వాసుదాస విరచిత శ్రీకౌసల్యా పరిణయం
వనం
జ్వాలా నరసింహారావు
దశరథుడి తాత రఘు
మహారాజు. ఆయన కుమారుడు అజుడు. గొప్ప పరాక్రమవంతుడు. అందగాడు. ఆయన యువరాజుగా
వున్నప్పుడు విదర్భ మహారాజు భోజుడు తన సహోదరి ఇందుమతి స్వయంవరాన్ని ప్రకటించాడు.
అజుడు విదర్భ చేరి ఆ స్వయంవరంలో పాల్గొన్నాడు. ఇందుమతి కరగ్రహణం చేశాడా
స్వయంవరంలో. ఆమెతో కలిసి అయోధ్యకు బయల్దేరాడు. ఆ తరువాత తండ్రి ఆజ్ఞానుసారం
పైతృకమైన రాజ్యాన్ని ప్రజాను రంజకంగా పాలించాడు. భార్య ఇందుమతి దశరథుడికి
జన్మనిచ్చింది. ఒకనాడు ఇందుమతితో ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆకాశమార్గాన
పయనిస్తున్న నారదుడి మెడలోని పూలమాల వాయువశాన జారి ఇందుమతి మీద పడింది. వెంటనే ఆమె
మరణించింది. దానికి నారదుడిని అజుడు నిందించగా అది ఆమెకు శాప విమోచనమని నచ్చ
చెప్పాడు నారదుడు. భార్యా వియోగాన్ని భరించలేక దశరథుడికి యౌవరాజ్య పట్టాభిషేకం
చేసి ప్రాణత్యాగం చేశాడు అజుడు.
అజ మహారాజు మరణానంతరం దశరథుడు అయోధ్యాపుర
సింహాసనం అధిష్టించాడు. పెద్దలు అతడి వివాహానికి తొందరపడ సాగారు. ఒకనాడు దశరథుడు వేటకు
పోయి క్రూర మృగాలను సంహరించ సాగాడు. కాసేపటికి గుర్రాలు అలసిపోవడంతో సమీపంలో వున్న
అత్రి మహాముని ఆశ్రమానికి పోయారు. అత్రి మహాముని రాజుకు ఆతిథ్యమిచ్చి ధర్మాలను
బోధించాడు. అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం ఉత్తమమైనదని చెప్తూ,
త్వరగా మంచి కన్యను వివాహమాడమని సూచించాడు. దక్షిణ కోసల రాజ్యాధిపతి కుమార్తె
సౌందర్యవతి అని ఆమెను వివాహం చేసుకొమ్మని చెప్పాడు. అత్రిమహాముని దగ్గర సెలవు
తీసుకుని అయోధ్యకు పోతూ మార్గమధ్యంలో తన కులగురువైన వశిష్టుడి ఆశ్రమానికి
వెళ్లాడు. వశిష్టుడు దశరథుడికి రామనామ మహాత్మ్యాన్ని గురించి చెప్పాడు. అయోధ్యకు
వచ్చిన దశరథుడు నిరంతరం రామనామ ధ్యాన చిత్తుడై వున్నాడు.
దశరథుడికి రాజ్యాన్ని విస్తరించాలన్న
కోరిక కలిగింది. దండయాత్రకు బయల్దేరాడు. దండయాత్ర చక్కగా సాగింది. దక్షిణ కోసల
రాజ్యం సమీపంలో వుండగా ఆ దేశ రాజైన భానుమంతుడి కుమార్తె కౌసల్యను చూడాలని కోరిక
కలిగింది దశరథుడికి. వశిష్టుడిని ధ్యానించగా ఆయన రాగానే తన మనసులోని మాట చెప్పాడు.
ఆ సాయంకాలం దగ్గరలో వున్న ప్రమదావనంలో దాగి వుంటే ఆయన కోరిక తీరుతుందని వశిష్టుడు
చెప్పాడు. వశిష్టుడు చెప్పినట్లే ఆ దేశ రాకుమారి కౌసల్యాదేవి ఆ సాయంకాలం
చెలికత్తెలతో ఉద్యానవనం ప్రవేశించింది. ఆమె చూడ చక్కగా వున్నదని అనుకున్నాడు
దశరథుడు.
ఇక కౌసల్యాదేవి
విషయానికొస్తే......దక్షిణ కోసలదేశ రాజు భానుమంతుడికి, అతడి
భార్య చంద్రభాగకు చాలా కాలం సంతానం కలగలేదు. సంతానం కొరకు వారిరువురు శ్రీహరి
గురించి అరణ్యాలలో తపస్సు చేశారు. శ్రీహరి ప్రత్యక్షమై వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు పుట్టుతారని, వారి కుమార్తెకు తాను
కుమారుడిగా జన్మించుతానని వరం ఇచ్చాడు. శ్రీహరి చెప్పినట్లే ఆ దంపతులకు ఒక
కుమార్తె, ఒక కుమారుడు కలిగారు. కుమార్తెకు కౌసల్య అని, కుమారుడికి భామమంతుడు అని పేర్లు పెట్టారు. కౌసల్యకు తగిన వరుడు దశరథుడు
అని ఒకనాడు వారింటికి వచ్చిన అత్రి మహాముని చెప్పాడు. దశరథుడి గుణగణాలను, పరాక్రమాన్ని గురించి వివరించాడు అత్రి.
ఈ నేపధ్యంలో కౌసల్య ప్రమదావనానికి రావడం, ఒక
పూల పొదల చాటున దాగివున్న దశరథుడిని చూడడం, వారిరిరువురు కొంతసేపు మాట్లాడుకోవడం
జరిగింది. తమతమ వృత్తాంతాలను చెప్పుకొన్నారు. తనను వివాహం చేసుకోవాలంటే తన
తండ్రిని సంప్రదించమని చెప్పి వెళ్లిపోయింది. ఆ తరువాత కొన్నాళ్లకు భానుమంతుడు
కౌసల్యను దశరథుడికిచ్చి వివాహం చేయడానికి ముహూర్తం నిశ్చయించి ఆ విషయాన్ని
తెలియచేయడానికి పురోహితులు వచ్చారని తెలుసుకొని దశరథుడు సంతోషించాడు. ముహూర్తం
కొరకు ఎదురు చూడసాగాడు.
ఇదిలావుండగా రాక్షసరాజు రావణాసురుడు
పెట్టె బాధలు సహించలేక దేవతలు శ్రీహరికి మొరపెట్టుకున్నారు. శ్రీహరి తాను మానవుడిగా, శ్రీరాముడిగా దశరథ మహారాజుకు పుట్టి, సీతాదేని
పెండ్లి చేసుకొని రావణుడిని సంహరిస్తానని, దేవతలంతా వానర రూపాలలో పుట్టి
తనకు సహాయం చేయాలని అన్నాడు. అదెప్పుడు జరుగుతుందని దేవతలు బ్రహ్మను అడిగారు.
కౌసల్యా దశరథుల వివాహం రాబోయే ఫాల్గుణ శుద్ధ దశమి శుక్రవారం నాడు జరుగుతుందని
చెప్పాడు. ఇదంతా విన్న నారదుడు ఆ వృత్తాంతమంతా రావణుడికి చెప్పాడు. ఇది
దేవరహస్యమని, బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తమని కూడా అన్నాడు.
దశరథుడుకి, కౌసల్యకు వివాహం కాకుండా చేస్తానని నారదుడితో
అన్నాడు రావణాసురుడు. ఆ తరువాత భార్య మండోదరి ఎంత వారిస్తున్నా వినకుండా
కౌసల్యాదేవి వుంటున్న నగరానికి వెళ్లి రాత్రివేళ నిద్రిస్తున్న ఆమెను మంచంతో సహా
అపహరించి తెచ్చాడు. ఆ మంచాన్ని ఒక పెట్టెలో పెట్టి సముద్రుడిని పిలిచాడు. మానవులకు,
దానవులకు, దేవతలకు, కింపురుషులకు, యక్షులకు, ఇతరులెవరికీ కనపడకుండా ఆ పెట్టెను దాచి
పెట్టమని, తాను ఆదేశించినప్పుడు భద్రంగా తనకు అప్పగించమని, అలా చేయకపోతే చంపుతానని బెదిరించాడు. సముద్రుడు ఆయన సమక్షంలోనే ఒక తిమింగలాన్ని
పిలిచి హెచ్చరిక చెప్పి ఆ పెట్టెను దానికి అప్పగించాడు.
బంగారు పెట్టెలో వున్న కౌసల్యాదేవికి మెలకువ వచ్చింది. తనను
ఎవరో వంచన చేసి, పెట్టెలో బంధించి తీసుకొని పోతున్నారని తలచింది. వనదేవతలను,
నదులను కాపాడమని ప్రార్థించింది. ఆమెకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై జరిగిన వృత్తాంతం
అంతా చెప్పి ధైర్యం చెప్పింది. తనకు దశరథుడు భర్తగా కావాలని వరం కోరింది కౌసల్య.
అలాగే కాగలదని చెప్పి లక్ష్మి అంతర్థానం అయింది. ఇదిలా వుండగా దశరథుడు పెండ్లికై
పౌరులతో బయలుదేరి సరయూనది దగ్గరికి వచ్చాడు దానిని దాటడానికి. ఇంతలో పెనుగాలి
వచ్చి ఆయన వున్న నావ సరయూ నదిలో మునిగిపోయి ప్రవాహంలో కొట్టుకు పోసాగింది. అలా
పోయి, పోయి సముద్రంలోని ఒక ద్వీపానికి చేరాడు. అక్కడున్న ఒక
దిగుడుబావిలో స్నానం చేసి దొరికిందేదో తిన్నాడు. తన దుస్థితికి చింతిస్తూ
శ్రీహరిని ధ్యానించాడు.
ఆ సమయంలో అక్కడికి ఒక బంగారు పెట్టె కొట్టుకొని వచ్చింది.
అది దశరథుడి కంట బడింది. దగ్గరికి పోయి తెరచి చూడగా దానిలో కౌసల్య కనబడింది.
ఇద్దరూ ఒకరి కష్ట సుఖాలు మరొకరికి చెప్పుకున్నారు. ఇంతలో వారి పెళ్లి ముహూర్తం
దగ్గరపడడంతో ఇంద్రాది దేవతలు అక్కడి వచ్చారు. వారంతా ఇరువురిని పెండ్లికి సిద్ధం
చేశారు. బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తానికి దశరథుడు కౌసల్యాదేవిని వివాహం చేసుకున్నాడు.
బ్రహ్మదేవుడు వారిద్దరినీ ఆశీర్వదించి తిరిగి బంగారు పెట్టెలో వుంచి దేవతలతో సహా
అదృశ్యమైపోయారు. ఇది జరిగిన కాసేపటికి తిమింగలం వచ్చి ఆ పెట్టెను నోట కరచుకొని
తీసుకుపోయింది.
మర్నాటి ఉదయం బ్రహ్మరాత తప్పని చెప్పడానికి రావణుడు
నారదుడితో కలసి సముద్రతీరానికి వచ్చాడు. సముద్రుడిని పిలిచి పెట్టె తెప్పించి
తెరచి చూశాడు. దానిలో నుండి నవదంపతులు కౌసల్యా దశరథులు బయటకొచ్చారు. సముద్రుడి మీద
కోపంతో చంపడానికి పూనుకున్నాడు. ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పాడు సముద్రుడు.
చేసేది లేక రావణుడు కౌసల్యాదేవిని చంపడానికి సిద్ధపడ్డాడు. విభీషణుడు అడ్డుపడి
స్త్రీని చంపడం పాపం అని చెప్పాడు. అప్పుడు రావణుడు ఆ దంపతులను వదిలి లంకలోకి
పోయాడు.
అక్కడినుండి పోయే ఉపాయం చెప్పమని నారదుడిని అడిగారు కౌసల్యా
దశరథులు. నారదుడు అప్పుడు జటాయువును స్మరించగా అతడు ప్రత్యక్షమయ్యాడు. కౌసల్యా
దశరథులు జటాయువును ఎక్కి అయోధ్యాపురం వెలుపల వున్న ఉద్యానవనంలో దిగారు. తన మంత్రైన
సుమంత్రుడిని పిలుచుకు రమ్మని జటాయువుకు చెప్పాడు దశరథుడు. విచారంలో మునిగి వున్న
సుమంత్రుడి దగ్గరికి పోయిన జటాయువు దశరథుడు సతీ సమేతంగా వచ్చిన వార్త,
ఉద్యానవనంలో దిగిన వార్త చెప్పి అక్కడికి పోదాం రమ్మని అన్నాడు. అక్కడికి వెళ్ళిన
సుమంత్రుడు రాజును చూసి ఆనందంతో అతడి పాదాల మీద పడ్డాడు.
ఆ తరువాత నగరానికి పోయి పౌరులందరికీ దశరథుడు సతీ సమేతంగా
వచ్చిన వార్త చెప్పి స్వాగతానికి ఏర్పాట్లు చేశాడు. పౌరుల స్వాగతం మధ్యన దశరథుడు
సతీ సమేతంగా నగరంలోకి ప్రవేశించాడు. కూతురు రాక, వివాహం విషయం
తెలుసుకున్న కౌసల్య తండ్రి భానుమంతుడు అయోధ్యకు వచ్చి కొంతకాలం వుండి
వెళ్ళిపోయాడు. ఆ తరువాత దశరథుడు కొంతకాలానికి సుమిత్రాదేవిని, కైకేయీదేవిని వివాహం చేసుకున్నాడు.