హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-7
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (27-11-2016)
అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు.
అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు.
ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.
No comments:
Post a Comment