వాల్మీకి శబరీరామచరితలో సనాతన ధర్మం
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక (అక్టోబర్ 27, 28-2023)
సీతావ్వేషణలో
భాగంగా రామలక్ష్మణులు పంపా తీరానికి పడమటి దిక్కున వున్న శబరి (మతంగ మహాముని) ఆశ్రమానికి
చేరుకోగానే, ఆమె వీరికి పాద
నమస్కారం చేసి,
శాస్త్రప్రకారం ఉపచారాలు చేసింది. సంతోషించిన శ్రీరామచంద్రుడు శబరిని
‘సాధుచరిత్రా, కోపంలోను, ఆహారంలోను, నిర్మలమైన మనసు కలదానా’ అని సంబోధిస్తూ,
అలాంటి నియమమం కల శబరి, ఆమె చేస్తున్న తపస్సులు, వ్రతాలు, నిర్విఘ్నంగా
సాగుతున్నాయా అని, మనసు ఎల్లప్పుడూ ప్రసన్నంగా, శాంతంగా
వున్నది కదా అని, గురు సేవలు
కొనసాగుతున్నాయా అని, అలా చేయడం వలన
ఫలితం వున్నదా అని ప్రశ్నించాడు.
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యధాతథంగా
తెలుగులోకి అనువదించిన, ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసస్వామి)
గారు, శ్రీరాముడు
శబరికి వేసిన ప్రశ్నలో ఇమిడివున్న అద్భుతమైన ధర్మార్థాన్ని వ్యాఖ్యానంగా, అరణ్యకాండ
మందరంలో వివరించారు. ‘నిర్విఘ్నంగా సాగుతున్నాయా’ అనే దానికి వివరణ ఇస్తూ, ‘కామ, క్రోధ, లోభాలు’ అనే మూడు ‘నిర్విఘ్నాలు’ తపస్సు నాశము చేయడమే కాకుండా నరక ద్వారాలవుతాయని, ఉదాహరణగా,
విశ్వామిత్రుడు లాంటివారు కామం, ఆగ్రహం మూలాన
తపస్సు నాశము చేసుకున్న విషయం ప్రస్తావించారు.
ఇక శ్రీరాముడు సంబోధించిన ‘ఆహారం’ విషయానికి
వస్తే, నిషిద్ద
వస్తువులను తినకుండా వుండడం, నిషిద్ద
కాలాలలో తినకుండా వుండడం, మితభుక్తి, సాత్త్విక పదార్ధాలను తినడం అనే అర్థం ప్రధానంగా
స్ఫురిస్తుంది. సహపంక్తిలో తింటున్న వారితో అనవసర ప్రసంగం చేయకూడదు. నోటి నుండి
జారిపడినదానిని, భుజించగా మిగిలిన పదార్ధాలను, మళ్లీ
తినకూడదు. పిండి వంటకాలను, కూరలను, దుంపలను, ఫలాలను, చేయితో విరిచి తినాలికాని, పంటితో కొరికి తినకూడదు. విస్తరి (ప్లేట్) లో
ఉప్పు ప్రత్యేకంగా వేయకూడదు. పెరుగు, లేదా, చల్లలో కలిపే వేయాలి. నూనెతో వండినవి కాని, పచ్చివికాని, గరిటెలతో
వేయకూడదు. అన్నం, కూరలు, పచ్చళ్లు, మంచినీరు, పెరుగు, పాలు, నేయి, చేతితో
వేయకూడదు. గరిటెలు (లేదా ఆకులు) ఉపయోగించాలి. తినే అన్నం విషయంలో కాని, కూరలు, పచ్చళ్ల
విషయంలో కాని తినేటప్పుడు తప్పులు ఎంచకూడదు.
దేవాలయాలలో, చీకట్లో, ఆరుబయట, మిద్దెలమీద, వట్టినేలమీద, పాడుపడ్డ
ఇంటిలో భోజనం చేయకూడదు. పగలు కాని, రాత్రికాని
రెండుసార్లు తినకూడదు. రాత్రి రెండు జాములు దాటిన తరువాత, అర్థరాత్రి, పగలు రెండు
జాముల వేళ తిన కూడదు. నిలుచుని, కుర్చీమీద
కూచుని, ఆచమనం
చేయకుండ, ఒంటి వస్త్రంతో, తలగుడ్డతో తినడం నిషిద్ధం. ఇతరులు తాకినదాన్ని, చేతిలో పెట్టుకుని కాని, విడి ఆకులో కాని, మట్టి
పాత్రలో కాని, వస్త్రం మీద
కాని తినడం తప్పు. ఒక పంక్తిలో తింటూ తాను ముందుగా లేచి వెళ్లకూడదు. తప్పక
వెళ్లాల్సిన అవసరం కలిగితే కొన్ని నియమాలు పాటించాలి. చెడు శబ్దాలు వింటూ భోజనం
చేయడం తప్పు. భోజన సమయంలో భార్య మీద, పిల్లల మీద
కోప్పడడం, వారికి ఎంగిలి పదార్థాలు పెట్టడం పనికిరాదు. పాయసం, పెరుగు, పాలు, నీరు, నేయి శబ్దం
కాకుండా తాగాలి. సశేషంగా తీసుకోవాలి. రాత్రి తినేటప్పుడు దీపం ఆరిపోతే (విద్యుత్
పోతే!) సూర్యుడిని స్మరించుకుని, చేతులతో
పాత్రను తాకి వుండి, తిరిగి దీపం వచ్చేదాకా తినకూడదు. అప్పుడైనా పాత్రలో వున్న
పదార్ధాన్నే తినాలి. ఈ నియమ నిబంధనలతో పాటు, మరికొన్ని
నిషిద్ధాలను కూడా శబరి వృత్తంలో చర్చకు వచ్చాయి.
ఇక శ్రీరాముడు అడిగిన గురుపూజ, గురు సేవలు కొనసాగుతున్నాయా అన్న
ప్రశ్న విషయంలో కూడా అద్భుతమైన వ్యాఖ్యానం వున్నది. గురువు, గురుపుత్రులు లేనప్పుడు గురుశుశ్రూష ఏమిటని
సందేహం కలగవచ్చు. గురువు లేకపోయినా ఆయన పాదుకలు వుంచుకుని గురుపూజ చేయాలి.
గురుభక్తిలేనివారికి ఆయన చెప్పిన విషయాలు మనస్సుకు రావు. అలాంటప్పుడు ‘ఫలానుభవం’ వుండదు. అందుకే శ్రీరాముడు శబరిని ‘గురుపూజాఫలం’ వున్నదా? అని
ప్రశ్నించాడు. మనస్సు, వాక్కు, కాయము, పరిశుద్ధంగా
వుంచుకుని, గురుభక్తి, దైవభక్తి
కలిగి ఉన్నవారిని భగవంతుడు స్వయంగా వెతుక్కుంటూ వస్తాడని శబరీరామచరిత
తెలియచెప్తున్నది. భగవదాపేక్ష వుండికూడా శ్రీరాముడిని వెతుక్కుంటూ పోయే శక్తిలేని
శబరి దగ్గరికి, భగవంతుడైన రాముడే రావడం దీనికి నిదర్శనం.
ఆ విషయాన్నే శబరి నోట చెప్పిస్తాడు వాల్మీకి. తన గురుశుశ్రూషకు ఫలం
భగవత్సాక్షాత్కారమని, అది రాముడిని చూడడంతోనే కలిగిందని, తన గురుశుశ్రూష ఫలించిందని, తన తపస్సుకు, వ్రతాలకు ఫలం
కూడా భగవత్సాక్షాత్కారమేనని, అదికూడా
రాముడి దర్శనంతో జరిగిందని, తాను
సార్థకజన్మురాలిని అయ్యానని, తనకిక
మోక్షప్రాప్తి కలుగుతుందని, పాపాలు, అరిషడ్వర్గాలు హతమయ్యాయని అంటుంది శబరి. ఇలా
అంటూ, తాను సంతోషంతో
ఏరి కోరి కోసి వుంచిన (రుచి చూసిన లేదా ఎంగిలి చూసిన అనలేదు వాల్మీకి రామాయణంలో)
నానా రకాల కందమూల ఫలాలు రాముడికి తినడానికి ఇచ్చింది. ఇక్కడ (ఆంధ్రవాల్మీకి
వాసుదాసుగారి వ్యాఖ్యానం ఆధారంగా) శబరిలోని సహజ స్త్రీత్వం వ్యక్తమైంది. శరభంగాది
పురుష ఋషులు రాముడి రాకను ముందుగా తెలిసినవారే. ఆయన వచ్చిన సమయంలో ఆశ్రమంలో వున్న
పండో, కాయో
సమర్పించినవారే. శబరి మాత్రం ముందుగా ఏర్పాటుచేసుకుని తెచ్చి పెట్టుకున్నది. అతిథి
ఆకలి దప్పులు విచారించడం ఉత్తమ స్త్రీల లక్షణం, సహజ గుణం.
శబరి
మాటలకు స్పందనగా రామచంద్రమూర్తి ఆమె గురువుల ప్రభావం విన్నానని, అది ప్రత్యక్షంగా చూడాలని కోరికగా వుందని, ఆ
చిత్రాలను చూపించమని ఆమెను కోరాడు. బదులుగా శబరి, వర్షించే
మేఘాలలాగా నల్లగా వ్యాపించి, మృగాలతో, పక్షులతో నిండి వున్న
మతంగవన స్థలంలో తమ మంత్రాల శక్తితో ఆమె గురువులు తీర్థాలను కల్పించారని, పడమటి వేదిమీద తమ స్వాములు ముసలితనంతో వణకుతున్నప్పటికీ భగవదారాధన
మానకుండా పూలతో పూజించేవారని, వారి తపోమహిమ వల్ల వేదులు
వాళ్లు లేకున్నా దిక్కులన్నిటినీ ప్రకాశింప చేస్తున్నాయని,
శుష్కోపవాసాలు చేసి బలహీనంగా వుంటే వాళ్ల పిలుపు మేరకు సముద్రాలే వారి దగ్గరికి
వచ్చాయని, గురువులు స్నానాలు చేసి తడిసిన నారవస్త్రాలు
అక్కడి చెట్లకొమ్మల మీద వుంచి పోయారని, వారి తపఃప్రభావం వల్ల
నేటికీ అవి ఆరలేదని, వారు దేవతారాదనలో పూజించిన పూలు
ఇప్పటికీ వాడిపోలేదని వివరించి, తనకు ఆజ్ఞ ఇస్తే తన
గురువులున్న చోటుకు పోయి వాళ్లను దర్శించుకుంటానని అంటుంది. ఆమె గురుభక్తికి,
దైవభక్తికి మెచ్చి, శబరి కోరిక ప్రకారం వెళ్లిపొమ్మని ఆనతి ఇచ్చాడు రాముడు.
దీనివల్ల అవగతమయ్యేది, ఆచార్య శుశ్రూష ద్వారా భగవదనుగ్రహం కలిగి, మోక్షప్రాప్తికి కారణమవుతుందనే విషయం.
ఇటీవల
పనికట్టుకుని సనాతన ధర్మాన్ని, అదేపనిగా, దానిని లోతుగా అర్థం చేసుకోకుండా
విమర్శిస్తున్న వారు తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి శబరీరామచరితలో. అందులో
ముఖ్యమైనది, విదురుడిలాంటి, శబరిలాంటి బ్రాహ్మణేతురులకు సహితం వేదకాలంలోనే జ్ఞాన,
యోగ, దేవ పూజలలో అధికారం సంపూర్ణంగా కలదనే విషయం. అలాగే
గురుశుశ్రూష ద్వారా ఎవరికైనా స్వర్గప్రాప్తి కలుగుతుందనే విషయం కూడా. ‘శబరి’ అంటే
‘శబరజాతి’ స్త్రీ. శబరులు బోయలు. ఈమెనే ‘శ్రవణి’ అని కూడా చెప్పడం జరిగింది. అంటే, సంసార సంగమం లేకుండా, నియతవ్రతాన్ని పట్టి, బ్రహ్మచర్యాన్ని చేపట్టి, సర్వసంగపరిత్యాగం చేసి, తపస్సు చేసుకునే పవిత్ర స్త్రీ అని అర్ధం. సీతాన్వేషణలో భాగంగా
రామలక్ష్మణులు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు వారికి కబంధుడు శబరి విషయం చెప్పాడు.
శబరికి
బ్రహ్మజ్ఞానానికి అధికారం వుందా? లేదా? అని
కొంతమందికి కలిగే అనుమానం ఆంధ్రవాల్మీకి వాసుదాసుగారి వ్యాఖ్యానం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
విజ్ఞానం అంటే విశేష జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. యోగసమాధి ద్వారా
దేహాన్ని విడిచింది శబరి అంటే, ఆమె మహాయోగిని అనేది సుస్పష్టం.
కాబట్టి శబరికి బ్రహ్మజ్ఞానం వందశాతం ఉన్నట్లే. శబరికి మతంగముని శిష్యులు
బ్రహ్మజ్ఞానం ఉపదేశించినట్లు చెప్పడం జరిగింది.
‘సామాన్య
విధి’ అని, ‘విశేషవిది’ అని రెండు రకాలున్నాయి. ఉదాహరణకు, ‘సత్యం’ చెప్పాలి కాని, దానివల్ల నిష్కారణంగా నిరపరాధులకు
కీడుకలిగితే, కొన్ని సందర్భాలలో సత్యం చెప్పక పోవడమే ధర్మం అని శాస్త్రం
చెప్తున్నది. సత్యం చెప్పడం సామాన్య విధి అయితే చెప్పకపోవడం విశేష విధి. సామాన్య
విధికంటే విశేష విధి బలీయం. అలాగే సామాన్య వైదిక ధర్మం కంటే భగవద్ధర్మం బలీయం.
శబరిలాంటి భగవద్ధర్మనిష్టులకు బ్రహ్మజ్ఞానానికి అధికారం వున్నది. సనాతనమైన
భగవద్ధర్మం ప్రకారం భగవంతుడు సర్వసముడు, భక్తప్రియుడు, దీనజనపక్షపాతి, లోకజనకుడు. కాబట్టి, భగవద్ధర్మనిష్టులై, ఆ ధర్మాన్ని
అనుసరించేవారు, వీరు-వారు అనే భేదం లేక, జాతివివక్ష లేక, స్త్రీపురుష భేదం లేక
భగవద్కటాక్షానికి పాత్రులే. వర్ణాశ్రమ ధర్మాలకన్నా అతీతమైనది, ఆచరణీయమైనది
‘సనాతనమైన భగవద్ధర్మం’. నిజమైన దైవభక్తుడు భగవదనుగ్రహం మినహా మరేదీ ఆశించడు. ఇదే
నిజమైన భక్తి లక్షణం. దీనినే పరమ భక్తి అని కూడా అంటారు. ఇదే ఆర్త ప్రపత్తి. ఈ దశ
వచ్చేదాకా ఎవర్నీ భక్తుడు అనడానికి వీల్లేదు.
ఏదేమైనా,
బ్రహ్మజ్ఞానానికి కావాల్సిందల్లా జ్ఞానాదికారం. అది ఎవరికి వుంటే వారంతా దానికి
అర్హులే. ఈ నియమం బ్రాహ్మణుడికి కూడా వర్తిస్తుందని వాసుదాసుగారు రాశారు. పరజ్ఞానం
లేకుండా పరమభక్తి రాదని, పరభక్తి లేకుండా పరజ్ఞానం రాదని కూడా ఆయన చెప్పారు. పర
భక్తి అనేది అన్ని ప్రాపంచిక ఆందోళనలకు అతీతంగా, స్వచ్ఛంగా, పారదర్శకంగా,
సరళంగా, స్వచ్ఛంగా, నిస్వార్థంగా, వినయంగా, భగవంతుడి మీద భక్తిని
సూచిస్తుంది. పరజ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. అలాగే అష్టాంగయోగాల (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం,
ప్రత్యాహారం, ధారణ, ధ్యానం,
సమాధి) సమ్మిళితమైన గౌణభక్తి లేకుండా పరభక్తి లభ్యం కాదు. గౌణభక్తి
అంటే గుణాలకు సంబంధించినది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని మూడు గుణాలున్నాయి. వీటిని బట్టి, మనస్సు
సత్వగుణ సంబంధమైనపుడు సాత్విక భక్తి కలిగి స్వార్ధమైన కోరికలు లేకుండా భగవంతుని
ప్రీతి కొరకే ఆరాధిస్తాడు.
ఆత్మసాక్షాత్కారం
లేదా దర్శనమే పరభక్తి అవుతుంది. ఈ దశలో ఆత్మను చూడడం వరకే సాధ్యపడుతుంది. కంటికి
కనిపించినప్పుడు ఎంత స్పష్టంగా ఒకరూపం వుంటుందో, అంతే స్పష్టంగా ధ్యానం
చేసేటప్పుడు మనసుకు ఆత్మ దర్శనమిస్తే, అలాంటి ధ్యానాన్ని పరమ భక్తి అనాలి. అదేసమయంలో,
భగవద్సాక్షాత్కారం జరగాలని పట్టుదలతో ధ్యానం కొనసాగిస్తే, క్షణకాలం సాక్షాత్కారం కలిగినట్లయితే అదే పరజ్ఞానం. కాబట్టి, పరమ భక్తి లభ్యం కావడానికి ఆత్మజ్ఞానం తప్పనిసరి అనేది అవగౌతమౌతున్నది.
సప్తవిధ భక్తులు సాధించిన యోగసాధకునకు, వారెవరైనాసరే,
ఆత్మజ్ఞానం ఉపదేశించవచ్చుననేది నిర్వివాదాంశం. శబరి తల్లి గొప్పతనం వివరంగా
తెలియచేసేదే ఈ సనాతన ధర్మ వివరణ.
క్లుప్తంగా
చెప్పాలంటే, మోక్షానికి ఉపాయాలు, కర్మజ్ఞానభక్తి ప్రపత్తులే
కాకుండా, ఆచార్యుడి అభిమానం కూడా పొందగలగాలి. శిష్యుడికి
సర్వస్వం ఒకవిధంగా గురువే. శబరి ముముక్షువు, మోక్షం కావాలని
కోరుకున్నది. ఆమె చేసిన తపస్సు సక్రమం, శాస్త్రీయం, ఆచార్యానుకూలం. త్రిగుణాతీతమైన మార్గంలో నడిచేవారికి నిదినిషేదాలు
వర్తించవు. పరమ భక్తులకు శాస్త నిబంధనలు లేవు. అందుకే శ్రీరాముడు ఆమెను
అనుగ్రహించాడు.
జ్ఞానమంటే
హితాహితబోధ, అంటే, మంచిచెడ్డల విశ్లేషణ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మరే ఇతరులైనా జ్ఞానాన్ని ఆర్జించవచ్చు, ఆచార్యుడిగా ఇతరులకు చెప్పవచ్చు.
బ్రాహ్మణుడైనప్పటికీ, జ్ఞాన, భక్తి, సదాచార, సనాతన సంపత్తులు లేకపోతే ఆచార్యులుగా
అనర్హులు. యోగ్యత ఆధారంగా ఎవరైనా అర్హులే అనేది సనాతన ధర్మం. అధికారం కలవారు
ఏవర్ణం వారైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రహ్మజ్ఞాన ఉపదేశం తీసుకోవడానికి అర్హులే అనే విషయాన్ని
భగవద్ధర్మశాస్త్రం స్పష్టం చేస్తున్నది. యోగ్యతలేనివారికి అనర్ధకరమైన అల్పజ్ఞానం
కంటే అజ్ఞానం మేలు. అజ్ఞానికి ఆపద కలగకుండా బాగుపడాలంటే పెద్దలు చెప్పిన మాటమీద
విశ్వాసం పెట్టి నడుచుకోవాలి. ఇలాంటివారికి శాస్త్ర పఠనం తప్పనిసరి. శబరీరామచరిత
విశ్లేషణలో వాసుదాసుగారి వ్యాఖ్యానం, సనాతన ధర్మాలకు నిదర్శనం, ఆదర్శం.
No comments:
Post a Comment