Sunday, February 26, 2017

శ్రీ సుందర కాండ ఒక మహా మంత్ర భాండాగారం ..... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

శ్రీ సుందర కాండ ఒక మహా మంత్ర భాండాగారం
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-02-2017)

          శ్రీ సుందర కాండ ఒక మహా మంత్ర భాండాగారం. చక్కదనానికి సంకేతం. మనస్సును మురిపించేదే నిజమైన సౌందర్యం. శాబ్దిక పారమ్యాన్ని నింపుకున్న రామాయణం లోని ప్రతి అక్షరమూ మధురాతి మధురమేకాదు…..మహా మంత్రాక్షరాలతో నిక్షిప్తమైన అక్షయ నిధానం. శ్రవణ స్మరణాదుల మాత్రం చేత అంతఃకరణ శుద్ధి, ఆశయ సిద్ధి, సద్భుద్ధి లభిస్తాయట! వింటేనే చాలు సర్వతో భద్రమన్నారు. అలాంటి వాల్మీకి భగవానుని అనుగ్రహ ప్రసాదమైన రామాయణంలో సారభూతమైనదీ, సర్వారిష్ట నివారకమైనదీ, సర్వాభీష్ట ఫల ప్రదానమైనదీ శ్రీ సుందరకాండ. రామాయణంలో ప్రతికాండకూ అందలి కథా విశేషాన్ని బట్టీ, ఇతివృత్తాన్నిబట్టీ వాల్మీకుల వారు పేరు పెట్టారు. కానీ సుందరకాండ మాత్రం ఈ నియమానికి కట్టుబడినట్లు కనిపించదు, లోతుకు వెళ్లితే తప్ప. "ఏమిటీ ఆ సౌందర్యం" అంటే, "అందులో సుందరం కానిదేమున్నది" అంటారు విజ్ఞులు.

సుందరకాండలో ప్రస్తావించబడిన ప్రతి అంశమూ సౌందర్యమయమే అన్నారు. శ్రీరాముడు 96 అంగుళాల పొడవైన మహా చక్కనివాడు. సీతమ్మ అపురూప సౌందర్య రాశి. అశోకవనమూ-మధువనమూ అతిలోక సుందరమైనవే. ప్రతి శ్లోకంలోనూ పల్లవిస్తూ లయలతో హొయలొలికే గాయత్రీ మంత్రాక్షరాలు అద్భుత సుందర బంధురాలైన శబ్దమాలికలు. ఆద్యంతాలూ కనిపించే వానరాలు సుందర అరవిందాలు. ఇక కావ్యమా? నిరుపమాన సౌందర్యనిధానం. ఆదికావ్యం. పదపదం అక్షర రమ్యం. దివ్యం. ఇక సుందరకాండ ధ్వని, అర్థ సామర్థ్యాలతో చదువరిని మంత్రముగ్దుడిని చేయగల ఫణితితో నిండినది.

సముద్రతరణం - లంకాగమనం - సీతాన్వేషణం - శ్రీరామ నివేదనం - ఇవన్నీ కలిస్తే సుందరకాండ! జరిగిన ఇతివృత్తం యావత్తూ దినద్వయం లోపే. శబ్దాను ప్రాసలతోనూ, అంత్య ప్రాసలతోనూ మార్దంగిక వైభవంగా సాగుతాయి శ్లోకలతలు. "చంద్రోదయ వర్ణన" (ఐదవ సర్గ) ఒక్కటి చాలు....పదవిన్యాసాన్ని తిలకించడానికి.అర్థ సౌందర్యం - రస సౌందర్యం - కథా నాయికా నాయకులైన శ్రీ సీతారాముల సౌందర్య విశేషాలు (జీవాత్మ-పరమాత్మల సౌందర్యాలు)-ఆచార్యుడైన హనుమత్ సౌందర్యం-మహావిశిష్టమైన లంకా నగర సౌందర్యం - లంకానగర ప్రమదావన సౌందర్యం - లోక రావణుడైన రావణ రాజసవీర సౌందర్యం - హనుమంతుడి సమయోచిత బుద్ధిబల సౌందర్యం - వాల్మీకి మహత్తర కవితా శిల్ప సౌందర్యం, ఆదిమధ్యాంతాలూ నింపుకున్నది కాబట్టే, దీనిని వాల్మీకి "సుందరకాండ" అన్నారు. "సుందరః" అంటే హరి అని అర్థం. హరి అంటే నారాయణుడూ కావచ్చు - కోతీ కావచ్చు. శ్రీమన్నారాయుణుడైన శ్రీరాముడు, అరివీర పరాక్రముడూ - అంజనీ సూనుడూ అయిన ఆంజనేయుడు కోతి రూపంలో దర్శనీయులౌతారు ఇందులో.

ఇందులో అద్భుతమైన సాముద్రిక, సాగరిక, జలాంతర్గత, వాయు, వియత్తల, స్వప్న, ధర్మ, దౌత్య, రాజనీతి శాస్త్రాల రహస్యాలు ప్రచ్ఛన్నంగా ఉండడం గొప్ప విశేషం. కంటికి కనిపించే అవయవ సంపుటిని బట్టి కంటికి కనిపించని అవయవ విశేషాలను పసిగట్టి, వ్యక్తి తత్త్వాన్నీ, ఔన్నత్యాన్నీ వ్యక్తపరిచే సునిశిత కౌసల్యం ఇందులో నిక్షిప్తం చేయబడినందున, "వైఖరీ విద్యాపారంగతులకు" ఇదొక ప్రమాణ గ్రంథం.

మంత్ర శాస్త్రమే సుందరకాండ. ఇది గాయత్రీ బీజ సంయుతం. దీనికి విశ్వామిత్రుడు ఋషి. వాల్మీకి మహా ఋషి. ఆంజనేయుడు మంత్రాధి దేవత. సర్వారిష్ట నివారణ ఫలం. ఆద్యంతాలూ "త" కార, "స" కారాలతో సుసంపన్నమైన మహా మంత్ర వనం సుందర నందనం! "త", "థ", "స", "న", "ర" ల పట్టు అంతా ఈ అక్షరాలలో విధేయంగా అణగి వుంది. "రామ", "సీత", "హనుమ", "దశరథ", "భరత", "శత్రఘ్ను", ఇవన్నీ పేర్లుగా కనిపించినా, నిజానికి మంత్ర మూలికలు...మహిమాన్విత మంత్ర మాలికలు. అందువల్లనే దీనిని శ్రద్ధగా చదువుతారు. నియమంగా పారాయణం చేస్తారు. నిష్ఠగా శ్రవణం చేస్తారు. ఇవేవీ సాధ్యపడక పోయినా, పరోక్షంగా సుందరకాండను ప్రాచుర్యంలోకి తెస్తారు.


వావిలికొలను సుబ్బారావు దాసు అని (వాసుదాసు) ఒక మహా....మహానుభావులు మన తెలుగు గడ్దపై అవతరించి, వాల్మీకి రామాయణాన్ని మందరం పేరుతో యధావిధేయంగా, ఛందోబద్ధంగా మూల మంత్రాలనూ, మంత్రాక్షరాలనూ సైతం రమ్యత, పారమ్యతలకు విఘాతం కలుగని రీతిలో తెలుగు లోనికి అనువదించి ఆంధ్ర వాల్మీకి అన్న గౌరవాన్ని సంపాదించుకున్నారు. వ్యాస భాగవతాన్ని మరిపించిన పోతన్న భాగవతం వలె, వాల్మీకాన్ని ఆంధ్ర వాల్మీకి రామాయణం మరిపించి తెలుగువారిని మురిపించింది. శ్రీవారి అవతారకాలం లోనే నాలుగైదు పర్యాయాలు ప్రచురణ పొంది, విశేషమైన ప్రాచుర్యాన్ని పొందగలిగింది 100 ఏండ్ల క్రితమే!. ఊహాతీత ప్రతిభా విరాజిగా వాసుదాసు గారు రామ భక్తుల హృదయారవిందాలలో సుప్రతిష్ఠులైనారు. వందేళ్లు పైగా కావొస్తూంది. కాలవిరామం పెరిగిపోతోంది. క్రమంగా వాసుదాస స్వామి వారు జనహృదయాలకు దూరంగా జరిగి పోతున్నారేమో అనిపిస్తున్న తరుణంలో, అశేష తెలుగు హృదయాలకు మరో మారు ఆయన్ను గుర్తు చేసే దిశగా ఆయన రాసిన వాల్మీకి తెలుగు అనువాదంలోని సుందర కాండను పాఠకులకు అందించే ప్రయత్నమే ఇది.

వాసుదాసు గారు ఆంధ్ర వాల్మీకులుగా లబ్ధ ప్రతిష్ఠులైనారు. మహనీయమైన మందర రామాయణాన్ని అనేకానేక విశేషాలతో, పద్య-గద్య-ప్రతిపదార్థ-తాత్పర్య-ఛందోలంకార విశేష సముచ్ఛయంతో నిర్మించి వేలాది పుటలలో కూర్చి మనకు అందించారు. రామాయణ క్షీరసాగరాన్ని మందరం మధించి మన కందరకూ ఆప్యాయంగా అందించింది. కానీ దానిని ఆస్వాదించే తీరికా, ఓపికా లేని జీవులమైపోయాం మనం. భాష, శైలి, అర్థం, తాత్పర్యం, కాలక్రమంలో పరిణామం చెందాయి. సూక్ష్మంలో మోక్షం కావాలంటున్నారు నేటి తరం పఠితులూ, పండితులూ కూడా. ఆత్మ తృప్తికీ, స్ఫూర్తికీ, మనశ్శాంతికీ, సర్వబాధోప శమనానికీ ఇది దివ్య రసమయ పానీయం. సాహితీ పిపాసులకూ, సౌందర్యారాధకులకూ, ఆస్తిక భావుకులకూ ఇది హృద్యమైన నైవేద్యం కాగలదని భావిస్తున్నాను.

శ్రీరామాయణం క్షీరధార. అందులో సుందరకాండ పంచదార. అందులోనూ శ్రీవాసుదాసస్వామి వారి "మందరం" మందార మకరంద మాధుర్యం."కవికులగురువు-కాళిదాసు" అన్నట్లు:

"వృత్తమ్ రామస్య వాల్మీకీః , కృతి తౌ కిన్నెర స్వరౌ!
కింతత్? యేన మనోహర్తుం అలం స్యాతాం నశ్రుణ్వతాం’!"

          (చరిత్ర మారాముడిది. రచన సాక్షాత్తూ వాల్మీకుల వారిది. గానం చేసేవారు కిన్నెర గాత్రులైన కుశ, లవులు. ఇంతటి మహనీయమైన రామాయణంలో శ్రోతలను పరవశింప చేయని అంశం ఏముంటుంది?)


అనన్య సామాన్యమైన సీతారాముల కధను ఎందరు ఎన్ని విధాలుగా మార్చి-మార్చి, కూర్చినా, దాని మాధుర్యం, ఇంకా, ఇంకా వృధ్ధి పొందుతూనే వుంటుంది. వసివాడని పారవశ్యం అది. End Intro

1 comment: