Monday, June 26, 2023

స్వర్ణదాన మహిమను, అపరిగ్రహం అనే మహా పుణ్యాన్ని వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-126 : వనం జ్వాలా నరసింహారావు

 స్వర్ణదాన మహిమను, అపరిగ్రహం అనే మహా పుణ్యాన్ని వివరించిన భీష్ముడు

ఆస్వాదన-126

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-06-2023)

యజ్ఞాలన్నింటిలో మిక్కిలి శ్రేష్టంగా ఇవ్వతగ్గది బంగారమని అంటారని, వేదాలు కూడా సువర్ణ దక్షిణను కొనియాడుతూ వుంటాయని, భూమి, ఆవులు, బంగారం మేలైన దానాలని వేదవ్యాసుడే చెప్పాడని, ఈ నేపధ్యంలో బంగారం గొప్పతనాన్ని, స్వర్ణదాన మహిమాతిశయాన్ని వినాలని వుందని భీష్మ పితామహుడితో అన్నాడు ధర్మరాజు.

భీష్ముడు, తన తండ్రి శంతను మహారాజు చనిపోయినప్పుడు, తాను పితృకార్యం నిర్వహిస్తున్న సమయంలో, పితృదేవతలు స్వర్ణదాన మహిమను గురించి చెప్పగా అతడు బంగారం దానం చేసి ధన్యుడైన అంశం వివరించాడు. భీష్ముడు భూమికి, గోవుకు బదులుగా సువర్ణాన్ని ఇవ్వడాన్ని తన పితృదేవతలు ప్రశంసించిన విషయాన్ని కూడా చెప్పాడు. సువర్ణదానం పితృదేవతలకు కూడా ప్రీతి కలిగించిందంటే దాని మహిమ ఎంతటిదో అర్థం చేసుకోవాలని భీష్ముడు అన్నాడు. సువర్ణం పరమ పవిత్రమైనదని అది ఇచ్చిన వాడికే కాకుండా, తరతరాలుగా వున్న వంశం వారందరికీ కల్మషంలేని బుద్ధినిస్తుందని, ఇది గ్రహించి అన్ని యజ్ఞాలలో సువర్ణదానం చేయమని ధర్మరాజుకు చెప్పాడు భీష్ముడు. 

పరశురాముడి కథను కూడా ఉదాహరించాడు భీష్ముడు ఈ సందర్భంగా. పరశురాముడు 21 సార్లు రాజులను చంపిన తరువాత ప్రాయశ్చిత్తంగా అశ్వమేధయాగం చేశాడని, అయినా తృప్తి కలగలేదని, అప్పుడు వశిష్ఠుడి సూచన-సలహా మేరకు సువర్ణ దానం చేశాడని అన్నాడు. వశిష్ఠుడు పరశురాముడికి చెప్పిన సువర్ణ మహిమను వివరించాడిలా.

‘పార్వతీపరమేశ్వరులు ఒకరికొరకు ఒకరు తపస్సు చేసి ఒకరినొకరుగా పొందారు. లోకమంతా మహానందం పొందగా వారు పరమ సుఖంతో నిండిన హృదయాలు కలవారయ్యారు. కొంతకాలానికి, వారు కలిసి ఉన్నప్పుడు పరమేశ్వరుడి వీర్యం వెలువడింది. అతడు ఆ వీర్యాన్ని తన భావన శక్తి ద్వారా అగ్నియందు నిలిపాడు. ఆ సమయంలో తారకాసురుడనే రాక్షసుడి వల్ల బాధితులైన దేవతలు బ్రహ్మ వద్దకు వచ్చి మొర పెట్టుకోగా, అగ్నిని వేడుకొమ్మని ఆయన వారికి సూచించాడు. వారు అలా పోవడానికి సిద్ధపడ్డారు. అగ్నిదేవుడు వుండే చోటు కానరాలేదు వారికి. అగ్ని పాతాళంలో దాగి వున్న రహస్యాన్ని ఒక కప్పు దేవతలకు తెలిపింది. దానికి కోపించి అగ్ని కప్ప నాలుక కదలకుండా ఉండాలనీ, రుచులు తెలియరాకుండా ఉండాలని శపించాడు. దేవతలు కరుణించి కప్పలు ఎండలకు బొరియలలో ఎండిపోయినా నీరు రాగానే అవి జీవించి బెకబెకలాడుతాయని వరమిచ్చారు’.

‘అగ్ని రావిచెట్టులో దాగి ఉండగా ఒక ఏనుగు సైగ చేసి దేవతలకు ఆ విషయాన్ని చెప్పింది. అగ్ని కోపించి ఏనుగులకు నాలుక తిరుగబడాలని శపించాడు. దేవతలు ఏనుగులకు నాలుకలు తిరగబడినా రుచులు కలిగేటట్లు వరమిచ్చారు. జమ్మి గర్భంలో అగ్ని దాగి ఉండగా ఒక చిలుక ఆ రహస్యాన్ని దేవతలకు తెలిపింది. అగ్ని కోపించి చిలుక నాలుక తిరుగబడేటట్లు శపించాడు. దేవతలు చిలుకకు పలుకులు వచ్చే వరమిచ్చారు. చివరకు అగ్ని దేవతలకు కనిపించి, తారకాసుర వధను గురించిన వారి కోర్కెను తెలిసికొని దానిని తీర్చగలనని మాట ఇచ్చి వారిని పంపాడు’.

‘అగ్ని తనలో ఉన్న శివరేతస్సును గంగలో గర్భరూపంగా వదిలాడు. అది చాలా పెద్దదిగా పెరగటంవలన గంగ భరించలేక మేరుపర్వతం ఒడ్డున ఉన్న రెల్లుతోటలో దానిని నిలిపింది. అది బంగారు వన్నెతో మిలమిలలాడుతూ బాలుడి రూపం తాల్చింది. ఆ బాలుడిని కృత్తికలు ఆరుగురూ తమకు కొడుకుగా భావించి లాలించారు. ఆరుగురు తల్లుల లాలనను అందుకొనడం వల్ల ఆ బాలుడు ఆరు ముఖాలు కలవాడయ్యాడు.  ఆ విధంగా అగ్నిపుత్రుడు గంగాపుత్రుడూ, కృత్తికాపుత్రుడూ అయ్యాడు. బ్రహ్మాదులు అతడిని పూజించి దేవతా సైన్యానికి నాయకుడిని చేశాడు. అతడు తారకాసురుడిని సంహరించి దేవతలకూ, మునులకూ సంతోషాన్ని కలిగించాడు. ఆ కుమారస్వామి బంగారమే స్వరూపంగా కలవాడు కావటం, అతడు శివరూపుడు కావటం, అగ్ని హిరణ్యరేతుడు కావటం, శివుడు వహ్నిరేతుడే కావటంవలన బంగారం జాతరూపమనే పేరుతో ప్రసిద్ధి చెందింది. పరశురాముడు స్వర్ణ మహిమను తెలిసికొని దానిని విపులంగా దానం చేసి కృతార్థుడయ్యాడు’.

ఈ కథ చెప్పిన భీష్ముడు ధర్మరాజును కూడా స్వర్ణదానం చేసి సంసార సముద్రాన్ని దాటమని హితవు పలికాడు. తన తరువాత ప్రశ్నగా ధర్మరాజు, ‘పితృయజ్ఞం ఎట్లా చేయాలో చెప్పమని అడిగాడు. దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు కాబట్టి దేవపూజకంటె పితృదేవతల పూజ శ్రేష్ఠమైనదని,  అమావాస్యనాడు పిండ ప్రదానంతో శ్రద్ధతో చేసిన పితృపూజ నిత్యశ్రాద్ధం చేసిన ఫలితాన్ని ఇస్తుందని, పాడ్యమి మొదలైన తిథులలో కృత్తిక మొదలైన నక్షత్రాలలో శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఆయా విశేష ఫలాలు ఏర్పడుతాయని, కృష్ణపక్షం, అపర్ణాహం శ్రాద్ధానికి తగిన సమయాలని, కృష్ణపక్షంలో పాడ్యమి, దశమి, చరుర్దశి తిథులు మంచివి కావని సమాధానం ఇచ్చాడు భీష్ముడు.

‘శ్రాధ్ధం ఏ వస్తువులతో చేస్తే ఎక్కువ ఫలం వస్తుందని అడిగాడు ధర్మరాజు. నువ్వులు, పాయసం, నేయి శ్రాద్దాలకు మేలైన వస్తువులని, ఆవులనుండి ఏర్పడేది ఏదైనా గొప్ప ఫలాన్ని ఇస్తుందని, చేపలు, మాంసం, అందులోనూ గొర్రె, ఖడ్గమృగం, గండభేరుండం, మేక మాంసాలు శ్రేష్టాలని చెప్పి, శ్రాద్ధానికి సంబంధించిన తిథుల విశేషాలను వివరించాడు భీష్ముడు. కులవయోరూపశీలవిద్యలలో ఉదాత్తులయినవారు ఆరాధనకు యోగ్యులని, జూదరులు మొదలైనవారు పంక్తిదూషకులని, పగవారిని శ్రాద్ధంలో భోక్తలుగా నియోగించరాదని అన్నాడు భీష్ముడు.

‘ఉపవాసవ్రతాన్ని తపస్పని పెద్దలంటారని, నిజానికి అదేనా లేక మరొకటి ఉన్నదా అని, చేవగల తపస్సు పద్ధతిని తెలపమని ధర్మరాజు పితామహుడిని కోరాడు. వస్తులుండటం తపస్సు కానేకాదని, అది ఆత్మను హింసించటమని, దానివలన నరుడు తపస్వి కాజాలడని, సత్యం. బ్రహ్మచర్యం, ఎడతెగని పరిశుభ్రత, నిత్య పవిత్రత, మౌనం, సాటిలేని నిష్ఠ, భూతదయ, శుద్ధత్యాగం అనేవి తపస్సంపద ఆకారాలుగా తత్త్వవేత్త లంటారని భీష్ముడు అన్నాడు ధర్మరాజుతో.  

దాన శీలుడి విశేషమూ, దానం పుచ్చుకొననివాడి ప్రత్యేకతా గురించి చెప్పమని అడిగాడు ధర్మరాజు. ఈ విషయం తెలుసుకోవడానికి సప్తర్షి-వృషాదర్భి సంవాదం అనే పూర్వగాథ వున్నదని దాని సారాంశాన్ని చెప్పాడు భీష్ముడు. ‘సప్తర్షులు (కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, భరద్వాజుడు, జమదగ్ని, వశిష్ఠుడు), అరుంధతి, గండ, పశుసఖు డనే పదిమంది తపస్సు చేసికొంటూ భూమిమీద తిరుగుతూ ఉండేవారు. వారలా తిరుగుతుండగా ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడి తినటానికి పదార్థాలేవీ దొరకక బాధపడ్డారు. కశ్యపుడు మొదలైనవారు ఆకలి పీడించగా అన్నం కొరకు వెతకసాగారు. ఈ నేపధ్యంలో, శిబి కొడుకు యాజ్యుడనేవాడు తన కొడుకైన నీలుడిని ఋత్విక్కులకు యజ్ఞదక్షిణగా ఇచ్చాడు. అతడు కాలంతీరి చనిపోగా, అతడి శవాన్ని తినటానికి సప్తర్షులు సిద్ధమయ్యారు’.

‘అప్పుడు వృషాదర్భి అనే రాజు వారికి అగ్రహారాలతోపాటు ఆహారధాన్యాలను ఇస్తానని పిలిచాడు. వారు రాజునుండి దానం పుచ్చుకొనే ఆచారం తమకు లేదని, రాజు నుండి పుచ్చుకోవడం విషంగాను, కల్లుగాను భావిస్తామని అంటూ అతడి దానాన్ని తిరస్కరించారు. రాజు పంపిన బంగారం నింపిన పండ్లను కూడా తీసుకోవడానికి అంగీకరించలేదు. అతడు కోపించి యజ్ఞంచేసి ‘కృత్య'ని సృష్టించి వారిని చంపటానికి పురికొల్పి పంపాడు. సప్తర్షులకు తోడుగా శునస్సఖుడు అనే సన్యాసి వారితో కలిసి తిరుగ నారంభించాడు. వారొకసారి సరోవరంలోని తామరతూండ్లను తిని బతుకుదామని భావించగా కృత్య వారిని అడ్డుకొని వారించింది. శునస్సఖుడు ఆమెను మంత్రదండంతో భస్మం చేశాడు. ఋషులు తామరతూండ్లను తెంచుకొని కట్టకట్టి ఒడ్డున పెట్టి స్నానాదులు ముగించుకొని వచ్చేసరికి తామరతూండ్ల కట్ట మాయమైపోయింది. ఋషులు ఒకరిపై మరొకరు అనుమానపడ్డారు. అప్పుడా పదిమంది తామరతూండ్లను దొంగిలించలేదని ఘోరప్రతిజ్ఞలు చేశారు. శునస్సఖుడు చివరకు తాను తీశానని ఒప్పుకొని వారి చిత్తవృత్తులను పరీక్షించటానికే అట్లా చేశానని పేర్కొని, తాను ఇంద్రుడనని ప్రకటించుకొని, కృత్యనుండి వారిని కాపాడిన సంగతి చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా లోభగుణానికి లోనుకాని వారి చిత్తవృత్తులకు మెచ్చుకుని వారికి శాశ్వతలోకాలను సిద్ధింపజేశాడు’.

ఈ కథ చెప్పిన భీష్ముడు, ఇదంతా ఇలా జరగడానికి కారణం పుచ్చుకొనకపోవడం అనే గుణం గొప్పతనం వల్లేనని, సాధారణంగా ఒకడు దానాదులను తన పాపాలను పోగొట్టుకోవడానికి చేస్తాడని, అంటే అవి పుచ్చుకొనేవాడికి సంక్రమించే ప్రమాదం వున్నదని, కాబట్టి అపరిగ్రహం మహాపుణ్యమని అన్నాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Saturday, June 24, 2023

అలనాటి బంధాలు అదృశ్యం : వనం జ్వాలా నరసింహారావు

 అలనాటి బంధాలు అదృశ్యం

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం (25-06-2023)

          గ్రామీణ వాతావరణంలో బాల్యం, పెరుగుతున్న వయసులో పాక్షికంగా పట్టణీకరణ జరిగిన జిల్లా కేంద్రం ఖమ్మంలో, యుక్తవయసులో కళాశాల విద్యాభ్యాసానికి రాజధాని నగరం హైదరాబాద్ లో, ఆ తరువాత ఇప్పటిదాకా ఉద్యోగరీత్యా హైదరాబాద్ నగరంలోనే స్థిరపడిన నాకు, 75 సంవత్సరాల వయసులో, ఐదారు దశాబ్దాల క్రితం గడిపిన రోజులు మళ్లీ రావనిపిస్తున్నది. అప్పటి ‘బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు తలచుకుని, వర్తమాన పరిస్థితులతో పోల్చుకుంటే ఎందుకీ మార్పు వచ్చిందనే ఆవేదన అంతరాంతరాలను కలచివేస్తున్నది. ఇదేవిషయాన్ని నా వయసుకు కొంచెం అటో ఇటుగా వున్న కొందరిని కదిలించగా చాలామంది  పైకి చెప్పలేకపోయినా, నా అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించారు. ఎంత లోతుగా విశ్లేషించినా కారణాలు స్పష్టంగా బోధపడడం లేదనేది కఠినమైన వాస్తవం.

              ఆ రోజుల్లో కొన్ని సాంఘిక దురాచారాలు ఆచరణలో ఉన్నప్పటికీ, గ్రామీణులంతా ‘వసుధైకకుటుంబం’ లాగా కలమిడిగా, ఒకరికొకరు చేదోడు వాదోడుగా వుండేవారు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా తరతమభేదం లేకుండా, సాయపడడానికి ముందుకొచ్చేవారు. ఎవరింట్లో ఏరకమైన శుభ-అశుభ కార్యం జరిగినా అంగబలమో, అర్థబలమో తమతమ తాహతునిబట్టి సమకూర్చి సహాయపడేవారు. ఎవరింటికి బంధువులు వచ్చినా అడిగీఅడగకముందే, ఆ వచ్చిన బంధువుల సౌకర్యం నిమిత్తం, కులాలకు, అంతస్తులకు అతీతంగా తమ ఇళ్లకు తీసుకుపోయేవారు. అవీ ఆరోజుల్లోని అనుబంధాలు.

ఇప్పటిలాగా కాకుండా ఆ రోజుల్లో గ్రామాలలో (ఎక్కువగా) పెళ్లిళ్ళు జరుగుతే పరాయి ప్రదేశాల నుండి వచ్చిన బంధువులు ఒకటి-రెండు రోజుల ముందే వచ్చి, వారి సామాన్లు (సాధారణంగా చిన్న బిస్తరి, లేదా ఒక చిన్న సంచీ) పెళ్లివారి ఇంట్లో ఒక మూలన పడేసి, తాపీగా వుండి, పెళ్ళైన తరువాత మరో రెండు రోజులు వుండి, పెట్టింది తృప్తిగా తిని, కులాసా కబుర్లు చెప్పుకుని పోయేవారు. వున్నన్ని రోజులు సరదాగా వివాహ సంబంధిత కార్యక్రమాలను ఒకవైపు ఆసక్తిగా వీక్షిస్తూనే, కోలాహలంగా పెళ్లివారు వెంట వెంట అందిస్తుండే కాఫీ, బూందీ, అటుకుల మిక్స్చర్ లాంటివాటిని ఆస్వాదిస్తూ చతుర్ముఖ పారాయణం సరదాగా, సీరియస్ గా చేయడం ఆనవాయితీ. ఇక ఆరోజులనాటి తాటాకు పందిళ్లు, కొబ్బరి ఆకుల అలంకరణ, వట్టివేళ్ళ విసనకర్రలు, మేనత్త-మేనమామల పిల్లల చిరు సరసాలు, దాదాపు మృగ్యమే. అంతా యాత్రీకమే, అసహజమే! ఎబ్బెట్టే!

