్ట
కాలంలో ఎలా ప్రవర్తించింది, సుఖ కాలంలో ఎలా నడచుకుంది,
ఎలాంటెలాంటి వారి మీద ఏ విధమైన అభిప్రాయంతో మెలిగేవాడనేదీ, వీటి కారణాలేంటి అన్న విషయాలన్నీ చర్చించాల్సినవే. రామాయణ గ్రంథమేమో చాలా
గొప్పది. రాసిన కవేమో బ్రహ్మర్షి. ఇందులోని మర్మాలేమో మెండుగా వున్నాయి. రాసిందేమో
సంస్కృత భాషలో. చదివినా కొద్దీ విశేషాలు కనిపిస్తాయి. శ్రీమద్రామాయణం వేదంతో
సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేదమే అయినప్పుడు, వేదంతో
సమానమైందని ఎలా అనవచ్చునంటే, వేదంలోని వర్ణాలనే, అనులోమ-విలోమాలుగా మార్చి, వేద ప్రసిద్ధమైన రామ కథను
చెప్పడంవల్ల ఇది వేదమే అయింది. వేదాల్లోని అర్థాలున్నందువల్ల వేదంతో సమానమైంది.
అందువల్లనే, వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో,
రామాయణ పఠనం నియమితమైంది. ఎవరికైనా సత్కవి కావాలని కోరికుంటే,
వారు వాల్మీకి రామాయణాన్ని అనేక పర్యాయాలు, శ్రద్ధగా-భక్తితో
పఠించాల్సిందే.
No comments:
Post a Comment