Sunday, October 22, 2017

అశోకవనంలో సీతను వెతికిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (23-10-2017)

వింధ్య పర్వత శిఖరంలో వర్షిస్తున్న మేఘాలను చెదరగొట్టిన గాలిలా, హనుమంతుడు అశోకవనంలోని తీగల గుంపును చిమ్మాడు. వజ్రాలు, బంగారం, వెండి వున్న స్థలాలను; మంచినీటి బావులను; వాటిలో దిగడానికి ఏర్పాటుచేసిన మణిమయమైన మెట్లను; ముత్యాలు, పగడాలతో కూడిన ఇసుక ఒడ్డులను; ఆ ప్రక్కనే కూర్చోడానికి తయారుచేసిన స్ఫటిక ప్రదేశాలను; అక్కడే పుట్టిన బంగారు వన్నె చెట్లను; బావుల్లోని తామరతీగలను; కలువతీగలను; అందులో కూస్తున్న హంసలను; చక్రవాకాలను; నీటి ఇర్రులను, బెగ్గురులను, వాటిలో పారే ఏరులను, అందులోని అమృత తుల్యమైన నీళ్లను, చుట్టూ అల్లబడిన పూల తీగలను; అశోకవనంలోని ఆ ప్రదేశంలో చూసాడు హనుమంతుడు.

ఆ ఉద్యానవనంలోనే ఇంపైన శిఖరాలు, గదులు, చెట్లున్న రాతి ఇంటి క్రీడా పర్వతాన్ని చూశాడు. ఆ పర్వతంపైనుండి కిందకు పారుతున్న సెలయేరు, చూడడానికి, మగడి తొడపైనుండి కోపంతో దిగిపోతున్న స్త్రీలా వుంది. వ్రేలాడుతున్న కొమ్మలు ప్రవాహాన్ని అడ్డగించడంతో, ఎదురెక్కిపోతున్న నీళ్ల సన్నివేశం బంధువుల బుజ్జగింపులకు సమాధానపడి, శాంతించి, మగడివద్దకు తిరిగిపోతున్న ఆడదానిలా వుంది. ఆ సమీపంలోనే అనేక రకాల పక్షులున్న కొలనుకూడా వుంది. వీటన్నింటినీ నిశితంగా పరికించి చూసాడు హనుమంతుడు.

రతనాలమెట్లు, నిర్మలమైన చల్లటి నీళ్లు, నానారకాల పక్షులు, మృగాలు, కల్పితవనాలు, దిగుడుబావులు, విశ్వకర్మ నిర్మించిన మేడలు, ఫలాలతో, పుష్పాలతో నిండిన చెట్లవరుసలు, గొడుగులు, బంగారపు అరుగులు, మెట్లు ప్రకాశిస్తున్న ఆ ప్రదేశంలో, ఓపెద్ద "శింశుపావృక్షాన్ని" (ఇరుగుడుచెట్టు) చూసాడు హనుమంతుడు. అక్కడే బంగారపు అరుగుల చుట్టూ నిర్మించబడి మధ్యలో ఎర్రనిపూలు, చిగుళ్లూ వున్న అగ్నిలాంటి చెట్లను కూడా ఆశ్చర్యంతో చూస్తాడు హనుమంతుడు. ఆకాశాన్ని తగిలే కాంతితో వున్న బంగారపు చెట్ల కాంతులు తనపైన పడడంతో, సూర్యుడులాగా వున్నాననుకుంటాడు. చుట్టూ బంగారు చాయ ఉన్న చెట్లు చుట్టుకోగా, బంగారు గజ్జెలు ధ్వనించే "శింశుపావృక్షాన్ని" చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు హనుమంతుడు.

ధూర్త రావణుడు అశోకవనాన్ని చందనపు వృక్షాలతో, సంపెంగ, పొగడ చెట్లతో, మనోహరంగా కూసే పక్షులతో, అందమైన కొలనులతో, ఆహ్లాదభరితంగా ఉంచాడు కాబట్టి, సీతాదేవి ఇక్కడకు తప్పక వస్తుందని నమ్మిన ఆంజనేయుడు, "శింశుపావృక్షాన్ని" ఎక్కి, ఆమెను చూద్దామని భావిస్తాడు. "సుందరి, రాముడిరాణి, శ్రీరామచంద్రుడిని ప్రేమించే పతివ్రత, శ్రీరాముడినే ధ్యానించేది, జింక కన్నుల లాంటి కళ్లున్నది, వనాలలో తిరిగే నేర్పుగల సీత ఎందుకు ఇక్కడకు రాదు? వీటన్నిటికంటే ముఖ్యం, ఇక్కడ సంచరించే వన్యమృగాల క్షేమంకోరే స్వభావంకలది సీత. సంధ్యావందనం ఇంటివెలుపలో, చెరువుదగ్గరో, నదిలోనో చేయాలి కాబట్టి, శ్రీరాముడిని తలచుకుంటూ సీత ఇక్కడకు తప్పక వస్తుంది." అని భావిస్తాడు హనుమంతుడు. సీతాదేవి ప్రాణాలతో వుంటే తప్పక అశోకవనానికి వస్తుందని నమ్ముతూ, "శింశుపావృక్షం" పైన దాక్కుని అన్ని ప్రక్కలా చూస్తుంటాడు హనుమంతుడు.


(పూర్వకాలంలో స్త్రీలకు సంధ్యావందనం, ఉపనయనంమ్ వుండేవి. వివాహమే స్త్రీలకు ఉపనయనం, పతిసేవే గురుకుల వాసం, గృహకృత్య నిర్వహణే అగ్నిహోత్రమని కూడా చెప్పబడింది. మంగళసూత్రధారణ స్మార్తం కాబట్టి ఉపవీతాలకు బదులుగా మంగళసూత్రాలు వచ్చాయి. పూర్వకాలంలో స్త్రీలు వేదాధ్యయనం, గాయత్రీజపం కూడా చేసేవారట. అయితే తండ్రి, పినతండ్రి, అన్న మాత్రమే ఉపదేశం చేయాలి)

తీగల్లాంటి కల్పవృక్షాలతో, ప్రకాశించే చెట్లతో, దేవలోక సంబంధ పరిమళఫల రసాలను కూడిన శుభాకారాలతో, నందనవనంలాంటి సౌందర్యంతో, అందమైన మృగ, పక్షిజాతితో, మిద్దెలు, మేడలతో, కోకిలకూతల సందడితో, బంగారు కమలములతో, కలువలతో, రకరకాల కంబళ్లతో, విశాలమైన నేలమాళిగలతో, అన్నిరుతువులలో పూచే, కాచే చెట్లతో, అతిశయిస్తున్న అశోకవనాన్ని, "శింశుపావృక్షం" పైనుండి చూసాడు హనుమంతుడు. వికసించిన అశోకవృక్షాల ఎర్రెర్రటి కాంతి, సూర్యోదయకాంతిని పోలి, పెద్దమంటలో చిక్కుకున్నట్లుంది. పక్షులు తమతలలపై రాలిన పూలను విదిలించుకునేందుకు రెక్కలు విప్పాయి. విప్పిన ఆ రెక్కల సందునున్నపూలకు ఆకులుకూడా వున్నాయి. అంటే, ఆకులు-పూలు లేనివాటివలె చెట్లు ఆంజనేయుడికి కనిపించాయి. పూలు చెట్లవేళ్లవరకూ పూచాయి. అందువల్ల అందంగా వున్న ఆ చెట్ల కొమ్మలు కాంతిగల పూల బరువుకు నేలను తాకుతున్నాయప్పుడు.

         పూచిన గోగులను, కొత్తపూలున్న మోదుగులను, ఏడాకుల అరటిచెట్లను, పొన్నలను, సంపెంగలను, బంగారు వన్నె చెట్లను, అగ్నిజ్వాలల్లాంటి ఎర్రని చెట్లనూ, ఆంజనేయుడు అశోకవనంలో చూశాడు. నల్లటికాంతిగల వేలాది అశోకవృక్షాలను, చైత్రరధం (కుబేరుడి ఉద్యానవనం), నందన (ఇంద్రుడి ఉద్యానవనం) వనాలను మించిన సౌందర్యాన్ని, వర్ణించనలవికాని స్వరూపాన్ని కలిగిన అశోకవనం పూలనెడి నక్షత్రాల ఆకాశంలో రత్నాలతో నిండిన ఐదవరత్నాకరంలా కనిపించింది. అన్నిరుతువుల్లో ఫలాలతో నిండి, సువాసనగల చెట్లతో, జింకలతో అలరారుతూ, రెండవ గంధమాదన పర్వతాన్ని తలపిస్తున్నదావనం. వనం మధ్యలో కైలాసపర్వతంలో, తెల్లగా, నిర్మలంగా, పగడాల మెట్లు, బంగారపు అరుగులు కలిగి, లమీదేవిలా ప్రకాశిస్తున్న, రమ్యమైన, కన్నుల పండువైన, వేయిస్తంబాల మేడను చూసాడు హనుమంతుడు అతిదగ్గరనుండి.

No comments:

Post a Comment