ధర్మరాజుకు సతీసావిత్రి, సత్యవంతుడి కథ చెప్పిన మార్కండేయుడు
ఆస్వాదన-35
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (29-08-2021)
రామాయణ కథ విన్న
ధర్మరాజు ఎవరైనా పుణ్యసతి చరిత్ర వినాలని వున్నదనగానే మార్కండేయుడు, సావిత్రి గాథ చెప్పాడు. మద్రదేశాన్ని
పరిపాలించే ఆశ్వపతి అనే మహారాజు సంతానం కొరకు 18 సంవత్సరాలు సావిత్రీదేవిని
ఉపాసించాడు. ఆమె ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నది. పుత్ర సంతానం కావాలని రాజు కోరగా
ఆమె కూతురును ప్రసాదించింది. అలా వరం ఇచ్చిన తరువాత కొడుకు కూడా కావాలని ఆశ్వపతి
మళ్లీ ప్రార్థించగా కొన్నాళ్ల తరువాత ఒకానొక సన్నివేశం ప్రాప్తించి ఆయనకు నూర్గురు
సుతులు జన్మిస్తారని చెప్పింది ఆ దేవత. ఆ తరువాత ఆశ్వపతి భార్య మాళవి గర్భం ధరించి
సావిత్రి అనే అత్యంత సౌందర్యవతైన కూతురును కన్నది. ఆమె యవ్వనవతి కాగానే వరుడి
కొరకు వెతకసాగారు తల్లిదండ్రులు.
సావిత్రి సాళ్వదేశ
రాజైన ద్యుమత్సేనుడి కొడుకు సత్యవంతుడిని గురించి విన్నది. అతడిని ప్రేమించింది. కాని
సిగ్గుతో ఎవరికీ చెప్పలేకపోయింది. ఇంతలో ఒకనాడు నారదుడు వచ్చాడు వారింటికి. తండ్రి
దగ్గర కూచున్న సావిత్రిని చూసిన నారదుడు, ఎందుకామెకు ఇంకా తగిన వరుడిని చూడలేదని ప్రశ్నించాడు. జవాబుగా
ఆశ్వపతి కూతురిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆమెకు తగిన వరుడిని ఆమెనే ఎంచుకోమన్నాడు. వెంటనే సిగ్గుపడుతూ తన
మనసులోని అభిప్రాయాన్ని తండ్రికి తెలియచేస్తూ, సాళ్వదేశాధిపతి కొడుకైన సత్యవంతుడు తనకు తగిన
వరుడని, అతడికి తననిచ్చి పెండ్లి జరిపించమని
అన్నది.
అప్పటికే
సాళ్వదేశాధిపతి విధిబలీయం వల్ల అధికారాన్ని కోల్పోవడమే కాకుండా గుడ్డివాడయ్యాడు.
భార్యాపుత్రులతో అడవిలో నివాసం వుంటున్నాడు. అయినప్పటికీ సత్యవంతుడే తనకు భర్త
కావాలని సావిత్రి చెప్పింది. సత్యవంతుడి గుణగణాలను గురించి అడిగాడు ఆశ్వపతి
నారదుడిని. అతడిని అన్నివిధాలా పొగడిన నారదుడు అతడికి ఒక లోపం మాత్రం వున్నదని
చెప్పాడు. పెండ్లి అయిన ఒక సంవత్సరానికి అతడు మరణిస్తాడని అన్నాడు. ఇంకో వరుడిని
అన్వేషించుకొమ్మని సావిత్రికి తండ్రి చెప్పినప్పటికీ, మనోవాక్కాయకర్మలా ఆయన్నే మనసారా వరించానని,
సత్యవంతుడు ఎలాంటివాడైనా అతడినే పెండ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది ఆమె.
అప్పుడు నారదుడు, సావిత్రిని అభినందిస్తూ, ఆమె పుణ్యం వల్ల సత్యవంతుడికి నిండు ఆయుర్దాయం
లభించగలదని అన్నాడు.
ఒకానొక శుభదినాన
ఆశ్వపతి మహారాజు సావిత్రిని వెంటబెట్టుకుని మందీమార్బలంతో, పెండ్లి ఏర్పాట్లతో, అడవిలో వున్న ద్యుమత్సేన మహారాజు దగ్గరికి
వెళ్లాడు. ఉభయకుశలోపరి వచ్చిన విషయం చెప్పాడు ఆశ్వపతి ద్యుమత్సేనుడికి. తన ఏకైక
పుత్రిక సావిత్రిని కోడలుగా స్వీకరించమని ప్రార్థించాడు. తమ పరిస్థితులను, పడుతున్న కష్టాలను ఆశ్వపతికి వివరించాడు
ద్యుమత్సేనుడు. అడవుల్లో కష్టాలు పడుతూ కాపురం చేయగలదా? అని అడిగాడు. చివరకు,
అందరి అంగీకారంతో సత్యవంతుడికి,
సావిత్రికి వివాహం నిశ్చయమైంది. ఆశ్రమవాసులైన ఋషులు నిర్ణయించిన శుభముహూర్తాన
పెండ్లి జరిపించారు. తదనంతరం ఆశ్వపతి తన రాజధానికి వెళ్లిపోయాడు.
సావిత్రి సాధారణ
స్త్రీలాగా అడవిలో భర్తతో,
అత్తమామలతో నివసించసాగింది. నారద మహర్షి చెప్పిన విధంగా తన భర్త ఆయుర్దాయం
లెక్కపెట్టుకుంటూ వుండగా నాలుగురోజులు తక్కువగా ఒక సంవత్సరం గడిచింది. వెంటనే మూడు
రోజుల నిరాహార దీక్ష చేయాల్సిన త్రిరాత్రోపవాస మహావ్రతాన్ని పూనింది. ఎందుకీ వ్రతం
పూనావని మామగారడిగితే శుభాలను కోరి చేస్తున్నానన్నది. వ్రతం పూర్తై నాలుగో రోజు
వచ్చింది. నాలుగవనాడు కూడా సూర్యాస్తమయం అయ్యేదాకా ఉపవాస దీక్ష కొనసాగుతుంది.
ఆనాడు తన భర్త మరణించే రోజని మనస్సులో పరితపించి, కాలకృత్యాలను తీర్చుకుని, అత్తమామలకు నమస్కారం చేసి వారి దీవెనలు
తీసుకుంది.
ఇంతలో సావిత్రి
భర్త సత్యవంతుడు సమిధలు, దర్భలు, పండ్లు తేవడానికి అడవికి బయల్దేరాడు. భర్త
వెంట సావిత్రి కూడా అడవికి పోవడానికి సిద్ధమైంది. అలా సుకుమారైన సావిత్రి భర్త
వెంట అరణ్యానికి వెళ్లింది. అడవిలో సత్యవంతుడు పండ్లను కోసి బుట్ట నింపాడు. ఇంతలో
అతడి శరీరం స్వాధీనం తప్పింది. మనస్సు భ్రమచెందినట్లు తూలసాగింది. తలపోటు
వచ్చింది. సావిత్రి తొడను తలగడగా చేసి సత్యవంతుడు నిద్రపోయి, కాసేపటికి చైతన్యం లేనివాడుగా అయిపోయాడు.
కొంతసేపటికి భయంకరమైన ఒక దివ్యపురుషుడు పాశాయుధాన్ని హస్తాన ధరించి సత్యవంతుడిని
సమీపించాడు. ఎవరాయన అని ప్రశ్నించింది సావిత్రి. తాను యమధర్మరాజునని, సావిత్రి గొప్ప పతివ్రత కాబట్టి తనను
చూడగలిగిందని, సామాన్యులు చూడలేరని,
ఆమె భర్త సత్యవంతుడి ఆయువు తీరిందని, అతడు గొప్ప పుణ్యాత్ముడు కాబట్టి తానే స్వయంగా తీసుకుపోవడానికి
వచ్చానని జవాబిచ్చాడు ఆ దివ్యపురుషుడు.
ఇలా చెప్పిన
యమధర్మరాజు పాశాలను ప్రయోగించి,
సత్యవంతుడి శరీరం నుండి జీవుడిని బంధించి బయటకు లాగాడు. ఆ తరువాత దక్షిణ దిక్కుగా
పోసాగాడు. తన భర్త శరీరాన్ని ఒకచోట భద్రపరిచి సావిత్రి యమధర్మరాజును వెంబడించింది.
తన వెంట రావద్దని వెనక్కు తిరిగి పొమ్మని యమధర్మరాజు సావిత్రికి చెప్పాడు. భర్త
వెంటే భార్య వుండాలి కాబట్టి,
తాను వెనక్కు పోనని చెప్పి,
యమధర్మరాజు వల్ల ఏదైనా మేలు పొందకుండా ఎలా తిరిగిపోతానని అన్నది. ఆమె మాటలకు మెచ్చిన
యమధర్మరాజు, తన భర్త జీవితం తప్ప ఏదైనా వరం కోరుకొమ్మని సావిత్రికి చెప్పాడు.
వరం కోరుకొమ్మని
ఎప్పుడైతే యమధర్మరాజు అన్నాడో,
వెంటనే, తన మామగారైన ద్యుమత్సేనుడి కన్నులు
తిరిగి పొందేట్లుగా కోరింది. ఆమె కోరిన వరాన్ని ప్రసాదించాడు యమధర్మరాజు. అయినా
సావిత్రి ఇంకా వెంబడించసాగింది. యమధర్మరాజును పొగడసాగింది. ఆమె మాటలకు సంతోషించి
ఇంకేదైనా వరం కోరుకోమ్మానాడు సావిత్రిని. ద్యుమత్సేనుడికి శత్రువులు అపహరించిన
రాజ్యాన్ని తిరిగి లభించేలా వరం కోరింది ఈసారి. దాన్ని కూడా అనుగ్రహించాడు
యమధర్మరాజు. ఇక వెళ్లిపొమ్మన్నాడు. అప్పుడు భర్త ప్రాణం తప్ప మరో వరం కూడా కోరుకోమ్మాన్నాడు.
తన తండ్రి ఆశ్వపతికి నూర్గురు కొడుకులు కలిగేట్లు వరం ఇవ్వమని అడగ్గా ఆలాగే
ప్రసాదించాడు. అయినాసరే వెనక్కు పోకుండా యమధర్మరాజును వెంబడించ సాగింది సావిత్రి.
అప్పుడు
యమధర్మరాజు ప్రసన్నుడై సావిత్రిని ఆమె ఇష్టం వచ్చిన వరం కోరుకొమ్మన్నాడు. వెంటనే, తన భర్త సత్యవంతుడు తిరిగి బతికేటట్లుగా
వరాన్ని ప్రసాదించమని కోరింది. సరేనన్న యమధర్మరాజు తక్షణమే సత్యవంతుడిని బంధించిన
పాశాలను తొలగించి, భర్త ప్రాణాలను తీసుకొమ్మని సావిత్రికి చెప్పాడు. ఇక ముందు
నాలుగు వందల సంవత్సరాలు సత్యవంతుడు జీవిస్తాడని కూడా చెప్పాడు. నూరు మంది
కొడుకులను కని, పేరు ప్రతిష్టలను ఆర్జించగలడని అన్నాడు. అలా చెప్పి యమధర్మరాజు
అదృశ్యమయ్యాడు. సావిత్రి వెనక్కు వచ్చి యథాప్రకారం తన భర్త శిరస్సును తన తొడమీద
పెట్టుకుని కూచున్నది. కొంతసేపటికి సత్యవంతుడికి మేలుకొచ్చింది. నిద్రలేచాడు.
ఆ తరువాత
ఆశ్రమానికి బయల్దేరారు ఇద్దరూ. ఇక అక్కడ ద్యుమత్సేనుడికి గుడ్డితనం పోయి దృష్టి
వచ్చింది. కొడుకు సత్యవంతుడి కొరకు ఎదురు చూశాడు. అక్కడి ఆశ్రమవాసులైన ఋషులు
దుఃఖిస్తున్న అతడిని అనునయించారు. ఇంతలో సావిత్రీసమేతుడై సత్యవంతుడు ఆశ్రమాన్ని
చేరాడు. ఆలస్యానికి కారణం వివరించసాగాడు. వెంటనే సావిత్రి కలిగించుకుని
ద్యుమత్సేనుడితో నారద మహర్షి సత్యవంతుడి అకాల మరణం గురించి చెప్పడం దగ్గరి నుండి, సత్యవంతుడితో తాను అడవికి పోయిన కారణం, సత్యవంతుడు అలసిపోయి నిదిరించినప్పుడు
యమధర్మరాజు రావడం, రాజకుమారుడి ప్రాణాలు తీసుకుపోవడం, తాను వెంబడించడం, ఆయన నాలుగు వరాలివ్వడం, సత్యవంతుడు పునర్జీవితుడు కావడం అంతా వివరంగా
చెప్పింది. అత్తమామలు సావిత్రిని అభినందించారు.
కొన్నాళ్ల
తరువాత సాళ్వరాజు గారి మంత్రులు ఇతర ముఖ్యులు వచ్చారు. రాజుగారి శత్రువులంతా
మరణించారని చెప్పి ద్యుమత్సేనుడిని పట్టపు ఏనుగునెక్కి రాజధానికి రమ్మన్నారు. ఆ
క్షణంలోనే ద్యుమత్సేనుడు అక్కడి ఋషులకు వీడ్కోలు పలికి, కొడుకు సత్యవంతుడితో సహా రాజధానికి చేరి
పట్టాభిషిక్తుడయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు.
సావిత్రి కథను
చెప్పిన మార్కండేయుడు పాండవులను వీడ్కొని తన ఆశ్రమానికి వెళ్లాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment