Tuesday, February 7, 2017

108 సేవల ఆద్యుడు రామలింగరాజే! .....వనం జ్వాలా నరసింహారావు

108 సేవల ఆద్యుడు రామలింగరాజే!
వనం జ్వాలా నరసింహారావు
ఎం ఆర్ 108 మాజీ కన్సల్టెంట్ (80081 37012)

108 ఆద్యుడు పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన గుజరాత్ వాసి డాక్టర్ సుబ్రతోదాస్ అని, కొన్ని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. ఆపదలో వుంటే ఫోన్ చేయగానే క్షణాల్లో చేరుకుని ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ సేవల వెనుక వున్న కథకు ఆయన ఆద్యుడు కాదు. అహ్మెదాబాద్ కు చెందిన డాక్టర్ సుబ్రతోదాస్ స్థాపించిన లైఫ్ లైన్ ఫౌండేషన్ అనే స్వఛ్చంద సంస్థ సేవలు గొప్పవే. ఆయన ఈ రంగంలేసిన కృషి కూడా గొప్పదే. కాకపోతే అభ్యంతరమల్లా, ఆ సంస్థ కారణంగానే గుజరాత్ ప్రభుత్వం తొలిసారి అత్యవసర వైద్యసేవల చట్టం-2007 తీసుకొచ్చిందనీ, ఆ క్రమంలో ఆవిర్భవించిందే 108 అనీ, తరువాత ఇతర రాష్ట్రాలతోనూ ఆయన మాట్లాడారనీ, అందువల్లే 26 రాష్ట్రాల్లో 108 పనిచేస్తుందనీ, పేర్కొనడమే. నిజానిజాలు పదిమందికి తెలియాలనీ, 108  సేవల కారకుడు బైర్రాజు రామలింగ రాజు అనే ఒక తెలుగువాడనీ, ఆ విషయం పదిమందికి తెలిసేలా చరిత్ర పుటల్లో ఇప్పటికైనా నమోదు కావాలనీ ఈ వ్యాసం రాస్తున్నాను.

108 సేవలు ఎలా అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా మొదలైందీ, ఎలా ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చెందిందీ అనే వివరాలలో భాగంగానే గుజరాత్ రాష్ట్రంలో ఆ సేవలు ఎలా ప్రారంభమైనాయో అనే విషయం స్పష్టంగా వుంది. ఆగస్ట్ 15, 2005 న అప్పటి కేంద్ర మంత్రి దయానిధి మారన్, అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డిల సమక్షంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న ఈ సేవల విషయం తెలుసుకున్న మోడీ గుజరాత్ ప్రభుత్వం, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి శ్రీమతి మోనా ఖాందార్ ను, హైదరాబాద్ పంపింది. 108 సేవల కేంద్రమైన ఇఎంఆర్ఐ కార్యాలయాన్ని 2007 మే నెలలో సందర్శించిదామె. దరిమిలా ఇఎంఆర్ఐ అధికారులు (నేను కూడా వున్నాను) అహ్మెదాబాద్ వెళ్లి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం, ఆ తరువాత ఐదారు పర్యాయాలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం, అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం, ఆగస్ట్ 29, 2007 న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛనంగా ఆ రాష్ట్రంలో 108 సేవలు మొదలవడం జరిగింది. ఉత్తర ప్రత్యుత్తరాలలో ఇఎంఆర్ఐ పక్షాన రాసిన లేఖలన్నీ నా సంతకంతో పోయినవే! ఈ పూర్వరంగంలోనే గుజరాత్ అత్యవసర వైద్యసేవల చట్టం-2007 ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాని డాక్టర్ సుబ్రతోదాస్ కారణంగా కానే కాదు. అహ్మెదాబాద్ లో 108 సేవలు ప్రారంభమైనప్పుడు వేదికపైన మోడీతో పాటు మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం, ఇఎంఆర్ఐ సంస్థ అధ్యక్షుడు రామలింగరాజు, సంస్థ సీఈఓ వెంకట్ చంగవల్లి కూడా వున్నారు. ఆ రాత్రి మోడీ ఇచ్చిన ప్రత్యేక డిన్నర్ లో రామలింగరాజు పాల్గొన్నారు.

108 అంబులెన్స్ సేవలతో మూడున్నర సంవత్సరాలు అనుబంధం వున్న వ్యక్తిగా, "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" ఆవిర్భావం నుంచి ఆరోహణ వరకు, ఉన్నత శిఖరాలకు చేరుకోవడం దాకా, నా వంతు (ప్రధాన?) భూమిక నిర్వహించిన వ్యక్తిగా, ఎవరు 108 ఆద్యులో...ఎవరు కాదో...పూర్తిగా తెలిసినవాడిగా వాస్తవాలు తెలియచేసే ప్రయత్నమే ఇది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ "కరుణామయి-కారుణ్య దేవతగా వర్ణించిన 108 అంబులెన్స్ అత్యవసర సహాయ సేవల తో సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు అనుబంధం, ఆయన కారణంగానే 108 సేవలు మొదలై, అంచలంచలుగా వ్యాప్తి చెందాయనే సత్యం ఇప్పట్లో కొందరికి తెలియకపోయినా ఓ దశాబ్దం క్రితం ఇప్పటి ప్రధాన మంత్రి, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురికి తెలిసిన విషయమే. "108 అంబులెన్స్" ఆవిర్భావం, పరిణామక్రమం వెనుక దాగి వున్న వాస్తవాలు ఆసక్తికరమైన వే కాకుండా పరిశోధకులకు అధ్యయనపరమైనవి కూడా.

తాను నడుపుతున్న సత్యం కంప్యూటర్స్ సంస్థ భారతదేశంలోనూ-అంతర్జాతీయం గానూ పేరు-ప్రతిష్ఠలతో పాటు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడంతో, సంస్థ చైర్మన్ రామలింగ రాజులో అంతర్లీనంగా వున్న దాతృత్వ ధోరణి బహిర్గతం కాసాగింది. తనను ఉన్నతస్థితికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ముందుగా తన ప్రాంత ప్రజలకు, దరిమిలా రాష్ట్ర ప్రజలకు, క్రమేపీ దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి ఏదైనా లాభం కలిగే పని చేపట్టాలన్న భావన కలిగింది రాజుగారిలో. తనకీ ఆలోచన కలగడానికి కొంత నేపధ్యం కూడా వుంది. జూన్ 27, 2001 న రామలింగ రాజు తండ్రి బైర్రాజు సత్యనారాయణ రాజు  మరణించడంతో, ఆయన జ్ఞాపకార్థం, గ్రామీణ ప్రజల్లో వికాసం కలిగించేందుకు ఉద్దేశించిన "బైర్రాజు ఫౌండేషన్" ను రామలింగరాజు సోదరులు ఆగస్ట్ 15, 2001 న స్థాపించారు. ఇందులో భాగంగా సంస్థ అందించిన సేవల్లో ప్రధానమైనవి మూడు అంబులెన్సుల ద్వారా అందించిన ఆరోగ్య రక్షణా సేవలు. క్రమేపీ, ఆ గ్రామీణ వికాస సేవలను 200 గ్రామాలకు విస్తరించి, నేరుగానో, పరోక్షంగానో, సుమారు పది లక్షల మంది జనాభాకు లాభం చేకూరేలా సుమారు 25 రకాల సేవలను అందించసాగింది బైర్రాజు సంస్థ. ఆ సేవల్లో ప్రధానమైనవి: ఆరోగ్య సంరక్షణ, విద్య-అక్షరాశ్యత, జీవనోపాధి, పర్యావరణం, పారిశుధ్యం, మంచి నీరు, వ్యవసాయం, క్రీడలు, గ్రామీణ సాంకేతిక అభివృద్ధి, అత్యవసర సహాయ సేవలు. ఆ క్రమంలోనే జులై 16, 2003 "సహాయ" పేరుతో ప్రయోగాత్మకంగా వైద్య పరమైన అత్యవసర సహాయ సేవలను (+91 98494 54321 కాల్ నంబర్) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలలోని 19 గ్రామాలకు పనికొచ్చేలా బైర్రాజు ఫౌండేషన్ ప్రారంభించింది. అవి విజయవంతంగా నడవడంతో వాటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచన కలిగింది రామలింగరాజు గారికి. ఆ ఆలోచనే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవల ఏర్పాటుకు దారితీసింది.


రామలింగరాజు ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి సత్యం కంప్యూటర్స్ సంస్థలో పని చేస్తున్న డాక్టర్ బాలాజి రంగంలోకి దిగారు. డాక్టర్ బాలాజికి తోడ్పడిన వారిలో ముందు వరుసలో డాక్టర్ ఎ. పి. రంగారావు, వారణాసి సుధాకర్, శ్రీకాంత్, కృష్ణ కోనేరు, శ్రీనివాస రాంబాబు, పొలిమల్లు శివ వున్నారు. వీరి లాంటి ఎందరో కలిసి రూపొందించిన ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ పథకమే 108-అత్యవసర సహాయ సేవలు. వీరందరి కంటే, సంస్థ సీఈఓ గా ఐదేళ్ల పాటు పని చేసిన వెంకట్ చంగవల్లి వివిధ రాష్ట్రాలకు ఆ సేవలను విస్తరించడానికి కృషి చేశారు.

మొదట్లో, హైదరాబాద్ నగరంలో ఒకటి-రెండు అంబులెన్సులను నడిపి ఫలితాలెలా వుంటాయో చూద్దామనుకున్నారు. కేవలం ఒక్కో పౌరుడి మీద సంవత్సరానికి పది రూపాయలు (అప్పటి లెక్కల ప్రకారం) మాత్రమే ఖర్చు చేయగలిగితే దేశమంతా సంపూర్ణ వైద్య సౌకర్యాలున్న అంబులెన్సులను నడపొచ్చొని నిర్ణయానికొచ్చారు. సత్యం సంస్థలోనే పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి వారణాసి సుధాకర్ సాంకేతిక సహాయం, డాక్టర్ రంగారావు వైద్య పరమైన సలహా-సంప్రదింపులు రాజుగారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాయి. సత్యం మేనేజ్ మెంట్ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి కృష్ణ కోనేరు కూడా వీరికి తోడయ్యారు. ఆయన సూచించిన "సెన్స్-రీచ్-కేర్" నమూనా రాజుగారికి నచ్చింది. డాక్టర్ రంగారావు ఎంపికచేసిన (అప్పటికి) సుమారు 132 రకాల "ఎమర్జెన్సీలను" క్రోడీకరించారు. అత్యవసర సహాయ సేవలు లభ్యమవడానికి అవసరమైన "మెడికల్ ప్రక్రియలను, "ప్రోటోకాల్స్" ను రూపొందించసాగారు. టోల్ ఫ్రీ టెలిఫోన్ గురించి, దాని నంబర్ గురించి, అంబులెన్స్ డిజైన్ గురించి, లోగో గురించి, వైద్య పరమైన ప్రోటోకాల్స్ గురించి, సాంకేతిక సదుపాయాల గురించి, ప్రభుత్వ భాగస్వామ్యం గురించి స్పష్టత రాసాగింది.

          లాభాపేక్ష లేని "సొసైటీ" తరహాలో, "ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్" అన్న పేరుతో రిజిస్టర్ చేశారు. దీనికి స్ఫూర్తి అమెరికాలోని 911 అత్యవసర సహాయ సేవలు. ఇలా మౌలిక సదుపాయాలకు-సహాయ సేవల రూపకల్పనకు సంబంధించిన పనులను చేసుకుంటూనే, ప్రభుత్వంతో ఏప్రియల్ 2, 2005 న మొట్టమొదటి "అవగాహనా ఒప్పందం" పై సంతకాలు చేశారు. జులై 14, 2005 కల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు తయారయ్యాయి. కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ కార్యదర్శిగా అప్పట్లో పనిచేస్తున్న తెలుగు అధికారి జె శ్రీధర్ శర్మతో రామలింగరాజు గారికున్న వ్యక్తిగత సాన్నిహిత్యంతో, టోల్ ఫ్రీ నంబర్ 108 ని శాశ్వతంగా, ఏ రాష్ట్రంలో వాడుకోవడానికైనా వీలుగా, కేటాయిస్తూ, కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా 108 నంబర్ ను సాధించిన ఘనత రామలింగరాజు దైతే, అది కేటాయించిన ఘనత శ్రీధర్ శర్మదవితుంది. ఇద్దరూ తెలుగు వారు కావడం మనకు గర్వకారణం. ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరిగాయి.

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్, గౌరవ అతిథిగా (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కూడా వచ్చారు. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్ లో భారీ సంఖ్యలో హాజరయిన ఆహుతుల సమక్షంలో, ఆగస్ట్ 15, 2005 , ఆద్యతన భవిష్యత్ లో, లక్షలాది ప్రాణాలను కాపాడనున్న అత్యవసర ఆరోగ్య, వైద్య-పోలీసు-అగ్నిమాపక దళ సహాయ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేవలం 75 అంబులెన్సులతో ఆరంభమయిన ఆ సేవలు, అచిర కాలంలోనే, "ఇంతై-ఇంతితై-వటుడింతై" అన్న చందాన దేశంలోని 14 రాష్ట్రాలలో 10, 500 అంబులెన్సులను ప్రవేశ పెట్టడానికి దారితీసింది. రామలింగరాజు గారు సంస్థ అధ్యక్షుడుగా బాధ్యతల నుండి వైదొలగేనాటికి 108 సేవలు 10 రాష్ట్రాలలో 45 కోట్ల మంది ప్రజలకు అందుబాటులో వుండేవి. ఆ తరువాత ఇఎంఆర్‍ఐ బాధ్యతలను జీవీకే సంస్థ చేపట్టింది. మరో 35 కోట్ల జనాభాకు ఈ సేవలను విస్తరించి 80 కోట్ల ప్రజలకు లబ్ది కలిగేలా జీవీకే సంస్థ కృషి చేసింది. ఈ అరుదైన తరహా సేవల ప్రక్రియను అధ్యయనం చేసేందుకు, ఇంకా పొరుగు రాష్ట్రాల నుంచి-విదేశాల నుంచి అధికార-అనధికార ప్రతినిధులు, బృందాలు రావడం జరుగుతూనే వుంది.

ఉమ్మడి ఆంధ్రపదేశ్ తరువాత ఈ సేవలను మొట్టమొదట ప్రారంభించిన రాష్ట్రం గుజరాత్ కాగా, ఆ తరువాత మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్, గోవా, అస్సాం, కర్నాటక, మేఘాలయ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ లతో కలిపి మొత్తం 14 రాష్ట్రాలలో 80 కోట్ల ప్రజలకు 108 సేవలు లభ్యమవుతున్నాయిప్పుడుసుమారు  5 కోట్ల ఎమర్జెన్సీలలో సహాయం అందించి, సుమారు 2 కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగిందీ 108 నంబర్. అదనంగా జీవీకే కృషి వల్ల పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా ఈ సేవలు విస్తరించాయి.


వాస్తవాలు వాస్తవాలుగా రాయాలి కాని, ఒకరు చేసిన మంచి పనిని మరొకరు చేసినట్లుగా చిత్రీకరించడం భావ్యం కాదు. కోట్లాది మంది ప్రాణాలను కాపాడడానికి కారణమైన, అవుతున్న, "108 ఆద్యుడు" నూటికి నూరు పాళ్లు సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత, ఇఎంఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు బైర్రాజు రామలింగ రాజు గారే! ఆ గౌరవం ఆయనకే దక్కాలి...దక్కి తీరాలి! End 

No comments:

Post a Comment