Tuesday, November 22, 2016

సముద్రాన్ని లంఘించి లంక చేరిన హనుమ .... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 20 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

సముద్రాన్ని లంఘించి లంక చేరిన హనుమ
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
20 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (21-11-2016)

          ఆంధ్ర వాల్మీకి రామాయణంలో అందమైన కాండ "సుందర కాండ". ఆద్యంతాలు హనుమంతుడు ఆచార్యుడుగా దర్శనమిచ్చే అద్భుతమైన "సుందర కాండ"లో, మంత్ర పూతమైన రస సౌందర్యం, ఉద్యానవన సౌందర్యం, లంకా నగర సౌందర్యం, కామినీ-భోగినీ జన సౌందర్యం, వీర సౌందర్యం, హనుమ సాధనా సౌందర్యం, కవితా శిల్ప సౌందర్యం రాశీ భూతమైంది. సీతా దేవిని వెతుక్కుంటూ కిష్కింధ చేరిన శ్రీరాముడు వాలిని చంపి, సుగ్రీవుడిని వానర రాజ్యానికి రాజును చేశాడు. బదులుగా సీతా దేవిని వెతికించి పెట్తానని సుగ్రీవుడు వాగ్దానం చేసి వానరులను నలు దిక్కులకు పంపాడు. ఆ తర్వాత కథే సుందర కాండ. ఈ కాండలోని వృత్తాంతమంతా కేవలం ఒకటిన్నర రోజుల్లోనే జరిగింది.

          నలు దిక్కులకూ పోయిన వానర బృందంలో ఒకటి, అంగదుడి నేతృత్వంలో, దక్షిణ దిక్కుకు పోయింది. జాంబవంతుడి ప్రేరణతో, మహేంద్ర పర్వతాన్ని ఎక్కి, అక్కడినుంచి, లంకకు వెళ్లాలన్న సంకల్పంతో సిద్ధపడ్డ హనుమంతుడి ఉత్సాహంతో మొదలవుతుందీ కాండ. హనుమంతుడి విక్రమానికి చీకాకు పడుతుంది మహేంద్రాది. ఆకాశానికి ఎగిరి కపుల వద్ద శెలవు తీసుకుంటాడు హనుమంతుడు. మైనాకుడికి సర్ది చెప్పి ముందుకు సాగుతున్న తనను అడ్డుకున్న సురస నోట్లో దూరి బయటపడ్తాడు హనుమంతుడు. సింహికను వధించాడు. లంకా తీరాన్ని చూసిన హనుమంతుడికి అమితమైన ఉత్సాహం కలిగింది. ఆ సందర్భంలో, హనుమంతుడి ఉత్సాహాన్ని తెలిపేందుకు, వాసు దాసు గారు ఒక పద్యాన్ని "ఉత్సాహం" వృత్తంలోను, రామ కార్యార్థియై సముద్ర లంఘనం చేస్తున్నందున, ఆ మహానుభావుడికి పంచ చామర సేవ చేసేందుకు "పంచ చామరం" వృత్తంలో మరో పద్యాన్ని రాశారీవిధంగా.

ఉత్సాహము:           చారువివిధరూపధారి సాగరప్రతీరము౯(న్)
                        జేరి దుర్జయుండు పూల నైజరూపుఁ గార్యము౯(న్)
                        సారె దలఁ చి తనదురూపుఁ జక్కఁ జూచి కేత కే
                        లారుహాళి సొంపు నింపు లంబభూధరంబున౯(న్) -82

పంచచామరము:      సుకూటవాటికాగ్రసీమ జూచి దూఁ కి యొడ్డున౯(న్)
                        ద్రికూటభూధరాగ్రసీమ దేవతాధి రాట్పురీ
                        నికాశమైన లంకను౯(న్) వ నీసమూహరాజి పా
                        వకాత్మ మిత్రపుత్రుఁ డప్డు పారఁ జూచెఁ జక్కఁ గ౯(న్) -83

తాత్పర్యం:    
మనోహరమైన అనేక రూపాలను ధరించగలిగే హనుమంతుడు సముద్రం ఆవలి ఒడ్డును చూశాడు. మంచి శిఖర ప్రదేశాల కొనను చూసిన హనుమంతుడు, ఒడ్డుకు దూకి, త్రికూట పర్వత కొనలో, దేవేంద్రుడి పట్టణంతో సరితూగుతూ - వన సమూహాలతో ప్రకాశిస్తున్న లంకా నగరాన్ని తేరిపార చూశాడు.

ఛందస్సు:      ఉత్సాహం వృత్తానికి ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి. పంచ చామరం వృత్తానికి  "జ" "ర" "జ" "ర" "జ" "జ" "గ" గణాలు, తొమ్మిదింట యతి వుంటాయి.


హనుమంతుడు లంకా పురి వెలుపల వున్న ఉద్యానవనంలో విహరించాడు కొంత సేపు. లంకను పరికించి చూశాడు. చూసి, దాని అందానికి నివ్వెర పోయాడు. లంకలోకి ప్రవేశించే ఉపాయాన్ని ఆలోచించాడు. దుర్భేద్యమై, ప్రవేశించనలవి కాని లంకా నగరాన్ని మరికొంత సేపు రెప్ప వాల్చకుండా చూశాడు. చీకటి పడే వరకు అక్కడే దాక్కొని, తర్వాత చిన్న ఆకారంలో, లంకలో దూరాలను కుంటాడు. సూర్యాస్తమయం కాగానే చిన్న పిల్లి ఆకారంతో, కొండ దిగకుండానే, ఒకే ఒక్క గంతుతో, లంకలో ప్రవేశించాడు హనుమంతుడు. తక్షణమే, లంకా పురి అద్భుతానికి మరో సారి ఆశ్చర్య పడతాడు. నాటి రాత్రి, ఫాల్గుణ శుద్ధ త్రయోదశీ తిథిన, చుక్కల నడుమనున్న చంద్రుడిని చూసినప్పుడు, హనుమంతుడికి కలిగిన సంతోషాన్ని, కవి తరలము వృత్తంలో వర్ణించారీ విధంగా: (ఆశ్వయుజ శుద్ధ త్రయోదశీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో, "నిర్మలంగా కనిపించిన చంద్రబింబాన్ని, శుభ్రంగా వున్న వెన్నెల" ను చూస్తూ ఈ వ్యాఖ్య రాశారు వాసు దాసు గారు)

తరలము:      జలజకాంతియుఁ బాలడాలు బి సంబుడంబును నింబుగాఁ
                గలికిరూపునఁ గాన వచ్చి ప్ర కాశమానుఁ డు నౌశశి౯(న్)
                వలిముఖాగ్రణి సారసాకర వారిఁ గ్రీడఁ జరించునా
                జలజసంభవు తేజి యట్టులు సంతసంబునఁ గన్గొనె౯(న్) -84
తాత్పర్యం:     శంఖం, పాలు, తామరతూడుల మాదిరి తెల్లటి కాంతితో, మనోహర రూపంతో కనిపిస్తూ ప్రకాశిస్తున్న చంద్రుడిని, తామర కొలనులోని నీటిలో క్రీడించే హంసలాగా సంతోషంతో చూశాడు హనుమంతుడు.
ఛందస్సు:      తరలము నకు "న" "భ" "ర" "స" "జ" "జ" "గ" గణాలు. పన్నెండో ఇంట యతి.


ప్రాకారం చేరి తిరిగి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. వానర సైన్యం లంకలోకెలా రాగలదని యోచించాడు. రామ లక్ష్మణుల బల పరాక్రమాలను బేరీజు వేసుకుని, ధైర్యం తెచ్చుకుంటాడు. లంకా నగరంలో ప్రవేశిస్తున్న హనుమంతుడిని అడ్డుకున్న లంకాధి దేవత లంకిణిని, తన ఎడమ చేతి పిడికిలితో పొడిచాడు హనుమంతుడు. తనను రక్షించమని వేడుకున్న లంకిణి, లంకా నాశనానికి సమయం వచ్చిందని అంటుంది. లంకలో తిరగమంటుంది. 

No comments:

Post a Comment