సాలసప్తకాన్ని భేదించిన శ్రీరామచంద్రుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-18
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (23-02-2020)
సుగ్రీవుడు ఈ విధంగా చెప్పగా రామచంద్రమూర్తి ఆయనకు నమ్మకం
కలిగేట్లు చేయడానికి, తన విల్లు చేతబట్టుకుని, బంగారు పిడి కల బాణాన్ని సంధించి, అల్లెతాటి మోత, బాణం రెక్కల ధ్వని దిక్కులన్నీ వ్యాపిస్తుంటే,
మద్దిచెట్టును గురిచూసి కొట్టాడు. రామచంద్రమూర్తి వేసిన బాణం త్వరగా పోయి, ఆ ఏడు చెట్లను త్వరగా నరికి, కొండబద్దలయ్యేలా
భేదించి, భూమిలో దూరి, మళ్లీ త్వరగా
బయటకు వచ్చి ఆయన అంబులపొదిలో చేరింది. ఏడుచెట్లు భయంకరమైన ఆ బాణానికి వాటి
దార్ధ్యం చెడిపోయి, చూసేవారికి బయం కలిగేట్లు దభాలున కూలడం
చూసిన సుగ్రీవుడు ఆ బాణవేగానికి ఆశ్చర్యపడ్డాడు. తన మెడలోని ముత్యాలహారాలు నేలకు
తగిలేట్లుగా సుగ్రీవుడు నేలమీదవాలి, రామచంద్రమూర్తికి మొక్కి, పరమప్రీతిగా మళ్లీ లేచి భగవన్నమస్కారం చేశాడు. తన రెండు చేతులు జోడించి, రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు.
“నీ బాణాలతో
ఇంద్రుడితో కలిపి దేవతలందరినీ, రాక్షస
సమూహాలనూ ఏక కాలంలో చంపగలవు. ఇక యుద్ధంలో వాలి-గీలి నీకొక లెక్కా? వరుణ-ఇంద్రులతో సమానుడివి. మిత్రప్రీతికల నిన్ను చూడగానే నా దుఃఖం
సమసిపోయింది. ఆర్త శరణ్యా! ఏడు మద్దిచెట్లను పాతాళానికి ఒకే ఒక్క బాణంతో భేదించిన
నీకు యుద్ధంలో ఎదురెవరు? మహాత్మా! నా దుఃఖం పారదోలు.
దయలేనివాడైన నా విరోధి, అన్న వాలిని చంపు”.
దీనుడై
ప్రార్ధిస్తున్న సుగ్రీవుడిని రామచంద్రమూర్తి ప్రేమతో కౌగలించుకుని కిష్కింధకు
పోదాం అని అంటాడు.
తొలిసారి వాలిమీదకు యుద్ధానికి పోయిన సుగ్రీవుడు
సుగ్రీవుడితో
రాముడు, “కిష్కింధకు పోదాం పద. ఇక
ఉపేక్ష చేయవద్దు. త్వరగా నువ్వు ముందు పోయి, నీ సోదరుడిని
సంతోషంగా యుద్ధానికి పిలువు. భయపడవద్దు” అని అంటాడు. ఇలా చెప్పి, రామలక్ష్మణులు కోతిమూకతో కలిసి శీఘ్రంగా కదిలి,
చెట్లచాటున దాక్కున్నారు. సుగ్రీవుడు ముందుగా పోయి దిక్కులు పిక్కలిల్లేట్లు
సింహనాదం చేసి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ ధ్వని విన్న వాలి మండిపడుతూ
యుద్ధానికి వచ్చాడు. వారిరువిరికీ ఆకాశంలోని బుధ, అంగారక
గ్రహాలకు లాగా ఘోరమైన ద్వంద్వయుద్ధం జరిగింది. పిడుగులతో సమానమైన పిడికిళ్ళతో, అరచేతులతో, భయంకరంగా విడవకుండా యుద్ధం చేశారు
ఇద్దరూ. పిడిగుద్దుల యుద్ధం అలా పెరుగుతుంటే, రామచంద్రమూర్తి
చేత్తో విల్లు పట్టుకుని, ఎక్కుపెట్టి,
గురిచూసి వేద్దామనుకున్నాడు కాని....అశ్వినీ దేవతల్లాగా,
తేజంలో, శౌర్యంలో, ఆకారంలో సమానంగా
ఒకేవిధంగా వున్న వారిద్దరినీ చూసి ఎవరు సుగ్రీవుడో, ఎవరు
వాలో పోల్చుకోలేక ఆగిపోయాడు. పైగా వాలి తన బంగారు మాలిక ధరించి రానందున
పోల్చుకోవడం రాముడికి కష్టమైంది. ప్రాణం తీద్దామనుకున్న బాణాన్ని సందేహంతో
రామచంద్రమూర్తి విడవలేదు. ఇంతలో వాలి దెబ్బలకు బాధపడి, వాలి
వెంటపడి తరుముతుంటే ఋష్యమూకానికి పరుగెత్తి పోయాడు సుగ్రీవుడు. అది గమనించి వాలి, “చీ! బతికావు పో” అని అనుకుంటూ మళ్లీ కిష్కింధకు పోయాడు. దాగివున్న
రామలక్ష్మణులు అక్కడనుండి కదిలారు.
వాలిని చంపనందుకు రాముడిని నిష్టూరాలు ఆడిన సుగ్రీవుడు
హనుమంతుడు
తోడురాగా, రాముడు లక్ష్మణుడితో సహా
సుగ్రీవుడున్న స్థలానికి పోయి అతడి ఎదుట నిలుచున్నారు. వాళ్లను చూసి సుగ్రీవుడు
సిగ్గుతో తలవంచుకుని ఇలా అన్నాడు. “నీ పరాక్రమాన్ని నేను నమ్మేట్లు చేసి చూపించి, నన్ను యుద్ధానికి పొమ్మని ప్రేరేపించి, శత్రువు
చేతిలో నన్నిలా చంపేట్లు చేయడానికి కారణం ఏమిటి? నా శత్రువు
చేతిలో నన్ను చంపించడంవల్ల నీకు కలిగే లాభం ఏంటి రామచంద్రా?
బలవంతుడా! మహాబుద్ధిమంతుడా! వాలిని చంపమని నిన్ను నేను కోరినప్పుడు చంపనని ముందే
చెప్పవచ్చుకదా? నువ్వు అలా చెప్తే నేను ఎప్పటిలాగా హాయిగా
ఇక్కడే పడి వుండేవాడిని కదా? నన్నెందుకు యుద్ధానికి పంపావు? నన్ను చావుదెబ్బల పాలుచేయడానికా?”
తాను వాలిని చంపకపోవడానికి కారణం చెప్పిన శ్రీరాముడు
ఇలా కన్నీరు
మున్నీరుగా కారుస్తున్న, ఏడుస్తున్న సుగ్రీవుడిని చూసి
రామభద్రుడు, “నాయనా! ఎందుకు నామీద కోప్పడతావు? నా దివ్యబాణాన్ని విడవకపోవడానికి కారణం చెప్తా విను. రూపంలో, వయస్సులో, ఎత్తులో, చూడడానికి, వేషంలో, నడకలో, కాంతిలో, మాటల్లో, కంఠస్వరంలో,
ధైర్యంలో, మీరిద్దరూ సమానంగా వున్నారు. ఈ కారణాన మీలో వాలి
ఎవరో, సుగ్రీవుడు ఎవరో నేను గుర్తుపట్టలేక ప్రాణం తీసే
బాణాన్ని వదలలేదు. ఇది ముమ్మాటికీ నిజం. స్నేహితుడా! నా చేతినుండి విడువబడ్డ బాణం
ఎప్పటికీ వ్యర్థం కాదు. ఉరికే విడుస్తే అది నీకు తగిలితే మూలనాశనం అవుతుంది కదా? అందుకే నేనప్పుడు బాణం విడువలేదు. నా బాణం నిన్ను చంపితే, నా బుద్ధిలేనితనం, పిల్లతనం,
శాశ్వతంగా నికిచి వుండేది కదా? కార్యభంగమే కాకుండా శాశ్వతమైన
అపకీర్తి వచ్చేది. మిత్రరత్నమా! అభయమిచ్చిన నేనే నిన్ను చంపితే నా పాపానికి అంతం
ఏది? దానికి ప్రాయశ్చిత్తం లేదు. దీన్ని నువ్వు ఆలోచించు.
నేను వాలితో కలిసి నిన్ను చంపించాలని అనుకున్నావేమో? ఈ
మహారణ్యంలో నేను, లక్ష్మణుడు, సీత నీకు
వశపడి వున్నాం. మా క్షేమం నీ చేతిలో వుంది. కాబట్టి నీకు నేను ద్రోహం చేయను.
సమాధానపడు. సుగ్రీవా! నా మాట నమ్ము. సందేహించవద్దు. మళ్లీ వాలి మీదకు యుద్ధానికి
పో. నాకు తెలిసేవిధంగా నువ్వేదైనా గుర్తు ధరించు. ఆ ఆమాత్రం నువ్వు చేస్తే, నా బాణం దెబ్బకు వాలి కిందపడి చస్తాడు” అని చెప్పి లక్ష్మణుడితో ఇలా
అంటాడు.
“లక్ష్మణా!
గజపుష్పమాల తీగె పుష్కలంగా వుంది. అది స్పష్ఠంగా తెలిసేట్లు తెచ్చి ఇప్పుడే
సుగ్రీవుడి మెడలో వేయి”. అని రామచంద్రమూర్తి చెప్పగానే లక్ష్మణుడు దాన్ని తెచ్చి
సుగ్రీవుడి మెడలో వేశాడు. అప్పుడు సుగ్రీవుడు గొప్ప నక్షత్రాలతో కూడిన
సూర్యుడిలాగా విపరీతంగా వెలిగాడు. రాముడి మాటలకు ధైర్యం తెచ్చుకుని ఆయనతో కలిసి
కిష్కింధకు పోయాడు సుగ్రీవుడు.
No comments:
Post a Comment