Monday, June 26, 2023

స్వర్ణదాన మహిమను, అపరిగ్రహం అనే మహా పుణ్యాన్ని వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-126 : వనం జ్వాలా నరసింహారావు

 స్వర్ణదాన మహిమను, అపరిగ్రహం అనే మహా పుణ్యాన్ని వివరించిన భీష్ముడు

ఆస్వాదన-126

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-06-2023)

యజ్ఞాలన్నింటిలో మిక్కిలి శ్రేష్టంగా ఇవ్వతగ్గది బంగారమని అంటారని, వేదాలు కూడా సువర్ణ దక్షిణను కొనియాడుతూ వుంటాయని, భూమి, ఆవులు, బంగారం మేలైన దానాలని వేదవ్యాసుడే చెప్పాడని, ఈ నేపధ్యంలో బంగారం గొప్పతనాన్ని, స్వర్ణదాన మహిమాతిశయాన్ని వినాలని వుందని భీష్మ పితామహుడితో అన్నాడు ధర్మరాజు.

భీష్ముడు, తన తండ్రి శంతను మహారాజు చనిపోయినప్పుడు, తాను పితృకార్యం నిర్వహిస్తున్న సమయంలో, పితృదేవతలు స్వర్ణదాన మహిమను గురించి చెప్పగా అతడు బంగారం దానం చేసి ధన్యుడైన అంశం వివరించాడు. భీష్ముడు భూమికి, గోవుకు బదులుగా సువర్ణాన్ని ఇవ్వడాన్ని తన పితృదేవతలు ప్రశంసించిన విషయాన్ని కూడా చెప్పాడు. సువర్ణదానం పితృదేవతలకు కూడా ప్రీతి కలిగించిందంటే దాని మహిమ ఎంతటిదో అర్థం చేసుకోవాలని భీష్ముడు అన్నాడు. సువర్ణం పరమ పవిత్రమైనదని అది ఇచ్చిన వాడికే కాకుండా, తరతరాలుగా వున్న వంశం వారందరికీ కల్మషంలేని బుద్ధినిస్తుందని, ఇది గ్రహించి అన్ని యజ్ఞాలలో సువర్ణదానం చేయమని ధర్మరాజుకు చెప్పాడు భీష్ముడు. 

పరశురాముడి కథను కూడా ఉదాహరించాడు భీష్ముడు ఈ సందర్భంగా. పరశురాముడు 21 సార్లు రాజులను చంపిన తరువాత ప్రాయశ్చిత్తంగా అశ్వమేధయాగం చేశాడని, అయినా తృప్తి కలగలేదని, అప్పుడు వశిష్ఠుడి సూచన-సలహా మేరకు సువర్ణ దానం చేశాడని అన్నాడు. వశిష్ఠుడు పరశురాముడికి చెప్పిన సువర్ణ మహిమను వివరించాడిలా.

‘పార్వతీపరమేశ్వరులు ఒకరికొరకు ఒకరు తపస్సు చేసి ఒకరినొకరుగా పొందారు. లోకమంతా మహానందం పొందగా వారు పరమ సుఖంతో నిండిన హృదయాలు కలవారయ్యారు. కొంతకాలానికి, వారు కలిసి ఉన్నప్పుడు పరమేశ్వరుడి వీర్యం వెలువడింది. అతడు ఆ వీర్యాన్ని తన భావన శక్తి ద్వారా అగ్నియందు నిలిపాడు. ఆ సమయంలో తారకాసురుడనే రాక్షసుడి వల్ల బాధితులైన దేవతలు బ్రహ్మ వద్దకు వచ్చి మొర పెట్టుకోగా, అగ్నిని వేడుకొమ్మని ఆయన వారికి సూచించాడు. వారు అలా పోవడానికి సిద్ధపడ్డారు. అగ్నిదేవుడు వుండే చోటు కానరాలేదు వారికి. అగ్ని పాతాళంలో దాగి వున్న రహస్యాన్ని ఒక కప్పు దేవతలకు తెలిపింది. దానికి కోపించి అగ్ని కప్ప నాలుక కదలకుండా ఉండాలనీ, రుచులు తెలియరాకుండా ఉండాలని శపించాడు. దేవతలు కరుణించి కప్పలు ఎండలకు బొరియలలో ఎండిపోయినా నీరు రాగానే అవి జీవించి బెకబెకలాడుతాయని వరమిచ్చారు’.

‘అగ్ని రావిచెట్టులో దాగి ఉండగా ఒక ఏనుగు సైగ చేసి దేవతలకు ఆ విషయాన్ని చెప్పింది. అగ్ని కోపించి ఏనుగులకు నాలుక తిరుగబడాలని శపించాడు. దేవతలు ఏనుగులకు నాలుకలు తిరగబడినా రుచులు కలిగేటట్లు వరమిచ్చారు. జమ్మి గర్భంలో అగ్ని దాగి ఉండగా ఒక చిలుక ఆ రహస్యాన్ని దేవతలకు తెలిపింది. అగ్ని కోపించి చిలుక నాలుక తిరుగబడేటట్లు శపించాడు. దేవతలు చిలుకకు పలుకులు వచ్చే వరమిచ్చారు. చివరకు అగ్ని దేవతలకు కనిపించి, తారకాసుర వధను గురించిన వారి కోర్కెను తెలిసికొని దానిని తీర్చగలనని మాట ఇచ్చి వారిని పంపాడు’.

‘అగ్ని తనలో ఉన్న శివరేతస్సును గంగలో గర్భరూపంగా వదిలాడు. అది చాలా పెద్దదిగా పెరగటంవలన గంగ భరించలేక మేరుపర్వతం ఒడ్డున ఉన్న రెల్లుతోటలో దానిని నిలిపింది. అది బంగారు వన్నెతో మిలమిలలాడుతూ బాలుడి రూపం తాల్చింది. ఆ బాలుడిని కృత్తికలు ఆరుగురూ తమకు కొడుకుగా భావించి లాలించారు. ఆరుగురు తల్లుల లాలనను అందుకొనడం వల్ల ఆ బాలుడు ఆరు ముఖాలు కలవాడయ్యాడు.  ఆ విధంగా అగ్నిపుత్రుడు గంగాపుత్రుడూ, కృత్తికాపుత్రుడూ అయ్యాడు. బ్రహ్మాదులు అతడిని పూజించి దేవతా సైన్యానికి నాయకుడిని చేశాడు. అతడు తారకాసురుడిని సంహరించి దేవతలకూ, మునులకూ సంతోషాన్ని కలిగించాడు. ఆ కుమారస్వామి బంగారమే స్వరూపంగా కలవాడు కావటం, అతడు శివరూపుడు కావటం, అగ్ని హిరణ్యరేతుడు కావటం, శివుడు వహ్నిరేతుడే కావటంవలన బంగారం జాతరూపమనే పేరుతో ప్రసిద్ధి చెందింది. పరశురాముడు స్వర్ణ మహిమను తెలిసికొని దానిని విపులంగా దానం చేసి కృతార్థుడయ్యాడు’.

ఈ కథ చెప్పిన భీష్ముడు ధర్మరాజును కూడా స్వర్ణదానం చేసి సంసార సముద్రాన్ని దాటమని హితవు పలికాడు. తన తరువాత ప్రశ్నగా ధర్మరాజు, ‘పితృయజ్ఞం ఎట్లా చేయాలో చెప్పమని అడిగాడు. దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు కాబట్టి దేవపూజకంటె పితృదేవతల పూజ శ్రేష్ఠమైనదని,  అమావాస్యనాడు పిండ ప్రదానంతో శ్రద్ధతో చేసిన పితృపూజ నిత్యశ్రాద్ధం చేసిన ఫలితాన్ని ఇస్తుందని, పాడ్యమి మొదలైన తిథులలో కృత్తిక మొదలైన నక్షత్రాలలో శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఆయా విశేష ఫలాలు ఏర్పడుతాయని, కృష్ణపక్షం, అపర్ణాహం శ్రాద్ధానికి తగిన సమయాలని, కృష్ణపక్షంలో పాడ్యమి, దశమి, చరుర్దశి తిథులు మంచివి కావని సమాధానం ఇచ్చాడు భీష్ముడు.

‘శ్రాధ్ధం ఏ వస్తువులతో చేస్తే ఎక్కువ ఫలం వస్తుందని అడిగాడు ధర్మరాజు. నువ్వులు, పాయసం, నేయి శ్రాద్దాలకు మేలైన వస్తువులని, ఆవులనుండి ఏర్పడేది ఏదైనా గొప్ప ఫలాన్ని ఇస్తుందని, చేపలు, మాంసం, అందులోనూ గొర్రె, ఖడ్గమృగం, గండభేరుండం, మేక మాంసాలు శ్రేష్టాలని చెప్పి, శ్రాద్ధానికి సంబంధించిన తిథుల విశేషాలను వివరించాడు భీష్ముడు. కులవయోరూపశీలవిద్యలలో ఉదాత్తులయినవారు ఆరాధనకు యోగ్యులని, జూదరులు మొదలైనవారు పంక్తిదూషకులని, పగవారిని శ్రాద్ధంలో భోక్తలుగా నియోగించరాదని అన్నాడు భీష్ముడు.

‘ఉపవాసవ్రతాన్ని తపస్పని పెద్దలంటారని, నిజానికి అదేనా లేక మరొకటి ఉన్నదా అని, చేవగల తపస్సు పద్ధతిని తెలపమని ధర్మరాజు పితామహుడిని కోరాడు. వస్తులుండటం తపస్సు కానేకాదని, అది ఆత్మను హింసించటమని, దానివలన నరుడు తపస్వి కాజాలడని, సత్యం. బ్రహ్మచర్యం, ఎడతెగని పరిశుభ్రత, నిత్య పవిత్రత, మౌనం, సాటిలేని నిష్ఠ, భూతదయ, శుద్ధత్యాగం అనేవి తపస్సంపద ఆకారాలుగా తత్త్వవేత్త లంటారని భీష్ముడు అన్నాడు ధర్మరాజుతో.  

దాన శీలుడి విశేషమూ, దానం పుచ్చుకొననివాడి ప్రత్యేకతా గురించి చెప్పమని అడిగాడు ధర్మరాజు. ఈ విషయం తెలుసుకోవడానికి సప్తర్షి-వృషాదర్భి సంవాదం అనే పూర్వగాథ వున్నదని దాని సారాంశాన్ని చెప్పాడు భీష్ముడు. ‘సప్తర్షులు (కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, భరద్వాజుడు, జమదగ్ని, వశిష్ఠుడు), అరుంధతి, గండ, పశుసఖు డనే పదిమంది తపస్సు చేసికొంటూ భూమిమీద తిరుగుతూ ఉండేవారు. వారలా తిరుగుతుండగా ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడి తినటానికి పదార్థాలేవీ దొరకక బాధపడ్డారు. కశ్యపుడు మొదలైనవారు ఆకలి పీడించగా అన్నం కొరకు వెతకసాగారు. ఈ నేపధ్యంలో, శిబి కొడుకు యాజ్యుడనేవాడు తన కొడుకైన నీలుడిని ఋత్విక్కులకు యజ్ఞదక్షిణగా ఇచ్చాడు. అతడు కాలంతీరి చనిపోగా, అతడి శవాన్ని తినటానికి సప్తర్షులు సిద్ధమయ్యారు’.

‘అప్పుడు వృషాదర్భి అనే రాజు వారికి అగ్రహారాలతోపాటు ఆహారధాన్యాలను ఇస్తానని పిలిచాడు. వారు రాజునుండి దానం పుచ్చుకొనే ఆచారం తమకు లేదని, రాజు నుండి పుచ్చుకోవడం విషంగాను, కల్లుగాను భావిస్తామని అంటూ అతడి దానాన్ని తిరస్కరించారు. రాజు పంపిన బంగారం నింపిన పండ్లను కూడా తీసుకోవడానికి అంగీకరించలేదు. అతడు కోపించి యజ్ఞంచేసి ‘కృత్య'ని సృష్టించి వారిని చంపటానికి పురికొల్పి పంపాడు. సప్తర్షులకు తోడుగా శునస్సఖుడు అనే సన్యాసి వారితో కలిసి తిరుగ నారంభించాడు. వారొకసారి సరోవరంలోని తామరతూండ్లను తిని బతుకుదామని భావించగా కృత్య వారిని అడ్డుకొని వారించింది. శునస్సఖుడు ఆమెను మంత్రదండంతో భస్మం చేశాడు. ఋషులు తామరతూండ్లను తెంచుకొని కట్టకట్టి ఒడ్డున పెట్టి స్నానాదులు ముగించుకొని వచ్చేసరికి తామరతూండ్ల కట్ట మాయమైపోయింది. ఋషులు ఒకరిపై మరొకరు అనుమానపడ్డారు. అప్పుడా పదిమంది తామరతూండ్లను దొంగిలించలేదని ఘోరప్రతిజ్ఞలు చేశారు. శునస్సఖుడు చివరకు తాను తీశానని ఒప్పుకొని వారి చిత్తవృత్తులను పరీక్షించటానికే అట్లా చేశానని పేర్కొని, తాను ఇంద్రుడనని ప్రకటించుకొని, కృత్యనుండి వారిని కాపాడిన సంగతి చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా లోభగుణానికి లోనుకాని వారి చిత్తవృత్తులకు మెచ్చుకుని వారికి శాశ్వతలోకాలను సిద్ధింపజేశాడు’.

ఈ కథ చెప్పిన భీష్ముడు, ఇదంతా ఇలా జరగడానికి కారణం పుచ్చుకొనకపోవడం అనే గుణం గొప్పతనం వల్లేనని, సాధారణంగా ఒకడు దానాదులను తన పాపాలను పోగొట్టుకోవడానికి చేస్తాడని, అంటే అవి పుచ్చుకొనేవాడికి సంక్రమించే ప్రమాదం వున్నదని, కాబట్టి అపరిగ్రహం మహాపుణ్యమని అన్నాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment