Sunday, August 1, 2021

ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తుకొని పోయిన సైంధవుడు, పాండవుల చేతిలో పరాభవం....ఆస్వాదన-31 : వనం జ్వాలా నరసింహారావు

 ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తుకొని పోయిన సైంధవుడు, 

పాండవుల చేతిలో పరాభవం

ఆస్వాదన-31

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (01-08-2021)

పాండవులు ఐదుగురూ స్వేచ్చగా కామ్యకవనం అడవిలో సంచరిస్తూ, ఒకనాడు, తృణబిందు ఆశ్రమంలో పురోహితుడైన ధౌమ్యుడిని, ద్రౌపదిని వుంచి వేటాడం కోసం నాలుగు దిక్కులకు పోయారు. వారు అలా వెళ్లిన కొంతసేపటికి సింధుదేశపు రాజు, పరాక్రమవంతుడైన సైంధవుడు (జయద్రథుడు) సాల్వరాజు కూతురును వివాహమాడడానికి పోతూ మార్గమధ్యంలో తృణబిందు మహాముని ఆశ్రమాన్ని, అక్కడ ఆశ్రమద్వారం దగ్గర నిలుచుని వున్న ద్రౌపదిని చూశాడు. ఆమె అందాన్ని చూసి సైంధవుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వున్న తన స్నేహితుడైన కోటికాస్యుడనే రాజకుమారుడితో ఆమె ఎవరో కనుక్కోమన్నాడు. ఆమె మీద తన మనసు పోతున్నదని, ఆ మనోహరాంగిని అంగీకరింపచేసి, ఇద్దరికీ సంయోగం కూర్చమని స్నేహితుడిని కోరాడు.

వెంటనే కోటికాస్యుడు ద్రౌపది వున్న చోటుకు వెళ్లి, ఆమె ఎవరని అడిగి, తనెవరో చెప్పి, దూరంగా నిలుచుని వున్నవాడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడని, భాగ్యవంతుడని, సింధు-సౌవీర దేశాలకు అధిపతి అని, పేరు జయద్రథుడని, ఆమె గురించిన వివరాలు అడిగి తెలుసుకొమ్మన్నాడని చెప్పాడు. జవాబుగా ద్రౌపది తన ఉత్తరీయాన్ని సవ్యంగా అమర్చుకొని, తాను అరణ్యంలో, ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నందున అతడిలా తన దగ్గరికి రావడం సమంజసం కాదని, తాను కొడుకులు కలదానినని, ధర్మాన్ని అనుసరిస్తున్నానని, తనను అందరిలాగా సామాన్య స్త్రీగా భావించి మాట్లాడ వద్దని చెప్పింది. తన వివరాలు చెప్తూ, తాను పాంచాల ప్రభువైన ద్రుపదుడి కూతురునని, తనను కృష్ణ అని అంటారని, పాండురాజు కుమారులైన ధర్మార్జున భీమ నకుల సహదేవులకు ధర్మపత్నినని, తనను అరణ్యంలో వుంచి వీరులైన పాండవులు వేటకు వెళ్ళారని, కాసేపట్లో వెనక్కు వస్తారని చెప్పింది.

ఇలా చెప్పి, కోటికాస్యుడిని, జయద్రథుడిని ఆశ్రమం లోపలి వచ్చి అతిథి మర్యాదలు స్వీకరించమని కోరింది. కోటికాస్యుడు వెనక్కు పోయి ఆమె ఎవరో సైంధవుడికి చెప్పాడు. అవేవీ వినిపించుకోకుండా సైంధవుడు ద్రౌపదిని బలాత్కారంగా తీసుకుపోవాలనే ఆలోచనతో కొందరు భృత్యులను వెంటబెట్టుకొని ద్రౌపదిని చేరాడు. ఆమెను సమీపించి కుశల ప్రశ్నలు వేశాడు. అతడి ఆరోగ్యాన్ని గురించి అడిగింది ద్రౌపది. సంప్రదాయ సిద్ధమైన అతిథి మర్యాదలకు తగినవాడివని అంటూ ఉచితాసనాన్ని స్వీకరించమని కోరింది. విందు భోజనం ఆరగించమని అడిగింది. తన భర్తలు వచ్చిన తరువాత ఇంకా మర్యాదలు చేస్తారన్నది.

ఇవన్నీ పక్కనపెట్టి, మారుమాట్లాడకుండా తనతో లేచిరమ్మని అంటాడు సైంధవుడు. ప్రీతితో సమ్మతించి తన రథాన్ని ఎక్కమని అడిగాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల్లో తిరుగుతున్న పాండవులతో ఆమెకు సుఖం లేదన్నాడు. సింధురాజైన తనను ఏలుకొమ్మని చెప్పాడు. ఆ మాటలకు ద్రౌపది హృదయం కంపించింది. దూరంగా జరిగి నిలబడింది. భర్తలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడసాగింది. వారు వచ్చేదాకా సమయం గడపాలనుకున్నది. మాటల్లో పెట్టింది. ధృతరాష్ట్రుడి కూతురు దుస్సల భర్త అయిన సైంధవుడు తనకు సోదర సమానుడని చెప్పింది. తప్పుడు మార్గంలో పోవద్దన్నది. సాధారణ మానవ ధర్మానికి, రాజ ధర్మానికి తేడా వున్నదని, రాజులకు స్వేచ్చ వున్నదని, రాజులకు వావివరుసలతో సంబంధం లేదని అన్నాడు సైంధవుడు. ఇలా లాభంలేదనుకుని సైంధవుడితో కఠినత్వం చూపాలనుకున్నది. వివిధ రకాల నిష్టూరాలు ఆడింది.

ద్రౌపది ఆ క్రమంలో పాండవుల పరాక్రమం గురించి చెప్పింది. పాండవులను లెక్కచేయకుండా తనను అవమానిస్తే చివరకు దుర్భరమైన ఫలితాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించింది. ధర్మరాజును ఎదిరించడం అంటే ఏనుగుతో డీకొనడమే అన్నది. భీమసేనుడి జోలికి పోవద్దన్నది. అర్జునుడికి కోపం తెప్పించవద్దన్నది. నకులసహదేవుల పరాక్రమం సాటిలేనిదని చెప్పింది. సైంధవుడి ఆయువు తీరిందని, అతడికి చావు తప్పదని, అతడు పాతాళ లోకంలో దాగినా మరణం తధ్యమని పాండవులకు కీడు తలపెట్టవద్దని ఘాటుగా చెప్పింది. ఇంత చెప్పినప్పటికీ చలించలేదు సైంధవుడు. పాండవుల సంగతి తనకు బాగా తెలుసని, తనను వారి మాట చెప్పి భయపెట్టవద్దని, తాను పిరికిపందను కానని, వేగంగా తన రథం ఎక్కమని అని అన్నాడు. ద్రౌపది అప్పుడు శ్రీకృష్ణుడి ప్రస్తావన కూడా తెచ్చింది. తనను ఆయన సదా రక్షిస్తాడని చెప్పింది. దురాత్ముడైన సైంధవుడు తనను బలాత్కారంగా తీసుకుపోవడానికి సిద్దమౌతున్నట్లు గ్రహించిన ద్రౌపది తమ పురోహితుడైన ధౌమ్యుడిని పేరెట్టి పిలిచి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టింది. ధౌమ్యుడు ఆ కేక విని వచ్చేలోపులే సైంధవుడు ద్రౌపది కొంగుపట్టి లాగాడు.

ద్రౌపదిని బంధించి పట్టి రథం మీద పెట్టి సైంధవుడు, అనుచరులు తోడురాగా, బయల్దేరాడు. తనకు నమస్కరించిన ద్రౌపదిని చూసి, సైంధవుడిని హెచ్చరించాడు ధౌమ్యుడు. ద్రౌపది పుణ్యాత్మురాలని, పతివ్రతా శిరోమణి అని, ఆమెను విడిచి పెట్టమని, లేకపోతే పాండవులు వచ్చి వాడి ప్రాణం తీస్తారని అన్నాడు.

ఇంతలో పాండవులు వేట పూర్తి చేసుకొని వెనక్కు వస్తుంటే వారికి కొన్ని దుశ్శకునాలు కనిపించాయి. వెంటనే పంచపాండవులు తమ రథాలను వేగంగా తోలి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఆశ్రమంలో ద్రౌపది దాసి బిగ్గరగా ఏడుస్తూ, సైంధవుడు బలాత్కారంగా ద్రౌపదిని రథం మీద తీసుకుపోయిన సంగతి చెప్పింది. పాండవులు దాసిని ఓదార్చారు. వెంటనే యుద్ధానికి సిద్ధమై సైంధవుడిని తరుముకుంటూ సమీపించారు. అతడి సైన్యం వెంట కేకలు వేసుకుంటూ పోతున్న ధౌమ్యుడికి నమస్కరించారు. సైంధవుడి సైన్యం మీద పాండవులు వాలారు. సింహనాదాలు చేశారు. వస్తున్న తన భర్తల వివరాలు, ఒక్కొక్కరి గురించే చెప్పి సైంధవుడికి పిరికి మందు పోసింది ద్రౌపది. తక్షణమే వాళ్ల శరణు కోరమన్నది. ఇదే తుది అవకాశమని కూడా చెప్పింది.

పంచపాండవులు జయించ నలవికాని వారని, వారి బారి నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని, సైంధవుడి సైన్యం పాండవులకు చిక్కి వికలమౌతుందని హెచ్చరించింది ద్రౌపది. ఇంతలో పాండవులు సైంధవుడి సేనలను చుట్టుముట్టి అస్త్రాలను ప్రయోగించారు. జయద్రథుడు కూడా రణరంగంలో నిలబడి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు కాసేపు. ధర్మార్జున భీమ నకుల సహదేవులంతా పోరాడారు. వీరవిహారం చేశారు. యుద్ధభూమి భీభత్సంగా మారింది. సైంధవుడి స్నేహితుడైన కోటికాస్యుడిని భీమసేనుడు సంహరించాడు. అప్పుడు పన్నెండు మంది సౌవీరయువకులు, ఇక్ష్వాకు, శిబి, సైంధవ, త్రిగర్త సేనలు ఆర్జునుడిని ఎదుర్కొన్నాయి. అర్జునుడు తన గాండీవంతో అందరినీ ఓడించాడు.

ఇంతలో సైంధవుడు ద్రౌపదిని రథం మీద నుండి దింపి పారిపోసాగాడు. వెంటనే ధర్మరాజు ద్రౌపదిని తన రథం మీద ఎక్కించాడు. ఇక అక్కడ యుద్ధం ఆపుచేసి, సైంధవుడిని వెంబడిద్దామని భీముడితో అన్నాడు అర్జునుడు. ద్రౌపదిని తీసుకుని ధౌమ్యుడు, నకులసహదేవులతో సహా ఆశ్రమానికి వెళ్లమని ధర్మరాజుకు చెప్పాడు భీముడు. తాను, అర్జునుడు సైంధవుడిని వెంబడించి ముట్టడిస్తామని అన్నాడు. జయద్రథుడు ఎంత దుర్మార్గుడైనా అతడిని సంహరించవద్దని, అతడు ధృతరాష్ట్రుడి కూతురు దుస్సలకు భర్త అని, దుస్సల కోసం అతడి నేరాన్ని క్షమించాలని చెప్పాడు ధర్మరాజు.

భీమార్జునులు వేగంగా పోయి సైంధవుడిని సమీపించారు. అతడి రథం గుర్రాలను కూలదోశారు. సైంధవుడు భీమార్జునలు చూసి ఒక పొదలో దూరాడు భయపడి. దగ్గరికి వచ్చిన భీముడికి లొంగిపోయాడు. భీముడు అతడిని పిడికిలితో పొడిచాడు. రకరకాల దెబ్బలు కొట్టారు. అతడిని చంపవద్దని ధర్మరాజు చెప్పిన మాటల ప్రకారం పరాభవించి వదలాలనుకున్నారు. పదినైన కత్తి అంచున్న బాణంతో భీముడు సైంధవుడి తల పీతోలు లేచిపోయే విధంగా గొరిగి అసహ్యంగా చేశారు. ఇక ముందు తనను ‘పాండవదాసుడు  అని చెప్పుకొని బతకమని అన్నాడు భీముడు సైంధవుడిని. ఆ తరువాత చేతులు విరిచి వెనక్కు కట్టి ధర్మరాజు దగ్గరికి తీసుకు వచ్చారు. అతడిని విడిచి పెట్టమని ధర్మరాజు చెప్పాడు. ద్రౌపది వాడిని చూసి పరిహసించింది. ధర్మారాజు మందలించిన తరువాత పాండవులు సైంధవుడిని విడిచి పెట్టారు.

ఆ తరువాత సైంధవుడు పరమశివుడిని గూర్చి నిష్టగా తపస్సు చేశాడు. అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను యుద్ధంలో ఒక్కనాడు మాత్రమే జయించే విధంగా శివుడు సైంధవుడికి వరం ప్రసాదించాడు. ఆర్జునుడిని తాను కూడా యుద్ధంలో ఎదుర్కోలేనని అతడిని జయించడం సులభం కాదని చెప్పాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment