Monday, July 31, 2023

మోక్షకారకమైన విష్ణుమంత్రోపదేశాన్ని, విష్ణు సహస్రనామాలను, శివనామాలను ధర్మరాజుకు తెలియచేసిన భీష్ముడు ...... ఆస్వాదన-131 : వనం జ్వాలా నరసింహారావు

 మోక్షకారకమైన విష్ణుమంత్రోపదేశాన్ని, విష్ణు సహస్రనామాలను,

శివనామాలను ధర్మరాజుకు తెలియచేసిన భీష్ముడు

ఆస్వాదన-131

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-07-2023)

మోక్షం ఎట్లా కలుగుతుందని తెలుసుకోగోరిన ధర్మరాజు పరమపదం ఏవిధంగా లభిస్తుందో సెలవియ్యమని పితామహుడైన భీష్ముడిని ప్రశ్నించాడు. సమాధానంగా భీష్ముడు, శ్రీమన్నారాయణుడిని ధ్యానించడం, పూజించడం, స్తుతించడం, మనస్సులో మననం చేయడం, పుష్పాదులతో అర్చించడం, కీర్తనం చేయడం, అతడి పుణ్యకథలు వినడంవలన మోక్షం కలుగుతుందని అన్నాడు. అంతేకాక పండితులను, విద్వాంసులను కాపాడడం వల్ల కూడా పుణ్యం లభిస్తుందని చెప్పాడు.

పేదరికం తొలగడానికి, రోగాలు మానడానికి, దుఃఖాలు తీరడానికి తగిన జపమేదో చెప్పమని తాతగారిని కోరాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు ఇలా చెప్పాడు. ‘బ్రహ్మవిష్ణుమహేశ్వరులను, గణపతిని, కుమారస్వామిని, అగ్ని వాయుదేవుళ్లను, చంద్రసూర్యులను, ఇంద్ర, వరుణ, యమ, కుబేరులను, కామదేనువును, సప్తసముద్రాలను, పవిత్ర తీర్థాలను, సప్తమరుత్తులను, ఆశ్వినీదేవతలను, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, పితృదేవతలను, మహర్షులను, వ్యాసవాల్మీకి మొదలైన మౌనీంద్రులను, ధర్మాలను, రాత్రిపగళ్లను, తారలను, నవగ్రహాలను, ఇరవైఏడు నక్షత్రాలను, కాలాన్నీ, గరుత్మంతుడు మొదలైన పక్షీంద్రాలను, సర్పరాజులను, పవిత్ర స్థలాలను, వనభూములను, కొండలను, దిక్కులను, ఆకాశాన్ని, భూమిని, వనస్పతులను, బ్రాహ్మణులను, చక్రవర్తులను, రాజులను అమితమైన భక్తితో స్మరించి, స్తుతించి, నమస్కరించి, కాపాడమని, దీర్ఘాయుష్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఇవ్వమని మదిలో ఆకాంక్షించాలి’.

‘ఆతరువాత, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమ స్సర్వలోక గురవే, నమ స్సర్వలోకపితామహాయ,  నమ సర్వలోక ప్రపితామహాయ, నమ స్సర్వలోక గురవే, నమ స్సర్వలోక పిత్రే, నమ స్సర్వలోక పితామహాయ, నమ స్సర్వలోక ప్రపితామహాయ, నమ స్సర్వలోక ప్రధానాయ, నమ స్పర్వలోకేశ్వరాయ, నమ సర్వలోక విశిష్టాయ, నమ స్సర్వలోక సుఖప్రదాయ, నమ స్సర్వలోక కర్త్రే, నమ సర్వలోక భర్త్రే, నమ సర్వలోక హర్త్రే, నమ స్సర్వలోక నిధయే, నమ స్సర్వలోక నిధానాయ, నమ స్సర్వలోక హితాయ, నమ సర్వలోకహితకరాయ, నమ సర్వలోకోద్భవాయ, నమ స్సర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే, ప్రభవిష్ణవే అని విష్ణు సహస్రనామాలు జపించటమే మహాజపం’.

(ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ ఎమ్ కులశేఖరరావు, శ్రీ ముదివర్తి కొండమాచార్యులు ఇలా రాశారు. “సర్వ దారిద్ర్యాలను, సర్వ దుఃఖాలను పోగొట్టి మోక్షం ప్రసాదించే మంత్రం చెప్పమని ధర్మరాజు అడిగినప్పుడు భీష్ముడు విష్ణుమంత్రోపదేశం చేశాడు. భగవన్మంత్రాలు అనేకం. వాటిల్లో వ్యాపకా మంత్రాలు శ్రేష్టం. సకల వేదాలలో నారాయణుడిని మించిన వేల్పులేనట్లే అన్ని మంత్రాలలో అష్టాక్షరిని మించిన మంత్రం లేదు. ‘ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రం పరమోత్తమం”). ఈ విష్ణుమంత్ర జపం చేయడం వల్ల పాతకాలు, భయాలు, కష్టాలు తీరుతాయని, శుభాలు ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని, ధర్మం మీద ఆసక్తి కలుగుతుందని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. 

లోకాలన్నింటికీ మహానీయమై ఆశ్రయించి అనుభవించదగిన దైవం ఎవరని, అర్చనతో, స్తుతితో ఎవరిని కొలిస్తే  జనులు శుభాన్ని పొందుతారని, అనేక ధర్మాలలో ఉత్తమమైన అభిమతాన్ని చూరగొనేది ఏదని, జపాలన్నిటిలో ఉత్తమజపం ఏదని, తనను జపించేవారికి జన్మనూ, సంసార బంధాలను పోగొట్టేది ఏదని ప్రశ్నించాడు ధర్మరాజు భీష్ముడిని. సమాధానంగా ఇలా చెప్పాడు భీష్మపితామహుడు.

‘సమస్త జగత్తులకు ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడనే పేరుగలవాడి సహస్రనామాలను నిరంతరం స్తుతిస్తూ, జాగృతమనస్కుడై యజ్ఞకర్తను, అవ్యయుడైన అతడిని అర్చనం చేస్తూ, ధ్యానంతో నమస్కరిస్తూ, ఆద్యంతాలు లేని ఆ విష్ణుదేవుడిని, సర్వలోకాధ్యక్షుడిని, బ్రహ్మణ్యుడిని, త్రిలోకకీర్తివర్ధనుడిని, సర్వధర్మాలు తెలిసినవాడిని, దయామయుడిని, లోకనాథుడిని, పంచభూతాల ఉత్పతికి కారకుడైన వాడిని నమ్మి భక్తితో సేవిస్తే అతడు దుఃఖాలనన్నింటిని దూరంగా గెంటి వేయగలడు. పుండరీకాక్షుడిని పరమభక్తితో పూజించటమే ధర్మాలన్నింటికంటే ఉత్తమ ధర్మం.  పరబ్రహ్మమైన ఆ విష్ణుదేవుడి సహస్రనామ సంకీర్తనం, పాపాలను, భయాలను పోగొట్టుతుంది. సకల సంపదలను సమకూరుస్తుంది’.

‘విశ్వము, విష్ణుడు, వషట్కారుడు, భూత భవ్యభవత్ప్రభువు మొదలైన నామాలతో మొదలుపెట్టి రథాంగపాణి, అక్షోభ్యుడు, సర్వప్రహరణాయుధుడు' అనే నామాలు తుదిగాగల విష్ణు సహస్రనామాలను భీష్ముడు ఉపదేశించాడు. తరతరాలుగా ఆ సహస్రనామాలు ప్రసిద్ధికెక్కాయని తెలిపాడు. విష్ణు సహస్ర నామాలను నిత్యం పఠించిన మనుష్యుడు ఇహపర శుభాలను పొందుతాడని, చతుర్వర్ణాల వారికి బహువిధ లాభాలు కలుగుతాయని, చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి కలుగుతుందని, సర్వవిధ అరిష్టాలకూ దుఃఖాలకూ దూరమై పరమపదం పొందుతారని, విష్ణు వొక్కడే మహాభూతమని, భూతములెన్ని ఉన్నా త్రిలోకవ్యాప్తుడుగా ఆయన విస్తరించి ఈ విశ్వాన్ని అనుభవిస్తాడని చెప్పిన భీష్ముడు, వ్యాసవిరచితమైన విష్ణు సహస్రనామాలను పఠించి శుభాలు సుఖాలు అనుభవించుమని ధర్మరాజుతో అన్నాడు. విష్ణుదేవుడి వెయ్యి నామాలను ఎల్లప్పుడూ పఠిస్తే ధర్మరాజుకు దీర్ఘాయుష్యం, ఐశ్వర్యం, వైభవం, ఆరోగ్యం, ఉత్తమ జ్ఞానం కలుగుతాయని చెప్పాడు భీష్ముడు.

ధర్మరాజు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు పూజా నమస్కారాలకు బ్రాహ్మణులు తగినవారని, వారికి అశుభం కలిగితే ఇంద్రుడికి కూడా కీడు కలుగుతుందని, వారికి సంతోషం కలిగితే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పగా, బ్రాహ్మణులలో మెచ్చుకొనదగిన ప్రవర్తన ఏమున్నదని ప్రశ్నించాడు ధర్మరాజు. ఆయన ప్రశ్నకు సమాధానం పవన-కార్తవీర్యార్జున సంవాదం అనే ఇతిహాసంలో లభిస్తుందని అంటూ దాని సారాంశాన్ని ఇలా వివరించాడు భీష్ముడు.

‘వేయి భుజాలుగల కార్తవీర్యార్జునుడు సప్తద్వీపాలకు అధిపతి అయి తనంత వారెవ్వరూ లేరని గర్వించాడు. ఒక భూతం బ్రాహ్మణుల ఆధిక్యాన్ని గురించి అతడికి చెప్పింది. బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించి జీవిస్తారని అతడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఆ సమయంలో వాయువు చొరవతీసుకొని బ్రాహ్మణశక్తి వలననే రాజులు ప్రజలను రక్షిస్తున్నారని, బ్రాహ్మణులను మించినవారు లేరనీ పేర్కొన్నాడు. గౌతముడు, భృగుమహర్షి, ఉచథ్యుడు, అగస్త్యుడు, వసిష్టుడు, అత్రి, భార్గవచ్యవనుడు, దత్తాత్రేయుడు మొదలైనవారి మహిమలు చెప్పి బ్రాహ్మణులను దైవస్వరూపులుగా భావించి వారి నీడలో ప్రకాశించడం శుభమని వాయువు హితవు చెప్పాడు. కార్తవీర్యార్జునుడు వాయువు మాటలలోని సత్యాన్ని గ్రహించి బ్రాహ్మణులను గౌరవించాడు’.

భీష్ముడు చెప్పినదంతా విన్న ధర్మరాజు బ్రాహ్మణ ప్రభావాన్ని ఇంకా ఇంకా వినాలని వుందని, మరింత వివరించుమని ప్రార్థించాడు పితామహుడిని. దానికి భీష్ముడు, బ్రాహ్మణ మహిమను తనకంటే శ్రీకృష్ణ భగవానుడు చాలా చక్కగా విశదపరుస్తాడని అంటూ ఆయన గురించి చెప్పాడిలా. ‘నేను శ్రీకృష్ణుడిని బాగా ఎరుగుదును. ఆదివరాహ రూపంలో భూమిని ఉద్దరించిన విష్ణువు అతడే. అతడి లీలలవలననే పంచభూతాలు ఉద్భవించాయి. అతడి నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ ఈ లోకాలను సృష్టించాడు. శ్రీకృష్ణుడి లీలలు సామాన్యమైనవి కావు.  ధర్మాలకు రాక్షసులవలన గ్లాని కలిగితే తాను అవతరించి అసురులను సంహరించి ధర్మాన్ని, ధర్మాత్ములను కాపాడుతాడు. శ్రీకృష్ణుడు శుచి, సర్వవ్యాపి, శివుడు. అతడే దిక్పాలకుడు, విశ్వనాథుడు, కాలస్వరూపుడు. దిక్కులు మొదలైన సమస్తం అతడే, అతడు యజ్ఞపురుషుడు, సర్వమంత్ర తంత్రగమ్యుడు. ఋగ్వేదం శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని కీర్తించింది. సర్వవేదాలూ అతడి తత్త్వాన్నే ప్రతిపాదిస్తాయి. యజ్ఞంలో అగ్నీ, యజమానుడూ, ఆహుతులూ, యాగఫలం కూడా కృష్ణుడే. సూర్యచంద్ర నక్షత్రాలలోని వెలుగు అతడే. అతడే పరంజ్యోతి. స్వర్గం, అమృతం, వేదాంత వేద్యుడు అతడే’.  

భీష్ముడు చెప్పిన విధంగానే ధర్మరాజు, ‘బ్రాహ్మణ మహాత్మ్యాన్ని వివరించ కోరుతున్నా’నని, శ్రీకృష్ణుడితో అన్నాడు. దానికి సమాధానంగా ఆయన ఇలా చెప్పాడు. ‘నే నిదివరలో ప్రద్యుమ్నుడికి చెప్పినట్లు నీకు వివరిస్తాను. ధర్మార్థకామమోక్షాలను సంపాదించాలన్నా, వేదత్రయ విజ్ఞానాన్ని సంపాదించాలన్నా, మోక్షాన్ని సాధించాలన్నా, పితృదేవతల దయ పొందాలన్నా, ఐహిక సుఖాలు గడించాలన్నా బ్రాహ్మణులను ఆశ్రయించాలి. ఆయురారోగ్య యశస్సంపదలు వారివలన లభిస్తాయి. కోరితే వారు వరాలు ఇవ్వగలరు. కోపిస్తే భస్మం చేయగలరు. వారికి ఉన్నదానిలో దానం చేసి వారిని తృప్తి పరిస్తే ఇహపరసుఖాలు కలుగుతాయి’. ఇలా చెప్పి శ్రీకృష్ణుడు, ఏవిధంగా దుర్వాస మహర్షి తన మనశ్శుద్ధిని పరీక్షించి అనుగ్రహించాడో వివరించాడు. అదిలా సాగింది.

‘స్వతంత్రవర్తనుడైన దుర్వాసుడు ఒకసారి మా ఇంటికి వచ్చాడు. చిత్రవిచిత్రంగా వ్యవహరించాడు. ఒకసారి ఒంటినిండా పాయసాన్ని పూయించుకొన్నాడు. రథానికి రుక్మిణిని కట్టి లాగించి బాధించాడు. ఆమె మూర్ఛపోగా రథాన్ని వదలి వెడలిపోయాడు. నేను అతడివెంట వెళ్లి అనునయించి ప్రార్థించాను. అతడు ప్రసన్నుడై “అందరూ తమను తాము ఎంత ప్రేమించుకొంటారో అంతగా నిన్నుకూడా ప్రేమించి పూజిస్తా” రని నాకు వరం ఇచ్చాడు. పాయసం అరికాలికి పూయలేదని చెప్పి దానివలన నాకు ప్రమాదముంటుందని సూచించాడు. అయితే, కలగనున్న ఆ ఆపద వల్ల నాకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని అన్నాడు. రుక్మిణికి అపూర్వ సౌందర్యాన్ని, భర్తృవాల్లభ్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి బ్రాహ్మణులపట్ల భక్తి కలిగి ఉండడంవలన శుభాలు చేకూరుతాయి’.

ఆ తరువాత ధర్మరాజు కోరగా శ్రీకృష్ణుడు శివుడి మహిమను, దుర్వాసుడు శివాంససంభూతుడు అనడానికి కారణాన్ని వివరించాడు ఇలా. ‘ఎవరు శివుడిని మనస్సులో నిలుపుకొని శతరుద్రీయ (నమకాన్ని) మంత్రాన్ని జపిస్తారో వారు ఇహపరసుఖాలు పొందుతారు. శివుడు మహాదేవుడు. దానికి మించిన పేరు మరొకటి లేదు. అతడి మూడవ కంటిమంట ధర్మవిరోథులను కాల్చివేస్తుంది. దక్షుడి యజ్ఞం ధ్వంసం కాలేదా? త్రిపురాసుర సంహారం ఆ దేవుని ప్రతాపానికి చిహ్నం. త్రిపురాసురులను సంహరించిన అస్త్రాన్ని, ఆ దేవుడు ఒడిలో పెట్టుకొనగా, అది బాలుడుగా మారింది. ఆ బాలుడే దుర్వాసుడు’.

‘శివ నామాలన్నీ చెప్పి వివరించటానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. శివుడు సార్థకనాముడైన మహేశ్వరుడు. ఉగ్రత్వము, ఉన్నత ప్రతాపం ఉండటంచేత రుద్రుడయ్యాడు. దేవతలలో కెల్ల గొప్పవాడు కావున మహాదేవు డయ్యాడు. సత్కర్మఫలాలైన శుభాలు కలిగినవాడు కావటం చేత శివుడయ్యాడు. సుస్థిర తేజస్సుతో వెలుగొందడం వల్ల స్థాణువు అయ్యాడు. జంగమాత్మక రూపాలనన్నింటిని పొందటంచేత బహురూప నామధారి అయ్యాడు. పొగరంగు లాంటి జటలు కలిగినవాడు కావడం వల్ల ధూర్జటి అయ్యాడు. విశ్వులనే దేవతలు అతడియందు పుట్టారు కాబట్టి విశ్వరూప నామధేయు డయ్యాడు. తన శరీరంలో బహునేత్రా లుండటంవలన సర్వతశ్చక్షువనే  నామంతో ఒప్పుతున్నాడు. భూతములన్నీ పశువులై తాను వాటికి పతి కావటంచేత పశుపతి అయ్యాడు. నందివాహనుడు కావటంచేత వృషవాహను డయ్యాడు. ప్రాణులను సమభావంతో పాలిస్తాడు కాబట్టి మృత్యువయ్యాడు. ఇవన్నీ వేదాలలో చెప్పిన శివనామాలు. ఇంకా ఎన్నో పేర్లు శివుడికి ఉన్నాయి. వేదవేత్తలు వాటిని తెలిసి శివానందులై విహరిస్తారు. శివనామావళిని భక్తితో చదివినా, విన్నా ఇహపరలోకంలో సౌఖ్యానందాలు జనులు పొందుతారు’.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment