యుద్ధానికి బయల్దేరిన వాలిని అడ్డగించిన తార
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-20
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (08-03-2020)
సమస్త
జీవరాసులను గడ-గడలాడించే శక్తికల సుగ్రీవుడి సింహనాదం అంతఃపురంలో వున్న వాలి
వినగానే అతడి మదం అణగిపోయింది. విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో రూపం మారిన
అవయవాలతో, సంధ్యాకాలంలో సూర్యకాంతులు
కలిగించే వాలి గ్రహణం పట్టిన సూర్యుడిలాగా హీనుడయ్యాడు. కోపాతిశయంతో మండుతున్న
అగ్నిలాగా వెలుగుతూనే కాంతిహీనుడయ్యాడు. భయంకరమైన సుగ్రీవుడి కంఠధ్వని తన చెవుల్లో
పడగానే, పట-పటా పండ్లు కొరికి,
కాలితొక్కిడితో భూమి బద్దలుకాగా సుగ్రీవుడి మీదకు యుద్ధానికి పోవడానికి
సన్నద్ధమయ్యాడు. ఆ సమయంలో స్నేహంగా కౌగలించుకుంటూ వాలి భార్య తార ఆయనను అడ్డుకుని
ఆయనకు మేలుజరిగే మాటలను తొట్రుపాటుతో ఇలా చెప్పింది.
“రాత్రి
ముడిచిన పూలు ఉదయాన్నే తీసేసినట్లు సెలయేటిలాగా వచ్చిన ఈ కోపాన్ని వదిలిపెట్టు.
సూర్యోదయం కాగానే నువ్వు యుద్ధానికి పోవచ్చు. ఇప్పుడే పోకపోతే నీకు వచ్చే అవమానం
కానీ, నీ విరోదికి కలిగే గౌరవం కానీ
ఏమీ లేదు. ఆలోచించు. ఇప్పుడే పోతే వచ్చే నష్టం ఏంటి? అంటావా? ఇప్పుడు యుద్ధానికి పోకూడదు. దానికి కారణం ఏమిటంటావా? ఇంతకు కొద్దిసేపటి క్రితమే నీ భుజబలం ముందు సతమతమై, బలహీనుడుడై
పరుగెత్తిపోయాడు. ఇంతలోనే మళ్లీ యుద్ధానికి నిన్ను పిలిచే ధైర్యం, సాహసం ఎక్కడినుండి వచ్చింది? కాబట్టి నాకు ఏదో
సందేహం కలుగుతున్నది. అతడు చేస్తున్న సింహనాదం ఇదివరకు చేసినట్లు లేదు. ఇప్పుడు, బలం, చలం, బలమైన యత్నం, చాలా గొప్పగా కనిపిస్తున్నది. ఇలా కావడానికి కారణం ఏదో వుండాలి. కారణం
లేకుండా కార్యం వుంటుందా? ఏదో బలిష్టమైన సహాయం దొరక్కుండా
ఇలా మళ్లీ యుద్ధానికి రాడని నా అభిప్రాయం. బలిష్ట సహాయం దొరక్కపోతే అలాంటి
సింహనాదం చేయదు. తెలివి, నేర్పు సుగ్రీవుడికి పుట్టుకతోనే
వచ్చింది. బాగా ఆలోచించి, పరీక్షించి,
నిస్సందేహంగా బలిష్టుడని అనుకున్నవాడితో వస్తాడు కానీ,
అల్పులతో రాడు”.
“ప్రాణేశ్వరా!
ఇది నా ఊహమాత్రమే కాదు. వాస్తవంగా జరిగిన విషయమే. ఇంతకుముందే నేనీ వృత్తాంతాన్ని
విన్నాను. మన అంగదుడే నాకీ సంగతి చెప్పాడు. అతడు అరణ్యానికి పోయి మరలి
వచ్చేటప్పుడు మన వేగులవాళ్ళు చెప్పారట. రఘువంశంలో పుట్టిన అయోధ్యాదీశకుమారులు
ఇరువురు, యుద్ధంలో జయించనలవికానివారు, రామలక్ష్మణులు అనేవాళ్లు, నువ్వు పోలేని ఋష్యమూకంలో
నీ తమ్ముడికి సహాయం చేయడానికి వచ్చారట. వాళ్లలో రాముడనేవాడు శత్రువులపాలిటి
కాలాంతకుడు. ప్రళయకాలాగ్నిలాంటివాడు. ఉచితానుచిత విద్యల్లో సమర్థుడు. సుగ్రీవుడికి
రక్షకుడైన వాడు నీకెందుకు కాకూడదని అంటావా? నిన్నెందుకు
శిక్షిస్తాడంటావా? సుగ్రీవుడు ఆయన్ను ఆశ్రయించాడు. నువ్వు
ఆశ్రయించలేదు. కాబట్టి నీకు ఆయన రక్షకుడు కాలేదు. అదే కాకుండా, ఆయన్ను ఆశ్రయించిన సుగ్రీవుడికి నువ్వు విరోధివి. నిన్నెలా రక్షిస్తాడు? సుగ్రీవుడు సాధువు కాదుకదా! అతడు పాపం చేయలేదా?
అంటావేమో? చేసి వుండవచ్చు కాని,
ఎప్పుడైతే అతడు శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాడో, అప్పుడే
సాధువయ్యాడు. నువ్వు పోయి ఆశ్రయిస్తే నిన్నూ రక్షిస్తాడు. సమస్త ధాతువులకు
హిమవత్పర్వతం స్థానమైనట్లు సర్వకల్యాణ గుణాలకు రామచంద్రమూర్తి స్థానం. నేను నీ
దోషాలు ఎత్తి చూపడానికి ఇవన్నీ చెప్పడం లేదు. నా మాట విను. విని నడుచుకుంటే నీకు
మేలు కలుగుతుంది”.
“నువ్వు
వీరులలో శ్రేష్టుడివే. అయినా నీలాంటివారు లోకంలో మరెవ్వరూ లేరనుకోవడం సరైందికాదు.
కాబట్టి రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవడం సరైంది కాదు. అది దోషం....దానివల్ల
మేలు కలగదు. అందుకే, నేను,
నాకు తోచిన ఉపాయం చెప్తా విను. ఆ తరువాత నీకేది మంచిదో అదే చేయి. సుగ్రీవుడికి యౌవరాజ్యం
ఇచ్చేయి. వాడూ మహాబలవంతుడే. అలాంటి వాడితో నీకెందుకు అనవసర విరోధం? నా మనవి విను. రామచంద్రమూర్తితో స్నేహం చేయడం నీకు శ్రేయస్కరం, శుభకరం. అదెలా కుదురుతుంది అని అంటావా? నీ
తమ్ముడిమీద పగ వదలిపెట్టు. నువ్వాపని చేస్తే రామచంద్రమూర్తి నిన్ను ద్వేషించడు.
ప్రాణేశ్వరా! నీకు వాడొక్కడే తమ్ముడు. వాడు తప్ప నిన్ను అన్నా, అని పిలిచేవాడు ఎవరూ లేరు. వాడు కూడా దుర్మార్గుడు కాదు...దుష్టుడు కాదు.
ఉత్తమ గుణాలు కలవాడు. నీదగ్గర వున్న వాళ్ళందరిలో వాడితో సమానమైన వాడిని ఒక్కడినైనా
చూపించు. వాడికి నీమీద వినయవిధేయతలున్నాయే కాని, నిన్ను వాడు
ధిక్కరించేవాడు కాదు కదా?”
“నీ బంధువుల్లో అందరూ ఆడవారి వైపువారే కాని
నీతండ్రి వైపు వాళ్లు ఒక్కరైనా వున్నారా? వాడక్కడ వున్నా, ఇక్కడ వున్నా బందువంటే వాడే కదా? నీ కఠినత్వంవల్ల ప్రయోజనం లేదు. కాబట్టి వాడిని ఆదరించు. వాడు నీకు
తమ్ముడు కాదా? నీకేమైనా శత్రువా? వాడు, నువ్వు ఒక్క గర్భంలో పుట్టారుకదా? వాడు నీకు
బంధువని నానమ్మకం. కాబట్టి అతడిని గౌరవించి దగ్గర వుంచుకో. నేను నీ మేలు
కోరేదానినని నువ్వు నన్ను నిండు మనస్సుతో నమ్మితే, నాకిష్టమైన
పని చేయడం నీకు సమ్మతమైతే, తమ్ముడి విషయంలో ద్రోహం మానుకో.
వాడితో స్నేహం చేయి. ఇది వ్యర్తమైన ఆలోచనకాదు. ఇది మినహా నీకు వేరే మార్గం లేదు.
ప్రాణేశ్వరా! నామాట విను. కోపం వదులుకో. చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను.
ఇది నీకు కీర్తికరం కాదు. మేలు కూడా చేయదు. పరిమాణంలేని విక్రమం, ఇంద్రుడి తేజస్సుకల రామచంద్రమూర్తితో విరోధం వద్దు. శాంతించు”.
తార ఈ విధంగా
ఎంత హితం చెప్పినా వాలి చెవులకు ఎక్కలేదు. కాలం దాపరించినవాడు హితవాక్యాలు వింటాడా?
No comments:
Post a Comment