Monday, March 19, 2018

శ్రీరాముడి వృత్తాంతం సీతకు చెప్పదలచుకున్న హనుమ ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడి వృత్తాంతం సీతకు చెప్పదలచుకున్న హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (19-03-2018)

"శ్రీరాముడి వృత్తాంతం ఈమెకు చెప్పడం ఆవశ్యకమే అయినా, ఎలా చెప్పాలి? నేనుచెప్తున్న మాటలు రాక్షసులు వినకూడదు. వింటే ఇప్పుడే పోయి రావణుడికి చెప్పుతారు. వాడు బయలుదేరి వస్తాడు వెంటనే. కార్యభంగమవుతుంది. వీళ్లకు తెలియకుండా సీతాదేవితో మాట్లాడాలి. ఉదయం అయ్యేలోపల మాట్లాడకపోతే, ఆమె ప్రాణాలు విడుస్తుందేమో!  అంతేకాదు, రాముడి దగ్గరకు పోగానే: సీతను చూసావా హనుమంతా? ఉంగరమిచ్చావా? చూసి ఏమంది? అని ఆయన అడగక మానడు. అడిగితే ఏమని చెప్పాలి? చూసి రమ్మన్నావు కాబట్టి చూసి వచ్చాను, మాట్లాడలేదని చెప్పాలా? ఉంగరం ఏంచేసావంటే పెట్టుకున్నానని చెప్పడం నాకు తగిందేనా? అట్లా చెప్పొచ్చా? సీతాదేవి ఏం చెప్పిందో తెలుసుకోకుండా, రాముడిని చూడబోతే, ఆయన కోపజ్వాలలో నన్ను భస్మం చేయడా? పోయి, చూసి, మాట్లాడకుండా వచ్చావని, కోప్పడడా? సీతాదేవిని చూసి రమ్మన్నావు కనుక చూసివచ్చానంటే, కోతికింతకంటే ఎక్కువ తెలివితేటలెందుకుంటాయని నన్నేమనడనుకుందాం. నామాటలు నమ్మి, వానరులందరు ఇక్కడకు వచ్చేసరికి, సీతాదేవి మరణించి వుంటే, వారి రాక వ్యర్థం కాదా! కాబట్టి అవకాశం చూసి, సీతాదేవిని ఓదార్చిపోవడమే మంచిది. ఎట్లాజరగాలది? నేను చిన్న ఆకారంలో వున్నాను. దాన్నిప్పుడు పెంచొద్దు. కోతినైన నేను మనుష్యులలా సంస్కృతం మాట్లాడవచ్చా? బ్రాహ్మణుడిలాగా సంస్కృతం మాట్లాడితే, నన్ను రావణుడిగా అనుమానించి అసలే మాట్లాడదేమో!"

"మాట్లాడకున్డా వూరుకుంటే, ఓదార్చాల్సిన ఆమెను ఎలా ఓదార్చాలి? మాట్లాడాలంటే, ఎలా, ఏమి మాట్లాడాలి? వేరేమార్గం లేదు. ఈమెకు తెలిసిన ప్రాకృతభాషలోనే మాట్లాడుతా. ఈ భాష రాక్షసులకు తెలియదు. వారికర్ధం కాదు. ప్రాకృతం మాట్లాడాలంటే కోతి ఆకారంలో ఎట్లావీలవుతుంది? సీత ఇదిరాక్షసుల పనేననుకుని, మరెక్కువ భయపడుతుందేమో! భయపడి రావణుడే వచ్చాడనుకుని అరుస్తుందేమో! ఆ అరుపువిన్న రాక్షస స్త్రీలు, నన్ను చూసి చంపడమో, కట్టిపడేసి రావణుడి వద్దకు తీసుకుపోవడమో జరుగుతుంది. పోనీ, కొమ్మో-రెమ్మో పట్టుకుని పారిపోతే, నా భయంకర రూపాన్ని చూసి, రావణుడింటివద్ద కాపలా వున్న రాక్షసులను పిలుచుకొస్తారు. వాళ్లు కత్తులు-కటార్లు-శూలాలతో వచ్చి, గుంపుగా నామీద పడ్తే, నాకూ కోపం వస్తుంది. ఇలావచ్చిన రాక్షసులను అందరినీ చంపుకుంటూ పోతే, సముద్రం దాటి తిరిగిపోవడమెట్లా? వాళ్లే గెలిచి నన్ను పట్టుకుంటే, సీతకు, శ్రీరాముడి వార్త చెప్పేవారుండరు. నేనుచిక్కిపోతా. సీతను రాక్షసులు చంపుతారు."

"ఇలా జరిగితే రామసుగ్రీవులు అనుకున్న పని చెడిపోతుంది. సీతను చంపకపోయినా, జాడ తెలియకుండా ఏ రహస్య ప్రదేశంలోనో దాచిపెట్తారు. ఆ బాధలు పడలేక ఆమె చనిపోవచ్చు. యుద్ధంలో రాక్షసులు నన్ను చంపినా, కోపంతో కట్టిపడేసినా, రామకార్యం చేయగలవాడెవరూ లేరు. నూరు యోజనాల సముద్రాన్ని దాటగల వానరుడెవడూ లేడు. ఎంతమంది రాక్షసులనైనా, భుజబలంతో యుద్ధంలో గెలుస్తానుకాని, బడలికవల్ల సముద్రాన్ని మళ్లీ దాటలేను. యుద్ధంలో జయాపజయాలు నిర్ధారించలేం కూడా! కాబట్టి సందేహానికి తావిచ్చే పనులేవీ చేయరాదు. మేలైన పనిని, బుధ్ధిమంతుడైనవాడు ఆలోచించకుండా చేస్తే, అది మేలుచేస్తుందా, కీడు చేస్తుందా, అనేది సందేహమే! అలాంటి సాహసం చేస్తే, నీతిమాలిన వాడని లోకులు నిందిస్తారు. రాక్షసులకు భయపడి పలకరించకుండా పోతే, అదే రాక్షసులకు భయపడి సీత మరణించడం ఖాయం. పలుకరిస్తే కీడు కలుగుతుందేమో? ఎట్లాచేస్తే కార్యం చెడదు, ఎట్లా ప్రవర్తిస్తే సముద్రం దాటడం వ్యర్థం కాదు, ఎలా చెప్పితే సీత నామాటలు చక్కగా వింటుంది, నన్ను చూడగానే సీత భయపడకుండా ఎట్లా వుంటుంది?"

ఇలా పరిపరి విధాల ఆలోచించిన హనుమంతుడు, బుధ్ధిమంతుడు కనుక, సరైన నిర్ణయానికొస్తాడు. తన్ను చూస్తేనే కదా సీత భయపడేది అనుకుంటాడు. కనిపించకుండా, కొమ్మల్లో దాక్కుని, సీత భయపడకుండా, రామచంద్రమూర్తిని, ధర్మంతోకూడిన, శుభాన్నిచ్చే, తియ్యటి మాటల్తో పొగిడి, ఆమె నమ్మేటట్లు చేస్తే మంచిదని భావిస్తాడు. తనమాటలను ఆమె ఎంతవరకు నమ్ముతుందో చూసిన తర్వాతనే, ముందు-ముందు ఏమిచేయాల్నో నిర్ణయించుకోవచ్చు అనుకుంటాడు. దీనివల్ల నష్టమేమీలేదని నిశ్చయించుకుని, హనుమంతుడు, ఆమెను చూస్తూ, ఆమె మాత్రమే వినేటట్లు, చెట్టుచాటునుండి, తియ్యగా మాట్లాడసాగాడు.

దశరథుడి పేరు స్మరించేవారెవ్వరూ లంకలో వుండరు కాబట్టీ, ఆ ప్రస్తావన వచ్చినా కీర్తించే వారెవరూ లేరుకాబట్టీ, దశరథుడితో మొదలెట్టి ఆయన ఉదారకీర్తిని గురించిన మాటలు సీతచెవిలో పడేటట్లు చేసి, ఆమెమనస్సును ఆకర్షిస్తాడు హనుమంతుడు. ఈవిధంగా సీతాదేవి మనస్సును తనవైపు లాక్కొని, ఆతర్వాత ఇంకేమి చెప్తాడో విందామన్న ఆసక్తి ఆమెలో కలిగిస్తాడు హనుమంతుడు. పరేంగిత జ్ఞాగా హనుమంతుడు సాక్షాత్కరిస్తాడు. ఇలా కొనసాగితుందిఆయన ప్రశంస:

"దశరధుడనే మహారాజు, మహాదాతనే కీర్తి తెచ్చుకున్నాడు. ఆయనకు చతురంగ బలసైన్యం, ధర్మస్వభావం వున్నాయి. సుగుణసంపత్తి కలిగిన లోకపూజ్యుడు. రాజర్షులందరిలోనూ శ్రేష్టుడు. చక్రవర్తుల వంశంలో పుట్టాడు. తపస్సులో ఋషులకు, బలంలో ఇంద్రుడికి సమానుడు. దయాశీలి. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్లందరిలో శ్రేష్టుడు. సత్యపరాక్రముడు. అహింసా ప్రియుడు.  గొప్పరాజులకుండే శుభ లక్షణాలున్నవాడు. చక్కని నడవడికలిగి, నాలుగు సముద్రాల నడుమనున్న భూమిని ఏలినవాడు. ఒకరిని సుఖపెట్టి తానూ సుఖపడే వాడు. ప్రభువులందరికీ ప్రభువైనవాడు.”

(ఇలా ఎవరో తనమామగారిని పొగడ్తున్న మాటలు విన్న సీతాదేవి ఇంకేమి వినపడ్తుందో అని ఆలకించింది ఆసక్తిగా)



"గొప్ప మనసున్న ఆ దశరథ మహారాజు పెద్దకొడుకే శ్రీరామచంద్రుడు. చంద్రుడిలాంటి ముఖమున్న కారణాన అందరికీ ప్రియుడైనాడు. తన్ను ఆశ్రయించిన వారిని, వారినాశ్రయించిన వారినీ, రక్షించే సమర్ధుడు. స్వధర్మ రక్షణ అంటే ఇష్టపడేవాడు. విల్లుపట్టే వారిలో మేటి. అన్నివిషయాలలో పరిపూర్ణ వ్యక్తిత్వమున్నవాడు. సర్వజ్ఞత్వ, సర్వశక్తిమత్వ, సర్వసంహారకత్వ  సర్వరక్షకత్వాది గుణాల్లో ఏ లోపమూ లేనివాడు. చెడ్డవారికి, పగవారికి భయం కలిగిస్తాడు. నిర్మలమైన తనవంశాచార ధర్మాన్ని రక్షించేవాడు".

(ఎవరో తన మగడిపేరు చెప్పుతున్నారే అని, ఇంకా ఏంచెప్తారో విందామని, మరింత ఆసక్తిగా మనస్సు పెట్టి వినసాగింది సీత)

"పాపరహితుడైన ఆ శ్రీరాముడు సత్యసంధుడు. ముసలివాడైన తండ్రి ఆజ్ఞప్రకారం, తమ్ముడు, భార్య తోడురాగా అడవులకెళ్లాడు. ఆయన కామరూపులైన దుష్ట రాక్షసులను, ఖరదూషణాదులను, ఇంకా అనేకమందిని చంపాడు. జనస్థానంలో వున్నవారిలా చావడం భరించలేని రావణుడు, మాయలేడి నెపంతో, మోసంచేసి, శ్రీరాముడి భార్యను అపహరించాడు. ఆమెను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులు వానర రాజైన సుగ్రీవుడితో స్నేహం చేసారు. తన స్నేహితుడైన సుగ్రీవుడి కోరికపై, వాలిని చంపి, రాజ్యాన్ని ఆయనకప్పగించాడు రాముడు. సీతాదేవిని వెతికేటందుకు, సుగ్రీవుడు పంపిన, పరాక్రమమవంతులు, కామరూపులైన వానరులనేకమంది అన్నిదిక్కుల్లో గాలిస్తున్నారామెకొరకు. అలాంటివారిలో ఒకడినైన నేను, జటాయువు సోదరుడు సంపాతి సలహామేరకు, ఆయన మాటలు నమ్మి, నూరామడల పొడవున్న సముద్రాన్ని దాటి లంకకొచ్చాను. సీతాదేవిని ఇక్కడ వెతుకుతున్న నాకు, నా పూర్వ పుణ్యఫలంవల్ల, శ్రీరాముడు చెప్పిన ఆకారం, వర్ణన, కాంతి, గుణం, సౌందర్యం వున్న పతివ్రత కనిపించింది.

ఇలా హనుమంతుడు అంటున్న మాటలను విన్న సీతాదేవి, ఆశ్చర్యపడి, కుటిలాలకాలను సవరించుకుంటూ తలపైకెత్తి, ఎవరీ మాటలు చెప్పుతున్నారా అని చెట్టువైపు చూసింది. ఇదేమన్నా రావణుడి మాయేమో అనుకుని, భయం, భయంగా, రాముడిని స్మరించుకుంటూ, చెట్టు కింద, మీద, ప్రక్కన, సందుల్లో చూడసాగింది సీత. (మృతసంజీవనం రామచరితం అని ఆర్యోక్తి. అంటే, చనిపోయేవారిని బ్రతికించేది రామమంత్రమట. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతమ్మకు హనుమంతుడు చేసిన రామగుణగానం జీవివితంపైన ఆశలు చిగురింప చేసింది. సీతమ్మకు ఊపిరులూదింది. మరొక చమత్కారం కూడా వుంది. రామ కథని వివరించే సందర్భంలో కైక మాటను ప్రస్తావించకుండా, తండ్రి ఆజ్ఞ పైనే రాముడు అడవికి వచ్చాడని హనుమంతుడు పలకడం అతని వాగ్విదాంవరత్వానికి శుభ ప్రతీక కద!).

No comments:

Post a Comment