Sunday, March 11, 2018

సీతాదేవికి శుభ శకునాలు....మాట్లాడాలనుకున్న హనుమ ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవికి శుభ శకునాలు....మాట్లాడాలనుకున్న హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (12-03-2018)

మాటల్లో చెప్పలేనంతగా బాధపడ్తూ, సంతోషమనేదిలేక, శోకపూరిత మనసుతో, పరమవ్రతం విడువని, సీతాదేవికి ధనవంతుడిని చేరే సేవకుల్లాగా శుభశకునాలు కనపడసాగాయి. (ఈ శుభశకునాలు, సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతాదేవిని ఆశ్రయించి, ఆమెకు వుపకరించినందువల్లే శుభశకునాలని పేరుతెచ్చుకున్నాయట). శోభాయమానమై, వంకరవెంట్రుకలతో ఆవరించబడి, తెల్లగా, విశాలంగా, నల్లని గుడ్లతో, ఎర్రటి అంచుకాంతితో వున్న సీతాదేవి ఎడమకన్ను చేప తాకిన పద్మంలాగా అదిరింది. మృదువైన, మనోహరమైన, బలసిన, గుండ్రని చందన, అగరు పూతకు అర్హమైన, లోకాధినాధుడగు శ్రీరామచంద్రమూర్తిని చేపట్టిన, ఆమె ఎడమచేయి అంతకంటే కూడా ఎక్కువగా అదిరింది. (స్త్రీలకు ఎడమకన్ను, భుజం, తొడ అదిరితే శుభం. పురుషులకు కుడివైపున అదిరితే శుభం కలుగుతుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం).

ఏనుగుతొండంతో సమానంగా, అందంగా, బలిసున్న ఆమె తొడలు జోడించి నడిస్తే, నడుమనున్న ఎడం కనిపించిందట. అందులోనూ ఎడమతొడ, రామచంద్రమూర్తిని ఎప్పుడు చూస్తానా అనుకుంటున్న సీతకు నేను చూపిస్తానన్నట్లుగా అదిరింది. (సీత ఎడమకన్ను, ఎడమచేయి, ఎడమతొడ అదిరిందంటే సరిపోతుందికదా! ఈ వర్ణన ఎందుకని పాఠకులనుకోవచ్చు. ఇది వ్యర్ధమైన వర్ణనకాదు. లోకంలో స్త్రీలకున్న అంగవైకల్యం వారి దుఃఖ కారణమౌతుంది. అలాంటి ఏవిధమైన అంగవైకల్యం ఈమెలో రవ్వంత అయినా లేవు. మరెందుకు దుఃఖిస్తున్నదని ప్రశ్నిస్తే, అది ఆమె స్వయంగా కోరి తెచ్చుకున్నదేనన్న సమాధానం దొరుకుతుంది. కాల్తున్న ఇంట్లో చొరబడి, దాంట్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేసేవారిలాగా, రావణుడి చెరలో వున్నవారిని రక్షించదలచి, ఆమెకూడా ఆ చెరలో ప్రవేశించింది. కాని కర్మానుభవం కొరకు కాదు. ఈ విషయాలు తెలియ చేసేందుకే ఈ అవయవ వర్ణన చేయడం జరిగింది)

అందంగా దానిమ్మ గింజల్లా వున్న పళ్లు, చక్కటి కళ్లు, తామరాకులవంటి ముఖమున్న సీతాదేవి కట్టుకున్న పచ్చని కాంతిగల మాసిన చీరె, సన్నగా వదులై జారింది. ఈ శకునాల గురిన్చి రించి వివరంగా తెలిసిన సీతాదేవి, ఎండకెంది, నేలలో పడి వున్న విత్తనం గింజ వానపడగానే మొలకెత్తినట్లు సంతోషపడింది. దొండపండులాంటి పెదవి, తుమ్మెదల్లాంటి ముంగురులు, చక్కటి కనుబొమలు, తామర రేకుల్లాంటి కళ్లు, తెల్లటి పళ్లున్న సీతాదేవి ముఖం, ఈ శుభ శకునాలను గని, రాహువు విడిచిన చంద్రుడిలాగ ప్రకాశించింది. (సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన ఉత్తమ స్త్రీ లక్షణాలన్నీ సీతాదేవిలో వున్నాయి).



ఇలాంటి శుభశకునాలు కన్న సీతాదేవి శోకం వదలి, సంతోషించి, చంద్రుడున్న రాత్రిలాగా ప్రకాశించసాగింది. అంటే భర్తతో గూడిన సంతోషం కలిగింది. (చంద్రుడు రాత్రి వేళే కనిపిస్తాడు కనుక రాత్రికి ప్రతి చంద్రుడు. రాత్రి చంద్రుడితో తేజరిల్లుతున్నట్లుంటుంది. అంటే, రాత్రీ చంద్రులూ కలిసినట్లే, సీత కూడా త్వరలో రాముడిని కలియబోతోందని సూచన)

సీతాదేవి ఏడుస్తూ అన్న మాటలను, రాక్షసస్త్రీల బెదిరింపు మాటలను, త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతాన్ని విన్న హనుమంతుడు, ఈమె దేవలోకంలోని నందనవనంలో వుండాల్సిన స్త్రీగాని, మనుష్య స్త్రీకాదని తలుస్తాడు. (హనుమంతుడు [ఆచార్యుడు] తాను చూస్తున్న స్త్రీ, సీతాదేవేనని [శిశ్యుడు] నిశ్చయించు కోడానికి, స్వతంత్ర, పరోక్ష, ప్రత్యక్ష, పరస్పర సంబంధం లేని, సాక్ష్యాలు ఆధారంగా చేసుకుంటాడు. ప్రత్యక్ష సాక్ష్యం, శరీరం పైన కనిపించిన సాముద్రిక చిహ్నాలు. సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన ఉత్తమస్త్రీ, లక్షణాలన్నీ ఆమెలో వున్నాయనుకొంటాడు. ఇన్ని విధాలైన ప్రత్యక్ష, పరోక్ష నిదర్శనాల వల్ల, ఈమే సీతనీ, రామచంద్రమూర్తి సందేశం వినే అర్హత ఈమెకే వుందనీ, హనుమంతుడు తీర్మానించుకుంటాడు. అదేవిధంగా "ఆచార్యుడు" కూడా, తన శిష్యుడిగా స్వీకరించదలచిన వాడిని, ప్రత్యక్ష, పరోక్ష నిదర్శనాల ద్వారా, భగవత్తత్వ రహస్యం ఉపదేశించడానికి అర్హుడా, కాడా?అని పరీక్షించాలని దీనర్థం).

ఇలా అనేక కోణాల్లోంచి చూసి, అనేకవిధాల ఆలోచించి, వానరలోకమంతా ఏ స్త్రీకొరకై వెతుకుతున్నదో, ఆమెను నేనిక్కడ చూసాననుకుంటాడు హనుమంతుడు. వేగులవాడిలాగా, ఉపాయంతో, చేయతలపెట్టిన కార్యాన్ని చేయడమే కాకుండా, శత్రువుల బలాబలాలు తెలుసుకునే సమర్ధతున్న తాను లంకంతా తిరిగి, రాక్షసుల బలాల తారతమ్య విశేషాలు, రావణుడి బలం, లంకానగర లక్షణం కూడా తెలుసుకున్నాననుకుంటాడు. ఇంతవరకు సుగ్రీవుడు అప్పగించిన పని సాధించిన హనుమంతుడు, ఇక శ్రీరాముడు చెప్పిన కార్యసాధన గురించి ఇలా ఆలోచించసాగాడు. (సీతాన్వేషణ బహిరంగంగా చేయకుండా దొంగలాగా వెతకడం పౌరష విరుధ్ధమని కొందరు వాదిస్తారు. ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తారో, వారి విషయంలో అలానే ప్రవర్తిస్తే ధర్మహాని లేదని భీష్మవాక్యం తెలుపుతుంది. మాయలమారిని మాయచేతనే ఎదుర్కోవాలి. చోరునివలె వంచనతో సీతను ఎత్తుకునిపోయిన రావణుడి విషయంలో వంచన చేయడం ధర్మ విరుద్ధం కాదు.)

"రావణుడిని గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకున్నాను. పతిని చూసే ఆసక్తిగల రామచంద్రమూర్తి దేవిని కల్సి, ఆమెకు భర్త యోగక్షేమాలు తెలిపి, ధైర్యం చెప్పడమే మేలైన పని. అట్లా చేయకుండా వెనుతిరిగిపోతే, ఆమె దుఃఖాన్ని పోగొట్టుకోక, ఇంకా అందులోనే మునిగితేలుతుంటుంది. ఈమె ఎన్నో సుఖాలను అనుభవించాల్సిందేకాని, ఇలా వుండాల్సిందికాదు. ఈమెకు ధైర్యం చెప్పి, ఈమె దుఃఖాన్ని నివారించడం నా ప్రధమ కర్తవ్యం. ఈమెను వూరడించకపోతే అనర్థం కూడా జరుగుతుంది. కీర్తికి అర్హురాలైన ఈమె, తన్ను తాను రక్షించుకోలేక మరణిస్తుంది. మహాబలశాలి రామచంద్రమూర్తి సీతను ఎప్పుడు చూస్తానా అని ఆసక్తితో వున్నాడక్కడ వనంలో. ఆయన మాటలు ఈమెకు చెప్పి, ఓదార్చి, ఈమెచెప్పే మాటలు ఆయనకూ చెప్పి ఆయన్ను కూడా ఓదార్చాలి. ఇదే సరైన మార్గం." అనుకుంటాడు హనుమంతుడు.

No comments:

Post a Comment