విద్యుత్ విజయాలపై కుటిల విమర్శలు
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (27-07-2023)
(తెలంగాణ రాష్ట్రంలో నేడు 15,497 మెగావాట్ల విద్యుత్
డిమాండ్ వున్నా, ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలగడం రాష్ట్ర పురోగతికి చిహ్నం.
భారీ పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలలకు పవర్ హాలీడేలు పోయి ప్రతిరోజూ, ప్రతి నిమిషం విద్యుత్ అందుబాటులో వుంటున్నది. పారిశ్రామిక ప్రగతికి,
వ్యవసాయ వృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల
పెంపుకు విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి చోదకశక్తిగా మారింది-సంపాదకుడి వ్యాఖ్య)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత, గత తొమ్మది సంవత్సరాలలో,
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత ప్రాదాన్యతనిచ్చి, యావత్ దేశంలో
అగ్రగామిగా మలచిన రంగం విద్యుత్. కానీ జరిగిన మంచిని ప్రస్తావించే కనీస మర్యాద
లేని కొందరు రాజకీయప్రముఖులు, కేసీఆర్ కు ఏమాత్రం సంబంధంలేని, పదమూడేళ్ల క్రితం
జరిగిన కాల్పుల సంఘటనను పేర్కొంటూ, అసబ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ
ప్రజల్లో చులకన అవుతున్నారు. అంతే కాకుండా తెలంగాణాలోని 95% రైతులు
మూడెకరాల లోపు వారేననీ, వారికి రోజుకు 8 గంటల పాటు విద్యుత్
ఇస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని కూడా వెల్లడి చేశారు.
13 సంవత్సరాల క్రితం జరిగింది ఏమిటి, ఎలా
జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి
ప్రమేయంతో జరిగింది, ఆ తదనంతర పరిణామాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలా
నాంది-ప్రస్తావన అయ్యాయి, అనే వాస్తవాన్ని అవగాహన
చేసుకోకపోవడమూ దురదృష్టకరమే. చంద్రబాబునాయుడు రెండోపర్యాయం అధికారంలోకి వచ్చిన
తర్వాత వ్యవసాయ విద్యుత్ చార్జీలను వున్నఫలంగా పెంచేసింది ఆయన ప్రభుత్వం. ఎన్టీరామారావు
కాలంనుంచి సబ్సిడీపై కరెంటు పొందుతున్న రైతులు చంద్రబాబు నిర్ణయంతో అవాక్కయ్యారు
పెంచిన వ్యవసాయ విద్యుత్ చార్జీలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేశారు.
చివరికి 2000 ఆగస్టులో ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఆ నిరసనపై చంద్రబాబు
ప్రభుత్వం కాల్పులు జరపడంతో ముగ్గురు రైతులు హైదరాబాద్ నగర నడిబొడ్డున బషీర్ బాగ్
లో ప్రాణాలు వదిలారు.
నాటి బషీర్ బాగ్ కాల్పుల ఘటన తెలుగుదేశం పార్టీలో అప్పుడు కీలక
నేతగా, శాసనసభ ఉపసభాపతిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది.
రైతుల గోస తనపార్టీ ప్రభుత్వానికే పట్టకపోవడం, వారిపట్ల అత్యంత రాక్షసంగా
వ్యవహరించడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. తక్షణమే తన అసంతృప్తిని తెలియచేస్తూ ముఖ్యమంత్రికి
రాసిన లేఖలో, యావత్తు తెలంగాణ వ్యవసాయమే మోటార్లపై ఆధారపడి ఉంటుందనీ,
ఆ మోటార్లకు కరెంటే ప్రాణాధారమనీ, అసలే
అరకొరగా, నష్టాలతో సాగే వ్యవసాయానికి పెంచిన కరెంటు చార్జీలు మరణ శాసనంగా మారాయనీ, వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించమనీ, తెలంగాణ
రైతుల సహనాన్ని పరీక్షించవద్దనీ పేర్కొన్నారు.
అప్పటికే నిధుల విషయంలో, సాగునీటికి కావాల్సిన ప్రాజెక్టుల
నిర్మాణం విషయంలో, నియామకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై
తీవ్ర అసంతృప్తితో ఉన్న కేసీఆర్, బషీర్ బాగ్ కాల్పుల ఘటన తర్వాత
తెలుగుదేశంలో కొనసాగడం సరైనదికాదనే నిర్ణయానికొచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
వస్తే తప్ప రైతుల కష్టాలకు ముగింపు ఉండదని భావించి, దాని
సాధనకొరకు తానే ముందుండి పోరాడాలని నిర్ణయించుకున్నారు. అలా కేసీఆర్ ఉద్యమ
రంగంలోకి దిగడానికి విద్యుత్ చార్జీల పెంపుదల, బషీర్ బాగ్
కాల్పుల సంఘటన ప్రత్యక్ష-పరోక్ష కారణాలయ్యాయి. వ్యవసాయ విద్యుత్ విషయంలో సమైక్య
పాలకులు అవలంభించిన అతి నీతి బాహ్యమైన వైఖరే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బలీయమైన కారణమైంది.
చివరకు తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది.
వ్యవసాయ ఆధారిత తెలంగాణ రైతులకు మాత్రం విద్యుత్ ఓ
ప్రాణాధారం. సమైక్య అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ,
చార్జీలు, నాణ్యత, అశాస్త్రీయంగా
వుండడమే కాకుండా, వివక్షతతో కూడుకునేవి కావడంతో తెలంగాణ
వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతన్నలు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకునేవారు.
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేటి పరిస్థితికీ,
2014కు ముందు విద్యుత్ కోసం అర్రులు చాచిన పరిస్థితికి పోల్చి
చూస్తే తెలంగాణ ప్రస్థానంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇవేవీ కువిమర్శలు
చేస్తున్నవారికి కనిపించక పోవడం బాధాకరం.
ఈ సమస్యను లోతుగా విశ్లేషించి,
గతంలోకి తొంగిచూస్తే మరికొన్ని విషయాలు మననం చేసుకోవచ్చు. సమైక్య పాలకుల
నిర్లక్ష్యంవల్ల తెలంగాణలో నిర్మించాలని ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులన్నీ
కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్రాజెక్టుల కింద కాలువలు నిర్మించడం జరగలేదు. కాకతీయులు
నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ధ్వంసమవుతున్నప్పటికీ పాలకులు నిర్లక్ష్యం వహించారు.
తెలంగాణ రైతులకు సాగునీరు పెద్ద సమస్యగా మారి, విధిలేని పరిస్థితుల్లో లక్షలాది
రూపాయల వ్యయంతో సొంతంగా బోర్లువేసి, మోటార్లు పెట్టుకున్నారు.
తెలంగాణ వచ్చే నాటికే 24 లక్షలకు పైగా పంపుసెట్లు వేసుకున్నారు. ఇంత చేసినప్పటికీ
రైతులకు కావాల్సినంత విద్యుత్ వచ్చేది కాదు.
వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన
హైటెన్షన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు సరిగ్గా ఉండకపోవడంతో లోఓల్టేజీ
సమస్య ఎదురయి,
మోటార్లు తరచూ కాలిపోయేవి. అదనపు ట్రాన్స్ ఫార్మర్లు లేకపోవడంతో
అధిక లోడ్ పడి అవి కూడా పేలిపోయేవి. కాలిపోయిన మోటార్లను రైతులే తమ స్వంత ఖర్చులతో
మరమ్మతులు చేయించుకోవాల్సిన దుస్థితి. ఇది ఆర్థిక భారమే కాకుండా, కొత్త ట్రాన్స్ ఫార్మర్ వచ్చేవరకు చాలాజాప్యం జరిగేది. ఈలోగా పంటలు ఎండిపోయేది.
నాటి దుస్థితి నేపధ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నినాదంతో కేసీఆర్ తెలంగాణ
రాష్ట్ర సమితిని (టీఆర్ఎస్) స్థాపించడం, ప్రత్యేక తెలంగాణ
రాష్ట్రం ఏర్పాటైన తరువాత రైతులకు ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని హామీ
ఇవ్వడం సమకాలీన చరిత్ర .
2004 ఉమ్మడి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
కూడా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడం, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్
పొత్తు పెట్టుకుని ఉండడం, ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి రావడం, ఉచిత విద్యుత్ హామీని నామమాత్రంగా అమలు చేయడం జరిగాయి. కాంగ్రెస్
ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పటికీ, పారిశ్రామిక,
వాణిజ్య, గృహ తదితర అవసరాలు తీరిన తర్వాత
మాత్రమే, చివరి ప్రాధాన్యతగా, అదీ రాత్రి వేళల్లోనే, మూడు నాలుగు గంటలకు మించకుండా
వ్యవసాయానికి ఇచ్చింది. రాత్రి పూట వచ్చే కొద్దిపాటి కరెంటుతో మోటార్లు
నడిపించడానికి వెళ్లిన రైతులు కరెంటు షాకులతో, పాము కాట్లతో
మరణించిన సంఘటనలు తెలంగాణలో కోకొల్లలు. వీటికి తోడు లో ఓల్టేజీ సమస్య. ఈ నిర్లక్ష్య
వైఖరివల్ల ఆచరణలో అది విజయవంతం కానేకాలేదు. ఈ పరిస్థితిని ఉద్యమ సమయంలో కేసీఆర్
ప్రముఖంగా ప్రస్తావించేవారు. తెలంగాణ వస్తే తప్ప రైతుల విద్యుత్ కష్టాలు తీరవని
స్పష్టం చేసేవారు. రైతుల్లో కేసీఆర్ పట్ల విశ్వసనీయత కలిగింది.
జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణను
మొట్ట మొదట చుట్టు ముట్టిన సమస్య విద్యుత్ సంక్షోభమే. 2,500 మోగావాట్ల లోటుతో
తెలంగాణ రాష్ట్రం తన ప్రస్తానాన్ని ప్రారంభించింది. విద్యుత్ సమస్యను సత్వరం
పరిష్కరించి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి
కేసీఆర్ విద్యుత్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, స్వల్ప,
మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రచించారు.
స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా తక్షణావసరాల నిమిత్తం ఎక్కడ ఎంత విద్యుత్ లభ్యమవుతే
అంత కొనుగోలు చేసి తెలంగాణను దేశంలోనే ప్రప్రథమ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా
మార్చారు. ఫలితంగా తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే వ్యవసాయానికి 9 గంటలు, మిగతా రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగింది.
కేసీఆర్ అంతటితో సంతృప్తి చెందలేదు. మిగతా వారికిచ్చినట్లే
వ్యవసాయానికి కూడా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయగలిగినప్పుడే తెలంగాణ రాష్ట్రం
సాధించుకున్న ఫలితం రైతులకు దక్కినట్టు భావించేవారు. రైతులకు 24 గంటలకు కరెంటు
ఇవ్వడం వల్ల పెరిగే ఆర్థిక భారం, గ్రిడ్ సమస్యలు, ఇతరత్రా
ఇబ్బందులను లక్ష్యపెట్టకుండా అది అమలు చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. విద్యుత్ రంగ
నిపుణుడు, ఆ రంగంలో అపార అనుభవం కలవాడు, ఆ శాఖ చైర్మన్-మానేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర రావు కేసీఆర్ ఆదేశాలను
యధాతథంగా అమలుచేయడానికి, పటిష్ట కార్యాచరణ పథకం రూపొందించి, రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి కావాల్సిన సాంకేతిక, ఇతర ఏర్పాట్లు చేశారు.
వేలకోట్ల రూపాయల వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్
ఫార్మర్లు, లైన్లు ఏర్పాటయ్యాయి. అంతా సవ్యంగా జరిగి 2018
జనవరి 1 నుంచి రాష్ట్రంలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ఇలా ఇస్తున్న
ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశ చరిత్రలోనే నూతనాధ్యాయం లిఖించుకున్నది.
గతంలో మాదిరిగా ఇప్పుడు విద్యుత్ కోతలు లేవు. లో ఓల్టేజీ
సమస్యలు లేవు. మోటార్లు నడవక పంటలు ఎండిపోయే పరిస్థితి లేదు. సబ్ స్టేషన్ల ముందు
రైతుల ధర్నాలు లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండే విద్యుత్ వల్ల, మిషన్
కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వల్ల, పెరిగిన భూగర్భ జలాల అండతో, రైతులు సమృద్ధిగా
పంటలు పండిస్తూ, తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే
అన్నపూర్ణగా అవతరించింది. మహా స్వాప్నికుడు కేసీఆర్ కన్న కల వ్యవసాయానికి 24 గంటల
ఉచిత విద్యుత్, గత ఐదేళ్లకు పైగా అమలవుతూ అద్భుతాలు సృష్టిస్తున్నది. కేసీఆర్
పాలనా దక్షతకు ఇది మచ్చు తునక.
తెలంగాణ రాష్ట్రంలో నేడు 15,497 మెగావాట్ల విద్యుత్
డిమాండ్ వున్నా, ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలగడం రాష్ట్ర పురోగతికి చిహ్నం.
భారీ పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలలకు పవర్ హాలీడేలు పోయి ప్రతిరోజూ, ప్రతి నిమిషం విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. పారిశ్రామిక ప్రగతికి,
వ్యవసాయ వృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల
పెంపుకు విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి చోదకశక్తిగా మారింది. స్థాపిత విద్యుత్
ఉత్పత్తి సామర్థ్యం వందశాతం పెరిగింది. పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా
విద్యుత్ ఉత్పత్తిని 28వేలకు పైగా మెగావాట్లకు తీసుకుపోవడమే కాకుండా మిగులు
విద్యుత్ రాష్ట్రంగా మారడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు, భద్రాద్రి
పవర్ ప్లాంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
రికార్డు సమయంలో కెటిపిఎస్ 7వ యూనిట్ పూర్తయింది. ఉత్పత్తితో పాటు సరఫరాలో మెరుగుదల
గణనీయంగా పెరిగింది. ప్రగతి సూచికైన తలసరి విద్యుత్ వినియోగం వృద్దిలో దేశంలో
నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ, గరిష్ట డిమాండ్ లో గణనీయమైన వృద్ధి, వ్యవసాయ
కనెక్షన్ల మంజూరులో గణనీయమైన వృద్ధి, పేదలకు విద్యుత్ సబ్సీడీలు, సెలూన్లకు గృహ
కేటగిరీ విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం
రికార్డుస్థాయి విద్యుత్, తెలంగాణ చొరవతో ఉత్తర, దక్షిణ
గ్రిడ్ ల మధ్య కొత్త లైన్ల ఏర్పాటు లాంటివి కేసీఆర్ సారధ్యంలోని బంగారు తెలంగాణ
నిర్మాణంలో కీలకాంశమైన విద్యుత్ విజయంలో భాగాలు. ఒక అంశంపై విమర్శ చేసే ముందర వాస్తవాలను
అధ్యయనం చేసి, సద్విమర్శ చేయడం మంచిది. లేకపోతె, అది అనుభవరాహిత్యమవుతుంది.
No comments:
Post a Comment