Thursday, March 15, 2018

ప్రజాహిత బడ్జెట్లు : వనం జ్వాలా నరసింహారావు


ప్రజాహిత బడ్జెట్లు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (16-03-2018)

2018-2019 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్, ఎన్నికల ముందు ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావచ్చు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బహుశా మొదలు వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టి, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టవచ్చు. ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపధ్యంలో ఒక్కసారి రాష్ట్ర ఆవిర్భావం నుండి వరుసగా 2014-2015 నుండి ఈ సంవత్సరం వరకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ల తీరుతెన్నులను, ఇప్పటివరకు చోటు చేసుకున్న అభివృద్ధి-సంక్షేమ అంశాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి.

అన్యాయానికి, వివక్షతకు, భేదభావానికి, అణచివేతకు వ్యతిరేకంగా దశాబ్దకాలం పైగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటం, తమ భవిష్యత్ ను తామే తీర్చిదిద్దుకుంటామని, తమ అస్తిత్వాన్ని తామే నిరూపించుకుంటామనీ నినదిస్తూ, నాలుగు కోట్లమంది తెలంగాణా ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలపాటు చేసిన అలుపెరుగని పోరాటం, రాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది. తెలంగాణాను పునర్ సృష్టించుకోవడానికీ, పునర్నిర్వచించుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి, కేసీఆర్ ఎంచుకున్న బహుముఖ వ్యూహం, బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా, లక్ష్యంగా, ప్రజల ఆశయాలు-అవసరాలు-ఆకాంక్షలు ప్రతిబింబించేలా, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనకు దోహదపడింది. నూతనంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని ప్రజల అవసరాలకనుగుణంగా రూపుదిద్దడానికి ఒక సరికొత్త విజన్-దూరదృష్టి కలిగి వుండడమే ఆ బహుముఖ వ్యూహం పరమార్థం. తెలంగాణా విషయంలో రాష్ట్రాభివృద్ధికి ఒక దశ-దిశ నిర్దేశించడం జరిగిందలా. సహజ, మానవ, ఆర్ధిక, భౌతిక వనరులను సమీకరించుకుని, వాటి సక్రమ ఉపయోగానికి దారితీసింది.

          తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క సగటు పౌరుడు భాగ్యవంతులుగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జీవనం సాగించే బంగారు తెలంగాణాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పాటైన అచిరకాలంలోనే ఈ లక్ష్యసాధన దిశగా గణనీయమైన అభివృద్ధి సాధించింది. చిన్నాభిన్నమైన ఆర్ధిక వ్యవస్థను గాడినపడవేయడమే కాకుండా గణనీయమైన వృద్ధి రేటుకు చేరుకుంది. పేలవమైన పాలన నుండి పటిష్టమైన, ప్రజలే కేంద్రబిందువుగా వుండే పాలన దిశగా అడుగులేసింది. కేవలం శంఖుస్తాపనలకే పరిమితమైన ప్రాజెక్టులు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తికావడం, వాటి ఫలాలను ప్రజలందుకోవడం ఆరంభమైంది. 

రాష్ట్రం ఏర్పాటైన రోజుల్లో ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. తీవ్ర విద్యుత్ సంక్షోభంతో, విద్యుత్ కోతలతో సతమయ్యే రాష్ట్రాన్ని, వ్యవసాయరంగానికి కూడా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసే దిశగా తీసుకెళ్లడం ఆషామాషీ విషయం కాదు. రైతు దగ్గరనుండి వ్యవసాయ శిస్తు వసూలుచేసే పరిస్థితి నుండి, వ్యవసాయానికి ఎకరాకు రు. 8000 పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రభుత్వం వేశపెట్టడం ఒక అద్భుతమైన చర్య అనాలి. అసంఘిటిత వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో సంఘటితం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేయడం పెద్ద సవాలు. యాదవులకు, కురుమలకు సబ్సిడీ మీద గొర్రెల పంపకం, బెస్తలకు, ఇతర మత్స్యకారులకు చేపల పంపకం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే! ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కేసీఆర్, ఆయన సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పెనుసవాళ్లను ఎదుర్కొని, ఒక్కొక్కదాన్నే అధిగమించుకుంటూ అభివృద్ధిపథాన దూసుకుపోతుంది. ఇవన్నీ ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది.

ఏదెలా వున్నా, అతి తక్కువ సమయంలో, రాష్ట్రం ఏర్పాటైన కొన్నాళ్లకే, నూతనంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి వారసత్వంగా లభించిన, అస్త-వ్యస్త ఆర్ధిక పరిస్థితి-దుస్థితి నుండి వృద్ధి దిశగా, ప్రజలే కేంద్ర బిందువుగా, సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా, పయనించే పాలనకు శ్రీకారం చుట్టడం జరిగింది. సంఘటిత అభివృద్ధి అంటే కేవలం లబ్దిదారులకు ఆర్థికపరమైన లాభాలు-అవకాశాలు చేకూర్చడమే కాకుండా, వారికి సాధికారత కలిగిస్తూ, అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదీ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ, చేపట్టి అమలు పరుస్తున్న పలు పథకాలు ఈ లక్ష్య సాధన దిశగానే వున్నాయి. ఇలా చేయడాన్ని ఒక సవాలుగా తీసుకున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరానికి, అంటే, 2014-2015 కు, బడ్జెట్ రూపొందించడానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి రకమైన “క్లూ”-ఆధారాలు లభించలేదు. అదో పెద్ద సవాల్ ప్రభుత్వానికి. రాష్ట్ర ఆదాయ వనరుల విషయంలో కానీ, వ్యయానికి సంబంధించి కానీ, ఏ మాత్రం అంచనా ప్రభుత్వం దగ్గర లేదు. ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల కల్పనకు దర్పణం పట్టే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు వుండాలి కానీ, కేవలం ఆదాయ-వ్యయ లెక్కల పట్టికగా ఉండరాదని ప్రభుత్వ ఉన్నత అధికారులకు స్పష్టం చేసారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని రంగాలలో ధర్మమైన, సమధర్మ-న్యాయ సమ్మతమైన  అభివృద్ధిని చేకూర్చి, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి బాటలు వేయడం నాటి ప్రభుత్వం ముందున్న సవాల్. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, వికేంద్రీకరణ నమూనా అభివృద్ధికి పీటవేసి, “మన వూరు-మన ప్రణాళిక” కార్యక్రమం ద్వారా, గ్రామీణ స్థాయిలో అట్టడుగు వర్గాల ప్రజల అవసరాలెలా వుంటాయో అనే విషయంలో సూచనలు-సలహాలు రాబట్టింది.

అదనంగా, దేశంలో, ప్రపంచంలో ఎక్కడా అంతవరకు జరగని రీతిలో, ఆగస్ట్ 19, 2014 న, ఒకే ఒక్క రోజున రాష్ట్రవ్యాప్తంగా “సమగ్ర కుటుంబ సర్వే” చేపట్టి పూర్తి చేసింది. దీనికి ఒక రికార్డు స్థాయిలో దేశవ్యాప్త మన్ననలు, ప్రసంశలు వచ్చాయి. బడ్జెట్ తయారీకొరకు, ఒక్కో రంగంలో ప్రాదాన్యతాంశాలను గుర్తించడానికి, వనరుల సమీకరణకు అవలంభించాల్సిన విధానాల రూపకల్పనకూ, సూచనలు-సలహాలు ఇచ్చేందుకు 14 టాస్క్ బృందాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వీటన్నింటి నేపద్యంలో, టాస్క్ బృందాల సిఫార్సుల మేరకు, మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ ను నవంబర్ 5, 2015 న రాష్ట్ర శాసనసభకు సమర్పించడం జరిగింది. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఆ విధంగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సరిగ్గా లేకుండానే, గతంకంటే పూర్తి భిన్నంగా, అందుబాటులో వున్న అంశాల ఆధారంగా, మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది. 2014-15 బడ్జెట్ వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు మాత్రమే. అంటే, ఆ ఏడాది 12 నెలల ఆదాయ-వ్యవ వివరాల అంచనాలు పూర్తిస్థాయిలో లేని నేపధ్యంలో ఆ తరువాతి సంవత్సరం అంటే 2015-16 బడ్జెట్ తయారుచేయాల్సి వచ్చింది.

2015-20 మధ్యన ఐదేళ్ళ కాలానికి 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాల వాటాను 32 శాతం నుండి 42 శాతానికి పెంచినప్పటికీ, ఆ లాభం తెలంగాణాకు చేకూరలేదు. దీనికి కారణం జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణా తలసరి సగటు ఆదాయం ఎక్కువగా వుండడమే! తలసరి ఆదాయానికి సంబంధించి జిల్లాలకు-జిల్లాలకు మధ్యనున్న భారీ వ్యత్యాసాలు కూడా రాష్ట్ర తలసరి సగటు ఆదాయంలో భాగమే. కేంద్ర పన్నుల్లోనుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా తగ్గినప్పటికీ (2014-15 లో వాటాగా ఇచ్చిన 2.893 శాతం నుంచి 2015-20 మధ్య ఐదేళ్ళ కాలంలో 2.437 శాతానికి తగ్గుదల) రాష్ట్రం విత్త సంబంధమైన ప్రమాణాలను పటిష్టంగా నిలబెట్టుకోగలటమే కాకుండా, అదనంగా జీఎస్డీపీ మీద 0.5% ఎఫ్ఆర్బీఎం పొందగలిగి, అప్పుతెచ్చుకోగల సామర్థ్యం సంపాదించుకోగలిగింది.


  2016-17 బడ్జెట్ రూపొందించుకునే సమయానికల్లా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, ఆదాయ-వ్యయాలపై, ప్రభుత్వానికి ఒక సమగ్రమైన-సంపూర్ణమైన అవగాహన వచ్చింది. 31 మార్చ్ 2015 నుండి 31 మార్చ్ 2016 వరకు, ప్రణాళిక, ప్రణాలికేతర పథకాల కింద ఆదాయ-వ్యయ లెక్కలు ఖచ్చితంగా తెలవడంతో, తెలంగాణ బడ్జెట్ రూపకల్పనకు అసలు-సిసలైన ప్రాతిపదిక దొరికి, బడ్జెట్ తయారీకి మార్గం సుగమమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత రూపొందించిన మొదటి బడ్జెట్-అడహాక్ లెక్కల మీద, గతంలో సమర్పించిన బడ్జెట్ల మీద ఆధారపడిందైతే, అంతో-కొంతో కుస్తీపట్టి ఆ తరువాతి సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ తయారు చేయడం జరిగింది. క్రమేపీ, పూర్తి అవగాహన కలగడమే కాకుండా, ఒక్కో పథకం, ఒక్కో శాఖకు సంబంధించి లోతుగా అధ్యయనం చేయడం, పూర్తి అవగాహనకు రావడం జరిగింది. ఆవిధంగా బడ్జెట్ కు సంబంధించిన సవాలును జయప్రదంగా అధిగమించడం జరిగింది. 2016-17 సంవత్సరం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ మూడో బడ్జెట్ అయినప్పటికీ, వాస్తవంగా ఆలోచిస్తే, ఒక సమగ్ర-సంపూర్ణ అవగాహనతో, పూర్తి స్థాయి సమీక్ష ఆధారంగా, అన్ని రకాల ఆదాయ-వ్యయాల వాస్తవ అంచనాల ప్రాతిపదికగా, వనరులకు సంబంధించి అసలు-సిసలైన లెక్కల ఆధారంగా, తయారుచేసిన మొదటి బడ్జెట్ అనాలి.

రాష్ట్ర ఆవిర్భావం తరువాత అనేక అభివృద్ధి-సంక్షేమ పథకాల కోసం విరివిగా నిధులను వ్యయం చేస్తున్నప్పటికీ, ఆర్థికంగా ఆరోగ్యకరమైన, పటిష్టమైన పరిస్థితిలో కొనసాగగలగడం ఎంతో తృప్తినిచ్చే అంశం అనాలి. ఇలా వుండడానికి ప్రధాన కారణం, పన్నులేవీ అదనంగా విధించకుండానే రెవెన్యూ వసూళ్లను మెరుగుపరుచుకోగలగడమే. 2015-16 సంవత్సరంతో పోల్చి చూస్తే, 2016-17 లోరాష్ట్ర స్వయం పన్నుల రెవెన్యూలో 21.1% వృద్ధి రేటు సాధించగలిగింది. ఇది దేశంలోని మిగాతా అన్ని రాష్ట్రాలకంటే అధికం.

ఈ నేపధ్యంలో, ఈ క్రమంలో, గత ఏడాది 2017-2018 లో రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఏ విధంగా చూసినా ఒక రకమైన స్ఫూర్తిదాయకంగా, సందేశాత్మకంగా వుందని చెప్పాలి. ప్రభుత్వ ఆశయానికి, ఆలోచనకు, ఉద్దేశ్యానికి అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాలకు, కులవృత్తుల వారికి, అన్ని మతాల వారికి, వివిధ రంగాలలో నిమగ్నమై వున్న వారికి, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే అన్ని ప్రభుత్వ శాఖల వారికి, అల్పాదాయ-మధ్య తరగతి వారికి, సమాజంలో వారూ-వీరూ అనే తేడా లేకుండా అందరికీ చేరువయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది.

2014 లో రాష్ట్ర ఆవిర్భావానంతరం తెలంగాణా ఆర్ధిక పరిస్థితిలో, ఆర్ధిక గమనంలో గణనీయమైన పెరుగుదల, అభివృద్ధి స్పష్ఠంగా కనిపిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్ళ కాలంలో (2012-14) రాష్ట్ర జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటు 4.2% మాత్రమే వుండగా, తదనంతరం మూడేళ్ళ కాలంలో (2014-17) అది 9.5% చేరుకోవడం గమనించాల్సిన అంశం. ఇంతే కాకుండా 2015-16 తొ పోల్చి చూస్తే, 2016-17 లో  రాష్ట్ర స్వయం పన్నుల రెవెన్యూలో 21.10% వృద్ధి రేట్ తో, దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకంటే అగ్రస్థానంలో నిలిచింది. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గాను, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం, రెవెన్యూ వృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన వుంది 17.82% వృద్ధి సాధించింది.

ఆర్ధిక వ్యవస్థ పట్ల అవసరమైన వివేచన, వివేకం ప్రభుత్వానికి పూర్తిగా వుండి, ఎక్కడ ఎక్కువగా పెట్టుబడులు పెడితే లాభాలు సమృద్ధిగా చేకూరుతాయో అనే విషయంలో పూర్తి స్థాయి అప్రమత్తతతో వుంది. అయితే ఇదిలా వుండగా, అణగారిన, పేద వర్గాల మోలిక-కనీస అవసరాలను తీర్చడానికి నిధులు సమకూర్చడానికి, ఖర్చు చేయడానికి, పూర్తి సంసిద్ధతతో వుంది. ఆ విధంగా ప్రభుత్వ నిధుల్లో గణనీయమైన భాగం, కంటికి కనిపించని లాభాలకోరకు, అంటే, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే రంగాలకు, తద్వారా మరింత ఉత్పాదకత దిశగా అడుగులేసేందుకు వెచ్చిస్తున్నది. ఉదాహరణకు ప్రభుత్వం తీసుకున్న భూ-ప్రక్షాళన తీసుకుంటే.....ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2% వృద్ధి రేటుంటుందని ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా.

వీటన్నిటి నేపద్యంలో రాష్ట్ర శాసనసభలో ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గత 45 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి అమలు పరుస్తున్న కార్యక్రమాలను ఏ విధంగా ప్రమాణీకరణం చేయవచ్చు, ఏ విధంగా స్థిరపర్చవచ్చు, ఏ విధంగా పటిష్టం చేసుకోవచ్చు అనే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాష్ట్ర స్థూల ఆర్ధిక పరిస్తి ఎలా మెరుగునపడిందో తెలియచేస్తుందీ బడ్జెట్. జేఎస్టే అమలు, పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపధ్యంలో కూడా రాష్ట్ర సాధించిన ఆర్ధికాభివృద్ధి స్పష్టం చేయడం జరిగింది.  అదనంగా, 2017-2018 ఆర్ధిక సంవత్సరంలో రూపకల్పన చేసిన పథకాలను వర్తమానంలో-భవిష్యత్ లో ఎలా అమలు చేస్తున్నారు-చేయబోతున్నారు అనే విషయాలు కూడా ఈ బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. ఉదాహరణకు ఎకరాకు రు. 8000 పెట్టుబడి మద్దతు పథకం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, రైతు భీమా, గొర్రెల పంపిణీ పథకం, ఉద్యోగుల సంక్షేమం, అన్ని రంగాలకూ 24 గంటల విద్యుత్ సరఫరా, మరిన్ని సంక్షేమ పథకాలు, షెడ్యూల్డ్ కులాల-తెగల-వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ ప్రగతి నిధి, చేనేత పరిశ్రమ అభివృద్ధి, కేసీఆర్ కిట్స్ పథకం లాంటివి చెప్పుకోవచ్చు. వర్తమాన-భవిష్యత్ అవవసరాల దృష్ట్యా వ్యవసాయం లాంటి ప్రాధాన్యతారంగాలను గుర్తించి, ఫలితాలను ప్రజలకు చేరువ చేయడానికి కావాల్సిన నిధులను కేటాయించి, బడ్జెట్ అంటే ఇదీ-ఇలా వుండాలని, ఒక “రోల్ మోడల్” బడ్జెట్ తయారుచేయడం జరిగింది.

ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను, కోరికలను ప్రతిబింబించే అసలు-సిసలైన బడ్జెట్ ఈ బడ్జెట్. 

No comments:

Post a Comment