Sunday, October 1, 2023

దావాగ్నిలో ధృతరాష్ట్రాదుల నిర్యాణం గురించి ధర్మరాజుకు చెప్పిన నారదుడు ..... ఆస్వాదన-140 ; వనం జ్వాలా నరసింహారావు

 దావాగ్నిలో ధృతరాష్ట్రాదుల నిర్యాణం గురించి ధర్మరాజుకు చెప్పిన నారదుడు

ఆస్వాదన-140

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02-10-2023)

అరణ్యాలకు పోయిన ధృతరాష్ట్రుడు, తీవ్రమైన తపస్సును ఏకాగ్రతతో ఆచరిస్తున్న రోజుల్లో, ఒకనాడు ఆయన్ను చూడడానికి నారదుడు, పర్వతుడు, దేవలుడు, మౌంజాయనుడు అనే మహర్షులు ఆయన ఆశ్రమానికి వచ్చారు. అదే సమయంలో శతయూపుడు కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. కుంతి వారందరినీ పూజించింది. ధృతరాష్ట్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమం చాలా విశిష్టమైనదని, లోగడ అక్కడ తపస్సు చేసినవారు ఇంద్రలోకం పొందారని, ఆ ఆశ్రమానికి రావడం సామాన్యులకు సాధ్యం కాదని, వ్యాసుడి దయవల్ల ధృతరాష్ట్రుడికి అక్కడ తపస్సు చేసే అవకాశం కలిగిందని, ఆయనకు ఉత్తమగతులు కలుగుతాయని, గాంధారి కూడా ఆయన్ను అనుసరించి వస్తుందని, భక్తితో సేవలు చేస్తున్న కుంతి కూడా ఆమె భర్త పాండురాజును చేరుతుందని, విదురుడు ధర్మరాజు శరీరంలో ప్రవేశిస్తాడని, సంజయుడు స్వర్గలోకంలో ప్రకాశిస్తాడని నారదుడు చెప్పాడు.

కురురాజు ధృతరాష్ట్రుడికి ఉత్తమగతి కలగడానికి సంబంధించిన విశేషాలను చెప్పమని నారదుడిని అడిగాడు శతయూపుడు. తాను ఒకసారి దేవేంద్రుడి దగ్గరికి పోయినప్పుడు అక్కడ సభలో ధృతరాష్ట్రుడి ప్రస్తావన వచ్చిందని, అతడి తపోనిష్టకు అంతా ప్రశంసించారని, ఆ సందర్భంగా తనతో ఇంద్రుడు చెప్పిన మాటలను చెప్పాడు నారదుడు. ధృతరాష్ట్రుడు మూడు సంవత్సరాలు తపస్సు చేసి, అ ఆతరువాత ఆయన, గాంధారి శరీరాలు విడిచి, కుబేరుడితో మైత్రి పొంది, దివ్యమైన ఆభరణాలు ధరించి, పుష్పక విమానంలో సంచరిస్తూ సంతోషంగా వుంటారని ఇంద్రుడి మాటలుగా చెప్పాడు. నారదుడి మాటలకు ధృతరాష్ట్రుడు ఆనందించాడు. నారదాది మహర్షులు అ ఆతరువాత ధృతరాష్ట్రుడిని ప్రశంసించి తమ నివాసాలకు వెళ్లిపోయారు. అక్కడ హస్తినాపురంలో అను నిత్యం ధృతరాష్ట్రుడిని, గాంధారిని, కుంతిని, సంజయుడిని, విదురుడిని తలచుకొని పాండవులు బాధపడేవారు. ద్రౌపది, సుభద్ర కూడా వారితో పాటే బాధపడేవారు.

ధైర్యం కోల్పోయిన పాండవులు ధృతరాష్ట్రుడిని, గాంధారిని, కుంతీదేవిని చూడడానికి అడవులకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. వారితోపాటు పోవడానికి ద్రౌపది, సుభద్ర కూడా సిద్ధపడ్డారు. ధర్మరాజు అడవికి వెళ్దామని నిర్ణయించుకుని సేనాపతులను పిలిచి అన్నీ సిద్ధం చేయమన్నాడు. రాదల్చుకున్న పురజనులను రమ్మన్నాడు. వెంటనే రథాలు, పల్లకీలతో సహా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. యుయుత్సుడిని, కృపాచార్యుడిని, ధౌమ్యుడిని నగర రక్షణ కొరకు వుంచారు.

ధర్మరాజు అడవికి ప్రయాణమయ్యాడు. పౌరులు ఆయన వెంట వచ్చారు. గంగానదిని దాటి కురుక్షేత్రంలో ప్రవేశించి, శతయూపుడి ఆశ్రమ సమీపంలో వున్న ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వెళ్లాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు యమునలో స్నానం చేయడానికి పోయినందున అటు దిక్కుగా వెళ్లారు ధర్మరాజాదులు. వీరికి ఎదురుగా వచ్చారు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. పాండవులు, ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి, ధృతరాష్ట్రుడి కోడళ్లు మొదలైనవారు వారి పాదాలమీద పడి నమస్కరించారు. అంతా కన్నీరు కార్చారు. తనవారంతా తన దగ్గరికి రావడంతో ధృతరాష్ట్రుడు మనసులో తాను హస్తినాపురంలో వున్నట్లుగా భావించాడు. అంతా కలిసి ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో పాండవుల రాక తెలుసుకొని అక్కడికి వచ్చిన తాపసులకు సంజయుడు అందరినీ పరిచయం చేశాడు. పాండవుల క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ధృతరాష్ట్రుడు. తన బాగోగులను గురించి వివరించాడు. తన తపస్సు గురించి చెప్పాడు. కుంతి చేస్తున్న సేవలను వివరించాడు. సంజయుడు తమను జాగ్రత్తగా చూసుకుంటున్న సంగతి తెలియచేశాడు. విదురుడు తమను విడిచి ఎక్కడెక్కడో తిరుగుతుంటాడని అన్నాడు.

ఇంతలో అక్కడికి విదురుడు వచ్చాడు. హటాత్తుగా ధర్మరాజుకు కనబడ్డాడు. ఆశ్రమంలో జనాలను చూసి వెళ్లిపోసాగాడు. ధర్మారాజు ఆయన్ను వెంబడించాడు. విదురుడిని ఆగమని పిలిచాడు. ఒక చెట్టు కింద ఆగి నిల్చున్నాడు విదురుడు. ధర్మరాజు దగ్గరికి వెళ్లినప్పటికీ, యోగి అయిన విదురుడు మాట్లాడకుండా నిశ్చలంగా వుండిపోయాడు. తాను ధర్మరాజునని చెప్తుండగానే విదురుడు, మెల్లగా కనురెప్పలు ఎత్తి, ధర్మరాజును తదేకంగా చూస్తూ, యోగశక్తితో తన ఇంద్రియాలను ధర్మరాజు ఇంద్రియాలలోనూ, తన ప్రాణాలను ధర్మరాజు ప్రాణాలలోనూ కలిపి, తన శరీరం విడిచిపెట్టి ధర్మరాజు శరీరంలో ప్రవేశించాడు. చలనం లేకుండా, మార్పు లేకుండా పడివున్న విదురుడి శరీరానికి అగ్ని సంస్కారం చేయాలనుకున్నాడు. కాని ఒక అశరీరవాణి విదురుడి శరీరాన్ని దహనం చేయడం తగదని చెప్పింది. ధర్మారాజు ఆ పని మానుకొని, ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న వారికి జరిగినదంతా చెప్పాడు.

ఆ తరువాత ధృతరాష్ట్రుడి ఆశ్రమంలో పాండవులు ఆయన్ను సేవించుకుంటూ, అక్కడ దొరికినవి భుజిస్తూ, నెలరోజులున్నారు. ఒకనాడు అంతా కలిసి వున్న సమయంలో వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. ధృతరాష్ట్రుడి, గాంధారి, కుంతి క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నాడు. ఏదైనా వరం ధృతరాష్ట్రుడికి ఇస్తాను కోరుకొమ్మని వ్యాసుడు ఆయనకు చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, భారత యుద్ధంలో దుర్యోధనుడి కొరకు మహారాజులంతా యుద్ధం చేసి మరణించారని, ఆ మహాపురుషులకు ఎటువంటి లోకాలు సిద్ధించాయో తెలియక తనకు బాధగా వున్నదని, ఆ బాదను పోగొట్టమని అడిగాడు. యుద్ధంలో మరణించిన కురువంశపువారిని తమకు చూపించమని గాంధారి కూడా కోరింది. సరిగ్గా అదే సమయంలో కుంతి కర్ణుడిని స్మరించిన సంగతి గ్రహించాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ద్రౌపది, సుభద్ర, ఇతర భరతస్త్రీలు చనిపోయిన తమవారిని చూస్తారని అన్నాడు వ్యాస మహర్షి.

వారివారి మనస్సులలో వున్న దుఃఖాన్ని పూర్తిగా పోగొట్టుతానని అంటూ అందరినీ తనతో పాటుగా గంగానది దగ్గరికి రమ్మన్నాడు. యుద్ధంలో మరణించిన వారివారి బంధువులను ఆ గంగానది దగ్గర చూస్తారని చెప్పాడు వ్యాసుడు. అంతా కలిసి గంగానదికి వెళ్లారు. గంగ ఒడ్డున ధృతరాష్ట్రాదులు అంతా బసచేశారు. మర్నాడు వారి బంధువులను చూస్తారని చెప్పాడు వ్యాసుడు. అన్నట్లే మరుసటి రోజు ఉదయం వ్యాసుడు గంగాజలంలో మునక వేసి, ‘భారత యుద్ధంలో మరణించిన వారంతా ఇక్కడికి రండి అని అన్నాడు. వెంటనే నీళ్లలో నుండి పెద్ద చప్పుడు ఆరంభమైంది. దానితోపాటే దుర్యోధనుడు, అతడి తమ్ములు, ఇతర కురువీరులు, అభిమన్యుడు, ఉపపాండవులు, ద్రుపదుడు, ద్రోణుడు, భీష్ముడు మొదలైన వారంతా తమ దివ్య శరీరాలతో కనబడ్డారు. ఆ సమయంలో వ్యాసుడు ధృతరాష్ట్రుడికి సంపూర్ణ దృష్టిని ఇచ్చాడు. అది తెలిసి గాంధారి తన కళ్లకు కట్టిన వస్త్రాన్ని తొలగించి దుర్యోధనాదులను చూసింది. అలా భారత యుద్ధంలో మరణించిన వారంతా వచ్చి ధృతరాష్ట్రాదులతో కలిసిమెలిసి వ్యవహరించారు. ఆ మర్నాడు ఉదయాన్నే వీడ్కోలు తీసుకున్నారు. వ్యాసుడు అప్పుడు గంగలో మునిగి, ‘భర్తలను అనుసరించి వెళ్లదల్చుకున్న స్త్రీలు గంగలో మునగడానికి రండి అనగానే విధవలైన స్త్రీలంతా గంగలో మునిగి శరీరాలు విడిచి తమ భర్తలను కలుసుకున్నారు.

ఆ తరువాత అంతా ఆశ్రమానికి తిరిగి వచ్చారు. వ్యాసుడికి వీడ్కోలు పలికాడు ధృతరాష్ట్రుడు. ఆయన అంతర్థానమయ్యాడు. ధర్మరాజును పిలిచి ధృతరాష్ట్రుడు ఆయన్ను తమ్ములతో సహా హస్తినాపురానికి బయల్దేరి పొమ్మని చెప్పాడు. తన కొడుకులు అడవిలో వుండడంవల్ల తమ తపస్సుకు ఆటంకం కలుగుతుందని, ఇది గ్రహించి రాజ్యానికి వెంటనే వెళ్లమని, ఆశ్రమంలో వుండడం ఉచితం కాదని కుంతి చెప్పింది. పాండవులు అయిదుగురూ ధృతరాష్ట్రుడి పాదాలకు ప్రణామం చేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. గాంధారికి, కుంతికి నమస్కరించారు. ఆ తరువాత హస్తినాపురానికి పోయి రాజ్యపాలన చేశారు. అలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఒకనాడు నారదుడు వచ్చాడు వారిదగ్గరికి. ధర్మరాజాదులకు అడవిలో వున్న ధృతరాష్ట్రాదుల సంగతులు పూర్తిగా చెప్పాడిలా.

 ‘ధర్మరాజాదులు ధృతరాష్ట్రుడిని చూడడానికి అరణ్యాలకు వెళ్లి, ఆయన్ను సేవించి, అతడి అనుమతి తీసుకొని రాజ్యానికి తిరిగివచ్చిన కొన్నాళ్లకు ఒకనాడు గాంధారి, కుంతి, సంజయుడు తన వెంట వస్తుంటే, ఋత్విక్కులు అగ్నులతో ఆయన తోడుండగా, ధృతరాష్ట్రుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి గంగానదీ పరిసర ప్రాంతంలోని అరణ్యంలోకి వెళ్లాడు. అక్కడ కేవలం గాలే ఆహారంగా అసాధ్యమైన తపస్సు చేశాడు. గాంధారి కూడా నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ  తపస్సు చేసింది. కుంతి, సంజయుడు కూడా తపస్సు చేశారు. ఒక్కొక్కసారి ధృతరాష్ట్రుడు ఆశ్రమం విడిచి ఎక్కెడెక్కడో తిరిగేవాడు. ఆ సమయంలో ఆయన బాగోగులు సంజయుడు, కుంతి, గాంధారి చూసుకునేవారు. ఒకరోజు వాళ్లంతా గంగాద్వారంలో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా పెద్ద సుడిగాలి ఎగసి పడింది. దావానలం వ్యాపించింది’.

‘ఆ విధంగా అడవి నిప్పు విస్తరించి తమను ముట్టడించడంతో నిరాహారంగా వున్న కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు అక్కడి నుండి కదలలేక ఆగిపోయారు. దావాగ్ని లేని చోటుకు వెళ్లిపొమ్మని సంజయుడికి చెప్పాడు ధృతరాష్ట్రుడు. తాము వెళ్లడానికి సాధ్యపడదని అన్నాడు. వారిని వదిలి వెళ్లనని సంజయుడు అన్నప్పటికీ, సంజయుడిని ఒప్పించి ధృతరాష్ట్రుడు నిశ్చలంగా తూర్పుముఖంగా కూచున్నాడు. గాంధారి, కుంతి కూడా అలాగే చేశారు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడిని, చిత్తవ్యాపారాలను నిరోధించమని, అంటే, జీవాత్మను పరమాత్మతో కలిసి వుంచమని చెప్పగా ధృతరాష్ట్రుడు అలాగే చేశాడు. అప్పుడు సంజయుడు ఆ దావాగ్నిలో కొంచెం సందు చూసుకొని అక్కడి నుండి హిమాలయానికి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ దావాగ్ని వాళ్లందరినీ తనలో కలుపుకున్నది. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ముగ్గురూ ఆ విధంగా తమతమ తనువులు చాలించి ఉత్తమలోకాలకు చేరుకున్నారు’.

తాను ఆ ముగ్గురి (దగ్ద) శరీరాలను చూశానని, వారు ఉత్తమలోకాలకు వెళ్లారని, ధర్మరాజు దుఃఖపడవద్దని నారదుడు అన్నాడు. ధర్మరాజు, భీమాదులు దుఃఖంతో ఏడ్చారు. అంతఃపురంలో తెలిసి అక్కడ కూడా ఏడ్పులు వినిపించాయి. ధృతరాష్ట్రాదుల మరణవార్త విన్న పురప్రజలు శోకంతో హాహాకారాలు చేశారు. ధర్మరాజును నారదుడు సముదాయించాడు. అప్పుడు ధర్మరాజు నారదుడిని చూస్తూ, దావాగ్నిలో మరణించిన ధృతరాష్ట్రుడికి తాను చేయాల్సిన ఉత్తర క్రియలు ఏమిటని అడిగాడు. ధృతరాష్ట్రుడు తాను చనిపోవడానికి ముందురోజే తన అగ్నులకు పూజలు చేసి, అవసరమైన ఇష్టిని నిర్వహించి, ఆ అగ్నులనుండి సెలవు తీసుకున్నాడని, వాస్తవానికి ఆ అగ్నులే అడవిని కాల్చి వేశాయని. అందువల్ల ధృతరాష్ట్రుడు స్వీయాగ్నిలోనే మృతి చెందాడని చెప్పాడు నారదుడు. ఆయనకు, గాంధారికి, కుంతికి నిష్టతో నువ్వులు, నీళ్లు వదలమని ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు చెప్పినట్లే ధర్మరాజు గంగానదికి వెళ్లి ధృతరాష్ట్రుడికి, గాంధారికి, కుంతికి తిలోదకాలు ఇచ్చాడు. మృతాశౌచం వదిలేవరకు హస్తినాపురం బయట గుడారాలలో నివసించాడు. ఆ తరువాత అస్తికలను నిమజ్జనం చేశారు.

ఇదంతా జరిగేంతవరకు నారద మహర్షి ధర్మరాజాదులతోనే వుండి తరువాత వెళ్లిపోయాడు. ధర్మరాజు హస్తిన ప్రవేశించాడు. ఈ విధంగా భారత యుద్ధం ముగిసిన తరువాత 18 సంవత్సరాలు గడిచాయి. ధర్మారాజు రాజ్యపాలన కొనసాగించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆశ్రమవాసపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment