ఆచారధర్మాలు ఆయువును పెంచుతాయని,
తీర్థాలన్నీ మేలైనవే అనీ అన్న భీష్ముడు
ఆస్వాదన-128
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (10-07-2023)
తపస్సును సారమైన ధర్మంగా చెప్తుంటారని,
దానికి మించిన ధర్మం మరొకటి వున్నదా అని ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించాడు.
సమాధానంగా భీష్ముడు, ధర్మాలన్నీ కొనియాడదగిన కార్యాలే అనీ, తపస్సు అంటే నియమంతో భోజనం గ్రహించడమనీ, తపస్సులన్నీ కొనియాడదగినవేననీ, తపస్సుకు దీటైన ధర్మం లేదనీ, ఈ విషయాన్ని స్వయంగా
బ్రహ్మ భగీరథుడనే రాజుకు చెప్పాడనీ అన్నాడు.
వేదం పురుషుడికి ఆయువు నూరేళ్లని చెప్పుతున్నదని, కాని,
చిన్నతనంలోనే కొందరు మృతి చెందుతున్నారని,
దేనిచేత ఆయువు వృద్ధి పొందుతుందని, దేనిచేత తరిగిపోతుందని
మరో ప్రశ్న అడిగాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు ఇలా చెప్పాడు. ‘ఆచారం ఆయువును
పెంచుతుంది. అంతే కాదు సంపదను, కీర్తిని కలిగిస్తుంది.
దురాచారం ఆయువును క్షిణింప చేస్తుంది. ఉత్తమపురుషులు ఆచరించే మార్గాన్ని
తెలిసికొని నడచుకొనటం ఆచారం. అది వర్ణ ధర్మాలకు, ఆశ్రమ
ధర్మాలకు అనుగుణంగా ఉంటుంది. ఆచారాన్ని తప్పనిసరిగా నడిపించాలి. అది ధర్మానికి
కుదురు. ధర్మం ఆయువును పెంచుతుంది. సంపదను కీర్తిని వృద్ధి చేస్తుంది.
ఆచారాలన్నిటిలో సర్వభూతదయ మిన్న అయినదని ఆదిమునులంటారు. కాబట్టి అన్ని వర్ణాలవారూ
దయకలిగి ఉండటం ఉత్తమం’.
(“భారత ధర్మం చాలా సూక్ష్మంగా ఆలోచింపదగినది. చిన్ని నా
పొట్టకు శ్రీరామరక్ష అన్న భావాన్ని భారత ధర్మం ఎన్నటికీ అంగీకరించదు. అందరి సుఖమే
ఆత్మ సుఖం అనే ధోరణి భారతీయులది” అని విశ్లేషించారిక్కడ డాక్టర్ శలాక రఘునాథశర్మ
గారు).
అన్నదమ్ములేవిధంగా తమలో తాము పొందిక కలిగి ఉండాలని అడిగాడు
ఆ తరువాత. జవాబుగా, ‘తమ్ములు అన్నయెడ భయభక్తులు కలిగి అతడిని ఆరాధించాలి. అన్న తమ్ములను
మన్నిస్తూ ఉండాలి. తమ్ముడొకడు బుద్దిహీనుడైనా ప్రమాదం లేదు కాని అన్న కార్యదక్షత
లేనివాడైతే తమ్ముళ్ళు ఇబ్బందుల పాలౌతారు. అన్నదమ్ములు కలతలు లేని బుద్దితో సంపదను
పంచుకొని అనుభవించాలి. అప్పుడు లోకులు వారిని మెచ్చుకొంటారు. సంపద కూడా క్రమంగా
వృద్ధి పొందుతుంది. అట్లా కాక ఒకడు అత్యాశతో ఎక్కువ భాగాన్ని ఆపేక్షిస్తే
ప్రాణాంతకపు పనులు ఏర్పడుతాయి. తండ్రి తరువాత అన్నయే తమ్ములందరికీ తండ్రి. తల్లి
చనిపోయిన తరువాత వదినయే తల్లి. అన్నగాని, తమ్ముడుగాని న్యాయం
తప్పి అన్నదమ్ములకు కీడు చేస్తే రాజువలన శిక్షార్హుడౌతాడు. అక్కను, పెంచిన తల్లిని తల్లితో సమానంగా చూడాలి. ఉపాధ్యాయుడికంటె తండ్రి పదిరెట్లు
ఎక్కువ మాన్యుడు. తండ్రికంటె తల్లి పదిరెట్లు గౌరవంలో మిన్న. తల్లిదండ్రులవలన
కలిగిన జన్మ దేహసంబంధి. ఆచార్యుడివలన కలిగిన జ్ఞానజన్మ జరామరణాలు లేనిది. గౌరవంలో
ఆచార్యుడు అందరికంటే మిన్న’ అని చెప్పాడు భీష్ముడు.
ఉపవాస విధికి యోగ్యత, దాని గొప్ప ఫలం గురించి వినాలని
వుందన్నాడు ధర్మరాజు భీష్ముడితో. ఇదే విషయాన్ని తాను అంగిరసుడు అనే మునిని
అడిగానని, ఆయన చెప్పిన వివరాల సారాన్ని వినిపిస్తానని
భీష్ముడు అన్నాడు.
‘బ్రాహ్మణ క్షత్రియులు మూడు రోజులు, వైశ్యులు శూద్రులు
నాలుగు రోజులు ఉపవాసం చేయవచ్చును. ఏక భుక్తంతో నెలరోజులు ఉపవసిస్తే శుభాలు
కలుగుతాయి. ఉపవాసాలు పెరిగిన కొద్దీ శుభాలు కూడా పెరుగుతాయి. మహాత్ములు తల్లిని
మించిన గురువూ,
వేదాన్ని మించిన శాస్త్రమూ, ధర్మాన్ని మించిన
లాభమూ, అట్లాగే ఉపవాసాన్ని మించిన తపస్సూ లేదంటారు. దేవతలు,
ఆదిమునులు ఉపవాస నియమం చేతనే గొప్ప ప్రభావం కలవారయ్యారు.
విశ్వామిత్రుడు వెయ్యేళ్ళు ఏకభుక్తంతో బ్రాహ్మణత్వాన్ని పొందగలిగాడు. అర్థబలమూ,
అంగబలమూ లేకున్నా ఏ లోపమూ లేకుండా చేయదగినది ఉపవాస వ్రతమని
అంగిరసుడు చెప్పాడు. ఉపవాస వ్రతంలో తేలిక పద్దతి ఉన్నది. ఉపవాస వ్రతాన్ని ఆచరించడం
శరీరానికీ, మనస్సుకూ, పవిత్రతను
చేకూరుస్తుంది. దీనివల్ల ఈ లోకంలో గొప్పతనం, దేవలోకపు సుఖం
అబ్బుతాయి. పగలు ఒకమారూ, రాత్రి ఒకమారూ నీటితో తృప్తిగా
భుజిస్తూ మధ్యలో మరేమీ తినకుండా హోమకార్యం తగిన విధంగా చేస్తూ ఉంటే పుణ్యలోకాలు
సులభంగా లభిస్తాయి’ అని వివరించాడు భీష్ముడు.
భీష్ముడి మాటలు విన్న ధర్మరాజు అతడికి నమస్కరించి, ఎవరిని
తెలిసికొంటే తెలియదగిన విషయాలన్నీ తెలుస్తాయో అట్టివాడు శ్రీకృష్ణుడని వేదవ్యాసుడు
తెలియ చెప్పాడని, కాబట్టి ఆధ్యాత్మిక వాక్యాలకు ఆతడే గమ్యమని, మహామహిమకు గమ్యం శ్రీ కృష్ణుడని, తాను ఆ మహిమాన్విత
తత్త్వజ్ఞాన వాక్యాలను వినగోరుతానని, ఆధ్యాత్మ విద్యావరణం
కలిగించే వాక్యాలు వినిపించుమని అడిగాడు. ‘హరసనత్కుమార సంవాదం' అనే విషయం వింటే పరమార్థ విద్యకు ఉపకరించే అంశాలు తెలుస్తాయని, వాటిని సంగ్రహంగా చెప్పుతాను వినుమని భీష్ముడు అన్నాడు. అని ఇలా
చెప్పసాగాడు.
‘ఒకసారి శివుడు సనత్కుమారుడి వద్దకు వచ్చాడు. మహర్షి
మహేశ్వరుడికి అతిథిసత్కారాలు చేశాడు. “పుణ్యాత్మా! ధ్యానంలో చూడదగిన వస్తు వేది? చక్కగా
భావించదగిన తత్త్వాలు ఎన్ని? జ్ఞానమూ, యోగమూ
ఏ విధంగా ప్రవర్తిల్లుతాయి?” అని శివుడు అడిగాడు. మరికొన్ని
ఆధ్యాత్మ విశేషాలు చెప్పమన్నాడు. సనత్కుమారుడు శివుడితో ఇట్లా చెప్పాడు’.
“తత్త్వాలు ఇరవైమూడని కొందరు పామరులంటారు. ఇరవైనాలుగని
కొందరు అంటారు. నా దృష్టిలో తత్త్వాలు ఇరవై అయిదు. ఇరవైఅయిదవ తత్త్వం ‘అధిష్టానం' రూపంలో
ఉంటుంది. అది మిగిలిన ఇరవైనాలిగింటికీ ఒక స్థితిని కలిగిస్తుంది. తనయందే
లీనమయ్యేటట్లు చేస్తుంది. కాబట్టి అది ఉండటమూ, లేకపోవటమూ
రెండూ సంభవమే. కాబటి 24 తత్త్వాలు వివరిస్తాను. అవి 5 భూతాలు, 5 వాటి గుణాలు, 10
ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రకృతి, మొత్తం 24
తత్త్వాలు. వీటిని దేహమని జ్ఞానులు భావిస్తారు. కట్టెలో నిప్పువలె అందులో
‘పురుషుడు’ ఉంటాడు. అతడే 'నేను'. పురుషతత్యాన్ని
వేదం 'అమృతార్థతత్త్వ'మనీ, 'బ్రహ్మ' మనీ తెలియజేసుంది. ఇది అన్ని తత్యాలకంటె
అతీతమైనది. ఇదే ఈశ్వరం, అనీశ్వరం, సత్యపాకం,
అతిరహస్యం. దానిని దర్శిస్తే మృత్యువువలనుండి తప్పుకొన్నట్లే”.
“బ్రహ్మతత్వం ఓంకారంచేత మాత్రమే చెప్పదగింది. అనహంకార నిరూడ
భావనారాధ్యం. ఏ మాలిన్యం లేనిది. ద్వంద్వాతీతమైనది. సర్వం శుభమయమైనది. అది
అప్రమేయం,
అవిజ్ఞేయం, పుండరీకాక్షం, అనక్షయవిషయం, అచ్యుతం, సదసత్తుల
సమైక్యభావంతో ప్రకాశించేది. ఆ పరతత్త్వం మొదట నారాయణుడి కొక్కడికే తెలిసింది.
అతడివలన దేవతలు, మునులు, సిద్ధులు,
సాధ్యులు మొదలగువారికి అందింది. అది బంధవిముక్తులకే దర్శనమౌతుంది.
అహంకారం వదలిన జీవుడిలో దశేంద్రియాలూ, మనస్సూ, బుద్ధీ లీనమైపోతాయి. ఆ జీవుడు పరతత్త్వంలో లీనమైపోతాడు. యోగనిష్ఠ కలవాడు ఆ
తత్త్వాన్ని అందుకొని దుఃఖాలన్నింటిని తొలగించుకొని, చావు,
ముదిమి లేని తావులలో శాశ్వతంగా ఉంటాడు. అణిమాది సిద్ధుల సంపదలతో
విహరిస్తూ ఉంటాడు. యోగసాంఖ్యాలు రెండూ ఒకటే అనే భావంతో సంసార సముద్రాన్ని దాటుతాడు”.
“చైతన్యం గల ‘పురుషుడు' అనే తత్త్వాన్ని ఆశ్రయించి,
చైతన్యం లేని ప్రకృతి పుష్టికలది ఔతుంది. తక్కిన తత్వాలు ఆ
తత్త్వమహాసముద్రంలోని తరంగాలు. పురుషుడికి ఏ గుణాలూ లేవు. ప్రకృతియే గుణాలకు ఏవైనా
గుణాలను ఇస్తుంది. దానిచేత తక్కిన తత్త్వాలు గుణాలు కలవై గుణాలు లేని పరమాత్మకు
గుణాలు కలిగిన స్థితిని కలిగిస్తాయి. వీటినన్నంటిని సత్పదార్థానికి వేరైనవిగా
తెలిసికొని, ప్రకృతిని జయించి తనకు తానే కాని మరొకటి ఏమీ
లేదని గుర్తించినపుడు సాధకుడైన పురుషుడు పొగ లేని నిప్పువలే ప్రకాశిస్తాడు.
పురుషుడు సత్యాన్ని, తత్త్వాన్ని ఆశ్రయించి, ఆ రెండింటిని చక్కగా తెలిసికొని, వాటితో కలియక చైతన్యవంతుడౌతాడు.
అనేకం కావటం అజ్ఞానంవలన కలిగిన స్థితి. ఒక్కటి కావటం జ్ఞానంవలన కలిగే స్థితి.
పండితులు దీనినే అవిద్య, విద్య అంటారు. ఈ రెండూ ఇరవై అయిదవ
తత్త్వమైన జీవుడి దశలు. పరికించగా విద్యయే స్వరూపంగా గల ఇరవై ఆరవ తత్త్వం. వాడు
విద్య, అవిద్య అనే దశలు లేనివాడు. ముసలితనం లేనివాడు.
మొట్టమొదటివాడు. అంతం లేనివాడు. ఏ విధమైన మార్పులేనివాడు. అనంతుడు అచ్యుతుడు,
అద్యతనుడు, ఆనాది, కేవలాత్మకుడు.
నీటిలో చేపా, మేడిపండులో పురుగులు ఉన్నట్లుగా తాను ప్రకృతిలో
ఉన్నానని తెలిసికొని, దానినుండి వేరుకావటం అభ్యాసం చేసి,
సిద్దిపొందిన పురుషుడు అమృతత్వస్థితి పొందుతాడు”.
“జీవుడు తామరాకు మీది నీటి బిందువువలె ప్రకృతియందు ఉండి
కూడా దానికి సంబంధించిన వికారాలు లేకుండా వెలుగొందుతాడు. ఈ విధంగా ప్రకృతిని వదలి
పరమాత్మ స్థితిని పొందటమే ముక్తి. ఈ జ్ఞానాన్ని కపిలమహర్షి లోకానికి అనుగ్రహించాడు. దివ్యమునులెందరో దీనిని మన్నించారు. జీవుడు
ప్రకృతితో అంటిపెట్టుకొని ఉండటం బంధం. దానినుండి పొందిన విముక్తియే మోక్షం”.
ఈ విధంగా మహర్షి సనత్కుమారుడు శివుడికి యోగసాంఖ్యాలను
విన్నవించాడని ధర్మరాజుకు చెప్పాడు భీష్ముడు. అలా చెప్పిన పితామహుడితో ఆయన, ‘ఎక్కువ
పవిత్రతను కలిగించగల తీర్థం ఏదో’ తెలియచేయమని కోరాడు. భీష్ముడు ఆయనకిలా చెప్పాడు.
‘తీర్థాలన్ని మేలైనవే. మానవ తీర్థం ఒకటి ఉన్నది. దాని పేరు “సత్యం”. అదే
మిక్కిలి పవిత్రత కలిగిస్తుంది. “ధృతి” అనే మహాజలాశయంలో అది విరాజిల్లుతూ ఉంటుంది.
తమస్సు, రజస్సు అనే రెండు గుణాలను దూరంగా తొలగించుకొంటూ,
సత్యాన్ని ఊతకర్రగా తీసికొని దానిలోనికి ప్రవేశించి స్నానం
చేసినవాడు పరిశుద్ధతతో ప్రకాశిస్తాడు. రాగద్వేషాలు వదలి, ఇంద్రియాలు
వికారాలను తొలగించుకొని, ఏ మాత్రమూ సడలని వ్రతం పాటిస్తూ
వివేకం కలిగిన మహాత్ములు కూడా గొప్ప నిర్మలతీర్థాలే. వినయపూర్వకంగా ఆశ్రయించటం
కూడా తీర్థాలవలన కలిగే సిద్ధిని కలిగిస్తుంది. ఇంద్రియాలను అదుపు చేసుకోవడం, దేహాన్నీ, మనస్సునూ నియమ నిష్టల ద్వారా ఎండగట్టడం,
ఇతర ప్రాణులను హింసించకుండా వుండడం, మనస్సులో ఉద్వేగం
రాకుండా చూసుకోవడం కూడా తీర్థాలే. వాటివలన ఎక్కువ శుద్ధత కలుగుతుంది. ఊరకే నీటిలో
స్నానం చేస్తే పరిశుద్ధత కలుగదు. దొరకని వాటిని కోరక, దొరికినవాటియందు
తృప్తి పొందక ఆశను విడనాడి బతికే నరులు పవిత్రులు. వారికి వేరైన తీర్థాలు అవసరం
లేదు’.
ఎట్టి ప్రవర్తనతో మానవుడు, ఉత్తమపదం చేరుకొంటాడని, మరణించినవాడు దేహాన్ని వదలి ఏది తోడుగా వెళ్తాడని సందేహాన్ని
వెలిబుచ్చాడు ధర్మరాజు. ఇది వాస్తవానికి చాలా క్లిష్టమైన ప్రశ్న. కారణం, బతికున్నవాడికి మరణం తరువాత ఏమవుతుందో, జీవుడి అనుభవం ఎలాంటిదో తెలిసే
అవకాశం లేదు. కాబట్టి భీష్ముడు ధర్మరాజు ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేదు. పక్కనే
వున్న బృహస్పతి ఇలా అన్నాడు.
‘మేలు తొలుత ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. చచ్చినవారికి
ధర్మమే తోడుగా వస్తుంది. ధర్మం చేయనివాడు నరకానికి పోతాడు. నరుడు తాను చేసిన
పుణ్యాలకు తగిన విధంగా సుఖమయ సంసారంలోనూ, పాపాలకు అనుగుణంగా దుఃఖమయ
సంసారంలోనూ ప్రవేశిస్తాడు. పుణ్యపాపాలకు అనుగుణంగానే ఆయా జన్మ లెత్తుతాడు. పాపాలు
దానాలతో నశిస్తాయి. దానాలలో అన్నదానం మిన్న. ధ్యానం, ఇంద్రియనిగ్రహం,
అహింస, గురుసేవ, నిత్యకర్మాచరణం,
తపస్సు అనే వాటిలో అహింస పవిత్రమైనది. ఏ ఉత్తమ ధర్మాలనైనా
ప్రకాశింపజేస్తుంది’.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఆనుశాసనిక పర్వం, చతుర్థాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment