నే
నెవ్వరిని? అని అడిగిన శ్రీరాముడు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
30 వ భాగం - సుందర కాండ
వనం
జ్వాలా నరసింహా రావు
సూర్య
దినపత్రిక (06-02-2017)
స్రగ్విణి: ఓ మహాబాహు! నీ యొద్దికం గానఁ గా
నే మహానిష్ఠలన్ నిచ్చ వర్తింపఁ గా
రామ! భూమిం బరీ రంభసందాతవై
ప్రేముడిం గూరితే వీడితే న న్నిటన్ - 130
తాత్పర్యం: దీర్ఘమైన
బాహువులు కలవాడా! నేతోనే వుండాలనుకుని, నేను, నిత్యం
గొప్ప నిష్టతో వుంటే, నువ్వేమో నన్ను వదిలి భూదేవిని ప్రేమతో
కౌగలించుకుంటున్నావు కదా! నువ్వు ఏకపత్నీ నియమం కల నాయకుడివి కదా. నీకి ఇలాంటి దక్షిణ నాయకత్వం తగునా?
ఛందస్సు: స్రగ్విణికి
నాలుగు "ర" గణాలు. ఏడింట యతి.
మత్తకోకిలము:
బాలికం గద బాల్యమందున ప్రాప్తనైతిని
వల్లభా!
శీలినిన్ సహచారిణిన్ శుభ శీల!
భార్యను బత్నినిన్
బాళి న న్గన వేల? మాటయుఁ
బల్క వేటికి? నేమి కాం
తాళ మా హృదయేశ! మత్కృత దారుణాఘమ
చెప్పుమా-131
తాత్పర్యం: ప్రాణేశ్వరా!
నీవు నన్ను అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నప్పుడు, మనిద్దరం బాల్యంలోనే
వున్నాం కదా! నాటి నుంచి, నేను, నువ్వు
చేసే అన్ని ధర్మ కార్యాలలో-సుఖ దుఃఖాలలో నీతోనే తిరుగుతున్నాను కదా? వల్లభా! సదాచార సంపత్తి కలదాననే కదా? నువ్వే కదా
నన్ను భరించవలసిన వాడివి. నేనుంటేనే కదా నీవు యజ్ఞాలు చేయాలి? ఇలాంటి నన్ను ప్రేమతో చూడవెందుకు? ఒక్క మాటైన మాట్లాడవెందుకు?
నా మీద నీకు కోపమా? హృదయేశ్వరా? లేకి నేను చేసిన ఘోర పాపమా?
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి "ర, స, జ, జ, భ, ర" గణాలు. పదకొండవ స్థానంలో యతి.
రాక్షసులు రావణాసురుడితో వానరులు లంకను
ముట్టడించారని తెలియచేస్తారు. ఆ విషయాన్ని విన్న రావణుడు కోపానికి వచ్చి కాపలాను
పటిష్టం చేశాడు. ఆ సందర్భంలో కవి "తరువోజ" వృత్తంలో ఒక పద్యం, ""తోదకము" లో మరో పద్యం రాశారు.
తరువోజ:
అంతట రాక్షసు లసురేంద్రునిలయ మరిగి
యాతనితోడ నగచరు ల్లంక
నంతయు రోధించి నట్టివిధంబు నఖిలంబుఁ
దెల్పిన నాతండు కనలి
వింతగాఁ గా పెల్ల ద్విగుణంబుఁ జేసి వెస
సౌధ మెక్కిత ద్విధమునుగాంచెఁ
గాంతార శైలముల్ గణియింపరాని కదనలంపటు లైన
కపులాక్రమింప-132
తాత్పర్యం: ఇలా
వానరులు లంకను నలువైపుల నుంచి ముట్టడించిన తరువాత, రాక్షసులు రావణుడింటికి
పోయి, వానరులు ఎలా లంకను ముట్టడించారో తెలిపారు. అది విన్న
రావణుడు కోపంతో, లోగడ వుంచిన కాపలాకు అదనంగా, మరింత పెంచి, తన మేడ ఎక్కి, అడవులను-కొండలను
యుద్ధాసక్తులైన లెక్కలేని కపులు ఎలా ఆక్రమించారో చూశాడు.
ఛందస్సు: ప్రాసము
లేని ద్విపద తరువోజలో ఒక పాదమగును. యతులు నాలుగుంటాయి. ఇది జాతి వృత్తము. ఇంద్రగణాలు
మూడు,
ఒక సూర్య గణం వుంటాయి. మూడో గణం మొదటి అక్షరం యతిస్థానం.
ఇలాంటివి రెండు కలిపిన, తరువోజకు ఒక పాదం అవుతుంది. ప్రతి మూడవ గణం మొదటి
అక్షరం యతి స్థానం-ఇది ఒక పాదం. ప్రాసముతో ఇలా నాలుగు పాదాలు చెప్పితే
"తరువోజ" అవుతుంది.
తోదకము: ధరణిని మ్రింగఁ
గ దార్కొను వీరిన్
దురమున
నేగతి ద్రుంతు నటంచు
న్గరమును
జింత నొ నర్చుచు నాత్మన్
దిరుఁ
డయి వారలఁ దేకువఁ గాంచెన్ - 133
తాత్పర్యం: భూమినే
మింగేటట్లు వచ్చి వున్న వీరిని యుద్ధంలో ఎలా చంపాల్నా? అని
బాగా ఆలోచించిన రావణుడు, స్థయిర్యం తో ధైర్యంగా రాక్షసులను
చూశాడు.
ఛందస్సు: తోదకమునకు "న, జ,
జ, య" గణాలు. ఎనిమింట
యతి. దీనికి "తామరసము" అని కూడా పేరుంది.
రామ-రావణ ప్రధమ యుద్ధం ముగిసిన తరువాత, ఓడిపోయిన
రావణుడు లంకకు పోతాడు. తన పరాభవానికి దుఃఖపడి, ఆ సమయంలో
శత్రువులను ఎదిరించి పోరాడగల సమర్థుడు తమ్ముడు కుంభకర్ణుడొక్కడే అని
నిశ్చయించుకుంటాడు. కుంభకర్ణుడిని నిద్ర లేపమని మంత్రులను ఆదేశించాడు. అతడిని
నిద్రలేపే విధానాన్ని "స్రగ్ధర" వృత్తంలో వర్ణించారు కవి.
స్రగ్ధర:
పూరింతుర్ చంద్రతుల్యం బులు బహుళదరం బుల్ దిశల్ వ్రీలిపోవన్
ఘోరధ్వానంబు లోలిన్ గుమికొని యసురుల్ గొల్పి రవ్వార లేకా
కారంబై కుత్తుకల్ వ్ర క్కలుగ జన నిరా ఘాట బాహావిరావం
బారూఢం బయ్యె క్ష్వేళా యతరవములు పెన్ హావడిం గూర్చె లంకన్-134
తాత్పర్యం: దిక్కులు
పగిలిపోయే ట్లు చంద్రుడిలాగా తెల్లగా వుండే అనేక శంఖాలను పూరించారు. గుంపులుగా
గూడి రాక్షసులందరు, భయంకరంగా, ఒకే విధంగా గొంతులు
పగిలిపోయే విధంగా ధ్వనులు చేశారు. ఆగకుండా చేతులతో చప్పట్లు కొట్టారు. సింహనాదాలు
చేశారు. ఈ ధ్వనులు లంకా వాసులకు ఉపద్రవం కలిగించాయి.
ఛందస్సు: స్రగ్ధరకు "మ, ర,
భ, న, య, య, య" గణాలు. ఎనిమిదింట
ఎనిమిదింట యతి.
ఒంటరిగా
యుద్ధానికి పోవద్దని కుంభకర్ణుడిని హెచ్చరించాడు రావణాసురుడు. ఆ నేపధ్యంలో అతడు
యుద్ధానికి సిద్ధమవుతున్న సందర్భంలో కుంభకర్ణుడిని వర్ణిస్తూ "మానిని"
వృత్తంలో ఒక పద్యం రాశారు కవి.
మానిని: కాంచన భారసహంబు
నివాత మ కాండ విదార్యము వైద్యుత తే
జోంచిత మౌ కవచంబు ధరించి మ
హాత్ముఁ డు వీరుఁ డు సాంధ్యకభృ
త్సంచయ సవృత పర్వత రాజము చందమునన్
రహిమించె మరిన్
జందన సూనవిభూషణ భూషిత సర్వతనుం
డయి శూలియునై-135
తాత్పర్యం: బంగారంతో చేయబడిన, మిక్కిలి
బరువైన, బరువును సహించగలిగిన, గాలిదూర సందులేనిదైన,
బాణాలతో చీల్చరానిదైన, మెరుపుతీగలాంటి
కాంతిగలదైన వస్తువులాగా, పెద్ద దేహం కలవాడు, వీరుడైన కుంభకర్ణుడు సంధ్యా కాల
మేఘ సమూహాలతో కట్టబడిన పెద్ద పర్వతం లాగా ప్రకాశించాడు. గంధం పూలు, సొమ్ములు దేహమంతా అలంకరించబడినవాడై శూలం ధరించాడు.
ఛందస్సు: మానినికి ఏడూ "భ" గణాలు, ఒక గురువు.
పదమూడో ఇంట యతి.
రామ రావణ
యుద్ధం ముగిసి, రావణ వధ జరిగిన తదుపరి, అశోక
వనంలో వున్న సీతాదేవిని తీసుకురమ్మని విభీషణుడికి చెప్తాడు శ్రీరాముడు. అలానే
చేసిన విభీషణుడు ఆమె రాకను శ్రీరాముడికి తెలియ చేస్తాడు. తనను సమీపిస్తున్న
సీతాదేవితో, తన విజయం గురించి చెప్పాడు శ్రీరాముడు. సీతను
లోకులు సందేహించడానికి అవకాశం వున్నందున తానా మెను స్వీకరించనంటాడు. సీతాదేవి
అగ్నిప్రవేశం చేస్తుంది. దేవతలు ప్రత్యక్షమై సీతాదేవి నిర్దోషురాలని శ్రీరాముడితో
అంటారు. అలా వచ్చిన దేవతలతో, "దేవతలారా! నన్ను నేను
మనుష్యుడనని, రాముడంటే దశరథ కుమారుడని మాత్రమే
అనుకుంటున్నాను. నే నెవ్వరిని? ఎవ్వరివాడను? ఏల పుట్టాను?" అని తెలుపమంటాడు. అలా అడిగిన
రామచంద్రమూర్తిని చూసి బ్రహ్మ వేత్తలలో మొట్టమొదటివాడైన బ్రహ్మదేవుడు "రామా!
సత్య విక్రమా! యథార్థం చెప్తా వినుము" అంటాడు. శ్రీరాముడిని నుతిస్తూ బ్రహ్మ
చెప్పిన యథార్థం వాసు దాస కవి ఒక "దండకం" గా రాశారు.
దండకం: శ్రీరామరామా! మహాభావ! నారాయణా! దేవ!
లక్ష్మీసనాథా! యనాథాధినాథా! విభూ! శంఖచక్రాయుధా! నీవ మున్నొంటి శృంగంబు భూదారమై
భూమి కాధారమైనిల్చు పెన్వేల్పవుం, జన్న రానున్న యాసూడులం గీడులంగూర్చి వేదించి
సాధించి బాధించు బల్ప్రోడవున్, నీవ బ్రహ్మంబు, సత్యంబు నీ, వక్షరంబెల్లకాద్యుండు
మధ్యాంతసంస్థుండును న్నీవ లోకాళికిన్ సిద్ధ ధర్మంబు కర్మంబు మర్మంబునున్ నీవ,
నీవే చతుర్బాహువున్ స్వామియున్ శార్జివిన్ శంఖివిన్ ఖడ్గివిం
గృష్ణుఁ డున్ విష్ణుఁ డున్ బుద్ధియున్ సిద్ధియున్ సత్త్వముం దత్త్వమున్ శాంతియుం
దాంతియుం బూరుషాఖ్యుండవుం బూరుషోత్కృష్టరూపంబున న్నీవ, నేవే
హృషీకేశ విఖ్యాతమూర్తీ! యజయ్యుండవున్ సర్వసేనానివిన్ గ్రామణీరత్మమున్ స్రష్టవుం
ద్రష్టవున్ నీవ, నీ యంద డిందున్ సమస్తం బుపేంద్రా! హరీ!
మధ్వరీ! యింద్రకర్మా! మహేంద్రా! నరేంద్రా! మునీంద్రాదివంద్యా! పరా! పద్మనాభా!
విరోధ్యంతకారీ! శరణ్యుండవున్ నీవ, నిన్నే సుమీ సర్వ రక్షైక
సామర్థ్యదక్షుండవున్ లోకచక్షుండవుం చెల్ల దివ్యర్షు లుత్కర్ష భావించి సేవించి
స్తోత్రంబుఁ గావింత్రు శాఖాసహ స్రాత్మకామ్నాయరూపా! మహర్షి ప్రవేకా! యనేకోరు జిహ్వా! జగత్పాళి కీ
వాద్యుఁ డౌ కర్తవున్ ధర్తవున్ హర్తవున్ నీవ, నీవే
స్వయంభర్తవున్, సిద్ధసాధ్యాశ్రయుం డీవ, నీవే సుమీ సృష్టికిన్ముందు భాసిల్లు రూపంబు, యజ్ఞంబును
న్నీవ, నీవే వషట్కార మోకారమున్నీవ, నీవే
సముత్కృష్టయోగైకగమ్యుండవున్, భక్తరమ్యుండవున్ నీవ, నీ పుట్టువుం బుట్టునున్ గిట్టుటన్ వెండి నీవిట్టివాఁ డంచు నెవ్వాఁ
డెఱుంగన్, రమాధీశ! గోజాతభూనిర్జరాక్రాంతభూతావళీ
శైలదిగ్జాలకాంతారదేశంబులన్ నిండి రాణింతు వో దేవదేవేశ! నీవే కదా వేయిపాదంబులన్
వేయి శీర్షంబులన్ వేయినేత్రంబులం బూని భూతంబులన్ గోత్రసంఘాతసంస్ఫీతమౌ భూత ధాత్రిన్
వహింపన్ సహింపంగ దక్షుండ, వీ క్షోణి కల్పాంతవేళన్
మహామహీంద్రతల్పుండవై దేవ! గంధర్వ దైతేయ సంఘంబులం దాల్చి ప్రత్యక్షమై యందు, వోరామ! నీ చిత్తమే నేను, నీ జిహ్వయే వాణి, రోమాళి దేవాళి, యోగీశహృద్ధామ! శ్రీ ధామ కన్ రెప్పలన్
మూయగా రేయి, విప్పం బగల్, నీదు
విశ్శ్వాసముల్ వేదముల్ రామ! నీకాని దావంతయున్ లేదు, సర్వలోకంబు
నీకున్ శరీరంబు స్థైర్యంబు భూగోళ, మగ్నుల్ ప్రకోపంబు,
శ్రీవత్సచిహ్నా! ప్రసాదంబు సోముండు, నీవేకదా
మున్ను వైరోచనిం జేరి దానంబునం గోరి పాదత్రయీన్యాసరూపంబునన్ సర్వలోకంబులున్ నిండి
దండించి తా దైత్యు, దైత్యారికిం బట్టముం గట్టి రక్షించితో
దివ్యమూర్తీ! లసత్కీర్తి! శ్రీలక్ష్మియే సీత, విష్ణుండవే
నీవు, కృష్ణుండునున్ నీవ, నీవే
ప్రజానాథవాచ్యుండ వా పంక్తికంఠున్ వధింపంగ నై మానుషీదేహమున జొచ్చి రక్షోధిపుం
ద్రుంచి మా కార్యముం దీర్చి లోకంబులం దేర్చి తీ వింక హృష్టుండవై ధాత్రిఁ బాలించి
యాపై దివిం జేరుమా, యో రమానాథ! నీ వీర్యసారం బమోఘంబు,
నీ ఘోరశౌర్యం బమోఘంబు నీ దర్శనమే నమోఘంబు, నీ
స్తోత్రమున్ మోఘ మే వేళ నీవారికింగాదు, నిన్ భక్తిచేఁ గొల్చి
చిత్తంబునం దాల్చు నీభక్తులౌ వారి కే లోపముల్ లేవు, నిన్నుం
బురాణున్ సదాపూరుషోత్తంసు నిశ్చంచలం బైన సద్భక్తి సేవించు భక్తుల్ జగద్రక్షకా!
యైహికాత్యంత సౌఖ్యంబు లెల్లప్పుడుం గందు రీశా నమస్తే నమస్తే నమః.
తాత్పర్యం: శ్రీరాముడిని సేవించు భక్తులు ఇహపర
సౌక్యములనెల్ల పొందుదురని చెప్పబడెను. ఈ స్తోత్రమును ప్రతిదినం పఠించి రేని
జన్మాంతర ప్రాప్తిని కాని, కామక్రోధాదుల వలన కాని, బాహ్య
శత్రువుల వలన కాని, తిరస్కారం వుండదని చెప్పబడెను. ఇది
పాపహరం. పురాణం. ఇతిహాసం. వేద సంబంధమైనది. అందుకే దీనిలో ఇలాంటి మహాత్మ్యం వుంది.
No comments:
Post a Comment