తారకు సమాధానం చెప్పి యుద్ధానికి పోయిన వాలి
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-21
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (15-03-2020)
తన ప్రియమైన
భార్య, నీతి విద్యలో పండితురాలు, బుద్ధిసంపదకల తార ఇలా చెప్పడంతో, వాలికి కోపం
వచ్చింది. అలా చెప్పడం తారకు తగదని ఆమెతో ఇలా అన్నాడు. “చంద్రముఖీ! ఈ విధంగా
మాట్లాడడం నీకు న్యాయమా? వాడు నాకు తమ్ముడా? తమ్ముడే అయితే మితిమీరిన గర్వంతో చెలరేగి,
సింహనాదాలు చేసి, పరాక్రమవంతుడనని భావించి నన్ను యుద్ధానికి
పిలుస్తాడా? ఇలాంటివాడిని ఎలా క్షమిస్తాను? శూరులకు ప్రాణాలు తీపి అని అనుకుంటున్నావా? తరుణీ!
పరాజయం అంటే ఏమిటో తెలియనివారికి, యుద్ధంలో వెనుకడుగు వేయని, తిరస్కరించబడని వారికి, విరోధులు చేసే అవమానం కంటే
చావడమే మేలు. నామీదికి యుద్ధానికి వచ్చినవాడు శూరుడా?
సింహనాదాలు చేస్తాడా? నేనేమో బలహీనుడినా? వాడి రంకెలు విని సహించేటంత ఖర్మ నాకెందుకు? ఇక
రామచంద్రమూర్తి నన్ను చంపుతాడని కదా నువ్వు భయపడ్తున్నావు?
నువ్వు భయపడాల్సిన కారణం లేదు”.
“ఆయన నాకపకారం చేయడు. ఎందుకంటే, ఆయన ధర్మం అంటే విశేష ప్రీతికలవాడు.
మేలెరిగినవాడు. ఇలాంటివాడు నిష్కారణంగా నన్నెందుకు చంపుతాడు?
నువ్వు ఇతర స్త్రీలతో అంతఃపురానికి వెళ్లు. నామీద నీకున్న భక్తివల్ల ఇంత చెప్పావని
నాకు తెలుసు. యుద్ధానికి పోయి శత్రువును కొట్టి, నీ మరది
భుజబల గర్వం అణచి వస్తాను. వాడిని చంపను. నామాట నమ్ము. వాడికి బలం లేదు...గొంతు
లేదు...అలాంటివాడి సింహనాదాన్ని సహిస్తానా? నా ప్రాణం మీద
ఒట్టు పెడుతున్నాను. నా విజయం కాంక్షించి వెళ్లిపో”.
అని వాలి చెప్పగానే తార ప్రదక్షిణ చేసి, వాలిని కౌగలించుకుని,
మంగళాశాసనాలు చెప్పి స్త్రీలతో సహా సన్నటి గొంతుతో ఏడ్చుకుంటూ అంతఃపురానికి
పోయింది. ఇలా తార ఇంటికి వెళ్లిపోగానే వాలి అసమాన కోపంతో ఉరు విడిచి పోయాడు.
వాలిసుగ్రీవుల ద్వితీయ యుద్ధం
అధిక రోషంతో
విరోధిని చూడాలన్న కోరికతో వున్న వాలికి సుగ్రీవుడిని చూడగానే ఉత్సాహం కలిగింది.
వెంటనే, కట్టువస్త్రాన్ని చక్కగా
బిగించి, కడుకోపంతో, సుగ్రీవుడికి
ఎదురుగా పోయాడు. అలా వస్తున్న వాలిని బంగారుమాలిక ధరించిన
సుగ్రీవుడు-సూర్యపుత్రుడు చూసి, అదురు-బెదురూ లేకుండా
ముందుకు పోయాడు. తనకెదురుగా వస్తున్న తమ్ముడిని చూసి వాలి, కోపంతో
తన ముష్టిని చూపిస్తూ, అది అతడిని వజ్రంలాగా
భేదిస్తుందన్నాడు. పరుగెత్తి పోవద్దని అన్న వాలికి సమాధానంగా తన ముష్టిని చూపాడు
సుగ్రీవుడు. వాలి తలను చింతకాయలాగా చేస్తానంటాడు. ఆ ఆమాటలకు కోపించిన వాలి, సుగ్రీవుడిని సమీపించి గట్టి పిడికిలితో కొట్టాడు. ఆ దెబ్బకు ప్రతిగా, తన శరీరం నుండి నెత్తురుకారుతున్నప్పటికీ, ఒక
చెట్టు పీకి గిరగిరా తిప్పి వాలిని కొట్టాడు సుగ్రీవుడు. ఆ దెబ్బకు
బలవంతుడైనప్పటికీ వాలి గడగడ వణికాడు. కలవరపాటు చెందాడు కాసేపు. వాలిసుగ్రీవులిలా
ఒకరినొకరు జయించగలవారిలాగా, భయపడకుండా,
వెనుదీయకుండా, ఆకాశాన సూర్యచంద్రుల్లాగా భూమ్మీద యుద్ధరంగంలో
ప్రకాశించారు.
వాలి శౌర్యం
క్రమంగా పెరగసాగింది. సుగ్రీవుడి బలం క్రమంగా తగ్గసాగింది. అయినా సుగ్రీవుడు
యుద్ధం చేస్తూనే వున్నాడు. ఒకరినొకరు ముష్టిఘాతాలతో, చేతులతో, చెట్లతో, కాళ్లతో,
గోళ్లతో, దీరుల్లాగా తమ ఇష్టం వచ్చినరీతిలో
యుద్ధం చేశారు. ఒకరినొకరు సమీపించి చెట్లతో కొట్టుకుంటూ,
ఒకరినొకరు నేలమీద పడేసుకుంటూ, పిడికిలి గుద్దులతో
నొప్పించుకుంటూ, వీర్యంగా తాకుతూ యుద్ధం చేశారు. సుగ్రీవుడి
బలం క్రమక్రమంగా క్షీణించింది. వాలితో దెబ్బలు తిని నలుదిక్కులా చూడసాగాడు.
వాలిని నేలకూల్చిన శ్రీరాముడు
తన
స్నేహితుడు, తాను అభయహస్తం ఇచ్చిన వాడు, తననే నమ్మినవాడు, శరణాగతుడు,
సుగ్రీవుడు తన కళ్ళ ముందరే శత్రువు చేతిలో ప్రాణాంతక బాధ పడడం చూసిన శత్రుసంహరణ
దక్షుడైన శ్రీరాముడు, వాలిని చంపగల భయంకర బాణాన్ని తీసి
అల్లెతాటిలో చాలా వేగంగా కూర్చాడు. ఆ అల్లెతాటి శబ్దానికి ఆకాశంలో తిరిగే పక్షులు, నేలమీద తిరిగే మృగాలు భయపడి తమ స్థానాల్లో వుండలేకపోయాయి. వజ్రాయుధంలాగా,
వేగంగా, పిడుగులాగా,
రామచంద్రమూర్తి విల్లు నుండి వెలువడిన బాణం వాలి రొమ్మును తాకింది. ఆ బాణం తాకగానే
ఇద్రధ్వజంలాగా బలం క్షీణించి, వాలి నేలకూలాడు.
No comments:
Post a Comment