Thursday, February 2, 2017

హిందూ సంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వ్రతం : వనం జ్వాలా నరసింహారావు

హిందూ సంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వ్రతం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (29-01-2017)

ఈ వ్రతాన్ని, తెలుగునాట ఇంటింటా, వీలున్నప్పుడల్లా చేసుకునేవారు ఎందరో వున్నారు. ఫలానా మాసంలో, ఫలానా తిథి నాడు, ఫలానా సమయంలో ఈ వ్రతం చేసుకుంటే మంచిదని పురాణాల్లో చెప్పినప్పటికీ, ఎప్పుడైనా-ఎన్నడైనా-ఎక్కడైనా, వీలుంటే మంచిరోజొక్కటి మాత్రం చూసుకొని వ్రతం చేసుకోవచ్చని పండితులు చెపుతుంటారు. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. తెలుగువారింట్లో, ఏ శుభ కార్యం (వివాహం, గృహ ప్రవేశం, బారసాల, పుట్టిన రోజు, పెళ్లి రోజు, షష్టిపూర్తి, ప్రమోషన్, కొత్త ఉద్యోగం రావడం లాంటివి) జరిగినా-శుభ వార్త విన్నా, సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం ఆచారం.  

          అయితే, ఈ వ్రతాన్ని సాధారణంగా, వైశాఖ మాసంలో గానీ, మాఘ మాసంలో గానీ, కార్తీక మాసంలో గానీ ఏకాదశి-పౌర్ణమి, మకర సంక్రాంతి లాంటి శుభదినాల్లో కానీ చేసుకుంటారు చాలామంది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేసుకునేవారు కూడా వున్నారు. బారసాలలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.

          వ్రతానికి ముందుగా, తూర్పు దిక్కుగా అనువుగా వున్న ప్రదేశంలో ఒక ఆసనం (వ్రతం పీట) లాంటిది వేసి, దానిపై కొత్త వస్త్రం (తెల్ల టవల్) పరిచి, దానిమీద బియ్యం పోసి, దాని మధ్యలో కలశం (వెండిది) ఉంచి, దాని మీద ఇంకో కొత్త వస్త్రం (జాకెట్ గుడ్డ) ఉంచటం జరుగుతుంది. ఆ వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమనుంచి, వెనుక ఫొటోను పెట్టాలి. కలశం మీద వుంచేముందర ప్రతిమను పంచామృతములతో అభిషేకింప చేస్తారు పూజారి. ఆ మండపంలో బ్రహ్మాది పంచలోక పాలకులను, నవ గ్రహాలను, అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించడం జరుగుతుంది. తరువాత కలశంలో స్వామివారిని ఆవాహన చేసి పూజించే కార్యక్రమం జరిపించి, పూజానంతరం సత్యనారాయణ స్వామి కథ వినిపించి, ప్రసాదాన్ని పంచుతారు శాస్త్రిగారు. సత్యనారాయణ వ్రత కథని అయిదు అధ్యాయాలలో చెప్పడం జరుగుతుంది .ఒకో అధ్యాయం ముగియగానే అరటిపండు నైవేద్యం పెట్టి , కర్పూర హారతి ఇచ్చి రెండవ అధ్యాయం మొదలు పెట్టాలి.  చివరికి రవ్వతో చేసిన ప్రసాదం నివేదన చేయించాలి. చివరలో మంగళ హారతి కార్యక్రమం, అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పాపాయికి బట్టలు- ఆభరణాలు పెట్టే తంతు వుంటుంది. సాంప్రదాయం ప్రకారం ఆహ్వానితులకు పండు-తాంబూలం, భోజనం పెట్టడం ఆనవాయితీ.


          అదే రోజున పాపాయిని ఉయ్యాలలో వేయడం, బావిలో చేద వేయడం అనే కార్యక్రమాలను కూడా చేస్తారు. ఈ రోజుల్లో ఉయ్యాలయితే వుంటుంది గాని, బావి సౌకర్యం వుండదు కదా ! అయినా వేడుక వేడుకే. అదే మన వాళ్లకు ఆనందం. వున్న దాంట్లో సర్దుకుపోవడంలో మరీ ఆనందం మనవాళ్లకి. ఉయ్యాలలో వేయడం అంటే పాపాయిని ఉయ్యాలలో వెయ్యాలి కాబట్టి సాంప్రదాయంగా పదకొండో రోజున మొదలు పెడతారు కొంత మంది. మరికొందరు, ఆ రోజున అసలే చేయకుండా 21 వ రోజున కానీ బారసాల జరుపుకున్న రోజున కానీ చేస్తారు. కొందరు అప్పుడు-ఇప్పుడూ చేస్తారు. ఇవ్వాళ-రేపు పిల్లలు పుట్టగానే, ఆసుపత్రుల్లో ఎలాగూ ఉయ్యాల్లో వేస్తున్నారు కాబట్టి, ఈ కార్యక్రమం కేవలం వేడుకే అనాలి.

          ఇక ఆ రోజున మిగిలిన మరో కార్యక్రమం బావిలో చేద వేయటం.  బావిలో చేద వేయటం అంటే అంత వరకు ఆ అమ్మాయి (బాలింత-పాపాయి తల్లి) పనులేమి చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్నీ పనులు చేయ వచ్చు అని చెప్పటం కోసం అన్న మాట. ఇదంతా సైన్స్ ప్రకారమే జరుగుతుందనాలి ఒక విధంగా.


          కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత, శాస్త్రోక్తంగా, అంతా జరిపించిన బ్రాహ్మణుడిని శక్తి మేరకు సత్కరించడం మన ఆచారాల్లో అతి ముఖ్యమైంది. End

No comments:

Post a Comment