Sunday, March 15, 2020

ఆంధ్రవాల్మీకి రామాయణం అజరామరం : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్రవాల్మీకి రామాయణం అజరామరం
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ (16-03-2020)
         వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండనుకూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి, కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బరావు (వాసుదాసు). శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగునేల నాలుగుచెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో, ఏడెనిమిది దశాబ్దాల క్రితమే సంతరించుకున్నాయి.

         రామాయణం రసరమ్యం, రామనామం సదాస్మరణీయం. రామాయణాన్ని ఎన్నిసార్లు చదివినా, విన్నా తనివి తీరదు. ఆదర్శ పురుషుడైన రాముడి చరితాన్ని రామాయణ కావ్యంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. శ్రీ రామాయణం క్షీర ధార అయితే, వాసుదాసు శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరాలన్నీ, మందార మకరంద మాధుర్యాలే. వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లంచేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్ట మొదలు తెనిగించి, పదే-పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల తెలుగువారికి అత్యుత్సాహాన్ని కలిగించి, "రామ భక్తి సామ్రాజ్యం" అంటే, తెలుగు మాట్లాడే ప్రాంతాలే సుమా, అనిపించిన నిరుపమ రామ భక్తులు వాసుదాస స్వామివారు.

         ఎనిమిదేళ్ల సాహిత్య శ్రమ  ఫలితంగా, రామాయణాన్ని తొలుత నిర్వచనంగా తెనిగించి, ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేసారు. ఆయన రచించిన నిర్వచన రామాయణం, ఆయన జీవిత కాలంలోనే, నాలుగైదు సార్లు ముద్రించబడింది. ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని భావించిన వాసుదాసు “శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. దాన్ని చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయని, భావితరాలవారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసుదాసుగారు.

తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న 24,000 శ్లోకాలను తన పద్యాలలో కూర్చారు. అవన్నీ సుమారు 14,000 పద్యాలయ్యాయి. ఆయన రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. అవసరమైన చోట ఆంగ్ల వ్యాఖ్యానాన్నీ సమకూర్చారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. ఇక ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస, ఆటవెలది, తేటగీతి, కంద, శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వందకుపైగా వృత్తాలను, సందర్భోచితంగా ప్రయోగించారు. ఆయన చందఃప్రయోగాలు చదవాల్సిందే!  

         వాసుదాసు ఆంధ్రవాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ప్రతికాండ ఒక ధర్మశాస్త్రం, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురాతత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు, వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసంనుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు.


వావిలికొలను సుబ్బరావు కడప జిల్లా, జమ్మలమడుగులో 1863 లో జన్మించి 1939 లో పరమపదించారు. ఎఫ్.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హోదాకెదిగారు. 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేసారు. కళాశాలలో చేరక ముందే, "శ్రీ కుమారాభ్యుదయం" అనే ప్రబంధ గ్రంథాన్ని రచించారు. భార్యా వియోగం కలగడంతో, వాసుదాసు భక్తి, యోగ మార్గం పట్టారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య కాలంలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేసారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసుదాసుగారు, గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన, స్వతంత్ర రచన అనిపించుకుంది.

         బ్రహ్మర్షి వాల్మీకి రచించిన రామాయణం సంస్కృత భాషలో వున్నందువల్ల చాలామందికి దురవగాహమై పోయింది. చాలామంది తెలుగులో అనువదించి నప్పటీకీ అవి కేవలం కథాంశం తెలియ చెప్పడానికే పరిమితమై పోయాయి. తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మ విషయాలను అనువాదకులు వదిలిపెట్టారు. వాసుదాస స్వామి శ్రీరామ భక్త కోటిలో చేరి, దాసోభావంతో పరమ భక్తో-ప్రపత్తో మోక్షోపాయానికి మార్గమని భావించాడు.

         తనను తన్నే పరిచయం చేసుకుంటూ ఆయన అన్న మాటలు అక్షర లక్షలు. “వాల్మీకి సంస్కృత రామాయణం మూలంలోని 24,000 శ్లోకాలకు, శ్లోకానికి ఒకటి చొప్పున, తెలుగులో 24,000 పద్యాలను రాయాలని సంకల్పించుకున్నాను. అనుకొని, శ్రీరామచంద్రుడే శరణ్యం అన్న నిర్ణయానికొచ్చాను. ఒకనాడు పారాయణం ముగిసిన తర్వాత, శ్రీమద్రామాయణం పుస్తకం ముందుంచుకుని, ప్రశ్న వేసుకున్నాను. ఆశ్చర్యకరంగా వచ్చిన సమాధానం "ఉత్తిష్ఠ హరి శార్దూల, లంఘయస్వ మహార్ణవమ్" ("లెమ్మా హరిశార్దూలా, యిమ్మహితార్ణవము దాటుమీ") అన్న శ్లోక రూపంలో సమాధానం లభించింది. ఇక ఆగవద్దనుకుని, 1900వ సంవత్సరంలో, ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు, గ్రంథ రచన ఆరంభించాను.

"ఇంటి ముందరున్న పారిజాతం ఒంటిమిట్ట కోదండ రాముడికే ఈ కృతిని అంకితం చేశాను. సంస్కృతంలో "వాల్మీకి రామాయణం" ఎలాగో, తెలుగులో నా రచన అలానే అనుకుని రచనను కొనసాగించాను. శాలివాహన శకం ౧౮౩౦ (1830) అంటే 1908వ సంవత్సరంలో, శ్రావణ పౌర్ణమి నాడు, భగవదనుగ్రహం వల్ల కావ్యం పూర్తయింది. నాతో రామాయణ రచనను పూర్తి చేయించి, శ్రీ రామచంద్రుడే తన సత్య సంధత్వాన్ని ప్రపంచానికి తెలియపర్చాడు.

సంస్కృతం నుంచి తెలుగుకు భాషాంతరీకరణం చేస్తున్నప్పుడు, మూలంలోని ప్రతి అక్షరానికి అలాంటి మారక్షరం వేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నాకు చేతనైనంతవరకు తత్ సమానమైన అక్షరాలతో పోషిస్తూ తెనిగించాను. ఒక్కోసారి, శ్లోకానికి పద్యం కాకుండా, రెండు-మూడు శ్లోకాల భావాన్ని ఒక్క పద్యంలోనే చొప్పించే ప్రయత్నం కూడా చేశాను. రాసేది లోకోపకారమైన గ్రంథం కాబట్టి సార్వజనీనంగా వుండాలన్నదే నా అభిప్రాయం. ఈ కారణం వల్ల, మూలంలో గూఢంగా వున్న సందర్భాలలో, దాని అర్థాన్ని విడమర్చి కొంచెం పెంచి రాసాను. ఏ కారణం వల్ల వాల్మీకి తన కావ్యాన్ని "నిర్వచనం" గా రాసారో, అదే కారణం వల్ల నేనుకూడా తొలుత దీన్ని నిర్వచనంగానే రచించాను. నేను సర్వజ్ఞుడను కానందున, అల్పజ్ఞుడైనందున, శక్తిహీనుడను కూడా అయినందున, మీరు ఆలోచించి, నా సాహసానికి క్షమించి, మీ పిల్లల మాటలలాగా నా రచనను అనుగ్రహించి నన్ను ధన్యుడిని చేయమని ప్రార్థిస్తున్నాను. నా దోషాలను మన్నింతురుగాకఅని చెప్పుకున్నారు వావిలికొలను సుబ్బారావు.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం రచించడం పూర్తి చేసిన తర్వాత జరిగిన విషయాలను కూడా  వాసుదాసు మాటల్లోనే తెలుసుకుందాం.

గ్రంథ రచన పూర్తవగానే ఒంటిమిట్ట శ్రీకోదండరాముడికి నివేదించి, లోకానికి తెలియచేయడం ఎలాగని ఆలోచన చేశాం. ఒక ఆహ్వాన సభను ఏర్పాటు చేశాం. అందులో మహా-మహా పండితులు అనేకమంది వున్నారు. ఇలాంటి మహనీయుల కలయికతో అలంకరించిన సభ ఎలాంటి కార్యాన్నైనా చేయగలదు కదా ! ఆహ్వానాలందుకుని వచ్చిన వారిలో చాలామంది గొప్ప కవులు, విద్వాంసులు, అధికారులు, పూజ్యులున్నారు. కార్యక్రమం మూడు రోజులూ, ఉదయం, శ్రీ సీతారామచంద్రులకు సహస్రనామార్చన యథావిధిగా జరుపబడింది”.

“మొదటిరోజు ఉదయాన సంస్కృత వాల్మీకి రామాయణం, ఆంధ్ర వాల్మీకి రామాయణం పుస్తకాలను శ్రీస్వామివారి పల్లకిలో వుంచి, ఆ పల్లకిని, మంగళ వాద్యాలతో దేవాలయ గ్రామ ప్రదక్షిణగా వూరేగించారు. గ్రంథానికి పూజ చేసిన తర్వాత ముందున్న కొంత భాగాన్ని కవి చదివారు. ఒక్కరే మూడు దినాల్లో పూర్తి గ్రంథాన్ని చదవడం కష్టమని భావించి, మరికొందరు తోడ్పడి పుస్తక పఠన పూర్తి చేశారు. మూడు రోజులు కూడా దేవాలయ ముఖ మంటపంలో సభలు జరిగాయి.  తర్వాత గ్రంథ పరీక్ష జరిగింది. పండితులందరూ వారి వారి సంతుష్టిని పద్యంగానో-ఉపన్యాసంగానో వెల్లడిచేసి, కృతిని ప్రశంసించి కవిని ఆశీర్వదించారు. శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం, కృతి భర్తైన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారికి సమర్పించబడింది. అలనాటి పత్రికల్లో ఈ కార్యక్రమాన్ని గురించి విశేషంగా వార్తలొచ్చాయి. ప్రశసింస్తూ ప్రసంగం చేసిన వారు-పద్యాలను చదివిన వారు, నన్ను బమ్మెర పోతనతో పోల్చారు అని రాసుకున్నారు వావిలికొలను సుబ్బరావు.

ఆంధ్ర వాల్మీకిరామాయణం తర్వాత రచించబడిన పలు గద్య-పద్య రామాయణాలకు విశేష ప్రాచుర్యం లభించినా, ఆ రోజుల్లోనూ, ఈ రోజుల్లోనూ, వాసుదాసు రామాయణానికి ప్రాచుర్యం లభించినా తగినంత గుర్తింపు ఎందుకు లభించలేదనేది జవాబు దొరకని ప్రశ్న. వ్యాస మహాభారతాన్ని మొదట తెనిగించిన నన్నయను "ఆదికవి" గా పిలిచినప్పుడు, వాల్మీకి రామాయణాన్ని మొట్టమొదట తెనిగించిన వాసుదాసు కూడా "ఆదికవే" కదా? నన్నయంతటి గొప్పవాడే కదా. వాస్తవానికి సరైన పోషకుడో, ప్రాయోజకుడో వుండి వుంటే, వాసుదాసు ఆంధ్రవాల్మీకిరామాయణం, ఎప్పుడో, ఏనాడో నొబెల్ సాహిత్య బహుమతికో, జ్ఞానపీఠ పురస్కారానికో నోచుకుని వుండేది.

వాసుదాసు ఆంధ్ర వాల్మీకిగా లబ్దప్రతిష్టులయ్యారు. కాలం గడిచిపోతున్నది. వాసుదాసు మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్ఠమైపోతున్నది. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి.

(వాసు దాసుగారి మందరాలన్నీ, "మందర మకరందాలు" గా, ఆయనే వక్తగా, నేను కేవలం అను వక్త-వాచవిగా, సరళమైన వాడుక భాషలో-సాధ్యమైనంత లఘు కృతిలో అందించుదామని తొలి ప్రయత్నంగా "సుందర కాండ మందర మకరందం" రాశాను. 16 సంవత్సరాల క్రితం మొదలు పెట్టి, వరుసగా, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, ఇటీవలే యుద్ధకాండ మందర మకరందం పుస్తకాలు రాయడం, ప్రచురించడం పూర్తి చేసాను. ఈ పుస్తకాలన్నీ ఉచితంగా ఇవ్వడానికే వున్నాయి. ఓపిక చేసుకుని రచయితను {80081 37012} ఫోన్లో సంప్రదించి, మరింత ఓపిక చేసుకుని ఆయన ఇంటికి {ఫ్లాట్ నంబర్ 502, వాసవీ భువన అపార్ట్మెంట్స్, కంట్రీ ఓవెన్ పక్క సందు, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్-500073} వస్తే వాటిని తీసుకుపోవచ్చు).

No comments:

Post a Comment