“సమాచారహక్కు” పై వీడని
అనుమానాలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (06-10-2017)
పౌరులకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ శాఖల ద్వారా పొందేందుకు ఉద్దేశించిన 2005 సమాచారహక్కు చట్టం
నిబంధనలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు కమీషన్ ను
ఏర్పాటుచేసి, ప్రధాన సమాచార కమీషనర్ తో సహా ఒక సమాచార కమీషనర్ ను కూడా
నియమించింది. గవర్నర్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. సమాచారం పొందే
హక్కు కావాలని కోరుకునే ఎంతోమంది తెలంగాణ ప్రజల అభీష్టంతో పాటు రాజ్యాంగబద్ధమైన ఒక
బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరవేర్చినట్లయింది. న్యాయస్థానాలను ఆశ్రయించిన సమాచారహక్కు
ఉద్యమ సామాజిక కార్యకర్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఇక
ముందుంది...ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టాన్ని ఎంతమేరకు ఉపయోగించుకుంటారానే
విషయమే! ఇతర ప్రభుత్వ చట్టాల మాదిరి కాకుండా, సమాచారహక్కు చట్టం విజయవంతం
కావాలంటే, అది ప్రజల మీదే ఆధారపడి వుంటుంది. ప్రజలను ఎంత గొప్పగా చైతన్యపరిస్తే,
అంత గొప్పగా ఈ చట్టం అమలయ్యే వీలుంది. చట్టాన్ని సద్వినియోగం చేసుకుని సమాచారం
పొందడానికి పౌరుల్లో చైతన్యం తీసుకుని రావడమెలా అని సామాజిక కార్యకర్తలు ఆలోచన
చేయాలి.
సమాచారహక్కు చట్టం ఆవిర్భావం,
దాని పూర్వాపరాలు, అవసరం, పరిణామక్రమం నెమరేసుకుంటే, దాని మూలాలు, అలనాటి ఎన్డీయే
ప్రభుత్వం కాలం రోజుల్లో, ఆ మాటకొస్తే, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రిగా
వున్నా రోజుల్లో వున్నా విషయం మదిలో మెదలుతాయి. ఎన్డీయే ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ
చట్టం తెచ్చినప్పటికీ, దాని విధి-విధానాలను రూపొందించడంలో వైఫల్యం చెందడంతో, ఆ
తరువాత అధికారంలోకొచ్చిన యూపీఏ ప్రభుత్వ సారధి, ప్రధాని మన్మోహన్ సింగ్ జూన్ 21,
2005 న సమాచారహక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి, అంతకు ఒక వారం కిందే,
అలనాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చట్టానికి రాజముద్ర వేసినప్పటికీ,
రాష్ట్రపతికీ, ప్రదానికీ మధ్య చోటుచేసుకునే “సమాచార మార్పిడి” బహిర్గతం చేయడం
సరైందికాదని బాహాటంగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వాధికారులు ఫైళ్ళ మీద
రాసే వ్యాఖ్యలు కూడా రహస్యంగా వుమ్చాలనీ, అలా చేయకపోతే, నిర్ణయాధికార ప్రక్రియ
ఇబ్బందులకు గురైతుందనీ అన్నారు. కాకపొతే, పౌరులకు సమాచారహక్కు చట్టం సాధికారతను
సమకూరుస్తుందనీ, తమ విషయంలో ప్రభుత్వం తప్పుచేస్తున్నదన్న భావన ఈ చట్టం
తొలగిస్తుందనీ ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఎక్కడాలేని రీతిలో మన
సమాచారహక్కు చట్టం రూపొందించబడడం గొప్ప విషయమే!
భారత దేశానికి స్వాతంత్ర్యం
వచ్చి 50 ఏళ్లు నిండుతున్న సందర్భంగా, 1997 సంవత్సరం మే నెలలో, అప్పటి ప్రధాని ఐకే
గుజ్రాల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో వారంతా అంగీకరించిన “నవ
సూత్ర ప్రణాళిక”, ఒక విధంగా చెప్పుకోవాలంటే, సమాచారహక్కు చట్టానికి అసలైన
నాంది-ప్రస్తావన అనాలి. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు గడిచినా, కేంద్ర-రాష్ట్ర
ప్రభుత్వాల పనితీరుపై ప్రజలకు నమ్మకం కుదరలేదనీ, వారి నమ్మకం పూర్తిగా ఒమ్ము కాకముందే,
పారదర్శకతతో, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా, పౌరులకు స్నేహ హస్తం అందించే రీతిలో ప్రభుత్వాలు
పనిచేయడానికి ఆ నవసూత్ర కార్యాచరణ పథకాన్ని పార్టీలకతీతంగా ముఖ్యమంత్రుల సమావేశం
అంగీకరించింది. ఆ తీర్మానానికి అనుగుణంగా సమాచార స్వేచ్ఛ హక్కు చట్టం
రూపొందించాలనీ, అది విజయవంతం కావాలంటే, ప్రతి ప్రభుత్వ శాఖలో సిటిజెన్ చార్టర్లు
తయారు చేసి అమలు చేయాలనీ, పోరా సేవా-సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలనీ
నిర్ణయించడం జరిగింది. దురదృష్టవశాత్తూ వీటిలో చాలా వరకు కాగితం మీదే మిగిలి
పోయాయి. దరిమిలా వచ్చిందే సమాచారహక్కు చట్టం. ఇది ఆబాలగోపాలం ప్రజల్లో అనేక ఆశలు
కలిగించింది. ప్రజాస్వామ్యంలో పౌరుడికి, తాను కావాలనుకునే ప్రభుత్వ సంబంధమైన
సమాచారం లభించడం, ఆ సమాచారం పారదర్శకంగా వుండడం సహచట్టం రావడానికి ప్రధాన
కారణం.
అసలింతకూ
ఈ సమాచారం అంటే ఏమిటి? ప్రభుత్వ శాఖలకు (పబ్లిక్ అథారిటీగా చట్టం పేర్కొంది)
సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈమెయిల్లు, వ్యాఖ్యలు, పత్రికా
ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్ పుస్తకాలు, ఒడంబడికలు, నివేదికలు,
పత్రాలు, అన్నిరకాల డాటా మొదలైనవన్నీ సమాచారం కిందికే వస్తాయి. ప్రభుత్వం నుంచి
తగుమోతాదులో ఆర్ధిక సహాయం పొందుతున్న ప్రభుత్వ-ప్రభుత్వేతర వ్యవస్థ కాని, సంస్థ
కానీ, పబ్లిక్ అథారిటీగా చట్టం నిర్ణయించింది. వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం
పౌరులకు అందుబాటులో, సులభంగా పొందేందుకు వీలుగా, బహిర్గతం చేయాలి. ప్రతి పబ్లిక్
అథారిటీ పౌరులు కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు పౌర సమాచార అధికారులను వారి-వారి
శాఖల్లో కిందినుంచి పైదాకా నియమించాలి. వీరి దగ్గరనుంచి అడిగిన సమాచారం నిర్ణీత
గడువులోగా లభించకపోతే, సమాచార కమీషన్ ను ఆశ్రయించడానికి పౌరులకు హక్కుంది. సమాచార
కమీషనర్ విచారణ జరిపి సంబంధిత అధికారిమీద తగు విధంగా చర్య తీసుకోవచ్చు.
తెలంగాణ
రాష్ట్రంతో సహా చాలా రాష్ట్రాలు, కేంద్రం సమాచార కమీషన్లను ఏర్పాటుచేసినప్పటికీ,
చట్టం అమలుకు సంబంధించి వీడని అనుమానాలెన్నో వున్నాయి. చట్టంలో చెప్పిన విధంగా
పౌరులకు సమాచారహక్కును కలిగించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఏమేరకుందో ఆచరణలో ఇంకా
తేలలేదనే అనాలి. ప్రతి పబ్లిక్ అథారిటీ తన సంస్థకు సంబంధించిన రికార్డులన్నింటినీ
కేటలాగ్-ఇండెక్స్ చేసి, కంప్యూటర్లోకి ఎక్కించి, అన్ని రకాలుగా, అన్నిచోట్ల
పౌరులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా లభించే విధంగా నెట్వర్క్ కు అనుసంధానం చేయాలి. తన
సంస్థకు సంబంధించి అమలుపరుస్తున్న కార్యక్రమాలు, నిర్వహిస్తున్న విధులు, ఉద్యోగుల
అధికారాలు, వారి బాధ్యతలు, నిర్ణయాలు తీసుకునే విధానం, పర్యవేక్షణ-జవాబుదారీ
వివరాలు, జీత-భత్యాల వివరాలు, బడ్జెట్ కేటాయింపులు, సంస్థ ఇస్తున్న రాయితీలు-పర్మిట్లు
తదితర వివరాలన్నీ బహిర్గతం చేయాలి. సంబంధిత పబ్లిక్ అథారిటీ పౌరులకు అవసరమైన
సమాచారాన్ని అందించేందుకు కల్పించిన సౌకర్యాల గురించి, పనివేళల వివరాలు, సంస్థలో
నియమించిన పౌరసమాచార అధికారుల వివరాలు బాహాటంగా ప్రకటించాలని చట్టం చెపుతున్నది.
ఎన్ని ప్రభుత్వ శాఖలు వీటిని అమ్నలు చేశాయనేది జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలి
పోయింది.
చట్టంలో
చెప్పబడిన మరో ప్రధానమైన అంశం “తగు మోతాదులో ప్రభుత్వ నిధులు” పొందుతున్న ఏ సంస్థ
అయినా పబ్లిక్ అథారిటీగానే పరిగణించాలని. అయితే ఈ మోతాదు ఎంత అనేది నిర్వచనం
సరిగ్గాలేదు. రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సూచనల్లో కొంత స్పష్టత వచ్చినా
పూర్తిగా అవగతం కాలేదు. సాధారణంగా ప్రభుత్వ శాఖ చేసే ఎలాంటి పనైనా ప్రభుత్వ
నిధులతో ఏదేని ప్రభుత్వేతర సంస్థ చేస్తుంటే అది పబ్లిక్ అథారిటీగా పరిగణించాలని ఆ సంఘం
సూచించింది. ఈ అస్పష్టత కారణాన చాలా ఎన్జీవోలు సమాచారహక్కు చట్టం కింద రాకుండా
జాగ్రత్తపడుతున్నాయి.
అలాగే
బహిర్గతం చేయకూడని సమాచారాన్ని అడిగిన పౌరులకు ఇవ్వడానికి పబ్లిక్ అథారిటీ
తిరస్కరించవచ్చని, చట్టపరిధిలో ఇవ్వగలిగే సమాచారాన్ని మాత్రమే పొందే హక్కు పౌరులకు
వుందని అనడమంటే లక్ష్మణరేఖ గీసినట్లే అనుకోవాలి. దీన్ని తొలగించే ప్రయత్నాలు
ప్రభుత్వాలు చేసిన దాఖలాలు లేవు.
కొన్ని
చర్యలు చేపట్టడం ద్వారా చట్టం అమలులో మరింత కొత్తదనం తీసుకునిరావచ్చు. అసలు పౌరుల
అవసరాలేంటో అధ్యయనం చేయాలి, విశ్లేషణ చేయాలి. పౌరుల సమాచార అవసరాలకు అనుగుణంగా
పబ్లిక్ అథారిటీలు స్పందించాలి.
వివిధ
రంగాల్లో నిష్ణాతులైన వారిని, అనుభవజ్ఞులను సమాచార కమీషనర్లుగా ఎంపికచేయడం చాలా
క్లిష్టమైన వ్యవహారం. రాజకీయ వాసన లేకుండా ఎలాంటి పనీ జరగని మన దేశంలో, వివిధ
రాష్ట్రాలలో, సమాచార కమీషనర్ల పదవికి రాజకీయాలకు అతీతులైన వ్యక్తులు దొరుకుతారా?
అయితే తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఇది సాధ్యమైంది కనుక చట్టం చెప్పినట్లు
జరిగే అవకాశాలుండవచ్చు. అలాగే ప్రతి పబ్లిక్ అథారిటీకి కావాల్సిన సమర్థులైన,
యోగ్యులైన, పౌర సమాచార అధికారులు దొరికే విషయంలో కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు.
ఇవన్నీ
ఇలా వుంటే పౌరులు కోరుకునేది ఆసక్తికరంగా వుంది. తమని గౌరవంగా, మర్యాదగా చూడాలనీ;
ప్రభుత్వ కార్యకలాపాలు సులభతరం చేయాలనీ, తగిన సమయంలో నమ్మకమైన సహాయం అందించాలనీ; తమ
గొంతు వినాలనీ; తమ మాట పరిగణలోకి తీసుకోవాలనీ; నియమ-నిబంధనలకన్నా సహాయం చేయడమే
తమకు కావాలనీ వారంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమాచారహక్కు చట్టం ద్వారా ఈ దిశగా
ముందుకు పోతుందని ఆశిద్దాం.
No comments:
Post a Comment