Sunday, February 23, 2020

క్లుప్తసుందరం జ్వాలా ఆంధ్రవాల్మీకి రామాయణ మందర మకరందం : చిలకపాటి విజయ రాఘవాచార్యులు


క్లుప్తసుందరం జ్వాలా ఆంధ్రవాల్మీకి రామాయణ మందర మకరందం
చిలకపాటి విజయ రాఘవాచార్యులు
సూర్య దినపత్రిక (24-02-2020)
‘శ్రీరామాయణం’ ‘ఆదికవి’ వాల్మీకి మహర్షి ప్రణీతము. సంస్కృత భాషలో ప్రథమ రచన. ఇది ‘ఆంధ్రవాల్మీకి’ రామాయణం. తొలిసారిగా తెలుగు భాషలో వాల్మీకి రామాయణానికి యధాతథంగా శ్రీ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) పద్య గద్యములతో రచించిన సత్య, ధర్మ, జ్ఞానపీఠము. వాసుదాస స్వామి వాల్మీకి రామాయణానికి పద్యకావ్యముగా, మూల విధేయముగా వ్రాసి, ఆయనే ‘మందరము’ అను పేరుతో ప్రతి పదార్థ, విశేషార్థ తాత్పర్యములతో చక్కని తెలుగు భాషలో రచించడం జరిగినది. ఇప్పటికి వంద సంవత్సరాలు దాటింది.  భారత జాతికే ప్రతిష్టాత్మకమైన  ‘భారతరత్న’, ‘జ్ఞానపీఠ’ పురస్కారాలకు సర్వథా పాత్రమైన ఈ రచన ‘మందరము’ గా సుప్రసిద్ధం. లక్షలమంది తెలుగువారు మందరాన్ని పఠించి ధన్యులైనారు, ఇంకా అవుతూనే వున్నారు. శ్రీరామాయణ క్షీరసాగరాన్ని ‘మందరం’ మధించింది. ఆ దివ్య పీయూషాన్ని స్వర్ణ కలశంలో భద్రపరచి మనకందరికీ ఆప్యాయంగా అందించింది.

అయితే కాలాంతరంలో వస్తోన్న మార్పుల వలన ఆనాటి భాష, భావం, శైలి, స్వరూపం, తాత్పర్యం ఈనాటి తరానికి కించిత్తు క్లిష్టమన్పిస్తూండడంతో, ‘ఆంధ్రవాల్మీకి’  మన వనం జ్వాలా నరసింహరావు గారిలో ‘పరకాయ ప్రవేశం’ చేశారు.  శ్రీరామాయణ   పారాయణ పరాయణులైన స్వర్గీయ వనం శ్రీనివాసరావు పుత్రరత్నమే జ్వాలా నరసింహరావు.  కొంచెం ఆలశ్యంగానైనా, జీవనయానంలో ‘వాల్మీకం’ జ్వాలా నరసింహారావును ఆవహించింది.   ఇప్పటి ఈ వాసుదాసస్వామి వారి ‘మందరా’నికి మకరందంగా, మధురాతి మధురమైన చక్కని తెలుగు నుడికారంతో షట్కాండయుక్తంగా వారిని వాల్మీకి రామయాణాన్ని రుచి చూపించే ‘వాచవి’ గా, మందరానికి  ‘అనువక్త’ గా మలచి, శ్లోక సముచ్ఛయాల జోలికి పోకుండా, మజ్గళప్రదమైన మధురధారగా నడిపించింది.  ఇది ‘శ్రీరామప్రభావ’ మహిమ! 

‘జ్వాలా’ గారు నాకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి సంస్థలో (Dr MCR HRDI AP), సహవ్రతులే గాక సహవాసులు కూడా!  నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు అవిశ్రాంత వక్త. వ్యాసకర్త. ‘గోష్టీప్రియ’ కర్త.  ఒకవిధంగా, నిత్యసంధ్యానుష్టానాల క్రమశిక్షణ అటుంచితే, బహుముఖీనమైన కార్యక్రమాల వ్యగ్రత వారిది.  అలాంటి వారిచేత శ్రీసీతారామచంద్రులు 16 సంవత్సరాల కృషిగా (2004-19) రామాయణం ఆరుకాండలకూ యథానువాద రూపంలో  ‘ఆంధ్రవాల్మీకి రామాయణా’ నికి అనువక్తవ్యంగా ఆరుగ్రంథాలను మనకు అందిస్తున్నారు.  జ్వాలా జీవితంలో ఇది ఒక సువర్ణాధ్యాయం! తెలిసినవారు ఊహించింది కాదు..మా దివ్య సోదరి, వారి శ్రీమతి విజయలక్ష్మి గారి కాంతాసమ్మిత  సుకృతి!

         భారతీయులకు భగవద్గీత - శ్రీరామాయణం - శ్రీమధ్భాగవతం - శ్రీమద్ భారతం మహా పవిత్రగ్రంథాలు. ఇవి వేదంతో సమానమైన ప్రతిపత్తి కల్గినవి. వ్యాసవాల్మీకాదులు అనుగ్రహించిన అక్షరనిక్షేపాలు.  భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దివ్యజ్యోతులు. మన బ్రతుకు బాటలో వెలుగులు నింపిన దివిటీలు.  ధర్మమార్గదర్శకాలు. శ్రీ రామాయణం ఆదికావ్యం.   భారతం ఇతిహాసం. భాగవతం పురాణం.  ఈ మూడు శ్రీహరి అవతార కథాకథనాలు.  శ్రీరామాయణం శ్రీరామచంద్రుడ్ని, సీతమ్మ తల్లినీ ప్రధానంగా పెట్టుకుని ధర్మసంస్థాపనానికీ, ధర్మరక్షణకూ, సనాతన ధార్మిక సూత్రాలకూ రక్షాబంధనం చేసిన మహాకావ్యం. భారతీయులకు ప్రాణస్పందనం.. శ్రీసీతారామగుణగానం! 

వాల్మీకి విరచితమైన శ్రీరామాయణం - ఆదిలో శతకోటి శ్లోక ప్రవిస్తరం కాగా - 24 వేల శ్లోకాలతో అనుగ్రహించారు.  శ్రీ రామాయణ, భారతాలు సంస్కారశోభితమైన మన వైదిక భారతీయ జాతికి నేత్రద్వయమైతే, భాగవతం మాత్రం హృదయసీమయే! ఈ మూడింటినీ కలిసి శ్రీ వైష్ణవులు 'రహస్యత్రయ సౌరభం’  అంటారు. అందుకే ఇవి "హిరణ్యనిధి". 

‘ఆంధ్రవాల్మీకి’ వాసుదాసస్వామి వారి 'మందరా'నికి జ్వాలా అందించిన రుచులకు (ఆయన ‘వాచవి’ కద) ఆరు కాండలలో విస్తరించిన విశదవివరణమే నిదర్శనం.  మొదట వారు ‘సుందరకాండ’ ను సాంప్రదాయిక మర్యాదనునసరించి జులై నెల 2004 లో వ్యాఖ్యానం చేశారు.  సుందరకాండలో మొత్తం 68 సర్గలుండగా, దేనికదే ప్రత్యేకంగా 68 కథాంశాలుగా వివరిస్తూనే, చివరలో సుందరకాండ పారాయణ క్రమాన్నీ, ప్రాశస్త్యాన్ని వివరించారు. గురుముఖంగా ఉపదేశం పొంది, సుందర కాండ తో శ్రీ రామాయణ పారాయణం ప్రారంభించాలని పెద్దలు అంటారు. జ్వాలా ఆ సంప్రదాయాన్ని అనుసరించారు. సుందరకాండ ‘బాపు’ గారి చక్కని చిత్రాలతో విశేష ఆదరణ పొంది, ప్రస్తుతం నాల్గవ ముద్రణకు సిద్ధమౌతోంది. ఇది జ్వాలా గారి తొలి  శ్రీరామాయణ రచనం.   సుందరకాండకు నేను పుస్తక పరిచయ వాక్యాలను ఆ వేళ విన్నవించాను.

         ఆ తరువాత క్రమంగా బాలకాండ, ఆయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధా కాండ, యుధ్దకాండలకు అనువక్తగా మందరాన్ని అందంగా వాచానువాదనం చేస్తూ వచ్చారు. జూలై 2010లో బాలకాండను మెదట శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ  రామానుజ చిన్న జీయర్ స్వామివారు ‘జీయరు శతాబ్ది శతగ్రంథమాల’లో భాగంగా ముద్రింపించి మజ్గాళాశాసనాలను అనుగ్రహించడం గమనార్హం! గణనార్హం! ఈ బాలకాండ,  సత్సంప్రదాయానికీ, సనాతన ధర్మపథానికి నిలువుటద్ధంగా భాసించే ‘జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ప్రచురణం సర్వజనామోద ప్రమోదం అయింది.   శ్రీ స్వామి వారి మాటలలో ‘తెలుగులో - ఆంగ్లంలో సమాన ప్రతిభ కల్గి ఉండటంతో సవ్యసాచిలా తమ వ్యాఖ్యానాన్ని అతి విలువైన సమాచారంతో నింపిన’ జ్వాలా వారు అభినందనీయులు!  ఆ తరువాత బాలకాండను రెండో మారు కూడా ముద్రించారు.

అయోధ్యాకాండ, యుధ్దకాండలు పెద్దవి. అయోధ్యాకాండ 119 సర్గలతో 4315 శ్లోకాలతో నడిచే కథనం. ఇది నవంబరు 2017లో ఆవిష్కరించబడింది. అప్పటికే జ్వాలా ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యధౌరంధర్యవ్యగ్రతలో వున్నా, శ్రీరామానుగ్రహం వల్ల చక్కగా వాసుదాసస్వామివారిని ‘సరళీకరించి’ లోక వ్యవహార భాషలో ‘మందరించారు’! మహా సహస్రావధాని మాడుగల నాగఫణిశర్మ ‘రామాయణంలోని అన్ని కాండలకు వాచవి వ్రాయుదురు గాక! ’ అని ఆశీర్వదించారు.  నిజానికి వాసుదాస్వామి వారు 110 సంవత్సరాల క్రితం  తమ 70 ఏట రోజుకు 20 గంటలు శ్రమించి ‘మందరాన్ని’ నిర్మించారు.  నేను ముందే మనవి చేసినట్లు వాసుదాసస్వామి వారే జ్వాలా గారిని ఆవహించి పరకాయ ప్రవేశం చేసి వుండకపోతే, జ్వాలా గారి బహుముఖ కార్యక్రమాల చక్రబంధంలో ఈ రామాయణం వ్రాయడం సాధ్యమయ్యేదా?! అయోధ్యకాండ భాషలో, భావంలో, భావప్రకటనంలో ‘కండ’ కలిగిన కలకండ కొండ! ఆద్యంతములూ శ్రీరామ గుణసాగరతరంగములే ప్రతిధ్వనిస్తూంటాయి. వాటికి సంక్షిప్త సుందరవచనానువాద పీయూషం  రసరమ్యకోశం!

ఇక అరణ్యకాండ నవంబర్ 2018లో వెల్వడింది. ఇది అనుష్టానకాండ. అద్భుతమైన ఆర్షధర్మాలనూ,  ధర్మసూక్ష్మాలను నిష్కర్షించిన మహర్షి మహోపదేశమే అరణ్యకాండ.  జ్వాలాగారి అనువచనం అరణ్యకాండలో మరింత సుధాస్వాదమైంది. ప్రముఖ పాత్రికేయులు కావడం వల్ల సామాన్య పాఠకులకు అవగాహనా  సౌలభ్యంగా వుండే విధంగా వారు మందరమకరందాన్ని మరింత మధురాయమానం గావించారు. 

ఇక కిష్కింధాకాండ జూలై 2019లో అచ్చుపడి, ముచ్చటగా బాపు శైలి ముఖచిత్రంతో ఆవిష్కరణ అయింది. ‘మందరం’ తెలుగువారి నిరుపమభాగ్య శ్రీరామారామం! శ్రీరామానుగ్రహ ప్రాప్తికి దివ్యసాధనం.  జ్వాలా రచన కేవలం ‘మందర’ వ్యాఖ్యానానికే పరిమితం కాలేదు. వాసుదాసస్వామి వారు ప్రయోగించిన ఛందోవృత్తాలు, సాహితీపిపాసికి  ‘వసంత కుసుమాకరాలు’, ‘పూర్ణచంద్రోదయాలు’ కాగా, జ్వాలా వీటిని ప్రత్యేకించి చూసి, ఈ వృత్తాలను, వ్యాకరణ గ్రంథులను సైతం అవలోకనం చేసి, విడదీసి వేరొక గ్రంథంగా వ్రాయడం జరిగింది. 

శ్రీరామకథామృతపానం అలా వుంచితే, మందరంలో వాసుదాస స్వామివారు ప్రస్తావించిన అనేక రహస్యాలు, విశేషాలు, శాస్త్రాలు ఒక మహా విజ్ఞాన సర్వస్వంగా భాసిస్తాయి. కిష్కింధాకాండలో అనువక్త క్రొత్తదనాన్ని నింపడం జరిగింది. శాబ్ధికపారమ్యాన్నీ,  శ్రీరామావతార వైభవాన్ని వివరిస్తూనే,  ఇది  ‘జ్ఞానకాండ’ అన్న విషయాన్ని గుర్తు చేసేట్లుగా నవీకృతం చేశారు.   ఇది నిజానికి హనుమకాండ! కిష్కింధాకాండలోనే ప్రథమంగా ‘హనుమ’ దర్శనమిస్తారు శ్రీరామలక్ష్మణ సమేతులై! ఇందులో వర్ణనలు విశేషం.  వర్షఋతువర్ణనం, భౌగోళిక, ప్రాదేశిక వర్ణనం, వాలివధ విషయమై  ‘ధర్మచర్చ’, లౌకిక, ధర్మవివరణం - ఇలాంటి  మహా విషయాలు ఆలోచనామృతాలుగా నడిపిస్తాయి. వీటిని అనువచనం చేయడం క్లిష్టమే అయినా ‘వాగ్విదాంవరుని’ చలవతో జ్వాలాగారు సమర్ధంగా వ్యక్తపరచగలిగారు. వారు 24 పుటలలో "రామాయణంలో ఏముంది ? ఆంధ్రవాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?’’ అన్న పీఠిక ఇందులో ప్రతివారు చదివి తీరవలసిన మంచి విషయం !

ఇక యుద్ధకాండ. చాలా పెద్దకాండ.  ఆరవకాండ.  శ్రీరామపట్టాభిషేకంతో శుభ సమాప్తి.  యుద్ధకాండ 131వ సర్గ శ్రీరామపట్టాభిషేక సర్గ. దానితోనే శ్రీరామాయణ పారాయణానికి మజ్గాళాశాసనం. యుధ్ధకాండ లో కథాంశం కంటే యుద్ధవర్ణనలు ఎక్కువ.   పాఠకులకు క్లిష్టంగా ఉంటుంది.    దీనిని అనువక్త  క్లుప్తంగా సుందరీకరించారు.    ప్రతి సర్గకు తనదైన శైలిలో వ్యాఖ్య వ్రాస్తూనే  పాఠక సౌలభ్యాన్ని దృష్టిలో వుంచుకొని మూలానికి, కథా సూత్రానికి భంగం కలుగనిరీతిలో క్లుప్తసుందరంగా వ్రాయడం జరిగింది. మందరం మొత్తాన్నీ నవలా పఠనంగా నడిపించినందువలన  యుద్ధకాండలో కూడా మూలకథకు విధేయంగానే రచన సాగింది. ఎలాగైతే ఏమి గాని, వాసుదాసస్వామి వారి చలవ జ్వాలాపై  ప్రసరించింది.   వారిచేత తాను పలికిన కథను తాతగారు మనవడికి కథ చెప్పినట్లుగా జ్వాలాగారి చేత పలికించారు వాసుదాస స్వామి. ఇది జ్వాలా గారు చేసుకున్న సుకృతము.  శ్రీరామానుగ్రహఫలము.

అన్ని కాండలను సాంగోపాంగంగా సంక్షిప్తీకరించిన చక్కని తృప్తితో, వీలైతే యధావిధేయంగా చిన్నపిల్లలకు  కథ చెప్పే విధంగా మరింత క్లుప్తసుందరంగా ‘శ్రీరామాయణ మందరా’న్ని వ్రాయాలని జ్వాలా గారికి సూచిస్తున్నాను.   అలాగే తెలుగు - ఆంగ్ల భాషలలో చేయి తిరిగిన రచయిత గనుక ఈ ‘వాచవి’ ని ఆంగ్లీకరించే ప్రయత్నం చేయాలనీ,  దానివల్ల విదేశియులకు సైతం వాసుదాసస్వామి వారిని, వారి మందరాన్నీ అనుసంధానించగలిగే భాగ్యం వారికి లభిస్తుందని నా ఆశంస!
(రచయిత పూర్వ కార్యదర్శి, హిందూ ధర్మ    ప్రచారపరిషత్తు, టిటిడి, తిరుపతి)

(అనువక్త-వాచవిగా వనం జ్వాలా నరసింహారావు రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర కాండ, యుద్ధకాండ ‘మందర మకరందం’ పుస్తకాలను దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాల మూలం ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు-వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరాలు. ఈ పుస్తకాలు ఏవీ అమ్మకానికి లేవు. అన్నీ ఉచితంగా ఇవ్వడానికే వున్నాయి. ఓపిక చేసుకుని రచయితను (80081 37012) ఫోన్లో సంప్రదించి, మరింత ఓపిక చేసుకుని ఆయన ఇంటికి (ఫ్లాట్ నంబర్ 502, వాసవీ భువన అపార్ట్మెంట్స్, కంత్ర్ర్ వోవెన్ దుకాణం పక్క సందు, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్-500073) వస్తే వాటిని తీసుకుపోవచ్చు. చదవండి, చదివించండి....నచ్చితే ప్రోత్సహించండి అని అంటున్నారు రచయిత-సంపాదకుడు, సూర్య)

No comments:

Post a Comment