Friday, October 20, 2017

సంక్షేమ స్రష్టలుగా సర్పంచ్‍లు : వనం జ్వాలా నరసింహారావు

సంక్షేమ స్రష్టలుగా సర్పంచ్‍లు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (21-10-2017)

ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంతో సహా, స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో భాగమైన పంచాయితీలకు 2013 జులై నెలలో ఎన్నికలు జరిగాయి. గెలిచిన సర్పంచుల పదవీకాలం అదే ఏడాది ఆగస్ట్ 2న మొదలై 2018 ఆగస్ట్ ఒకటవ తేదీతో ముగుస్తుంది. పంచాయితీరాజ్ చట్టం ప్రకారం గడువుకు మూడునెలల ముందే ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి వుంటుంది. కాకపోతే, ప్రభుత్వం ముందున్న ప్రశ్న, బహుశా, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానికంటే, నిర్వహించిన తరువాత ఎన్నికయ్యే స్థానిక సంస్థల ప్రతినిధులు, ముఖ్యంగా సర్పంచులు ఏ విధమైన సేవలు గ్రామాలకు అందించితీరాలనే విషయం. దీనికి ప్రధాన కారణం, గత ప్రభుత్వాలు స్థానిక సంస్థల ద్వారా గ్రామాల పురోగతి సాధించే విషయం ఏమాత్రం పట్టించుకొకపోవడమే! గ్రామాల అభివృద్ధికి దర్పణం పట్టాల్సిన పంచాయితీరాజ్ వ్యవస్థ రాజకీయ చదరంగంలో కూరుకుపోయి, ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యంగా మారిపోయి, అది నిర్వహించాల్సిన విధులను, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కుంటుపడడానికి బాధ్యత నిర్వీర్యమైన స్థానిక సంస్థలే.

గుడ్డిలో మెల్లగా, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు 1992లో భారత ప్రధాన మంత్రిగా వున్న రోజుల్లో, 73వ రాజ్యంగ కీలక సవరణ చట్టం తేవడంతో, మొత్తం 29అంశాలకు సంబంధించి నిధులు, విధులు, అధికారాలను పంచాయితీలకు బదిలీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాగితాలకే పరిమితమై పోవడం బాధాకరమైన విషయం. ఒకవైపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మూడింటినీ సరిగ్గా బదిలీ చేయకపోవడం, మరోవైపు, బదిలీ చేసినా వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేని స్థితిలో మెజారిటీ (దాదాపు అందరూ) సర్పంచులు వుండడం చట్ట సవరణ సత్ఫలితాలు ఇవ్వలేకపోవడానికి దారితీసింది. చట్ట స్ఫూర్తితో ముందడుగు వేసిన గ్రామాలు వేళ్ళమీద లెక్కించవచ్చు. కొంతకాలం క్రితం ఇప్పటి ప్రధాని మోడీ “పంచాయితీ రాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామాభివృద్ధి, రైతుల ప్రగతి” అంటూ ఇచ్చిన నినాదం కూడా అంతగా స్పందన పొందలేదు. ఏదేమైనా పంచాయితీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. సర్పంచులు తమ బాధ్యతగా చేయాల్సిన అనేక రకాల గ్రామ సంబంధిత సంక్షేమ-అభివృద్ధి పనులు అటకెక్కాయి. తాగునీటి సమస్య కాని, మురుగునీటి సమస్యకాని, రహదారుల సమస్య కాని, గ్రామంలో కూరుకుపోయిన చెత్త సమస్యకాని, తమ గ్రామంలోని పాథశాల పరిశుభ్రంగా వుంచే విషయం కాని, చెట్ల పెంపకం విషయం కాని...ఇలా ఎన్నో సర్పంచులు చేయాల్సిన పనులు అడిగే నాధుడు లేక ఆగిపోయాయి.

ప్రజాస్వామిక వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్రను పోషించాల్సిన స్థానిక సంస్థలు-పంచాయితీరాజ్ వ్యవస్థలు బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయాయి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జివికె రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వీ కమిటీ...ఇలా ఎన్నో కమిటీలు చెప్పింది ఎవరూ ఆచరణలో చేయడం లేదు. పంచాయతీరాజ్ ఎందుకు?....అని ప్రశ్నించుకుంటే దొరికే సమాధానం...వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి, ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి, గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికి, స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి.....ఇలా ఎన్నో వున్నాయి. ఇవేవీ జరగడం లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక స్వపరిపాలనకువిశేషమైన ప్రాధాన్యత ఉందిప్రజాస్వామ్య ప్రయోజనాలు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు స్థానిక ప్రభుత్వాలుతోడ్పడాలి.


ఇవి సాధించే దిశగా, సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా "గ్రామ జ్యోతిఅనే వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేసారు తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్ రావు. ఈ కార్యక్రమంలో భాగంగాప్రాధమిక దశలోగ్రామానికి చెందిన ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగాఆరోగ్యకరంగా వుంచేందుకు కృషి జరిగిందిఅన్ని స్థాయిల అధికారులుఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లిగ్రామ ప్రజల భాగస్వామ్యంతోగ్రామీణాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలకు రూపకల్పన కూడా జరిగింది. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన సర్పంచుల అలసత్వం అనుకున్న స్థాయిలో గ్రామజ్యోతి విజయం సాధించడానికి దోహదపదలేదు. అందుకే ప్రజలు తమ సంఘటిత శక్తిలోని బలమేంటో గుర్తించాలి. ఏ గ్రామం ఎలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలో నేర్పించాలి. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రజలే సారధులుగా వుండాలి.

దురదృష్టవశాత్తుగ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన గ్రామ సర్పంచులు తమ స్వగ్రామంలో నివసించడం కూడా మరిచిపోయారు. మండలమంతా తిరిగి అభివృద్ధిని పర్యవేక్షించాల్సిన మండలాధ్యక్షుడు మండల కేంద్రానికి కూడా వెళ్లే పరిస్థితుల్లో లేడు. మండలానికిజిల్లా పరిషత్‌కు వారధిలాగా వ్యవహరించాల్సిన జడ్ పీ టీ సీ సభ్యుడు ఆ పనిని సక్రమంగా నెరవేర్చడం లేదు. క్షేత్ర స్థాయిలో అవసరాలకు అనుగుణంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ జరగడం లేదనాలి. గ్రామ సర్పంచ్ కు గ్రామం కొరకు పనిచేయాలన్న ఆలోచనే లేదిటీవల కాలంలో. నిరంతరం చాలామంది పైరవీలతోనే కాలక్షేపం చేయడం గమనించాల్సిన విషయం. సర్పంచ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న కోరికతో వుండాలి కాని అది జరగడం లేదు.

మనం నివసించే గ్రామాలను మనమే ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదుగ్రామాలలో శాశ్వత ఆస్తులను ఎందుకు ఏర్పాటు చేయకూడదుఏ గ్రామానికి వెళ్లినా కనిపించేదిఎవరికీ పట్టని ఒక వాతావరణం. దీని నుంచి బయట పడాలి. ఉదాహరణకు సర్పంచ్ నిర్ణయించుకుంటే గ్రామంలో గుడుంబా వుంటుందా? చెట్లు పెరగవా? పేకాట ఆడేవారుంటారా? ఈ నేపధ్యంలో పంచాయితీరాజ్ చట్టంలో కొంత మార్పు తీసుకురావాల్సిన అవసరం వుంది. బాధ్యతాయుతంగా పనిచేయని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల విషయంలో ఏం చేయాలన్న ఆలోచన జరగాలి. గ్రామ మొత్తం సంక్షేమం బాధ్యత ప్రాధమికంగా సర్పంచ్ పైన, కొంత మేరకు సహచర వార్డు సభ్యులపైన పెట్టాలి. పనిచేసే స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు అంకురార్పణ జరగాలి. పనిచేయని సర్పంచ్ పదవిలో కొనసాగడానికి అనర్హుడిగా చట్టం రావాలి. వారానికొక రోజన్నా, ఒక నాడు దళితవాడలో, ఒకనాడు రజక వాడలో, ఒకనాడు మరో వాడలో....ప్రజలతో సర్పంచ్ మమేకమై, వారి సమస్యలను తెల్సుకుని పరిష్కారానికి కృషి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామం విడిచి మరో చోట సర్పంచ్ నివసించకూడదు. సర్పంచ్ గా ఎన్నికైన గ్రామంలోనే శాశ్వత నివాసం వుండాలి.

గ్రామపంచాయితీకి, సర్పంచ్ కు ఇన్ని అధికారాలు ఇచ్చాం-అన్ని అధికారాలు ఇచ్చాం అని చెప్పడం కన్నా, ఇన్ని బాధ్యతలు ఇచ్చాం...అవి నెరవేర్చాల్సిన కర్తవ్యం ఆ సర్పంచ్ మీద వేస్తున్నాం, అని చెప్పాలి. రాజ్యంగా బద్ధంగా నిర్వర్తించాల్సిన విధులు వారు సక్రమంగా చేయకపోవడం సమంజసం కాదు. ప్రతిగ్రామానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో విధిగా ఒక డంపింగ్ యార్డ్, అక్కడే, విడి-విడిగా తడి-పొడి చెత్త పోయడానికి ఏర్పాటు చేయాలి. అలాగే గ్రామానికి అవసరమైన దహన-ఖనన వాటికలు ఏర్పాటు చేయాలి. గ్రామంలో వున్న అన్ని రకాలైన విద్యాసంస్థల పారిశుధ్యం నిర్వహణ బాద్య సర్పంచ్ దే. తన గ్రామంలో విధిగా ఒక నర్సరీ వుండేలా చూడాలి. గ్రామానికి అవసరమైన మొక్కలు అక్కడే ఏర్పాటు చేసుకోవాలి. గ్రామానికి వచ్చి-పోయే రహదారులకు ఇరువైపులా చెట్లు పెరిగేట్లు చర్యలు తీసుకోవాలి. గ్రామంలోని వాటర్ టాంకులు పరిశుభ్రంగా వుంచే బాద్య సర్పంచ్ దే. వీధుల్లో విద్యుత్ దీపాల నిర్వహణ బాధ్యత కూడా వారిదే. సర్పంచ్ గా ఎన్నికైన వెంటనే ఇంటి పన్ను వసూళ్ళకు శ్రీకారం చుట్టాలి. నూటికి నూరు శాతం పన్ను వసూళ్లు కావాలి. కేంద్ర-రాష్ట్ర అభివృద్ధి-సంక్షేమ పథకాల వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు వివరించే ఏర్పాటు చేయాలి. గ్రామంలో ఇండ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చేటప్పుడు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఇలా ఎన్నో విధిగా చేయాలి.


ఒక అద్భుతమైన పంచాయితీరాజ్ వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి తెలంగాణ వేదిక కావాలి. పని చేసే పంచాయితీ, సర్పంచ్ ఇలా వుంటారనడానికి తెలంగాణ రాష్ట్రం నమూనా కావాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం పంచాయితీగా పనిచేస్తేనే తప్ప ఎన్ని కోట్ల నిదులిచ్చినా అది వ్యర్థమే అన్న ఆలోచన కలగాలి. పని చేయకపోతే పదవి పోతుందన్న భయం సర్పంచ్ కు కలగాలి. అందుకే సర్పంచ్ గా పోటీ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. పోటీ చేసి గెలవడమంటే, గ్రామానికి, గ్రామ సేవకు అంకితమైనట్లే అనీ, పని చేయకుండా తప్పించుకోవడానికి వీలులేదనే భావన కలగాలి. END  

No comments:

Post a Comment