వివాహ విధానాలను, గోవుల మహాత్మ్యాన్ని వివరించిన భీష్ముడు
ఆస్వాదన-124
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (12-06-2023)
ఆలోచించాల్సిన విషయమైన ‘వధువును ఎన్నుకొనే పద్ధతిని’ తెలియచెప్పమని
పితామహుడు భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు, కులం,
శీలం, విద్య కలవాడిని పిలిచి ప్రీతితో
కన్యనివ్వటం బ్రాహ్మవివాహమని, కన్యా వరుడూ పరస్పరం కోరుకొని
వివాహమాడటం క్షాత్రమని, కన్నె తాను కోరుకొన్నవాడితో
వివాహమాడటం గాంధర్వమని, కట్నంతో చేసికొనేది ఆసురమని, బంధువులను చంపి కన్నెను బలవంతంగా ఎత్తుకొనిపోయి వివాహమాడటం రాక్షసమని
చెప్పాడు భీష్ముడు. ఈ అయిదు రకాలలో మొదటి మూడూ ధర్మవివాహాలని, మిగిలినవి రెండూ ధర్మానికి దూరంగా వుండే పద్దతితో కూడుకున్నందున అవి
కలుషితాలని అన్నాడు.
ధర్మపత్నియందు ధర్మబద్ధంగా పుట్టిన కొడుకు ఔరసుడని, కూతురి
కొడుకును దత్తత తీసికొంటే వాడు దౌహిత్రుడని, ధర్మమార్గంలో తన
భార్యను ఇతరుల కర్పించగా అతడివలన కలిగినవాడు క్షేత్రజుడని ధర్మరాజు అడిగిన మరో
ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు.
‘తల్లిదండ్రులు జలధార పూర్వకంగా దానం చేయగా దక్కినవాడు
దత్రిముడు. అనాథ బాలుడిని కొడుకుగా గ్రహిస్తే అతడు కృత్రిముడు. అజ్ఞాతంగా ఎవరివలన
కలిగినా,
పరభార్యకు పుట్టినా, భార్య కలవాడికి అతడు
గూఢజుడు. తల్లిదండ్రులు వదలివేసిన వాడిని కొడుకుగా స్వీకరిస్తే అతడు అపవిద్ధుడు.
కన్యగా స్త్రీ కన్నకొడుకు కానీనుడు. పెండ్లికాకముందే గర్భవతియై వివాహానంతరం స్త్రీ
కన్నకొడుకు సహోఢుడు. భర్తను విడిచిన భార్య, భార్యను విడిచిన
భర్త, విధవ ఎవడి వలన కొడుకును కంటారో ఆ కొడుకు కన్నవాడికే
కొడుకు. అతడి పేరు పౌనర్భవుడు. తనను తాను ఇతరులకు దానం చేసికొన్నవాడు
స్వయందత్తుడు. తల్లిదండ్రులు అమ్మగా కొనబడినవాడు క్రీతుడు. ఈ పన్నెండుమంది
పుత్రులలో ఔరసుడు శ్రేష్ఠుడు. వైదిక కర్మలకు తగినవాడు. ఔరసుడితో కూతురుకొడుకు
(దౌహిత్రుడు) సమానుడని పండితుల అభిప్రాయం. వేదకర్మలను, శాస్త్ర
విధులను పాటించి ఉభయ కులాలను ఉద్ధరిస్తే ద్వాదశపుత్రులూ యోగ్యులే’ అని అన్నాడు
భీష్ముడు.
‘కలిసి ఉండటం (సహవాసం) వలన, దర్శనం (చూడటం) వలన
పుట్టే స్నేహాలు ఎట్లాంటివి? గోవుల మాహాత్మ్యం ఎటువంటిది’
అని అడిగాడు ధర్మరాజు భీష్ముడిని. ధర్మరాజు సందేహాన్ని చ్యవన నహుష సంవాదం
తీరుస్తుందని దాని సారాంశాన్ని ఇలా చెప్పాడు.
‘చ్యవనమహర్షి గంగాయమునల సంగమ తీర్థంలో మునిగి తపస్సు చేస్తూ
ఉండగా అతడి శరీరాన్ని చేపలు తాకుతూ ఉండేవి. వాటిమీద స్నేహంతో (సహవాసంతో)
పన్నెండేళ్ళు తపస్సు చేశాడు. ఒకసారి జాలరులు చేపలు పట్టుతూ, చేపలతో
పాటు ఆ మునిని కూడా వలలో బంధించి ఒడ్డుకు లాగారు. ఋషిని చూచి జాలరులు భయపడి
క్షమాపణ వేడి, చేసిన పనికి ప్రాయశ్చిత్తం చెప్పుమని కోరారు.
చ్యవనుడు చేపల మీద ప్రేమతో, వాటితోపాటు తనను కూడా తగిన వెలకు అమ్ముకోవాలని సూచించాడు.
ఆ మాట విని బోయలు భయపడి నహుషుడనే రాజు వద్దకు వెళ్లి చ్యవనుడి వృత్తాంతం చెప్పారు. అతడు తొట్రుపాటుతో ఋషివద్దకు వచ్చి
క్షమాపణ కోరుకొన్నాడు. బోయలు తమ కులధర్మం
పాటించడంలో తప్పులేదని, వారు చాలా కష్టపడ్డారని అంటూ చ్యవనుడు
తన శరీరం ధర నిర్ణయించి బోయల కిమ్మని చెప్పాడు’.
‘రాజు సంతోషించి చ్యవనుడి ధరను వేయి మాడల నుండి సర్వరాజ్యం
వరకు నిర్ణయించి బోయలకు ఇవ్వచూపాడు. చ్యవనుడు అన్ని పర్యాయాలూ,
దానికి అంగీకరించకుండా, “న్యాయం తెలిసి వెల నిర్ణయించ” మనేవాడు. చివరకు ఆ రాజును తన
మంత్రులతో ఆలోచన చేసి తగిన మూల్యం నిర్ణయించుమని సూచించాడు. రాజు అట్లాగే చేశాడు.
అప్పుడక్కడికి గవిజాతుడనే ముని వచ్చి, రాజును దుఃఖించవద్దని
చెప్పి, తాను చ్యవనుడి వెల నిర్నయిస్తానని అన్నాడు. గోవూ,
బ్రాహ్మణుడూ ఒకటే కులమని, కాకపోతే బ్రహ్మ
రెండుగా సృష్టించాడని, గోవు హవిస్సుకూ బ్రాహ్మణుడు మంత్రాలకూ
ఆధారమని, సర్వవేదాలకూ మూలమైన బ్రాహ్మణుడి వెలను శివుడు కూడా
నిర్ణయించలేదని, గోవుకు కూడా అంతేనని,
కాబట్టి చ్యవనుడికి వెలగా గోవును ఇవ్వడం న్యాయమని తన అభిప్రాయం తెలియచేశాడు. ఆ
ప్రతిపాదనకు చ్యవనుడు సంతోషించి అంగీకరించాడు. గోవు పూజ్యమే అని ప్రశంసించి గోవును
తనకు వెలగా ఇమ్మన్నాడు చ్యవనుడు’.
ఈ సందర్భంగా తిక్కన గారు రాసిన పద్యం (చ్యవనుడి మాటల్లో)
ఇలా సాగింది.
క: గో
వగ్ని మయ మమృతమయ, మో వసిధాధీశ వినుము హోమ విధాన
శ్రీ
వాహిని నిచ్చెన త్రిద శానాసంబునాకు బూజ్య మమరుల కైనన్
(తాత్పర్యం: “రాజా! గోవు అంటే ఏమనుకుంటున్నావు?
జాగ్రత్తగా వినుము. గోవు అగ్నిమయం. అమృతమయం. యజ్ఞవిధానానికి పవిత్రమైన నది-మార్గం.
దేవతలకు నివాసమైన స్వర్గానికి వేసిన నిచ్చెన దేవతల కైనా పూజ్యమే”. ఈ సందర్భాన్ని
విశ్లేషిస్తూ డాక్టర్ తుమ్మపూడి కోటీశ్వరరావు ఇలా రాశారు. ‘నన్నయగారి శైలి మధురమైతే
కవిబ్రహ్మ తిక్కన శైలి విచిత్రమైనది. మొదటిది స్త్రీ సౌందర్యం లాంటిది. ఇది పురుష
గాంభీర్యం. క్షాత్ర శైలి. ఇది భావిస్తేనే తెలుస్తుంది. అది వినగానే తెలిసేది. పద్య
రచనలో శైలిని సృష్టించడం తిక్కన మార్గం. తిక్కనగారి పద్యం ఎలిఫెంటా గుహలోని
త్రిమూర్తి శివ విగ్రహం. ఇది బరువుతో భూమిలోకి దిగిపోయింది. ప్రాచీన వైదిక
సంప్రదాయం తెలసిన తిక్కన అద్భుతంగా రాశాడు ఈ పద్యాన్ని’).
‘బోయలు ఆ గోవును స్వీకరించి, చ్యవనుడిని దానం
చేశారు. బోయల అభ్యర్ధన మేరకు చ్యవనుడు ఆ గోవును తానే తీసికొన్నాడు. సహవాసం వలన
చేపలమీదా, దర్శనంవలన బోయలమీదా స్నేహం ఏర్పడటంవలన చ్యవనుడు
వారిరువురికీ బొందితో స్వర్గాన్ని ప్రసాదించాడు. గవిజాతుడు, చ్యవనుడు
కలిసి రాజుకు ధర్మ పరాయణత్వాన్ని, ఇంద్రైశ్వర్యాన్నీ వరాలుగా
ఇచ్చారు’ అని చెప్పాడు భీష్ముడు ధర్మరాజుకు.
ధర్మరాజు తన తరువాత ప్రశ్నగా ఇలా అడిగాడు పితామహుడిని. ‘మహత్తరమైన
బ్రాహ్మణశక్తి గల భృగువంశంలో విచిత్రమైన క్షత్రియ శీలం గల పరశురాము డెట్లా
జన్మించాడు?
మహోత్తమమైన క్షాత్రశక్తితో ప్రకాశించే కుశికవంశంలో బ్రాహ్మణ
తేజస్సుగల విశ్వామిత్రు డెట్లా పుట్టాడు?’
చ్యవన కుశిక సంవాదం దీనికి తగిన సమాధానమని, అది
వింటే ఆయన సందేహం తీరుతుందని అంటూ ఇలా జవాబిచ్చాడు భీష్ముడు. ‘కుశికుడివలన తనవంశం
సంకరమౌతుందని తెలిసికొని చ్యవనుడు. కుశిక వంశానికి ఆపద కలిగించాలని భావించి
కుశికుడి ఇంటికి అతిథిగా పోయాడు. కుశికుడు సతీసమేతంగా చ్యవనుడికి అతిథిపూజలు
చేశాడు. రాజ్యాన్నిచ్చి దాస్యం చేయటానికి పూనుకొన్నాడు. చ్యవనుడు తనకు రాజ్యకాంక్ష
లేదనీ, ఒక వ్రతాన్ని పూర్తిచేసికొనాలని ఉన్నదనీ, కుశికుడి ఇంట్లో నివసించి తన వ్రతాన్ని పూర్తి చేసికొంటానని పేర్కొన్నాడు.
కుశికుడు దాని కంగీకరించి ఒక దివ్య భవనాన్ని చ్యవనుడికి విడిదిగా ఇచ్చాడు.
చ్యవనుడు ఒక శయ్యపై పవళించి కుశిక దంపతులను తాను నిద్ర లేచేంతవరకు పాదాలను
ఒత్తుతుండమని కోరాడు. వారట్లాగే చేస్తూ ఉండగా ఇరవై ఒక్క రోజులు ఒక ప్రక్క పడుకొని
నిద్రపోయి, ఆ మరునాడు లేచి నగరం దాటిపోయి మాయమయ్యాడు’.
‘రాజ దంపతులు తిరిగివచ్చి భవనంలో చూస్తే శయ్యమీదనే మరొకవైపు
పడుకొన్నాడు చ్యవనుడు. వారు ఆశ్చర్యపోయి అతడి పాదాలు ఒత్తుతూ ఉండగా మరొక 21
రోజులు అట్లాగే పరుండి నిద్రలేచి తలంటి నీరు పోయుమన్నాడు. వారు సుగంధ తైలంతో
తలంటుతుండగా వారిని తెగ తిట్టి మాయమయ్యాడు. రాజదంపతులు అన్నపానీయాలు లేకపోయినా,
అలసటతో నీరసించినా కోపతాపాలకు గురికానందుకు సంతోషించి వారిచేత
స్నానం చేయించుకొన్నాడు. భోజనానికి
వస్తానని రాక ఎక్కడికో వెళ్ళాడు. రాజదంపతులు భోజనాలు మాని అట్లాగే
ఉండిపోయారు. చ్యవనుడు తెల్లవారిన తరువాత వచ్చి ఒక రథం మీద తనను కూర్చుండబెట్టి
రాజూ రాణీ దానిని లాగుతూ తీసికొని వెళ్లాలని కోరాడు. అలసటతో ఉన్న ఆ రాజదంపతులు
అలజడి పడక రథాన్ని లాగుతూ ఉండగా వారిని ముల్లుగర్రలతో పొడిచి బాధించాడు. అయినా
వారు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగటం చ్యవనుడు సంతోషించి రథం దిగి వారిని కరుణించి
వారి శరీరాలకు శ్రమలేకుండా చేసి, నవయౌవనాన్ని ప్రసాదించి,
తాను తపోవనానికి వెళ్ళాడు’.
‘మరునాడు ఉదయం రాజదంపతులు ఆ తపోవనానికి పోగా అక్కడ
స్వర్గలోక భోగాలు కానవచ్చాయి. ఆ తరువాత చ్యవనుడు తపోవనంలో మునివృత్తిలో
గోచరించాడు. చ్యవనుడు ఆ దంపతుల ఇంద్రియ నిగ్రహానికి ఆశ్చర్యపడి ప్రశంసించాడు. భృగు,
కుశిక వంశాలకు ఏర్పడే బాంధవ్యం వల్ల వంశసాంకర్యం ఏర్పడుతుందని బ్రహ్మలోకంలో విని, కుశిక
వంశాన్ని నాశనం చేద్దామని వచ్చానని, కాని ఆ దంపతుల నిష్ఠా
ప్రపత్తులను చూచి సంతోషించి, రాచరికం మీదకంటే బ్రాహ్మణత్వం
మీద ఉన్న మక్కువను గమనించి హర్షించాననీ పేర్కొన్నాడు’.
‘కుశికుడి మనుమడు బ్రహ్మతేజోమయు డౌతాడని వరమిచ్చాడు. దానిని
వివరిస్తూ చ్యవనుడు తన వంశంలో ఋచీకుడు జన్మించి కుశిక వంశంలోని గాధి కూతురును
పెళ్ళాడతాడనీ,
వారిరువురికి జమదగ్ని జన్మిస్తే అతడు విలువిద్యను పొందేటట్లు
చేస్తాడనీ, ఆ ధనుర్విద్య అతడికొడుకు పరశురాముడిలో
ఫలిస్తుందనీ పేర్కొన్నాడు. పరశురాముడు సకల క్షత్రియ కులనాశనం చేస్తాడనీ తెలిపాడు.
దైవఘటనవలన ఋచీక, గాధి వధువుల అనుష్ఠానాలు మార్పు చెంది
జమదగ్నికి క్రూరభావంకల క్షత్ర ధర్మంతో పరశురాముడు జన్మిస్తాడు. గాధికి బ్రాహ్మణ
తేజోనిధి అయిన విశ్వామిత్రుడు జన్మిస్తాడు అని వివరించి చ్యవనుడు తీర్థయాత్రలకు
పోయాడు. రాజదంపతులు రాచనగరుకు తిరిగి వచ్చారు’.
అలా చ్యవన కుశిక సంవాద సారాంశాన్ని వివరించిన భీష్ముడు
ధర్మరాజు సందేహాన్ని తీర్చే విధంగా పరశురాముడి, విశ్వామిత్రుడి జన్మల
నేపధ్యాలను తెలియచేశాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ద్వితీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment