వాలి తనను దూషించిన వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన
సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-15
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం
సంచిక (02-02-2020)
వాలికి, తనకు విరోధం వచ్చిన కారణాన్ని చెప్పడం
కొనసాగిస్తూ శ్రీరాముడితో సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. “దురాగ్రహంతో మండిపడుతున్న
ఆ కపిరాజు వాలి మీద వున్న గౌరవంతో వున్న విషయాన్ని విన్నవించుకున్నాను. కట్టెలాగా
ఆయన పాదాలమీద పడి ఇలా వేడుకున్నాను”.
“అన్నా! మహా శౌర్యశాలీ! మా భాగ్యంవల్ల శత్రువైన
మాయావిని నువ్వు చంపి వచ్చావు.
దిక్కులేనివారికి దిక్కైన నువ్వే ఈ దిక్కులేనివాడికి దిక్కు. చంద్రుడిలాగా
ప్రకాశించే తెల్లగొడుగును నీకు నేను పట్తాను. నిర్మలమైన మనస్సుతో అంగీకరించు. ఒక్క
సంవత్సరం నేను బిలం ముఖం వద్ద కాచుకుని కూర్చున్నాను. అప్పుడు నెత్తురు ప్రవాహాలు
అంతకంతకూ ఎక్కువై పారడం జరిగింది. రాక్షసుల సింహనాదాలు వినపడ్డాయికాని నీ గొంతు
వినపడలేదని బాధపడ్డాను. అప్పుడు, నిన్ను చంపిన
రాక్షసులు నామీదకు యుద్ధానికి వస్తారేమోనని భయపడి ఒక కొండను బిలద్వారంలో పెట్టి
ఏడ్చుకుంటూ, కలవరపడుతూ నగరానికి చేరుకున్నాను. అన్నా! ఇది
యదార్ధంగా జరిగిన సంగతి. దుఃఖంతో పరితపిస్తున్న నన్ను నేను వద్దంటున్నా బలవంతంగా
మంత్రులు రాజ్యాభిషిక్తుడిని చేశారు. దేవా! నన్ను దయచూడు. అన్నా, నువ్వే రాజుగా వుండు. నేను ఎప్పటిలాగా యువరాజుగా వుంటాను. రాజు లేకుంటే
రాజ్యం ఆరాచకం అవుతుందని మంత్రులీవిధంగా చేశారు. రాజ్యం, రాజుతనం
నేను కోరలేదు. ఇది నిజం. నీరాజ్యాన్ని నువ్వే తీసుకో. అన్నా! నేను నీకు తమ్ముడిని.
శత్రువును కాదు. నీ విషయంలో నేను ఎలాంటి ద్రోహం చేయలేదు. నన్ను క్షమించు. నీ
పాదాలమీద పడతాను. చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను”.
“అని ఎంతగా వినయంగా నేను వేడుకున్నా ఆయన కోపం వదలలేదు.
ధిక్కార స్వరం మారలేదు. ఎన్నో విధాలుగా తిట్టాడు. పురజనులను, మంత్రులందరినీ సభలో చేర్చి నన్ను చూసి వాలి ఇలా అన్నాడు”.
“ఒక అర్థరాత్రి, ఒక
రాక్షసుడు, యుద్ధానికి నన్ను పిలిస్తే నేను వెంటనే ఇల్లు
వదిలి పోయాను. ఈ మోసగాడు కూడా నా వెనకే వచ్చాడు. ఇది మీకు తెలిసిన విషయమే.
మమ్మల్ని ఇద్దరినీ చూసి మాయావి భయపడి పరుగెత్తాడు. నేను వాడివెంట పరుగెత్తాను. ఈ
పాపచారి నా వెంట వచ్చాడు. ఇలా పరుగెత్తి వాడు అడవిలో భూమిలో వుండే ఒక బిలంలోకి
దూరాడు. నేను విరోధం మానకుండా వాడివెంట పోవాలని, ఈ నీచుడితో, నేను రాక్షసుడిని చంపి వచ్చేవరకు ఈ బిలం దగ్గరే వుండమని చెప్పాను.
విరోధిని చంపినా తరువాతే ఊళ్లోకి వస్తానని కూడా చెప్పాను. అలా సుగ్రీవుడిని బిలం
వాకిట్లో వుంచి నేను ఆలశ్యం చేయకుండా లోపలికి పోయాను. పోయి అక్కడ రాక్షసుడిని
వెతికాను. ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు వాడు కనబడ్డాడు. వాడిని యుద్ధంలో వాడి
బంధువులతో సహా చంపి మళ్లీ మనవూరికి రావాలని ప్రయత్నం చేస్తే,
బిలద్వారానికి కొండ అడ్డంగా వుండడం వల్ల దారి కనపడలేదు. నేను గట్టిగా ఎన్నో సార్లు
సుగ్రీవా! సుగ్రీవా! అని అరిచాను. వాడి దగ్గర నుండి సమాధానం లేదు. బయటికి
రావడానికి దారి తెలియలేదు. నేను వుండమని చెప్పి వచ్చిన సుగ్రీవుడి గొంతు
వినపడలేదు. అప్పుడు నేను పడ్డ బాధ ఏమని చెప్పాలి? కడుపులో
చేయిపెట్టి కెలికినట్లయింది. ఇలా ఇబ్బందిపడుతూ బిలద్వారంలో వున్న కొండను గాలితో
తన్ని-తన్ని పడగొట్టి ఎంతో కష్టం మీద బయటపడ్డాను. రాజ్యలక్ష్మి కొరకు వీడెంత పాపం
చేశాడో చూశారా? వాడికి అన్నని కదా? ఇలా
ప్రవర్తించవచ్చా? అని ఆలోచించలేదు. ఈ నీచుడు ఎంత చెడ్డ పని
చేశాడో చూశారా? వీడిని మన్నించవచ్చా?”
“ఇలా అంటూ నన్ను వూరు వెడలగొట్టాడు. నా భార్యను గ్రహించాడు.
అంతటితో ఆగకుండా నన్ను చంపడానికి రావడంతో ప్రాణ భయంతో అనేక దేశాల్లో తిరిగి చివరకు
ఈ గుట్టకు అతడు రాలేకపోవడానికి కారణం వుండడం వల్ల ఇక్కడ స్థానం ఏర్పాటు
చేసుకున్నాను. బుద్ధిపూర్వకంగా నేను ఏ అపకారం చేయలేదు. అలా అయినప్పటికీ పడరాని
కష్టాలను పడుతున్నాను. నా మీద దయచూపించి సర్వభూతరక్షకుడవైన నువ్వు ఈ దీనుడిని, దరిద్రుడిని రక్షించు. దీనరక్షకుడని కీర్తిని సంపాదించు”.
(సుగ్రీవుడు జరిగినదంతా సత్యంగానే చెప్పాడు కాని, తాను రాజుగా వున్న సమయంలో అన్న భార్య తారను గ్రహించిన సంగతి
చెప్పలేదు. ఈ కలహంలో మొదలు సుగ్రీవుడు మీద అనుమానం రావడం సహజమే. కాని సుగ్రీవుడు
బుద్ధిపూర్వకంగా చేయాలని పొరపాటు చేయలేదు. వాస్తవంగా రాజ్యకాంక్ష వల్ల వాలికి
ద్రోహం చేసినట్లయితే అతడు కిష్కింధకు వచ్చినప్పుడు తన బలంతో వాలిని
నిగ్రహించగలిగేవాడే! వాలిసుగ్రీవులు ఇద్దరూ ఇంచుమించు సమానమైన బలవంతులే. వాలిదగ్గర
ఇంద్రదత్తహారం వుండడం వల్ల ఎక్కువ బలశాలి అయ్యాడు. హనుమంతుడు, నీలుడు లాంటివారు సుగ్రీవుడి సహాయకులు. సుగ్రీవుడు వాలితో యుద్ధానికి
పూనుకుంటే ఒక్క హనుమంతుడే వాలిని మట్టుబెట్టగలడు. కాబట్టి సుగ్రీవుడిలో
ద్రోహబుద్ది లేదు. సుగ్రీవుడి విషయంలో వాలి అనుమానపడ్డాడు. బిలద్వారం మూయడం, రాజ్యాభిషిక్తుడు కావడం ద్రోహబుద్ధితో చేశాడని నమ్మాడు. తాను జీవించి
వుండగా తన భార్య తారను గ్రహించాడని కోపం వచ్చి వుండవచ్చు. అందుకే ఆ తరువాత
సుగ్రీవుడి భార్యను వాలి గ్రహించాడు. అయితే సోదరుడు మరణిస్తేనే ఆయన భార్యను
స్వీకరించవచ్చని ఒక మర్యాద ఆ జాతుల్లో వుంది. వాస్తవానికి వాలి మరణించాడని నమ్మి
ఆయన భార్యను సుగ్రీవుడు గ్రహించాడు. కాని, సుగ్రీవుడు
జీవించి ఉన్నాడని తెల్సికూడా వాలి అతడి భార్యను గ్రహించాడు. ఈ కులమర్యాదను
రామచంద్రుడు కూడా ఆదరించాడు. ఎందుకంటేవాలి మరణం తరువాత సుగ్రీవుడు తారను
గ్రహించాడని తెలిసీ ఆయన ఏం అనలేదు. వాలి కుల మర్యాదను,
శాస్త్ర మర్యాదను ఉల్లంఘించడం వల్లే శిక్షార్హుడయ్యాడు).
సుగ్రీవుడు ఇలా చెప్పడంతో రామచంద్రమూర్తి అతడితో, “మిత్రమా! బాధపడవద్దు. నా బాణాలతో నీ పగ తీరుస్తాను. ఆ
పాపాత్ముడెంతవరకు నాకంట పడడో అప్పటివరకే సుఖంగా వుంటాడు. కపీశ్వరా నా దుఃఖంలాంటిదే
నీ దుఃఖం. దాన్ని ఉపశమించేట్లు చేస్తా. సంతోషించు”.
No comments:
Post a Comment