Sunday, July 23, 2023

ఉమామహేశ్వర సంవాదాన్ని, దాని మహిమను వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-130 : వనం జ్వాలా నరసింహారావు

 ఉమామహేశ్వర సంవాదాన్ని, దాని మహిమను వివరించిన భీష్ముడు

ఆస్వాదన-130

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-07-2023)

శ్రీకృష్ణుడు కొడుకు కావాలన్న కోరికతో రుక్మిణీ సమేతంగా హిమవత్పర్వతానికి వెళ్ళి పన్నేండేళ్ళు వ్రతం చేశాడు. అప్పుడు నారదాది మహర్షులు శిష్యసమూహంతో వచ్చి శ్రీకృష్ణుడి చుట్టూ కూచుని పుణ్యగోష్ఠి చేస్తున్న సమయంలో, అతడి ముఖం నుండి ఒక మహాగ్ని వెలువడి ఆ పర్వత వనాలను కాల్చివేస్తుంటే, శ్రీకృష్ణుడు ఆ మంటను చల్లార్చి అడవిని మునుపటిలాగానే సవ్యంగా చేశాడు. మహర్షుల ప్రార్థన మేరకు ఆ అగ్నిని గురించి శ్రీకృష్ణుడు వివరించి చెప్పాడు ఇలా.

‘ఒక రాక్షసుడు నా వరంవల్ల అస్త్ర విద్యతో అద్భుత శక్తి పొంది, అహంకరించి లోకకంటకుడయ్యాడు.  అతడిని సంహరించగల కొడుకును పొందటానికి ఈ మహావ్రతాన్ని చేపట్టాను. నా ఆత్మ అగ్నిగా మారి, నా ముఖం నుండి వెలువడి బ్రహ్మ దగ్గరకు వెళ్ళింది. ఆ మహానుభావుడు మన్మథుడిని నా కుమారుడిగా పంపి, ఆ అగ్నిని మరలించాడు. అది తిరిగిపోతూ ఈ అడవిని కాల్చింది. నేను కరుణించి మరల దానికి మొదటిరూపు కల్పించాను' అని అగ్ని కథ చెప్పి ఋషులను తనకొక ఉత్తమ ఇతిహాసాన్ని చెప్పి తన కోరిక తీర్చండని కోరాడు. ఋషులు ఆ పనికి సమర్థుడు నారదుడే అని పేర్కొని, అతడిని కథ చెప్పమని ప్రార్థించారు. నారదుడు “ఉమామహేశ్వర సంవాదం” అనే ఇతిహాసాన్ని శ్రీకృష్ణుడికి వినిపించాడు. అదిలా సాగుతుంది.

నారదుడు తాను లోక సంచారం చేస్తూ హిమవత్పర్వతం మీద ఒక సుందర దివ్యోద్యాన వనాన్ని చూశానని, ఆ ఉద్యానవనంలో మహాదేవుడు ఉండగా ఆ సభలో తాను కూడా చేరి స్వామిని సేవిస్తూ ఉన్నానని, అంతలో సపరివారంగా పార్వతీదేవి వచ్చి పరమేశ్వరుడిని విలాసంగా చూసిందని, దానితో లోకంలో సూర్యచంద్రుల కాంతి లోపించి కారుచీకటి వ్యాపించిందని, లోకాలు భీతిల్లగా పరమేశ్వరుడు మూడవ కంటిమంటతో వెలుగులు ప్రసాదించాడని, పార్వతి భీతిల్లి పరమేశ్వరుడి పాదాలకు ప్రణమిల్లిందని, స్వామి కరుణతో చూడగా మంటలు చల్లారి కొండ చల్లబడిందని చెప్పి, అప్పుడు పార్వతి పరమేశ్వరుడిని అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానాలు వివరించాడు.

శివుడు తన నొసటికన్ను తెరవటానికి గల కారణం ఇలా చెప్పాడు: ‘ఈ లోకాలన్నీ నా స్వరూపాలే. నా కేది కలిగితే లోకాలకు కూడా అది కలుగుతుంది. నీవు నా కన్నులు మూశావు. లోకాలలో చీకటి వ్యాపించింది. భూతాలు భయపడ్డాయి. నీ చేతులు తొలగించకుండా చీకటి పొగొట్టటానికి నా ఫాలనేత్రం తెరవవలసి వచ్చింది’. శివుడికి నాలుగు ముఖాలెందుకు ఉన్నాయన్న దానికి జవాబు: ‘సుందోపసుందులనే మహాబలవంతులైన రాక్షసులను చంపటానికి విశ్వకర్మ తిలోత్తమను సృష్టించి నా వద్దకు పంపాడు. ఆమె దేవకార్య నిమిత్తమై నా చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. నేనే ఆమెను రక్షించటానికై నాలుగు దిక్కులా చూచాను. అప్పుడు నాలుగు మొగాలు మొలిచాయి’.

శివుడికంఠంలో నలు పెందుకు కలిగిందన్న దానికి సమాధానం: ‘క్షీరసాగర మథన సమయంలో వెలువడిన కాలకూటాన్ని లోక సంరక్షణార్థమై నా కంఠంలో ధరించాను. బ్రహ్మాదులందుకే నన్ను నీలకంఠుడని పిలుస్తారు’. శివుడికి పినాక మనే ఆయుధం మీద ఎక్కువ మక్కువ ఎందుకని పార్వతి అడగ్గా చెప్పిన సమాధానం. ‘కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహాతపస్సు చేశాడు. అతడిమీద పెద్ద పుట్ట, దానిమీద మిక్కిలి పొడవు వెడల్పూ గల వెదురు మొలిచింది. బ్రహ్మ ఆ మహర్షికి ప్రత్యక్షమై వరమిచ్చి ఆ వెదురును తీసికొని, లోక శ్రేయస్సును కాంక్షించి దానిని మూడు ముక్కలు చేసి మూడవ ముక్కతో పినాకాన్ని నిర్మించి నా కిచ్చాడు. రెండవ ముక్కతో శార్ జ్గమును నిర్మించి విష్ణువుకు ఇచ్చాడు. మొదటి తునుకతో గాండీవాన్ని కల్పించి తాను తీసికొనిపోయాడు. అందువలన నేను పినాకాన్ని అభిమానిస్తాను’.

శివుడు నంది వాహనాన్ని ఎందుకు ఆదరిస్తాడని అడిగింది పార్వతి. జవాబుగా శివుడు: ‘నేను హిమవత్పర్వతంమీద తపస్సు చేసికొంటున్నప్పుడు ఆవులు నా చుట్టూ నిర్భయంగా తిరుగుతూ కష్టపెట్టాయి. నేను కోపించి చూడగా అవి బాధపడ్డాయి. బ్రహ్మ, దేవతలు నా వద్దకు వచ్చి ప్రార్థించి నా కొక ఎద్దును కానుకగా ఇచ్చి “గోపతి” అని పేరు పెట్టి గోవుల బాధ తీర్చారు. అది మొదలు నేను ఆ ఎద్దును వాహనంగా, ధ్వజంగా చేసికొని సంచరిస్తున్నాను’ అని చెప్పాడు.

మనోహరమైన నెలవులను వదలి అశుచి అయి, కేశాస్థికపాల దుర్గంధ దుర్దర్శన మైన శ్మశానంలో శివుడు వుండడానికి కారణమేమిటని పార్వతి ప్రశ్నించింది. ‘క్రూరభూతాలు జనులను ఘోరంగా వధ చేయటం గమనించి బ్రహ్మ నన్ను ఆ విపత్తును తొలగించుమని ప్రార్థించాడు. మోక్షమందు ఆసక్తి కలవారు నిర్జనమైన శ్మశానాన్ని పవిత్రస్థానంగా భావిస్తారు. కాబట్టి నేను వల్లకాటిలో ఉండటానికి ఇష్టపడతాను. అక్కడే ఉండి లోకరక్షాకార్యాన్ని నిర్వహిస్తాను’ అని జవాబిచ్చాడు శివుడు. బూదిపూత, ఎముకలు, పాములు ధరించడానికి కారణం చెప్పాడు ఇలా. ‘జగత్తంతా సౌమ్యం, ఆగ్నేయం అనే రెంటి కలయికతో కూడి ఉన్నది. సౌమ్యమైన దానిని విష్ణువూ, ఆగ్నేయమైన దానిని నేనూ భరిస్తూ ఉంటాము. ఈ రెంటిని కలిపి ఈ విశ్వాన్ని నేను వహిస్తున్నాను. అందువలన అగ్నిసంబంధ భావంతో కూడుకొనిన ఆకారాన్ని లోకహితం కొరకు తాల్చాను’.

శివుడు చంద్రుడిని ప్రేమతో తలపై ధరించటానికి కారణం ఏమిటని ప్రశ్నించింది పార్వతి. ‘దక్షయజ్ఞంలో నేను ఆగ్రహించినప్పుడు దేవతలందరినీ హింసించాను. ఆ సందర్భంలో చంద్రుడి దేహాన్ని అడ్డదిడ్డంగా త్రొక్కివేశాను. అతడు నన్ను శరణు కోరాడు. జాలిపడి చేసిన కీడు తొలగటానికి అతడిని తలపై ధరించాను’ అని సమాధానం ఇచ్చాడు శివుడు.  

పార్వతి కోరిక మేరకు శివుడు వర్ణాశ్రమ ధర్మాలను తెలియచేశాడు ఆమెకు. ‘లోకహితం కొరకు బ్రహ్మ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే వారిని సృష్టిచేశాడు. ఆయా వర్ణాలవారికి విధులను, ధర్మాలను నిర్దేశించాడు. బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచర్యం, గురుసేవ, విద్యాభ్యాసం, నిత్యాగ్నిహోత్రం అవశ్యకర్తవ్యాలు. గృహస్థాశ్రమం అన్నింటిలో ముఖ్యమైనది. పంచయజ్ఞాలు ఆచరించటం, స్వీయభార్యను పాలించటం, దానాలు చేయటం, బంధువులను గౌరవించటం గృహస్థాశ్రమ ధర్మాలు. అడవిలో నివసించటం, కందమూలాలు భుజించటం, స్త్రీ సంగమం వర్ణించటం, జడలు ధరించి జింకచర్మాన్ని కట్టుకొనటం, వానప్రస్థాశ్రమ ధర్మాలు. కోపగించుకోకుండా ఉండటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, ఓర్పు వహించటం, బ్రాహ్మణులతో కలిసి జీవించటం, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, శుచిగా, శుభ్రంగా ఉండటం, సద్ర్వతనిష్ఠ, భిక్షాభోజనం, నేలపై మాత్రమే శయనించటం, దయాస్వభావం కలిగి ఉండటం, సదా తత్వచింతనతో, యతి ధర్మాలతో జీవించటం సన్న్యాసాశ్రమ విధులు. ఇవి వేదాలు సమ్మతించిన విధులు’ అని అన్నాడు. 

ముని జనులు చేసే తపస్సు యొక్క విధానం తెలియజెప్పమని అడిగింది పార్వతి. ‘తపమంటే సామాన్యంగా వానప్రస్థులు చేసే ధర్మాలు. ఇంద్రియ నిగ్రహం, యోగాభ్యాసం, ఫలాభిరహిత కర్మాచరణం, పంచాగ్ని మధ్య తపస్సు మొదలైనవి చేసి స్వర్గం పొంది సుఖించేవారు తపస్వులు. భార్యాయుతులై తపస్సు చేసేవారు అహింస, దయ మొదలైన గుణాలు కలిగి, సర్వభూత సమభావంతో వర్తిస్తారు. ఉపవాసం, మౌనం, భూతలశయనం మొదలైన వానప్రస్థాశ్రమ నియమాలు తపస్వులు పాటిస్తారు’ అని అన్నాడు శివుడు. దేశ ద్రిమ్మరులైన విరాగులు యాయావరులని, పుణ్యతీర్థాలను సేవిస్తూ నిరాహారవ్రతాలను పాటిస్తుంటారని, బక్కచిక్కిన శరీరాలతో నియమనిష్ఠలతో జీవించి స్వర్గం చేరతారని, వైఖానసులు కఠిన వ్రతాలు పాటిస్తారని, రాళ్లతో, వరిధాన్యాలను దంచుకొని వానిని మాత్రమే నమలుతారని,  కొందరు గాలి, నీరు మాత్రమే స్వీకరిస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు శివుడు.

గృహస్థాశ్రమ ధర్మాలను తెలపమని అడగ్గా ఇలా జవాబిచ్చాడు శివుడు. ‘గృహస్థాశ్రమంలో కామం ధర్మప్రధానమై ఉండాలి. ఆత్మనిగ్రహం, భూతదయ, శాంత స్వభావం, అతిథి సత్కారం, మిగిలిన ఆశ్రమవాసులను గౌరవించటం గృహస్థాశ్రమ ధర్మంలో ముఖ్యం. స్త్రీకి పతిని సేవించటం ప్రధాన విధి. గృహస్థుడు నిజభార్యయందే రమించాలి. ఆహార నియమం పాటిస్తే ముక్తి మార్గం సులభం. రాజార్హత తపస్సువలన లభిస్తుంది. అందువలననే ఇతరులకు నమస్కార యోగ్యుడౌతాడు. నిగ్రహానుగ్రహ సమర్థు డౌతాడు. తాను నీతిపరుడై ఇతరులను నీతిపరులుగా చేస్తాడు. అవసరం వస్తే శిక్షిస్తాడు. కామాది అంతశ్శత్రువులను జయించి సప్తాంగాలను శాసిస్తాడు. చారచక్షువై లోకాన్ని గమనిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తాడు. అధర్మాన్ని శిక్షిస్తాడు. అకారణంగా యుద్ధం చేయడు. న్యాయబద్ధంగా యుద్ధానికి పూనుకొంటాడు. యజ్ఞాలు, దానాలు చేస్తాడు. ఈ నీతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే రాజుకు పాపం కలుగుతుంది. ప్రజలను బిడ్డలవలె కాపాడి సంపదను, పేరు ప్రఖ్యాతులను గడిస్తాడు. చివరకు స్వర్గసుఖాలను పొందుతాడు’ అని అన్నాడు శివుడు.  

ధర్మరహస్యం వినగోరుతానని అడిగినప్పుడు ఇలా చెప్పాడు శివుడు. ‘ధర్మాలన్నింటిలో అహింస సూక్ష్మమైన ధర్మం. శాంతగుణంతో తపస్సు చేసికొనేవారు అహింసావ్రతం పాటించేవారు. లోకులు తమ కర్తవ్యాలు చేస్తూ ఉండగా  కొన్ని ప్రాణులు చనిపోతాయి. అప్పుడు వారికి చంపే బుద్ది ఉండదు. పాపపుణ్యాలకు బుద్ధి ప్రధానం. యుద్ధాలలో మరణించటం, యుద్ధాలలో సంహరించటం హింస కాదు. స్వర్గప్రాప్తికి హేతువులు కూడా. వేటాడటం హింస కాదు. వేదమంత్రయుతంగా యజ్ఞంలో పశువిశసనం హింస కాదు. శిక్షకు తగినవాడిని శిక్షించటం కూడా హింస కాదు’.

జనులు జీవించే విధానాన్ని గురించి చెప్పమని ప్రశ్నించింది పార్వతి. ‘మనుష్యజన్మం కర్మభూమి. సుఖదుఃఖాలకు మూలం ధనం. అందువలన ధనసంపాదన మార్గాలు మానవుడు యోచిస్తాడు. అయితే అవి ధర్మపథంలో సాగాలి. కర్మలలో మోసం ఉండకూడదు. ఉపాయంతో పనులు చేయాలి. ఇతరుల ధనాన్నీ, వనితలనూ దొంగిలించరాదు. తల్లిదండ్రులను, అతిథులను, దేవతలను గౌరవించి పూజించాలి. ఇవి అందరూ ఆచరించదగిన జీవన విధానం’ అని సమాధానమిచ్చాడు.

పసివారు మరణించటానికి, ముసలివారు చాలాకాలం జీవించటానికి కారణ మేమిటని అడిగింది పార్వతి. జవాబుగా శివుడు: ‘శరీరం శిథిలమౌతున్నది కాని వృద్ధులకు చావు త్వరగా రావటం లేదన్నావు. మృత్యువు నరుడిని చేరినప్పుడు చావు కలుగుతుంది. పూర్వజన్మలో చేసిన కర్మలు మానవుడికి ఆయుస్సును వృద్ధి చేస్తాయి. తగ్గస్తాయి కూడా. దానివలన బ్రతుకు చావులు సంభవిస్తూ ఉంటాయి. క్షమ, సత్యం, కృప, శౌచం, గురుభక్తి, ఆయుస్సును వృద్ధి చేస్తాయి. అసత్యభాషణం, క్రౌర్యం, అశుభ్రత, గురువిరోధం ఆయుస్సును తగ్గిస్తాయి. బ్రహ్మచర్యవ్రతం, హితమితాశనం, జరావ్యాధులు పోగొట్టే ఔషధాలను సేవించటంచేతను ఆయుస్సు పెరుగుతుంది. శక్తికి మించిన పనులు చేయటం, తగనటువంటి, అనుసరణీయం కానటువంటి పదార్థాలు తినటం చేతను ఆయుస్సు తగ్గిపోతుంది. ఇవన్నీ పూర్వజన్మలో చేసిన కర్మలవలననే సంభవిస్తాయి’.

స్త్రీ పురుష భేదంతో ఉన్న మానవులలో జీవుడు వర్తించే విధం వివరించుమని పార్వతి కోరగా శివుడు ఇలా చెప్పాడు. ‘తాత్వికంగా జీవుడికి పురుష స్త్రీత్వాలు లేవు. అహంకారం కారణంగా కర్మానుభవం కలిగి భావించిన విధంగా జరుగుతుంది. ఆత్మ శరీరానికి అతీతమైనది. కర్మలకు ఆత్మ కర్త కాదు. అతడి త్రిగుణాత్మక చైతన్యం శరీరాన్ని పొంది కర్తృత్వం వహిస్తుంది. మనుష్యులు చేసే కర్మలను బట్టి ఫలితాలు కూడా కలుగుతాయి. జంతువులలో మానవుడు శ్రేష్ఠుడు. అతడికి గొప్పతనం కలిగించేది విద్య. విద్యవలన అజ్ఞానంవలన, సంసారంవలన కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి. వేదాలవలన జ్ఞానం కలుగుతుంది. వేదవిజ్ఞానంవలన మానవుడిలోని అంతశ్శత్రువులు తొలగిపోతాయి. విద్యావంతులు దేవతలవలె ప్రకాశిస్తారు’.

ఇంక ఇలా చెప్పాడు శివుడు. ‘మరణం ఆసన్నమైనపుడు శరీరాన్ని విడిపించి, మనుష్యులను అదృశ్య శరీరం వహించే విధంగా చేసి యమదూతలు తీసికొని వెళ్ళతారు. వారిలో ధార్మికులను సువాసన భరితంగానూ, సుకుమారంగా ఉండే మార్గంలో కొనిపోతారు.   ధర్మాధర్మాలను మిశ్రమంగా చేసినవారిని బాధలు లేనిదారిలో తీసికొనిపోతారు. అధర్మపరులను కఠినం, మలినం అయిన దారిలో నడిపిస్తారు. యమధర్మరాజు వారికి తగిన శిక్షలను విధిస్తాడు. రౌరవం, మహారౌరవం, కంటకావనం, అగ్నికుండం, పంచకష్టం అని నరకాలు అయిదు. జీవులు చేసిన పాపాలను బట్టి ఆయా నరకాలకు యముడు పంపుతాడు. యమభటులు వారికి కాల్చటం, కత్తిరించటం, కట్టివేయటం, కొట్టటంవంటి శిక్షలు విధిస్తారు. ఆ పాపాత్ములను కుక్కలు కరుస్తాయి. కీటకాలు తొలుస్తాయి. గ్రద్దలు ముక్కుతో పొడుస్తాయి. ఇటువంటి అనేక దుఃఖాలు అనుభవించి పురుగులుగానూ, పక్షులుగానూ, జంతువులుగానూ, మనుష్యులుగానూ జన్మిస్తారు. యమ శిక్షలతో పాపాలు తొలగిపోతాయి’.

‘మానసములనీ, వాచికములనీ, కాయికములనీ పాపాలు మూడు రకాలు. అన్యుల ద్రవ్యాన్ని ఆశించటం, పాపకృత్యాలకు పాల్పడటం, ధర్మాన్ని ద్వేషించటం మొదలైనవి మానసాలు. అసత్యమాడటం, కఠిన సంభాషణం మొదలైనవి వాచికాలు. హత్యచేయటం, ఇతరులను బంధించటం, మద్యపానం అనేవి కాయికాలు. అన్నిటిలో మద్యపానం మహాపాపం. దానిని వదలి యశస్సు, సంపద, సౌఖ్యం, పుణ్యగతి పొందవచ్చును. పుణ్యకర్మలు లోకంలో మూడురకాలు. అవి, ఔపమికం, నిరుపకరణం, సోపకరణం. ఔపమికమంటే పాపాన్ని తొలగించేది. నరకభయంతో పాపాలు చేయకుండా ఉండటం. దీనివలన స్వర్గం లభిస్తుంది. నిరుపకరణం అంటే శుచిగా ఉండటం, నిజం మాట్లాడటం, అహింసను పాటించటం, వ్రతదీక్ష, ఉపవాసం, స్త్రీ సంగమ వర్జనం, పుణ్యతీర్థ సేవనంవంటి నియమాలు పాటించటం. దానాదులు చేయటం సోపకరణం.

         భక్తులు ఏ పరిచర్యలవలన శివ సాయుజ్యాన్ని పొందుతారని పార్వతి అడిగింది. సమాధానంగా శివుడు ఇలా అన్నాడు. ‘నేను దేవతలకూ, మనుషులకూ అచింత్యుడను. యోగసాంఖ్యాలు నేను చేసినవే. నేను ఈశ్వరుడను, సనాతనుడను, అవ్యయుడను, సత్యాత్ముడను. పంచాక్షరీత్యాది మంత్రాలతో, స్మరణంచేత, నమస్కారంచేత, వివిధ సేవలచేత నియమంతో నన్ను సేవించాలి. చతురాశ్రమాలను పాటించే వారికి పాశుపతవ్రతాన్ని బోధించాను. శివలింగారాధనం, భస్మరుద్రాక్షధారణంవలన పరిశుద్ధులై అభిషేకాదులతో నన్ను ఆరాధిస్తే నా సాయుజ్యాన్ని పొందుతారు.

ఆ తరువాత శివుడు కోరడం వల్ల పార్వతి గంగాది నదులతో సంప్రదించి పతివ్రతాధర్మాలను చెప్పటం ప్రారంభించింది. ‘కన్యాదానం జరిగిన తరువాత స్త్రీకి భర్త అధికారి. ఆమె భర్తను దైవంగా భావించాలి. అతడి అభిప్రాయాన్ని అనుసరించి దైవపితృకార్యాలు చేయాలి. భర్తకు మేలే చేయాలి. ఆమెను పతివ్రత అంటారు. ఆమెకు ఇహపరలోక సుఖాలు లభిస్తాయి. స్త్రీ గృహనీతి విద్యకు ఆచార్యకం. వంటచేయటం, కాపురం చేయటం ఆమె కర్తవ్యం. భర్త ఎటువంటివాడైనా, ఎట్టి స్థితిలో ఉన్నా అతడిని ఆమె గౌరవించాలి. జంతువులకు బలి, బీదవారికి భిక్షం తప్పక ఇయ్యాలి. భార్యకు భర్తయే గతి. అక్రమంగా ప్రవర్తించే స్త్రీలు మూడురకాలు. వారిని ఆసురి, పైశాచి, రాక్షసి అని అంటారు. ఆసురి చంచల మనస్సుతో ధనవ్యయం చేస్తుంది. పైశాచికి కోపం అధికం. రాక్షసి కలహప్రియ. వీరు భర్త వంశంవారిని పాడుచేసి తాము పాపలోకానికి పోతారు. ఈ ముగ్గురూ పశ్చాత్తాపంతో ధర్మమార్గంలో నడిస్తే పాపాలు పోగొట్టుకొని భర్తతో కలిసి స్వర్గానికి పోతారు. సతికి పతితో సహగమనం స్వర్గాన్ని కలిగిస్తుంది. సంతానవతికి సహగమనం ధర్మం కాదు.

శివపార్వతుల సంవాదం విన్నవారికి సర్వశుభాలు కలుగుతాయని పరమేశ్వరుడు ప్రకటించాడు. నారదుడు చెప్పిన ఈ అద్భుత వృత్తాంతాన్ని భీష్ముడు ధర్మరాజుకు వినిపించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, చతుర్థ-పంచమాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment