Saturday, March 21, 2020

శ్రీరాముడిని దూషించిన వాలి ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-22 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-22
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (22-03-2020)       
         గొడ్డలి మొనతో నరకబడ్డ చెట్టులాగా రాముడి బాణం దెబ్బకు నేలమీద చాప పరిచినట్లు వాలి పడిపోయినప్పుడు, భూమి తేజం, చంద్రుడు లేని ఆకాశంలాగా అయిపోయింది. ఆ వీరుడు నేలమీద పడ్డప్పటికీ, ఆయన తేజం కాని, పరాక్రమం కానీ, ప్రాణాలు కానీ విడువలేదు. ఇంద్రుడు ఇచ్చిన మణులు చెక్కిన బంగారు సరం వాలి తేజస్సు, ప్రాణాలు, పరాక్రమం, కాంతి పోకుండా కాపాడాయి. శ్రేష్టమైన బంగారు మాలిక శరీరం మీద వెలుగుతుంటే పరాక్రమవంతుడైన వాలి, సాయంకాల సమయంలో ఎర్రటి కాంతితో ప్రకాశించే మేఘంలాగా కనిపించాడు. బంగారు సరంతో, ప్రాణాలు తీస్తున్న బాణంతో, నిర్మలమైన శరీరంతో వాలి మూడురంగుల ప్రకాశించాడు. శత్రువులను సంహరించే శక్తికల వాలికి, స్వర్గానికి పంపే శక్తికల రామబాణం ఉత్తమ గతిని (ముక్తిని) కలిగించింది.

         జ్వాలలు ఉడిగిన అగ్నిలాగా, ప్రళయకాలంలో నేలపడిన సూర్యుడిలాగా, పుణ్యం క్షీణించడం వల్ల భూమ్మీద పడ్డ యయాతిలాగా, ఇంద్రుడిని అలక్ష్యం చేసేవాడిని, సింహం రొమ్ములాంటి రొమ్ముకలవాడిని, మండుతున్న ముఖం కలవాడిని, దీర్ఘమైన చేతులు కలవాడిని, తాను నేలపడేసినవాడిని, బలశాలిని మెచ్చుకుంటూ, వాడెలాంటివాడో చూడాలనుకుని వాలిని లక్ష్మడితో కలిసి సమీపించాడు శ్రీరాముడు. ఇలా తనను సమీపించిన రామచంద్రుడిని, లక్ష్మణుడిని చూసిన వాలి ధర్మంతో కూడిన, వినయంతో కూడిన, కఠినమైన మాటలతో ఇలా అన్నాడు.

         “రామా! నువ్వు రాజకుమారుడివి. శాస్త్రజ్ఞానం చక్కగా తెలిసనవాడివి. స్థిరమైన శోభకలవాడివి. గొప్పవంశంలో పుట్టావు. మంచి తేజస్సు కలవాడివి. కీర్తికి నువ్వు నెలవైనవాడివి. ఇలాంటివాడివై వుండి కూడా యుద్ధభూమిలో నేను ఇతరులతో యుద్ధం చేస్తున్న సమయంలో, నా మనస్సు, దృష్టి దానిమీద వున్నప్పుడు, చాటున వుండి నా రొమ్ముమీద కొట్టడంలో ఏం గొప్ప వుందో చెప్పు. రామచంద్రా! రాముడు కరుణాజ్ఞానం కలవాడనీ, ప్రజల మేలు కోరేవాడనీ, దయాలక్ష్మికి స్థానమైనవాడనీ, ఉచితానుచితజ్ఞానం కలవాడనీ లోకులు నిన్ను పొగడుతుంటారు. తార నన్ను యుద్ధానికి పోవద్దని, సుగ్రీవుడికి సహాయంగా రాముడు వచ్చాడనీ, ఆయన నన్ను చంపుతాడనీ చెప్పినా వినకుండా వచ్చాను. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, ఓర్పు, ధర్మం, ధైర్యం, సత్యం, పరాక్రమం, అపరాధులను మాత్రమే దండించడమనే రాజులకుండే ఉచితమైన సద్గుణం....ఇవన్నీ రాముడిలో లేకపోతాయా, నన్నేల నిరపరాధిని చంపుతాడని వచ్చాను. నీ చేతుల్లో చచ్చాను.ఇప్పుడు నేను చెప్పిన రాజగుణాల్లో ఒక్కటికూడా నీలో లేదు. నువ్వేం రాజువి? సుగ్రీవుడు చెప్పాడని తొందరపడి, కోపగించి, గుణదోషాల విచారణ చేయకుండా, ఇతరులతో యుద్ధం చేసేవాడిని ఎలా చంపాలి? అన్న ఆలోచన చేయక, ధర్మచింతన చేయక, ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేక, సత్యాసత్యాలు తెలుసుకోకుండా, పిరికివాడిలాగా దూరంగా మాటువేసి, నీకే అపకారం చేయని నన్ను దండించావు కదా? నువ్వు మోసగాడివి అని తార తెలుసుకుంది కాని నేను తెలుసుకోలేక పోయాను”.


         “రాముడు గొప్పవంశంలో పుట్టాడు కాబట్టి గొప్ప గుణాలు కలవాడై వుంటాడనీ, కళ్యాణ గుణాల మనోహరుడు కాబట్టి హేయ కార్యాలు ఎందుకు చేస్తాడనీ, నేను ఇతరులతో యుద్ధం చేస్తున్నప్పుడు నామీదకు ఎలా వస్తాడనీ, నన్నెందుకు చంపుతాడనీ, ఇలాంటి అకార్యం ఎందుకు చేస్తాడనీ భావించి, నీ ముఖం ఎన్నడూ చూడని కారణాన మోసపోయి ఈ విధంగా యుద్ధానికి వచ్చి నీచేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాను. రాజవేషం ధరించిన పాపపు నడవడికలవాడివి నువ్వు. మాయలమారివి. ఈ వాస్తవం తెలుసుకోలేక బుద్ధిహీనతవల్ల ఇలా అయిపోయాను. నేనెప్పుడూ నీ ముఖం చూడలేదు. నగరంలో కానీ, పొలిమేరల విషయంలో కానీ నీకు అపకారం చేయలేదెప్పుడూ. కాబట్టి నీకు నామీద కలహకారణం లేదు. అడవుల్లో వుండి మా ఇష్టప్రకారం ఏదో ఆ వేళకు దొరికిన కాయకూరలు తింటూ బతికే కోతులం. కాబట్టి నీకూటికి అడ్డం రాలేదు. ఇలాంటి నన్ను యుద్ధం చేస్తున్న సమయంలో చంపడానికి కారణం ఏంటి? రాజుల వంశంలో పుట్టి వేదాలను అధ్యయనం చేశావే? తేజస్సులో అతిశయించావు కదా? నిస్సందేహమైన జ్ఞానం కలవాడివే? అలాంటి వాడివి ఎందుకీ విధంగా ధర్మాత్ములు ధరించాల్సిన వేషాలు వేసుకుని లోకులకు కీడైన క్రూర కార్యం చేయతలపెట్టావు? నువ్వు పుట్టిందా రాజవంశంలో. ధర్మాత్ముడనే కీర్తి సంపాదించావు. ఇలాంటి క్రూర కార్యం చేసే నువ్వు పెద్దమనిషిలా ఎలా ప్రవర్తిస్తావు? బుద్ధిమంతుల్లో శ్రేష్టులైన వారు సామం, దానం, శౌర్యం, సత్యం, క్షమ, ధర్మం, ధృతి, అపరాధులను దండించడం లాంటివి రాజగుణాలని చెప్పారు”.

         “మేం అడవుల్లో తిరిగేవాళ్ళం. మీరు నగరాల్లో తిరిగేవారు. మేం పండ్లు, కందమూలాలు తిని జీవించే మృగాలం. మీరు ఇష్ట మృష్టాన్నాలు తింటారు.  నేనేమో మృగాన్ని. నువ్వో మనుష్యుడివి....నేను నీ సేవకుడిని. నువ్వు రాజైనా బుద్ధిలేనివాడివయ్యావు. చూశావా? భూమికానీ, బంగారంకానీ, వెండికానీ, కలహకారణాలు కదా? నేను తినే కందమూలాలమీద నువ్వు ఆశపడి, నేను తింటే నీకు లేకుండా పోతుందన్న భయంతో నన్ను చంపావా? నయం, అనుగ్రహం సజ్జనులైన రాజుల్లో వుంటుంది. దుర్వినయం, నిగ్రహం, దుష్టరాజుల గుణాలు. సాధారణంగా కలవని ఈ రెండూ నీలో మిశ్రమంగా వున్నాయి. రాజులైనవారు ధర్మవశులై నడచుకోవాలికాని మేమే ప్రభువులం, మేమెలా చేసినా కాదనేవారెవరు? అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నువ్వేమో ఇంద్రియాల వల్ల కలతచెంది, కామమే సర్వకాల-సర్వావస్తలలో ముఖ్యమని భావిస్తూ, అది నెరవేరకపోతే కోప్పడుతూ, చెడు-మంచిరాజుల మిశ్రమ నడవడికలవాడివై ప్రవర్తిస్తున్నావు. దానివల్ల నువ్వు మంచివాడివో, చెడ్డవాడివో మాలాంటి వాళ్లకు అర్థం కావడం లేదు. నిన్ను శిష్టుడవని నమ్మలేం, దుష్టుడవని అనలేం. విల్లే ప్రధాన సాధనంగా తలచి, కలహానికి కాలుదువ్వుతూ, బలవంతుడినన్న గర్వంతో, ధర్మం విడిచి మర్యాద వదిలావు”.

No comments:

Post a Comment