అలనాటి బంధాలు అదృశ్యం
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక ఆదివారం (25-06-2023)
గ్రామీణ
వాతావరణంలో బాల్యం, పెరుగుతున్న
వయసులో పాక్షికంగా పట్టణీకరణ జరిగిన జిల్లా కేంద్రం ఖమ్మంలో, యుక్తవయసులో కళాశాల
విద్యాభ్యాసానికి రాజధాని నగరం హైదరాబాద్ లో, ఆ తరువాత ఇప్పటిదాకా ఉద్యోగరీత్యా
హైదరాబాద్ నగరంలోనే స్థిరపడిన నాకు, 75 సంవత్సరాల
వయసులో, ఐదారు
దశాబ్దాల క్రితం గడిపిన రోజులు మళ్లీ రావనిపిస్తున్నది. అప్పటి ‘బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు’ తలచుకుని, వర్తమాన
పరిస్థితులతో పోల్చుకుంటే ఎందుకీ మార్పు వచ్చిందనే ఆవేదన అంతరాంతరాలను
కలచివేస్తున్నది. ఇదేవిషయాన్ని నా వయసుకు కొంచెం అటో ఇటుగా వున్న కొందరిని
కదిలించగా చాలామంది పైకి చెప్పలేకపోయినా,
నా అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించారు. ఎంత లోతుగా విశ్లేషించినా కారణాలు స్పష్టంగా
బోధపడడం లేదనేది కఠినమైన వాస్తవం.
ఆ రోజుల్లో
కొన్ని సాంఘిక దురాచారాలు ఆచరణలో ఉన్నప్పటికీ, గ్రామీణులంతా ‘వసుధైకకుటుంబం’
లాగా కలమిడిగా, ఒకరికొకరు
చేదోడు వాదోడుగా వుండేవారు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా తరతమభేదం లేకుండా, సాయపడడానికి ముందుకొచ్చేవారు. ఎవరింట్లో ఏరకమైన
శుభ-అశుభ కార్యం జరిగినా అంగబలమో, అర్థబలమో తమతమ తాహతునిబట్టి సమకూర్చి
సహాయపడేవారు. ఎవరింటికి బంధువులు వచ్చినా అడిగీఅడగకముందే, ఆ వచ్చిన బంధువుల
సౌకర్యం నిమిత్తం, కులాలకు, అంతస్తులకు
అతీతంగా తమ ఇళ్లకు తీసుకుపోయేవారు. అవీ ఆరోజుల్లోని అనుబంధాలు.
ఇప్పటిలాగా కాకుండా ఆ రోజుల్లో గ్రామాలలో (ఎక్కువగా) పెళ్లిళ్ళు
జరుగుతే పరాయి ప్రదేశాల నుండి వచ్చిన బంధువులు ఒకటి-రెండు రోజుల ముందే వచ్చి, వారి సామాన్లు (సాధారణంగా చిన్న బిస్తరి, లేదా ఒక చిన్న సంచీ) పెళ్లివారి ఇంట్లో ఒక మూలన
పడేసి, తాపీగా వుండి,
పెళ్ళైన తరువాత మరో రెండు రోజులు వుండి, పెట్టింది తృప్తిగా తిని, కులాసా కబుర్లు చెప్పుకుని పోయేవారు. వున్నన్ని
రోజులు సరదాగా వివాహ సంబంధిత కార్యక్రమాలను ఒకవైపు ఆసక్తిగా వీక్షిస్తూనే, కోలాహలంగా పెళ్లివారు వెంట వెంట అందిస్తుండే
కాఫీ, బూందీ, అటుకుల మిక్స్చర్ లాంటివాటిని ఆస్వాదిస్తూ
చతుర్ముఖ పారాయణం సరదాగా, సీరియస్ గా
చేయడం ఆనవాయితీ. ఇక ఆరోజులనాటి తాటాకు పందిళ్లు, కొబ్బరి ఆకుల అలంకరణ, వట్టివేళ్ళ విసనకర్రలు, మేనత్త-మేనమామల పిల్లల చిరు సరసాలు, దాదాపు మృగ్యమే. అంతా యాత్రీకమే, అసహజమే! ఎబ్బెట్టే!
ఇక పట్టణాలలో, నగరాలలో అయితే పెళ్లివారి ఇంటికి వచ్చే అతిథులు
దాదాపు లేనట్లే. వచ్చే బంధువులు తమ వసతి కొరకు స్టార్ హోటళ్లలో ఏర్పాటు చేయమని
డిమాండ్ చేస్తున్నారు. లేదా కొందరు వారంతట వారే నచ్చిన హోటళ్లలో దిగి ముహూర్తం
సమయానికి వచ్చి, మొక్కుబడిగా అక్షింతలు వేసి, లాంచనంగా
విందు భోజనం అంటీముట్టనట్లు తిని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇక వున్నవూరిలో
వారైతే ముహూర్తం (జీలకర్ర-బెల్లం పెట్టే) సమయానికి రావడం, అక్షింతలు వేసి పోవడం ఒక ఫార్మాలిటీలాగా
చేస్తున్నారు. మంగళసూత్రా ధారణ దాకా వుండే బంధువులు,
స్నేహితులు చాలా తక్కువమందే! భోజనం ప్లేట్ల లెక్క మాత్రం తప్పడం లేదు. ‘మృష్టాన్న
భోజనం’ అయినా, రకరకాల వంటకాలున్నా, పెద్ద ఎత్తున మద్యం పార్టీలున్నా, అవన్నీ పెళ్లి చేస్తున్నవారి సంపద ప్రదర్శనగానే
మిగిలిపోతున్నాయి. పాతరోజుల్లో జరిగే మూడు, ఐదు, పదహారు రోజుల పెళ్లిళ్లలో సంప్రదాయబద్ధమైన
వేడుకలు, ఆచారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగేవి. హరికథలు, బుర్రకథలు వుండేవి. ఇప్పుడు వాటి స్థానంలో సంగీత్
అని, మెహందీ అని, లాస్ట్ బాచిలర్స్ పార్టీ అని, రిసెప్షన్ విందు అనీ, వారివారి తాహతును బట్టి సంపదను అతిగా ప్రదర్శించేవిగా
జరుగుతున్నాయి. ఖర్చు ఇబ్బడి-ముబ్బడి. ఆప్యాయతలు,
అనురాగాలు లేనట్లే!
ఆ పాత రోజుల్లో, విద్యను అభ్యసించడానికి, తల్లిదండ్రులు వున్న వూర్లో
కాకుండా వేరే ప్రదేశానికి విద్యార్థులు పోవాల్సి వచ్చినప్పుడు అక్కడ
ఉద్యోగారీత్యానో, మరేకారణానో నివసిస్తున్న
బంధువుల ఇళ్లలో పూర్తికాలమన్నా, లేదా వసతి సౌకర్యం దొరికేవరకన్నా వుండి చదువుకోవడమనేది
ఆనవాయితీ. మేనమామల ఇంటిలోనో, మేనత్తల ఇంటిలోనో,
బాబాయి, పెద్దనాన్నల
ఇళ్లలోనో, లేదా సమీప బంధువుల ఇళ్లలోనో, ఒక్కోసారి తల్లిదండ్రుల స్నేహితుల
ఇళ్లల్లోనో వుండడం ఒక ‘ఆప్యాయతతో కూడిన హక్కు’ లాగా భావించేవారు. ఇక వుంచుకునే బంధువులు,
స్నేహితులు కూడా అదొక ‘బాధ్యత’ గా, తమకు దక్కిన ఒక గౌరవంగా అనుకునేవారు.
ఇప్పుడు వుండడానికీ, వుంచుకోవడానికీ మొహమాటమే. వచ్చినవాడు ఎప్పుడు
పోతాడా అని ఒకరు, ఎప్పుడు
పోదామా అని మరొకరు ఆలోచించే రోజులొచ్చాయి. ఇక స్కూల్లోనో, కాలేజీలోనో సీటు
ఇప్పించడం లాంటి సహాయం చేయడం లేనేలేదు. అలాగే పనులమీద గ్రామాల నుంచి జిల్లా లేదా
రాజధాని కేంద్రానికో వెళ్లినప్పుడు బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లల్లో వుండే
ఆనవాయితీ, ఆచారం, మర్యాద
ఎప్పుడో, ఏనాడో పోయింది. నేను హైదరాబాద్ వచ్చిన మొదట్లో చాలా సంవత్సరాల దాకా, మా
సమీప బంధువులు, ఒక్కోసారి
ఉన్నతాధికారులైన వారి స్నేహితులు, మాఇంట్లో (చిన్న రెండు గదుల) ఎలాంటి సౌకర్యం
లేకపోయినా వుండి, మాతోపాటే తిని, పనైన తరువాత
వెళ్లిపోయేవారు. ఇక ఇప్పుడు, ఒక పూట భోజనానికి పిలవడం కూడా చాలామంది చేయడం
లేదు. అన్నీ హోటళ్లలోనో, క్లబ్బులలోనో వారివారి తాహతును బట్టి జరిగిపోతున్నాయి.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి బందు వ్యవస్థ ఇక లేనట్లే!!!
బాగా ఆలోచింప చేస్తున్న, ఒకప్పుడు అంతగా పాటించని విషయం ‘గోప్యం’.
దీన్ని చాలామంది అన్నిట్లో కాకపోయినా, చాలావాటిల్లో పాటించాల్సిన
అవసరం, ఆగత్యం, తప్పనిసరి పరిస్థితిగా కలుగుతున్నది. మారుతున్న కాలంలో, మానవ విలువలు పాటించడం తగ్గుతున్న, లేదా
పూర్తిగా క్షీణిస్తున్న నేపధ్యంలో, కొంతలో కొంత గోప్యం పాటించక తప్పడంలేదు. గతంలోలాగా,
దగ్గరివారికి, అయినవారనుకున్నవారికి
తమ స్వవిషయాలు చెప్పుకుంటే, వారిలో కొందరు, వాటినే ‘చిలవలు పలువలు’ గా ఉన్నవీ-లేనివీ
చేసి, చికోరీ కలిపి, అనవసరమైనవారికి, తక్షణమే చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేనివారికి
చేరవేయడం, ప్రచారం చేయడం దురదృష్టం. ముఖ్యంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు,
దగ్గర-దూరపు బంధువులకు కానీ, స్నేహితులకు
కానీ, అదీ అందరితో కాకపోయినా కొందరితోనన్నా చెప్పుకుని, మనసులో భారాన్ని దించుకునేవాళ్లం చాలామందిమి
పాతరోజుల్లో. ఇప్పుడు అలాచెప్పుకుంటే మనసులో భారం పెరుగుతున్నది. ఎందుకు చెప్పామా
అన్న సందేహం కలుగుతున్నది. కలిమిడిగా పరిష్కార మార్గాలను అన్వేషించే రోజులు
పోయాయి.
అందుకే గోప్యంగా వుంచడమే సహేతుకమేమో అనుకోవాలి. అలా వుంచేవారి ఆలోచన
వందశాతం కరెక్ట్ కావచ్చు. కలిగిన కష్టం చెప్పుకుంటే గతంలోలాగా కడుపులో పెట్టుకునే
రోజులు పోవడంతోపాటు, ఇతరుల కష్టాన్ని కడుపులో పెట్టుకునే సన్నిహిత
వ్యక్తులు కూడా తగ్గిపోతున్నారు. అసలు సాన్నిహిత్యమే కనుమరుగవుతున్నది!! ఎవరైనా
ఆసుపత్రిలో చేరినట్లు తెలిస్తే బంధువులు కానీ, స్నేహితులు
కానీ, తక్షణం
హాజరవ్వాల్సిన పనులను పక్కన పెట్టి, వెళ్లి పరామర్శించి వచ్చేవారు మునుపటి
రోజుల్లో. ఆపరేషన్ లాంటిది జరుగుతే ఆద్యంతం థియేటర్ ముందే వుండిపోయి పేషంట్
భర్తకో, భార్యకో,
తల్లిడంద్రులకో ధైర్యం చెప్తూ, అవసరమైతే రాత్రుళ్లు తోడుగా వుండేవారు. పేషంట్
తాలూకు వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయకపోయేవారు. ఇప్పుడు అలావచ్చే కొందరు ధైర్యం
చెప్పడం, సహానుభూతి చూపడం కన్నా ఇబ్బందికరమైన సానుభూతి చూపడం జరుగుతున్నదేమో అన్న
సందేహం కలుగుతున్నది??? ఆసుపత్రుల నిబంధనల కారణాన పరామర్శించడానికి వచ్చేవారి సంఖ్య
కూడా తగ్గిపోతున్నది.
ఆర్ధిక ఇబ్బందుల గురించి కూడా చెప్పుకోవాలి. పాత రోజుల్లో ఎవరికి
ఏచిన్న ఆర్థికపరమైన సమస్య వచ్చినా బంధుమిత్రులు తమకు ఆదుకునే తాహతు అంతగా
లేకపోయినా, వున్నదాంట్లోనే సర్దుబాటు చేసేవారు. అడిగేవారు కూడా మొహమాట
పడకపోయేవారు. గాస్ సిలిండర్ కు, పాలసీసాలకు,
ఆడపిల్లల పెళ్లిళ్లకు, ఆసుపత్రుల ఖర్చులకు, బంధువులు, స్నేహితులు డబ్బులు సర్దిన రోజులున్నాయి. అప్పట్లో
అందరి జీతాలు అంతంత మాత్రమేకాని ఆప్యాయతలకు, అనురాగానికి కొదవలేదు. ఇప్పుడు చాలామంది
అంతస్తులు పెరిగినా, ఆర్ధిక స్థోమత
పెరిగినా, సహాయం
చేయడానికి ముందుకొచ్చేవారు తగ్గిపోతున్నారు. ఇప్పుడు ఎవరి బాధ వారే పడతారులే అనే
భావన. పడుతున్నారు కూడా. దీన్ని స్వార్థం అనాలా?
ఇవన్నీ ఒక ఎత్తైతే, కాలం
గడుస్తున్న కొద్దీ, పాతరోజుల్లో లేనివిధంగా ‘ఈర్ష్యాసూయలు’
పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఒకరికి మంచి జరిగినా, మంచి
పదవి వచ్చినా, పదోన్నతి
వచ్చినా, విదేశాలకు
పోయే అవకాశం వచ్చినా, ఒక
ఆవార్దో-రివార్దో వచ్చినా, యావన్మంది
బంధుమిత్రులు తమకే వచ్చినట్లు భావించి, ఆనందించేవారు.
ఇప్పుడు అలాకాదు. పైకి సంతోషం ప్రకటించినా, ఏదో వ్యక్తం
చేయలేని ఈర్ష్య, అసూయ
చాలామందిలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ వయసులో ఇలా రాసుకుంటూ పోతే మనసులో
బాధ పెరగడమే కాని స్వాంతన కుదిరే అవకాశాలు ప్రస్ఫుటంగానైతే కనిపించడం లేదనడంలో
అతిశయోక్తి లేదనాలి. ఎందుకంటే దీనికి నేను సహితం అతీతుడిని కాకపోవడమే!!! తప్పు
మారుతున్న కాలానిదేనని సరిపుచ్చుకోవడమే శ్రేయస్కరం!!! కాలంతోపాటే మనమూ మారాలి
కదా!!!
(స్వానుభవంతో రాసినవే తప్ప ఎవరినీ ఉద్దేశించి కానేకాదు!!!)
కరెక్ట్ గా చెప్పారు
ReplyDelete