 ఇక పట్టణాలలో, నగరాలలో అయితే పెళ్లివారి ఇంటికి వచ్చే అతిథులు దాదాపు లేనట్లే. వచ్చే బంధువులు తమ వసతి కొరకు స్టార్ హోటళ్లలో ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నారు. లేదా కొందరు వారంతట వారే నచ్చిన హోటళ్లలో దిగి ముహూర్తం సమయానికి వచ్చి, మొక్కుబడిగా అక్షింతలు వేసి, లాంచనంగా విందు భోజనం అంటీముట్టనట్లు తిని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇక వున్నవూరిలో వారైతే ముహూర్తం (జీలకర్ర-బెల్లం పెట్టే) సమయానికి రావడం, అక్షింతలు వేసి పోవడం ఒక ఫార్మాలిటీలాగా చేస్తున్నారు. మంగళసూత్రా ధారణ దాకా వుండే బంధువులు, స్నేహితులు చాలా తక్కువమందే! భోజనం ప్లేట్ల లెక్క మాత్రం తప్పడం లేదు. ‘మృష్టాన్న భోజనం’ అయినా, రకరకాల వంటకాలున్నా, పెద్ద ఎత్తున మద్యం పార్టీలున్నా, అవన్నీ పెళ్లి చేస్తున్నవారి సంపద ప్రదర్శనగానే మిగిలిపోతున్నాయి. పాతరోజుల్లో జరిగే మూడు, ఐదు, పదహారు రోజుల పెళ్లిళ్లలో సంప్రదాయబద్ధమైన వేడుకలు, ఆచారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగేవి. హరికథలు, బుర్రకథలు వుండేవి. ఇప్పుడు వాటి స్థానంలో సంగీత్ అని, మెహందీ అని, లాస్ట్ బాచిలర్స్ పార్టీ అని, రిసెప్షన్ విందు అనీ, వారివారి తాహతును బట్టి సంపదను అతిగా ప్రదర్శించేవిగా జరుగుతున్నాయి. ఖర్చు ఇబ్బడి-ముబ్బడి. ఆప్యాయతలు, అనురాగాలు లేనట్లే!

ఆ పాత రోజుల్లో, విద్యను అభ్యసించడానికి, తల్లిదండ్రులు వున్న వూర్లో కాకుండా వేరే ప్రదేశానికి విద్యార్థులు పోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉద్యోగారీత్యానో, మరేకారణానో నివసిస్తున్న బంధువుల ఇళ్లలో పూర్తికాలమన్నా, లేదా వసతి సౌకర్యం దొరికేవరకన్నా వుండి చదువుకోవడమనేది ఆనవాయితీ.  మేనమామల ఇంటిలోనో, మేనత్తల ఇంటిలోనో, బాబాయి, పెద్దనాన్నల ఇళ్లలోనో, లేదా సమీప బంధువుల ఇళ్లలోనో, ఒక్కోసారి తల్లిదండ్రుల స్నేహితుల ఇళ్లల్లోనో వుండడం ఒక ‘ఆప్యాయతతో కూడిన హక్కు లాగా భావించేవారు. ఇక వుంచుకునే బంధువులు, స్నేహితులు కూడా అదొక ‘బాధ్యత’ గా, తమకు దక్కిన ఒక గౌరవంగా అనుకునేవారు.

ఇప్పుడు వుండడానికీ, వుంచుకోవడానికీ మొహమాటమే. వచ్చినవాడు ఎప్పుడు పోతాడా అని ఒకరు, ఎప్పుడు పోదామా అని మరొకరు ఆలోచించే రోజులొచ్చాయి. ఇక స్కూల్లోనో, కాలేజీలోనో సీటు ఇప్పించడం లాంటి సహాయం చేయడం లేనేలేదు. అలాగే పనులమీద గ్రామాల నుంచి జిల్లా లేదా రాజధాని కేంద్రానికో వెళ్లినప్పుడు బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లల్లో వుండే ఆనవాయితీ, ఆచారం, మర్యాద ఎప్పుడో, ఏనాడో పోయింది. నేను హైదరాబాద్ వచ్చిన మొదట్లో చాలా సంవత్సరాల దాకా, మా సమీప బంధువులు, ఒక్కోసారి ఉన్నతాధికారులైన వారి స్నేహితులు, మాఇంట్లో (చిన్న రెండు గదుల) ఎలాంటి సౌకర్యం లేకపోయినా వుండి, మాతోపాటే తిని, పనైన తరువాత వెళ్లిపోయేవారు.  ఇక ఇప్పుడు, ఒక పూట భోజనానికి పిలవడం కూడా చాలామంది చేయడం లేదు. అన్నీ హోటళ్లలోనో, క్లబ్బులలోనో వారివారి తాహతును బట్టి జరిగిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి బందు వ్యవస్థ ఇక లేనట్లే!!!  

బాగా ఆలోచింప చేస్తున్న, ఒకప్పుడు అంతగా పాటించని విషయం ‘గోప్యం’. దీన్ని చాలామంది అన్నిట్లో కాకపోయినా, చాలావాటిల్లో పాటించాల్సిన అవసరం, ఆగత్యం, తప్పనిసరి పరిస్థితిగా కలుగుతున్నది. మారుతున్న కాలంలో, మానవ విలువలు పాటించడం తగ్గుతున్న, లేదా పూర్తిగా క్షీణిస్తున్న నేపధ్యంలో, కొంతలో కొంత గోప్యం పాటించక తప్పడంలేదు. గతంలోలాగా, దగ్గరివారికి, అయినవారనుకున్నవారికి తమ స్వవిషయాలు చెప్పుకుంటే, వారిలో కొందరు, వాటినే ‘చిలవలు పలువలు’ గా ఉన్నవీ-లేనివీ చేసి, చికోరీ కలిపి, అనవసరమైనవారికి, తక్షణమే చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేనివారికి  చేరవేయడం, ప్రచారం చేయడం  దురదృష్టం. ముఖ్యంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, దగ్గర-దూరపు బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, అదీ అందరితో కాకపోయినా కొందరితోనన్నా చెప్పుకుని, మనసులో భారాన్ని దించుకునేవాళ్లం చాలామందిమి పాతరోజుల్లో. ఇప్పుడు అలాచెప్పుకుంటే మనసులో భారం పెరుగుతున్నది. ఎందుకు చెప్పామా అన్న సందేహం కలుగుతున్నది. కలిమిడిగా పరిష్కార మార్గాలను అన్వేషించే రోజులు పోయాయి.

అందుకే గోప్యంగా వుంచడమే సహేతుకమేమో అనుకోవాలి. అలా వుంచేవారి ఆలోచన వందశాతం కరెక్ట్ కావచ్చు. కలిగిన కష్టం చెప్పుకుంటే గతంలోలాగా కడుపులో పెట్టుకునే రోజులు పోవడంతోపాటు,  ఇతరుల కష్టాన్ని కడుపులో పెట్టుకునే సన్నిహిత వ్యక్తులు కూడా తగ్గిపోతున్నారు. అసలు సాన్నిహిత్యమే కనుమరుగవుతున్నది!! ఎవరైనా ఆసుపత్రిలో చేరినట్లు తెలిస్తే బంధువులు కానీ, స్నేహితులు కానీ, తక్షణం హాజరవ్వాల్సిన పనులను పక్కన పెట్టి, వెళ్లి పరామర్శించి వచ్చేవారు మునుపటి రోజుల్లో. ఆపరేషన్ లాంటిది జరుగుతే ఆద్యంతం థియేటర్ ముందే వుండిపోయి పేషంట్ భర్తకో, భార్యకో, తల్లిడంద్రులకో ధైర్యం చెప్తూ, అవసరమైతే రాత్రుళ్లు తోడుగా వుండేవారు. పేషంట్ తాలూకు వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయకపోయేవారు. ఇప్పుడు అలావచ్చే కొందరు ధైర్యం చెప్పడం, సహానుభూతి చూపడం కన్నా ఇబ్బందికరమైన సానుభూతి చూపడం జరుగుతున్నదేమో అన్న సందేహం కలుగుతున్నది??? ఆసుపత్రుల నిబంధనల కారణాన పరామర్శించడానికి వచ్చేవారి సంఖ్య కూడా తగ్గిపోతున్నది.

ఆర్ధిక ఇబ్బందుల గురించి కూడా చెప్పుకోవాలి. పాత రోజుల్లో ఎవరికి ఏచిన్న ఆర్థికపరమైన సమస్య వచ్చినా బంధుమిత్రులు తమకు ఆదుకునే తాహతు అంతగా లేకపోయినా, వున్నదాంట్లోనే సర్దుబాటు చేసేవారు. అడిగేవారు కూడా మొహమాట పడకపోయేవారు. గాస్ సిలిండర్ కు, పాలసీసాలకు, ఆడపిల్లల పెళ్లిళ్లకు, ఆసుపత్రుల ఖర్చులకు, బంధువులు, స్నేహితులు డబ్బులు సర్దిన రోజులున్నాయి. అప్పట్లో అందరి జీతాలు అంతంత మాత్రమేకాని ఆప్యాయతలకు, అనురాగానికి కొదవలేదు. ఇప్పుడు చాలామంది అంతస్తులు పెరిగినా, ఆర్ధిక స్థోమత పెరిగినా, సహాయం చేయడానికి ముందుకొచ్చేవారు తగ్గిపోతున్నారు. ఇప్పుడు ఎవరి బాధ వారే పడతారులే అనే భావన. పడుతున్నారు కూడా. దీన్ని స్వార్థం అనాలా?  

ఇవన్నీ ఒక ఎత్తైతే, కాలం గడుస్తున్న కొద్దీ, పాతరోజుల్లో లేనివిధంగా ‘ఈర్ష్యాసూయలు’ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఒకరికి మంచి జరిగినా, మంచి పదవి వచ్చినా, పదోన్నతి వచ్చినా, విదేశాలకు పోయే అవకాశం వచ్చినా, ఒక ఆవార్దో-రివార్దో వచ్చినా, యావన్మంది బంధుమిత్రులు తమకే వచ్చినట్లు భావించి, ఆనందించేవారు. ఇప్పుడు అలాకాదు. పైకి సంతోషం ప్రకటించినా, ఏదో వ్యక్తం చేయలేని ఈర్ష్య, అసూయ చాలామందిలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ వయసులో ఇలా రాసుకుంటూ పోతే మనసులో బాధ పెరగడమే కాని స్వాంతన కుదిరే అవకాశాలు ప్రస్ఫుటంగానైతే కనిపించడం లేదనడంలో అతిశయోక్తి లేదనాలి. ఎందుకంటే దీనికి నేను సహితం అతీతుడిని కాకపోవడమే!!! తప్పు మారుతున్న కాలానిదేనని సరిపుచ్చుకోవడమే శ్రేయస్కరం!!! కాలంతోపాటే మనమూ మారాలి కదా!!!

(స్వానుభవంతో రాసినవే తప్ప ఎవరినీ ఉద్దేశించి కానేకాదు!!!)

Staggering Distortions of Adi Kavya in Adi Purush : Vanam Jwala Narasimha Rao

 Staggering Distortions of Adi Kavya in Adi Purush

Vanam Jwala Narasimha Rao

The Hans India (25-06-2023)

            People like to see a movie either for entertainment or for a subtle message or for music and songs or for a comedy or a tragedy and appreciate if they like. But, if a movie projected as mythology centric and shown with typical disgusting combination of folk and social features, and turns out to be a rude shock to viewers, how can it be better described or reviewed than using a word ‘distortion’?

The instantaneous reaction of viewers of this movie, by and large was, Oh! Characters of Raghava (Sri Rama), Sheshu (Lakshmana), Janaki (Sita), Bajrang (Hanuman), Ravana, Vibhishana, Kumbhakarna, Mandodari, Shoorphanaka etc. could also be shaped and presented this way, without doing proper homework. The stunning name of this fabricated story film is ‘Adi Purush’ ostensibly based on the all-time world famous great epic Ramayana. Strangely, in the introduction, it was mentioned that, Valmiki Ramayana was the source and inspiration for the theme of the film, but in effect, it is seldom observed in the film anywhere.

The Great Sage Valmiki blessed humanity with his Epic and a Great Literature Sri Ramayana that speaks about the story of Sri Rama known to be an exceptional ‘Role Model’ (Maryada Purushottam). Unfortunately, the film makers seems to have totally forgotten that, Indians considered Ramayana as an Ideal and Best example and practiced the immense culture and traditions, which are totally distorted in the movie beyond anyone’s imagination!!! Valmiki Ramayana that emanates a unique poetical sound (Dhvani Kavyam) speaks of sixteen characteristics or qualities of Sri Rama contextualizing various phases of his life. The film makers, strangely gone totally opposite and portrayed him with his unlike characteristics.

When one reads Valmiki Ramayana the characters and importantly of Sri Rama will be of eye-catching. But when one sees this film, the feeling one will have is, Oh! could this be the real and correct way to portray Sri Rama (Raghava)!!! Adi Purush movie, had shown scenes of Raghava, in an awkward and often dreadful manner, graphically supported, exhibiting his skills of unnecessary leaps, jumps and heaps and dives!!! In one scene, it was shown awkwardly, Raghava sitting indifferently alone and suddenly turning aggressive with non-existing and elusive creatures in a rare display of folk style heroism.!!! What is this?   

Logic and rationale to start the film with parts of Aranya Kanda, negligible bit of Kishkindha Kanda and abruptly closing with Yuddha Kanda bit is also debatable. Sheshu (Lakshmana) positioning a grill-like structure around Janaki (Sita) with a warning not to cross the border, when she is alone, was shown in a ridiculous manner. Without signifying any context, Janaki was shown asking Raghava to fetch the Golden Deer that was loitering there in a flock. Immediately, emulating the style of Hero chasing Villain in a social film, Raghava chases the deer and pulls his arrow to kill it. Whispering ‘Sheshu’ ‘Sheshu’ it dies and becomes a demon. There was no mention of Ravana friend Maricha that was in that form!!!

There was no reference to ‘Laxmana Rekha’ or the Grill as in the film, drawn by Laxmana before leaving Sita or Janaki and go to help Sri Rama in Valmiki Ramayana. Ravana, according to Valmiki, enters the Ashram right royally and threatens Sita and kidnaps right royally by touching and pulling her. In the film Adi Purush, it was shown that, Ravana appearing as a Bikshuka first making Janaki to cross the line and later in a modern Hair Style and typical dress, and like a magician tie her with ropes in an unconscious stage and putting her in an awkward space vehicle of an unusual bird, and steering by himself.

It was also shown in the film, that Sheshu who went to help his brother meets him half a way through and both return to the Ashram, exactly at a time when Ravana was little away in the sky abducting Janaki. They were shown staying silent without attempting to counter Ravana which is incorrect! They both reach much much later after Ravana left. It was Kabandha who suggested Sri Rama to make friendship with Sugriva but not Sabari. Accordingly, Sri Rama and Lakshmana proceeded and, on the way met Sabari, who gave them the best of the fruits collected, but did not feed Rama with tasted fruits.

First meeting between Hanuma, Sri Rama and Lakshmana was incorrectly shown. The film shows Bajrang sitting at one place, exposing his six-pack body, and asking Raghava and Sheshu illogical and senseless questions which is not in Valmiki Ramayana.  Actual story is, on seeing Rama and Lakshmana in the vicinity of Rushyamook, Sugriva afraid of them as persons sent by Vali to kill him, deployed Hanuma to elicit information. Hanuma in a ‘Bikshuka’ attire went to them and revealed all about Sugriva and Vali and reasons for Sugriva being in exile driven away by Vali. Later he took them to Sugriva to befriend.  Thus, the bond of friendship between Rama and Sugriva developed.

Rama promises to kill Vali and fulfills his vow by way of releasing an arrow from his bow from behind a tree but not face to face as wrongly shown in the film. The rationale behind this was a pioneer discussion on ‘Dharma’ between Vali and Sri Rama. When Sugriva was sending his monkey brigade to all four sides in search of Janaki which did not form part of the film, Hanuma was deputed to south. Sri Rama confident of his caliber gives his ‘Finger Ring’ to show it to Sita indicating that he is Rama’s representative, but not the ‘single pearl’ as shown in the film. Sita in return gives her precious ‘Chudamani’ but not ‘Bangle’ to Hanuma as shown in the film.             

On leaving Sita, as a show of strength, Hanuma triumphantly fought against Ravana’s supporters before surrendering voluntarily, in a bid to reach Ravana. Hanuma and Ravana meeting where Hanuma exhibits his communication skills was not shown in the film for obvious reasons. Instead Bajrang was shown in an awkward way using filthy language on burning his tail. Construction of Bridge on the Ocean with stones was also shown faultily. Hanuman did bring Sanjeevani Mountain but the context was different. It was brought when Ravana threw the weapon ‘Shakti’ on Lakshmana resulting in his unconsciousness for a brief while. It was not because of his deathlike state in the hands of Indrajit. In another typical and faulty manner, it is shown in the film, making some medicine on the arrival of Sanjivani!!!

According to Valmiki Ramayana, during the last moments of Ravana, Rama used ‘Brahmastra’ and killed Ravana from the chariot sent by Indra with Matahli in the driving seat and advising to use the weapon. The way it was shown in the film that both Sri Rama and Ravana exposing their bodies with Chests overflowing out and muscles on display and fighting standing on the ground like boxers or wrestlers is again another awkward scene.   After Ravana’s death, the film was abruptly ended with Rama and Sita joining.

Valmiki Ramayana is the one and only standard text that talks about the exact story of Sri Rama and Sita Devi (Raghava and Janaki) and rest are all Texts with self-styled insertions. It was the first and foremost literary exposition, The Adi Kavya. Strangely, this Movie is named as ‘Adi Purush’!!! Any relevance???

Tuesday, June 20, 2023

తప్పక, తప్పక చూసితీరాల్సిన సినిమా ‘ఆదిపురుష్’ : వనం జ్వాలా నరసింహారావు

 తప్పక, తప్పక చూసితీరాల్సిన సినిమా ‘ఆదిపురుష్’

వనం జ్వాలా నరసింహారావు 

సినిమాలు చూసే అలవాటు అంతగా లేకపోయినా, మంచిదని ఆనోటా, ఈ నోటా వింటేనో, లేదా సమీక్ష చదివితేనో, లేదా పిల్లలు తీసుకుపోతేనో చూస్తుంటాను. చూసినవాటిలో ‘చాలా బాగావున్నవి, ‘బాగావున్నవి’, ‘పరవాలేదు అనిపించినవి, ‘వినోదాత్మకమైనవి, ‘సందేశాత్మకమైనవి, ‘సంగీత ప్రాదాన్యమైనవి,కుటుంబంతో కలిసి చూసేవి వున్నాయి. అలాంటి కొన్ని సినిమాల పేర్లు చెప్పుకోవాలంటే ‘సుడిగుండాలు’, ‘సీతారాముల కల్యాణం, సంపూర్ణ రామాయణం, ‘అన్నమయ్య, ‘భక్తరామదాసు, ‘లవకుశ, ‘దానవీర శూర కర్ణ, ‘శతమానంభవతి, ‘మిథునం’, ‘బాహుబలి, ‘శంకరాభరణం’, ‘సప్తపది, ‘రంగస్థలం’ లాంటివి వున్నాయి.  

వీటన్నిటికీ అతీతంగా, పూర్తి భిన్నంగా, మొట్టమొదటిసారిగా విడుదలైన రోజునే ఒక పౌరాణిక (జానపద, సాంఘిక కలిమిడిని పోలిన) సినిమా చూసే అవకాశం కలిగింది. ఓహో, రాఘవ (శ్రీరాముడు), శేషు (లక్ష్మణుడు), జానకి (సీత) భజరంగ్ (హనుమంతుడు), రావణ, విభీషణ, కుంభకర్ణ, మండోదరి, శూర్ఫనక, ఇత్యాదులు ఇలాకూడా వుంటారా అని ఆశ్చర్యం, విస్మయం, ఉలికిపాటు, గగుర్పాటు కలిగింది. బహుశా సినీ నిర్మాత, దర్శకుడు బాగా శోధించి, పరిశోధించి ఈ పాత్రలను ఇలా అపురూపంగా రూపుదిద్దారేమో, ఇలా వుండడమే సబబేనేమో అనిపించింది. అనాదిగా భారతీయులు రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని ఆచరిస్తూ వస్తున్న అపారమైన సంస్కృతీ, సంప్రదాయాలను ఈ విధంగా (వక్రీకరించి) కూడా చూపించసాధ్యమా? అనిపించింది. అందుకే ఈ సినిమా చూడాలి. చూసితీరాలి.

         ఆ చక్కటి సినిమా పేరు ‘ఆదిపురుష్. నిడివి మూడు గంటలకు పైగానే అనిపించింది. మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు కనుక్కున్న మేథావి థామస్ ఆల్వా ఎడిసన్, దాన్ని కనుగొనే ప్రక్రియలో ఎన్నిరకాలుగా తప్పులు చేయవచ్చో ముందుగా కనుక్కున్నాను అన్నాడట! అలా వుంది ఈ సినిమా ఆద్యంతం. వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన సినిమా ఇదని ఉపోద్ఘాతంలో చెప్పటం జరిగింది. ఏఏ విషయాలలో వాల్మీకి రామాయణంలోని అంశాలు ప్రామాణికంగా ఇందులో వున్నాయో నిర్మాత, దర్శకులకే తెలియాలి. ఇది అర్థం చేసుకోవడానికైనా చూడాలి ఈ సినిమా.            

వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి పదహారు గుణాలను వర్ణించాడు నారదుడు, ఈ పదహారు గుణాలు కాకుండా ఈ సినిమాలో పదిహేడవ గుణం, ఆమాటకొస్తే మరిన్ని రకాల గుణాలు ఉన్నవేమో అన్న భ్రమ కలుగుతుంది. ముఖ్యంగా ‘రౌద్ర గుణం చూపించిన తీరు వర్ణనాతీతం. శ్రీరాముడి పాత్ర అంటే ఆబాలగోపాలానికి ఒక చెరగని ముద్రలాగా మహానటులైన ఆ తరంవారు వాల్మీకి రామాయణంలో చెప్పిన గుణగణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు అప్పటి నిర్మాత, దర్శకులు. గ్రాఫిక్స్ ఆధారంగా అనవసరమైన కుప్పిగంతుల సన్నివేశాలకు రూపకల్పన చేసి ఎబ్బెట్టుగా చూపించారు శ్రీరాముడిని ఈ సినిమాలో. ఒక సన్నివేశంలో ఎవరికీ అంతుచిక్కని జీవరాశులతో రాఘవ జానపద శైలిలో పోరాడుతాడు! అసలు ఆ సన్నివేశంలో ఒంటరిగా రాముడు అక్కడ ఏం చేస్తున్నాడో అంతుచిక్కదు. ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి చరితాన్ని ఆదికావ్యంగా, శ్రీరామాయణ కావ్యంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. శ్రీసీతారాముల చరితానికి సంబంధించినంతవరకు వాల్మీకి రామాయణం మాత్రమే ఏకైక ప్రామాణిక గ్రంధం. ‘ధ్వనికావ్యంగా పేరున్న రామాయణం చదువుతుంటే కళ్లకు కట్టినట్లు వుండే పాత్రలు, ముఖ్యంగా శ్రీరాముడి పాత్ర ఈ సినిమా చూస్తుంటే ‘ఓహో! ఇలా వుంటుందా?’ అనిపించడం సహజం. అందుకే తప్పక చూసి తీరాలి ఈ అద్భుతమైన సినిమాని.

ఏకారణాన రామాయణాన్ని అరణ్యకాండ కథతో మొదలుపెట్టారో అర్థంకాదు. ఒకింత కిష్కింధకాండ, చాలావరకు యుద్ధకాండ అంశాలకే వక్రీకరించి ప్రాధాన్యత ఇచ్చారు. ఆరంభంలోనే ఎక్కడో రాముడు వుంటే, శేషు అనబడే లక్ష్మణుడు, లక్ష్మణరేఖను మించిన గ్రిల్ లాంటి నిర్మాణాన్ని సృష్టించడం, అది దాటి బయటకు రావద్దని వదిన ‘జానకి కి చెప్పడం విశేషం. అలాగే ఏవిధమైన నేపధ్యం లేకుండా జింకల గుంపులో వున్న బంగారు జింకను కావాలని జానకి అడగ్గానే, రాఘవ మారుమాట్లాడకుండా, సాంఘిక సినిమాలలో విలన్ ను వెంబడించే హీరో లాగా పరుగెడుతూ, దాన్ని వేటాడి బాణం వేస్తాడు. అది ‘శేషు అని అరుస్తూ (కాదు గొణుక్కుంటూ) చచ్చిపోయి రాక్షసుడు అవుతుంది సినిమాలో. అలా చనిపోయింది మారువేషంలో వున్న మారీచుడు అన్న విషయం సూచనప్రాయంగా కూడా చెప్పలేదు. శూర్ఫనక ప్రోద్బలంతో జానకిని అపహరించడదానికి రావణుడు పోయినట్లు, మండోదరి వారించినట్లు చూపించారుకాని, మారీచుడు రావణుడిని వారించినట్లు సూచనప్రాయంగానైనా లేదు. వీటిని ఆస్వాదించడానికన్నా ఈ సినిమా చూడాలి. 

(Photo courtesy internet) 

‘శేషు, ‘శేషు అన్న కేకలు విని జానకి బలవంతం మీద ఆమెను వదిలి రాముడికి సహాయంగా (గ్రిల్ లాంటి రక్షణ నిర్మాణాన్ని ఏర్పాటుచేసి) పోతుండగా అన్నదమ్ములిద్దరూ కలుస్తారు. ఏవిధమైన సంభాషణ జరగలేదక్కడ. వాస్తవానికి అన్నకు సాయంగా వెళ్తూ-వెళ్తూ సీతను జాగ్రత్తగా వుండమని అన్నాడే లక్ష్మణుడు కాని ఎలాంటి రక్షణ రేఖ ఏర్పాటుచేయలేదనేది వాల్మీకి రామాయణంలో స్పష్టంగా వున్నది. బ్రాహ్మణ సన్న్యాసి వేషంలో వచ్చిన రావణాసురుడు ఎడమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను, కుడిచేత్తో తొడలను, బెదిరించి, బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని, తన మాయా రథంలో వేశాడు. అంటే, వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని తాకి తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సినిమాలో చూపించినట్లు గారడీ, కనికట్టు విద్యద్వారా కట్లుకట్టి, స్పృహ కోల్పోయేటట్లు చేసి, తనవెంట తీసుకుని పోలేదు. అందుకే ఈ సినిమా చూడాలి.

‘ఆదిపురుష్’ సినిమాలో మరో చూసితీరాల్సిన వింత ఎవరికీ అంతుచిక్కని ఒకరకమైన వస్త్రాలు ధరించి, కనీసం విభూతి రేఖలు కూడా ముఖాన లేకుండా, అదునాతమైన మంచి హెయిర్ స్టయిల్ తో రావణుడు తనే స్వయంగా స్టీరింగ్ తిప్పుకుంటూ, అతి జుగుప్సాకరంగా వున్న ఒక పక్షి వాహనం మీద సీతను తీసుకుని పోవడం. మరో సందర్భంలో ఆ వాహన జంతువుకు టన్నులకొద్దీ మాంసాన్ని స్వయంగా రావణుడే తినిపించడం! సీతను ఎత్తుకుపోతుంటే రాఘవ-శేషు చూస్తూ నిలబడ్డారేకాని ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక్క బాణం కూడా సంధించలేదు. వాస్తవానికి వాల్మీకి రామాయణం ప్రకారం, రావణుడు ఎత్తుకుపోయిన చాలా సేపటికి కాని రామలక్ష్మణులు ఆశ్రమానికి చేరుకుంటారు. చెట్టు, పుట్ట, గుట్ట, మొత్తం అరణ్యం గాలిస్తారు. ఈ మార్పుకోసమైనా చూడాలి ఈ సినిమాను.

సుగ్రీవుడితో స్నేహం చేసుకొమ్మని రాముడికి చెప్పింది కబంధుడు కాని, శబరి కాదనేది వాల్మీకంలో స్పష్టంగా వుంది. వానర రాజు సుగ్రీవుడు తన అన్న వాలికి తనమీద కోపం రాగా, నలుగురు వానరులను సహాయంగా తీసుకుని పంపానది ఒడ్డున వున్న ఋశ్యమూక పర్వతం మీద సంచరిస్తున్నాడనీ, అతడితో రాముడు స్నేహం చేస్తే ఆయన భార్యను వెదకడానికి అతడు సహాయపడతాడనీ, అతడికి తెలియని రాక్షసులు వుండే చోటు భూమ్మీద లేదనీ, సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడతడనీ కబంధుడు చెప్పిన తరువాతే సుగ్రీవుడి అన్వేషణలో రామలక్ష్మణులు పోతారు.

అలా పోతున్న రామలక్ష్మణులు శబరి వుండే ఆశ్రమం చేరుకుంటారు. శబరి వీరి పాదాలకు నమస్కరించి, రామలక్ష్మణుల దర్శనం చేసుకుంటే తనకు మళ్లీ జన్మలేని లోకం లభిస్తుందని తన గురువులు చెప్పిన కారణాన వారికొరకు వేచి చూస్తున్నానని, మంచివి, ఏరి-కోరి నానా రకాలైన కందమూల ఫలాలు సంపాదించానని, వాటిని తినిపిస్తుంది. సినిమాలో చూపించిన విధంగా శబరి ఏరి కోరి తెచ్చి రాముడితో ఎంగిలి పండ్లు తినిపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. రాఘవను కలిసిన తరువాత శబరి ప్రాణత్యాగం చూపించి, దేవకన్యగా మారి సుగ్రీవుడితో స్నేహం చేయమని అన్నట్లు సినిమాలో వున్నది. ఇంత చిన్న విషయాన్ని మార్చి చూపినందుకైనా ఈ సినిమా చూడాల్సిందే!

ఆ తరువాత రామలక్ష్మణులు పంపాతీరం చేరి, అక్కడినుండి ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, వారిని చూసిన సుగ్రీవుడు వాలి పంపగా తమను చంపడానికి వచ్చినవారిగా భయపడ్డాడు. హనుమంతుడికి తన భయానికి కారణం చెప్పి, వాళ్ల దగ్గరికి పోయి విషయం తెలుసుకొమ్మంటాడు. సుగ్రీవుడి కోరిక మేరకు రామలక్ష్మణుల దగ్గరకు వానర రూపం వదిలి బిక్షుక వేషంలో పోయాడు హనుమంతుడు. రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు సుగ్రీవుడికి మేలు చేసేవారే కాని పగవారు కాదని నిశ్చయించిన హనుమంతుడు వారికి గౌరవంగా నమస్కారం చేశాడు. ఉభయకుశలోపరి, సుగ్రీవుడి గురించి వివరించి, ఆయన జయం కోరుతూ రామసుగ్రీవులకు స్నేహం కుదర్చాలని అనుకున్నాడు. అంతేకాని రాఘవ, శేషు వచ్చేసరికి ఒకచోట తిష్ట వేసుకుని కూర్చుని, అర్థంపర్థంలేని ప్రశ్నా-జవాబుల నేపధ్యంలో హనుమ (భజరంగ్), రామలక్ష్మణుల కలయిక జరుగదు. ఈ ట్విస్ట్ ఇచ్చినందుకైనా సినిమా చూడాలి మరి.  

తమ వృత్తాంతాన్ని వివరించిన రామలక్ష్మణులను సుగ్రీవుడి దగ్గరికి తీసుకుపోతాడు హనుమంతుడు. వాలి తనకు చేసిన అపకారాన్ని సుగ్రీవుడు రాముడికి చెప్పడం, వాలిని చంపడానికి రాముడి ప్రతిజ్ఞ, సీతను తాను తీసుకొస్తానని సుగ్రీవుడు రాముడికి చెప్పడం, సీతాదేవి ఉత్తరీయంలో మూటగట్టి విసిరేసిన సొమ్ములను చూపడం, వాలిసుగ్రీవుల ప్రధమ, ద్వితీయ యుద్ధాలు, శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి (సినిమాలో చూపించినట్లు ఎదురుగ్గా కాదు) బాణం వేయడం, ఇత్యాదులు వాల్మీకి రామాయణంలో స్పష్టంగా వున్నాయి. వీటికి భిన్నంగా ఆదిపురుష్ కథ అల్లడం జరిగింది కాబట్టి ఈ సినిమా చూసి తీరాల్సిందే! వాస్తవానికి కిష్కింధకాండలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం, వాలి నేలకూలిన తరువాత, కొనవూపిరితో వున్న వాలి, తనను రాముడు అన్యాయంగా చంపాడని ఆరోపణ చేసినప్పుడు, అనేక రకాలుగా ధర్మ శాస్త్ర వాక్యాలను చెప్పి, వాలిని చంపడం ఏమాత్రం అధర్మం కాదని అన్న శ్రీరాముడి మాటలకు సమాధానపడి క్షమించమని కోరాడు వాలి. ఇవి లేని ఆదిపురుష్ చూడాల్సిందే.

సీతను వెతకడానికి సుగ్రీవుడు నలుదిక్కులకు వానర ప్రముఖులను పంపడం చూపలేదు. దక్షిణ దిక్కుకు హనుమదాదులను పొమ్మన్న వెంటనే, హనుమంతుడి చేతికి తన ముద్రికను (చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని) ఇస్తాడు శ్రీరాముడు. సినిమాలో చూపించినట్లు ‘ముత్యం కాదు. ఆ తరువాత జరిగిన అసలు కథ (ఈ సినిమాలోలాగా కాదు) హనుమంతుడు లంకను దాటడం, సీతాన్వేషణ చేయడం, అశోకవనంలో సీతను చూడడం, రామముద్రికను (ఉంగరం) ఇవ్వడం, ఆమె ఇచ్చిన చూడామణిని (గాజును కాదు) తీసుకోవడం, రావణుడి ఉద్యానవనాన్ని ధ్వంసం చేయడం, మూడు వంతుల మంది రావణ సైన్యాన్ని చంపడం, కావాలనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం, రావణుడికి హితబోధ, హనుమ తోక కాల్చడం, (ఆ సన్నివేశంలో ఈ సినిమాలో వున్న ఎబ్బెట్టు డైలాగులు వుండవు. హనుమంతుడు అంటే ప్రశస్త వాక్కు కలవాడని అర్థం. వ్యాకరణ స్ఫూర్తితో మాట్లాడుతాడు), లంకా దహనం, మళ్లీ లంకను వదిలే ముందర సీతాదర్శనం, ఇత్యాదులు చూచాయగానన్నా లేకుండా, సినిమా తీసినందుకైనా దీన్ని చూడాల్సిందే!

సముద్రం మీద సేతువు కట్టిన విధానం కూడా తప్పుగా చూపించారు. వానరులంతా రాళ్లు వేయరు. ఒక్క నీలుడే ఇతర వానరులు తెచ్చిన రాళ్ళను వేస్తె అవి మునగకుండా వుంటాయి. అది ఆయనకున్న వరం. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు ప్రయోగించిన ‘శక్తి’ వలన లక్ష్మణుడు  మూర్ఛపోతే (చనిపోతే కాదు), హనుమంతుడు సంజీవిని  పర్వతాన్ని తెస్తాడు ఒకసారి. హనుమంతుడు విభీషణుడి సలహా మేరకు మృతసంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అనే మూలికలకోసం వేయి యోజనాల సంజీవని స్థలాన్ని వెతికి, కనపడక పోవడంతో ఆ శైలాన్ని పాటులతో సహా పెళ్ళగించి తెస్తాడు. హనుమంతుడు వస్తుంటేనే మూలిక గాలి సోకడం వల్ల వానరులంతా ప్రాణాలతో లేచి కూర్చున్నారు. ఆ మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృతి తెచ్చుకుని తెప్పరిల్ల్లారు. అంతేకాని సినిమాలో చూపించినట్లు ఒక భారీ ఔషధాన్ని తయారుచేయలేదు. దీనికొరకు కూడా సినిమా చూడాలి.

అదేవిధంగా, ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను ఆ బాణాలతో కట్టిపడేసినప్పుడు రామలక్ష్మణులు మూర్ఛ పోయారు కాని చావలేదు. గరుత్మంతుడు రాగానే పాములన్నీ చెల్లాచెదరై రామలక్ష్మణులు మూర్ఛ నుండి తెప్పరిల్లారు. మరోమారు యుద్ధానికి వచ్చిన ఇంద్రజిత్తు, రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, బ్రహ్మ వాక్కుకు కట్టుబడి వారు మూర్ఛపోయారు. అప్పుడు హనుమంతుడు హిమవత్పర్వతం పోయి, రెండవసారి సంజీవని పర్వతం తేవడంతో, మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృతి తెచ్చుకుని తెప్పరిల్ల్లారు. ఇంద్రజిత్తు లక్ష్మణుడిని చంపాడని ప్రచారంలో వున్న విధంగానే, ఈ సినిమాలో కూడా కొంత ట్విస్ట్ ఇవ్వడం సబబు కాదు. సంజీవని తేవడం వాస్తవం అయినప్పటికీ, లక్ష్మణుడిని బతికించడానికి కాదు. ఈ మార్పులు చూడడానికైనా సినిమా చూడాలిగా మరి!

ఇంద్రజిత్తు ఏదో నదిలో స్నానం చేస్తే ఎవరూ చంపలేరని, చేయకముందే చంపమని విభీషణుడు శేషుకు (లక్ష్మణుడు) సలహా ఇచ్చినట్లు సినిమాలో చూపించారు. ఇదికూడా వాస్తవం కాదు.  ఇంద్రజిత్తు చేస్తున్న యజ్ఞాన్ని ఎవరు విఘ్నం చేస్తాడో అతడి చేతిలో ఇంద్రజిత్తు చస్తాడని బ్రహ్మవరం వుందనీ,  యజ్ఞం పరిపూర్ణంగా సమాప్తమైతే వాడిని దేవతలైనా జయించలేరనీ, విభీషణుడు చెప్పినట్లు, ఆ విధంగానే లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపినట్లు వాల్మీకి రామాయణంలో వున్నది. దీనికి భిన్నంగా సినిమాలో చూపించినందుకైనా ఈ సినిమా చూసి తీరాలి.

రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు ఇంద్రుడి సారధి మాతలి రథాన్ని ఎక్కి బాణాన్ని సంధించి రావణుడి శిరస్సు నరికాడు. రావణుడి తల కిందపడ్డది కాని వెంటనే మరొక తల మొలిచింది. వాడు చనిపోయే విధం రాముడికి కనబడలేదు. అప్పుడు మాతలి సలహా ఇవ్వగా బ్రహ్మాస్త్రాన్ని రామచంద్రమూర్తి రావణుడిమీద వేయడంతో అది పోయి రావణుడి రొమ్ముమీద పడింది. పడగానే ఆ అస్త్రం రావణాసురుడి రొమ్ము చీల్చి, ఆ నెత్తురులో స్నానం చేసి, వాడి దేహం నుండి ప్రాణాలను వెడలగొట్టి, పనంతా అయిపోయిన తరువాత భూమిలో దూరి వెలుపలికి వచ్చి, రాముడి అమ్ముల పొదిలో ప్రవేశించింది. రావణుడు చావగానే ఆయన దేహం ప్రాణాన్ని వదిలినట్లే, విల్లు, బాణాలు కూడా రావణుడిని వదిలి నేలమీద పడ్డాయి. ఇది వాల్మీకం ప్రకారం రావణుడి అంత్యఘడియలు. అంతేకాని రామరావణులు రొమ్ములు విరుచుకుని కండరాలు ప్రదర్శించుకుంటూ అతి జుగుప్సాకరమైన రీతిలో యుద్ధం చేయడాన్ని వాల్మీకి రామాయణం చెప్పలేదు. ఈ ఆఖరి సన్నివేశం కొరకైనా ఆదిపురుష్ చూసి తీరాలి.

రావణ వధ అనంతరం, బహుశా సమయాభావం వల్ల సీతారాముల కలయిక నేపధ్యం చూపడం కుదరలేదేమో!! జరిగినదంతా జరిగిన తరువాత కొన్ని డైలాగులు తీసేశాం, కొన్ని సన్నివేశాలు తీసేశాం అని దర్శక నిర్మాతలు ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. అదీ మంచిదే. బహుశా రాబోయే రోజుల్లో ఈ అభినవ రాముడి ఫోటోలు ఇళ్లల్లో వెలుస్తాయేమో!!! ఏదేమైనా సినిమాకు మంచే జరగాలని కోరుకుంటున్నాను. అభిమానులు వున్నంతకాలం ఆ విషయంలో అనుమానానికి తావేలేదు.  

Monday, June 19, 2023

గోదానం, భూదానం, విద్యా దానం, అన్నదానం, జల దానం గొప్పవన్న భీష్ముడు ..... ఆస్వాదన-125 : వనం జ్వాలా నరసింహారావు

 గోదానం, భూదానం, విద్యా దానం, అన్నదానం,

జల దానం గొప్పవన్న భీష్ముడు

ఆస్వాదన-125

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (19-06-2023)

దాన విశేషాల గురించి వివరంగా చెప్పమని ధర్మరాజు భీష్మ పితామహుడిని కోరగా ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు. ‘పాలు పితకడానికి కంచు పాత్రతో సహా ఆవును మంచి బ్రాహ్మణుడికి, మంచి భక్తితో దానమిస్తే, ఇచ్చిన వ్యక్తి, ఆ గోవుకు ఎన్ని వెంట్రుకలు వుంటాయో అన్ని దివ్య సంవత్సరాలు దేవతల లోకంలో నివసిస్తాడు. తమ వంశంలో ఏడు  తరాల వారిని ఉత్తమ లోకాలకు పంపుతారు. ఆడపిల్ల, భూమి, ఇల్లు, బంగారం, అన్నం, నీరు, వస్త్రం, పాన్పు, కూచుండే పీట, వాహనం మొదలైన వాటిని విద్య పుష్కలంగా వున్న బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఇచ్చినవారికి ఈ లోకంలో, పరలోకంలో, సుఖాన్నిస్తుంది’.

అలాంటప్పుడు ‘వీటన్నిటికన్నా గొప్ప దానం ఏదని’ ప్రశ్నించాడు ధర్మరాజు.

జవాబుగా భీష్ముడు, ఏది కోరి యాచకుడు తన దగ్గరకు వస్తాడో దాన్నే ప్రేమతో ఇవ్వడం అన్ని దానాలలో శ్రేష్టమైన దానమని, దానికంటే కూడా అభయ మివ్వడం చాలా గొప్పదని అన్నాడు. వీరశయనమన్నిటి కంటే గొప్పదని, దానితో పోలిస్తే మిగిలినవి అసలు దానాలే కావని, సర్వపుణ్య కర్మలలోను అదే గొప్పదని చెప్పాడు.

‘శత్రువు ఎలాంటి వాడైనా దైన్యంతో శరణు కోరితే అతడి కోరిక తీర్చినవాడిని పురుషోత్తముడని అంటారు. భార్యా పుత్రులను పోషించుకోలేక పేదరికంతో బాధపడే మనిషి దుఃఖాన్ని పోగొట్టడం గొప్ప గుణం. నిత్యం యజ్ఞయాగాదులు చేస్తూ, కామ రోషాలు లేని మంచి బ్రాహ్మణులకు దానం చేయడం ముల్లోకాలలోనూ గొప్ప విషయమే కాకుండా, ముల్లోకాలలోనూ పూజించతగ్గది’ అని అన్నాడు భీష్ముడు.   

అడిగినవాడికి దానం చేయడం మంచిదా లేక అడగనివాడికి దానం చేయడం మంచిదా అని ప్రశ్నించాడు ధర్మరాజు. అడిగితే ఇవ్వడం కంటే అడగని వాడు ఫలానా వాడని తెలిసి వాడికివ్వడం చాలా గొప్పదానమని, అసలు అడగడం అన్నది చావు లాంటిదని, అడగబడడం పెద్దచావు లాంటిదని, కాబట్టి అడగని వాడికివ్వడం వల్ల వాడినీ, పుచ్చుకున్నవాడినీ, తననూ రక్షించేవాడౌతాడని చెప్పాడు భీష్ముడు.

యజ్ఞంలాంటి దానంలో వున్న ధర్మవిధులలో అధికమైన ఫలితాలను ఇచ్చేది ఏదని అడిగాడు ధర్మరాజు. నిత్యం బ్రాహ్మణులకు వినయపూర్వకంగా, ధనధాన్యాలు, ఆవు, రత్నం, భూమి, నీరు, అన్నాదులు సద్బుద్ధితో ఇవ్వడం ఇక యజ్ఞమని, కాబట్టి దానం చేయాలని, అది తపస్సును, యజ్ఞాన్ని చేసిన ఫలితాన్నిస్తుందని భీష్ముడు అన్నాడు.

అలాంటప్పుడు, అనేకదానాలుగా చెప్పబడుతున్న వాటిలో ఉత్తమైనది ఏదని మళ్లీ ప్రశ్నించాడు ధర్మరాజు. సమాధానంగా ఇలా అన్నాడు భీష్ముడు. ‘దానాలన్నింటిలో భూదానమే శ్రేష్టం. ధాన్యాలన్నిటికీ నేలయే ఆధారం. అతిశయంగా ధనం సమకూర్చేది నేలే. బంగారం, వెండి, వస్త్రం, ధాన్యం, వివిధ రత్నాలు ఇచ్చిన ఫలాలను అన్నిటినీ శ్రేష్టమైన భూదానం చేసినవాడు పొందుతాడు. భూమి ఎంతకాలం వుంటుందో భూదానం చేసినవాడు సైతం స్వర్గలోకంలో అంతకాలం వుంటాడు. కొంచెం నేలను దానం చేసినా ఎంతో నేలను పొందగలడు. రాజనేవాడు రణమరణమైనా పొందాలి, లేదా, భూదానమైనా చేయాలి. భూదానం వల్ల బ్రహ్మహత్యలాంటి పాపాలు పోతాయి. భూదానాన్ని ఎంత పాపాత్ముడు చేసినా, గ్రహించినవాడికి కల్మషం రాదు. భూదానం అశ్వమేధం సమానం అంటారు. బ్రాహ్మణుడికి పంటపండే భూమిని దానం చేస్తే కలిగే ఫలితాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. భూదాన విధులలో శ్రేష్టమైన విధి యాగం చేసినవాడు, బ్రాహ్మణుడిని ప్రార్థించైనా సరే భూమిని గ్రహించేట్లు చేయడం మంచిది’.

‘సరైన బ్రాహ్మణుడికి గోచర్మం అంత భూమిని దానమిస్తే పోని పాపం లేనేలేదు. భూదేవి రత్నగర్భ కాబట్టి భూదానం చేసినవాడికి గుర్రం, ఏనుగు, స్త్రీ మొదలైన రత్నాలను ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. రాజైనవాడు భూదానం తప్పక చేయాలి. ఎందుకంటే, రాజైనవాడు పాలనలో అనేక పాపాలు చేస్తాడు. అది పోవాలంటే భూదానమే మార్గం. ఒకవేళ ఎవరైనా ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటాడో వాడు తన వారైన 21 తరాల వాళ్లను నరకంలో పడేట్లు చేస్తాడు. మహాపాపానికి కేంద్రం అవుతాడు. ఇస్తానని వాగ్దానం చేసిన భూమిని ఇవ్వకపోవడం కంటే మహాపాపం లేదు. అడక్కుండానే ఇచ్చినంత మహాపుణ్యం కూడా లేదు’ అని చెప్పాడు భీష్ముడు.

దాన స్వభావం కలవారు దానం చేయడానికి అర్హమైన వస్తువులేవి అని ప్రశ్నించాడు ధర్మరాజు. అన్నం, బంగారం, పానీయాలు మొదలైనవి వున్నాయని అయితే ముందుగా ‘ఒకరోజు అన్నదానం’ గురించి  తెలియచేస్తానని, వినమని అన్నాడు భీష్ముడు.

‘లోకయాత్రలో యజ్ఞయాగాదులు, ఇతరాలు అన్నంతోనే ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి అన్నం కంటే విశిష్టమైనది ఇంకొకటి లేదు. అన్న దానంతో సమానమైనది లేదు. దాన్ని పవిత్రంగా చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. అన్నం ప్రాణధారకం కాబట్టి ఇంట్లో వారికి పెట్టడం మానుకొనైనా అతిథులకు పెట్టడం పుణ్యం. అలసటతో వున్నవాడికి, స్త్రీలకూ, బాలురకు, అంగవైకల్యం కలవారికి, ముసలివారికి, తాపసులకు అసలే కాదనకూడదు. ఆకలితో వచ్చిన కుక్కను కూడా ఆదరించాలి. అన్నం పెట్టడానికి కులం, విద్య, నడవడిక అడగరాదు. బ్రాహ్మణుడు అన్నం కావాలని అనగానే ఆదరపూర్వకంగా పెట్టాలి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ అన్నం అమృతమని చెప్పాడు. కాబట్టి అన్నం లేనివాడు ఎంత బలం కలవాడైనా బలహీనుడు అవుతున్నాడు. అన్నం సప్త ధాతువులను పోషిస్తుంది. అన్నదానం వల్ల స్వర్గసుఖాలు లభిస్తాయి’ అని అన్నాడు భీష్ముడు.

చెరువులు, కొలనులు, నూతులు, బావులు తవ్వించడం మంచిపనని, స్వర్గలోక నివాసాన్ని కలిగించే ఈ పనులు దాన కర్మలలో పవిత్రమైనవని, గొడుగును దానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని, బండిని దానం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని, చెప్పులు దానం చేస్తే శత్రువులను జయించవచ్చని, నువ్వులు ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారని, ఇచ్చినవాడు పవిత్రుడౌతాదని అన్నాడు భీష్ముడు. అడవి, కొండలు, నదులు, అనేక తీర్థాలు దానధర్మాలు చేయడానికి యోగ్యమైన స్థలాలని చెప్పాడు.  

గోదాన మహిమను ధర్మరాజు కోరిక ప్రకారం వివరించాడు భీష్ముడు ఈవిధంగా. ‘గోవన్నా, బ్రాహ్మణుడన్నా ఒకే తత్త్వం కావడం వల్ల గోదానం చేసినవాడు ముక్తి పొందుతాడు. ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తే ఎలాంటి సంకట స్థితి పొందక ఎవరూ పొందరాని పుణ్యలోకాలలో సుఖంగా వుంటారు. ఆవుపాలు అమృతంతో సమానమని దేవేంద్రుడు చెప్పాడు కాబట్టి ఆవును దానం చెయ్యడం వలన అమృతాన్ని దానం చేసిన ఫలాన్ని పొందగలడు. మునులు ఆవులంటే ప్రాణాలని చెప్తారు కాబట్టి ప్రాణదానం చెయ్యడం వల్ల లభించే ఫలం గోదానకర్తకు కలుగుతుంది. బాగా పరీక్షించి గోవును దానం చేయాలి. క్రూరుడికి, నాస్తికుడికి, చెడుపనులు చేసేవారికి, గోవును ఇస్తే అది శోకిస్తుంది కాబట్టి, ఆ శోకం దాతను నరకలోకంలో పడేస్తుంది. గోవులు పుణ్యలోకాలనే కాకుండా మోక్షాన్ని కూడా కలిగించగలవు’.

అన్నదానం అన్నింటికంటే చాలా గొప్పదని, అన్నదానం ప్రాణదానంతో సమానమని, అన్నం కంటే జలదానం గొప్పదని చెప్పాడు భీష్ముడు. ‘దానం చేయదగ్గవి మూడున్నాయి. భూమి, చదువు, గోవు. వీటికంటే గొప్పవి లేవు. గోదాన ఫలం ఇచ్చినవాడికీ, తీసుకున్నవాడికీ కలుగుతుంది. గోదాన ఫలం ఇంతది అని చెప్పడానికి బ్రహ్మకు కూడా శక్యం కాదు. ఆవులంటే సూర్యకిరణాల లాంటివి కాబట్టి గోదానం చేసినవారు సూర్యుడిలాగా ప్రకాశిస్తారు. పుణ్యపురుషుల చరిత్రలు కూడా గోదానానికి సరికావు’ అని అన్నాడు.

ఆవులలో కపిలగోవు శ్రేష్ఠమైనదని, దానిని దానం చేస్తే పాపాలన్నీ పోతాయని, ధర్మరాజు ప్రశ్నకు సమాధానంగా చెప్పిన భీష్ముడు కపిల గోవులకు ఆ విశేషం ఎలా కలిగిందో వివరించాడు ఇలా. ‘దేవతలకు ఆకలివేసి బ్రహ్మవద్దకు పోగా వారికి ఆయన అమృతాన్ని అందించాడు. ఆ అమృతపు వాసనలకు కామధేనువు పుట్టింది. దానికి ఆవులు పుట్టాయి. అవి హిమాలయ పర్వత పై భాగాన తిరుగుతున్నప్పుడు ఒక లేగదూడ తల్లిపాలు త్రాగుతూ ఉండగా పాలనురుగు గాలివాటానికి ఎగిరి శివుడి శిరస్సుమీద పడింది. దానికి ఆయన కోపించి మూడవ కన్ను తెరిచాడు. ఆ మంటకు ఆవులు ఎర్రబడిపోయాయి. బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వచ్చి ఆవుపాలు అమృతం వంటివని ప్రశంసించి ఆయనను ప్రసన్నుడిని చేసికొన్నాడు. శివుడు గోవులకు ఎక్కడైనా తిరిగే వరమిచ్చాడు. తన కంటి మంటకు ఎర్రబడిన ఆవులు శ్రేష్ఠమైనవని పేర్కొన్నాడు. దానితో కపిలగోవులను దానం చేయటం ఉత్తమమైనదనే ప్రశస్తి ఏర్పడింది. కపిలగోవుల కథ పుణ్యప్రదమైనది’.

ఆ తరువాత ధర్మరాజు కోరిక మేరకు గోలోకం బ్రహ్మలోకానికి పైన ఎందుకుందో చెప్పడిలా. ‘పూర్వం బ్రహ్మ అపూర్వ సౌందర్యరాశి అయిన సురభి అనే కన్యను, మార్తాండుడనే మగవాడిని సృష్టించి, వారిరువురకు కలిగే సంతానం యాగాలకూ, మోక్షానికి పనికివచ్చే పాలను సృష్టించి, బ్రహ్మలోకానికి పైభాగాన ఉండేటట్లు వరమిచ్చాడు. వారికి పుట్టిన ఆవులు క్షీరము లిచ్చాయి. మరొకసారి కామధేనువు చేసే తపస్సుకు మెచ్చి గోలోకాన్ని వరంగా ప్రసాదించాడు. ఆ విధంగా బ్రహ్మలోకంకంటె గోలోకం ఉన్నతంగా నిలిచింది’ అని అన్నాడు.  

భీష్ముడు ధర్మరాజు కోరికపై గోమహిమలను గురించి మరెన్నో విశేషాలను వివరించి చెప్పాడు. ఆవుపేడలో లక్ష్మి వుండడానికి కారణం (గో శ్రీసంవాదం అనే పూర్వగాథ ఆధారంగా) కూడా చెప్పాడు ఇలా. ‘ఒకసారి లక్ష్మీదేవి గోవులమందలోనికి వెళ్లి వాటి మధ్య ఉండటానికి అభిలషించింది. కాని, లక్ష్మి చంచల స్వభావురాలు కాన అవి ఆమె కోర్కెను మన్నించలేదు. ఆవులు తిరస్కరిస్తే లోకం గౌరవించదని పలికి లక్ష్మి గోవులను ప్రార్థించింది. గోవులు తమ మలమూత్రాలు పరమ పవిత్రమైనవని వేదం పేర్కొన్నది కాబట్టి వాటిలో నివసించమని అనుమతించాయి. లక్ష్మి దానికి ఆమోదించి వాటిలో నివసించింది. అందువలన వాటి మహిమ పెరిగింది’.

గోమాహాత్మ్యం తెలిపే కథలు వినినవారికి ఆయువు, సంపద, అధికారం, కీర్తి, సద్గతి కలుగుతాయి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ద్వితీయ-తృతీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)