Sunday, October 22, 2023

ద్రౌపదీపాండవుల మహాప్రస్థానం సశరీరంతో అమరత్వసిద్ధికి స్వర్గానికి చేరిన ధర్మరాజు ..... ఆస్వాదన-143 : వనం జ్వాలా నరసింహారావు

 ద్రౌపదీపాండవుల మహాప్రస్థానం

సశరీరంతో అమరత్వసిద్ధికి స్వర్గానికి చేరిన ధర్మరాజు

ఆస్వాదన-143

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (23-10-2023)

శ్రీకృష్ణుడు, బలరాముడు పరమపదించడం, యాదవులంతా ముసల యుద్ధంలో చనిపోవడం, ఆ విషయాన్ని తాను వేదవ్యాసుడికి తెలియచేయడం, ఆయన హితవచనాలను పలకడం ధర్మరాజుకు వివరించాడు అర్జునుడు. అంతా విన్న ధర్మరాజు, కాలపురుషుడు అన్ని భూతాలను కాల్చి పరిపక్వం చేస్తాడని, అందువల్ల తన బుద్ధికి కర్మను సంపూర్ణంగా త్యజించడం మాత్రమే తగినపనిగా ఒక నిశ్చితార్థం ఏర్పడుతున్నదని, బహుశా అర్జునుడికి కూడా అలాగే అనిపిస్తుండవచ్చని అన్నాడు ధర్మరాజు. అర్జునుడు ఆ మాటలు విని ధర్మరాజుతో, కాలాన్ని ఏమనగలమని, ఎలా వర్ణించగలమని, కాలాన్ని పోలింది కాలం మాత్రమేనని, అందుకే ధర్మరాజు చెప్పినట్లు చేయడమే మంచిదని చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు, భీమనకుల సహదేవులను పిలిచి జరిగిన విషయాన్ని, తన ఆలోచనను సంపూర్ణంగా తెలియచేశాడు. యుయుత్సుడికి సహితం వివరించాడు. అంతా సానుకూలంగా వుండడాన్ని గమనించిన ధర్మరాజులో ఉత్సాహం కలిగింది. 

యుయుత్సుడిని కురు సామ్రాజ్యానికి పెద్ద దిక్కుగా నియమించి, సైన్యాన్ని ఏర్పాటు చేసి, పరీక్షిత్తును భరతభూమికి రాజుగా అభిషేకించాడు. గౌరవనీయమైన సామ్రాజ్య పాలనా రీతులను పరీక్షిత్తుకు బోధించాడు. ఇంద్రప్రస్థం రాజైన వజ్రుడిని, కురు రాజ్యభారాన్ని మోయనున్న పరీక్షిత్తును, కురు-యాదవ వంశాలను రెంటినీ పరిరక్షించుకొనే బాద్యత సుభద్రదని ధర్మరాజు ఆమెకు చెప్పాడు. ధర్మరాజు సుభద్రకు ధర్మబోధ చేసి అంతఃపురం నుండి బయల్దేరే ప్రయత్నంలో వున్నాడు. ఆ తరువాత ధర్మరాజు భారత యుద్ధంలో మృతి చెందిన బంధువులకు, ముసలంలో మరణించిన యాదవులకు పుణ్యలోక ప్రాప్తి కలగడానికి అనేక రకాల భూదానాలు, కన్యాదానాలు, వస్త్రదానాలు లాంటి దానాలు చేశాడు. పరీక్షిత్తును కృపాచార్యుడికి శిష్యుడుగా అప్పగించాడు. ముఖ్యులైన పౌర ప్రముఖులను పిలిచి పరీక్షిత్తును తమ ఐదుగురికి బదులుగా ప్రభువుగా స్వీకరించి అభిమానం చూపమన్నాడు. తమ ప్రయాణానికి వారిని సమ్మతించేట్లు చేశాడు.

ధర్మరాజు పౌరులను పిలిచి మాట్లాడుతున్న సమయంలో ఎవరెక్కడ ఆసీనులు కావాలనే విషయంలో వారిలోవారికి తగవు వచ్చింది. అప్పుడు సహదేవుడు కలియుగం ప్రవేశించడం వల్లనే ఇలాంటి తగవు పుట్టిందని భావించి, అదే విషయాన్ని ధర్మరాజుకు చెప్పాడు. దానికి సమాధానంగా ఆయన ‘ఇక మన జీవితాలు చాలు అని అంటూ నగలన్నిటినీ తీసేసి, నారబట్టలను, జింకచర్మాన్ని ధరించాడు. భీమార్జునులు, నకులసహదేవులు, ద్రౌపది కూడా అట్లాగే చేశారు. అంతఃపురం నుండి బయటకు వచ్చారు. వారివెంట ఏడవదిగా ఒక కుక్క వెళ్లింది. అలా వెళ్తున్న పాండవులను చూడడానికి హస్తినాపురంలోని జనులంతా వచ్చారు. యుయుత్సుడు సైన్యంతో పాండవుల వెంట బయల్దేరాడు. పరీక్షిత్తు అతడి అంతఃపుర కాంతలు వారిని వెంబడించారు. ఆ విధంగా ధర్మరాజు హస్తినను వదిలి బయల్దేరాడు. వెంటవస్తున్నవారిని కొద్ది దూరం పోయిన తరువాత ఆగమని ధర్మరాజు ముందుకు సాగాడు. ఆ మాటలకు ఒక్కొక్కరే వీడ్కొని హస్తినకు చేరారు. అర్జునుడి భార్యలు ఉలూచి నాగలోకానికి, చిత్రాంగద కొడుకు దగ్గరికి వెళ్లారు.

ధర్మరాజు ముందుకు సాగుతుంటే భీమార్జున నకులసహదేవులు, ద్రౌపది ఆయన వెంట నడిచారు. వారిని వెంబడిస్తూ వస్తున్న కుక్క వదలకుండా వారిని అనుసరించి వెళ్తున్నది. వారు గంగను సమీపించి, అక్కడి నుండి తూర్పు సముద్రతీరం చేరారు. ఆ సమయంలో అగ్నిదేవుడు వారి ముందు నిలిచి, ఆర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన దగ్గర వున్న గాండీవం వరుణదేవుడి నుండి తెచ్చినదని, దాని అవసరం తీరిపోయిందని, దానిని మరల ఆ మహానుభావుడికే అప్పచెప్పమని అన్నాడు. అట్లాగే చేస్తానని అంటూ అర్జునుడు, గాండీవానికి గౌరవంతో నమస్కరించి, దాన్ని సముద్రంలో వుంచాడు. అర్జునుడు అలా చేయగానే అగ్నిదేవుడు అంతర్థానమయ్యాడు. పాండవులు సముద్రానికి సమీపంగా వెళ్లారు. అలా ప్రయాణం చేస్తూ ద్వారకకు సమీపంగా చేరారు. అక్కడి నుండి బయల్దేరి హిమవత్పర్వతాన్ని దాటి, అరణ్యాలు, నదులూ, కొండలూ దాటుకుంటూ, నలుదిక్కులనూ చుట్టి,  మేరుపర్వత భూభాగానికి వెళ్లారు.

అలా ఆ ఏడుగురూ వెళ్తుండగా పాంచాల రాజపుత్రికైన ద్రౌపది యోగం సడలిపోగా నేలమీద పడిపోయింది. అలా ఎందుకు జరిగిందని ప్రశ్నించిన భీమసేనుడికి సమాధానంగా ధర్మరాజు, ద్రౌపదికి అర్జునుడి విషయంలో పక్షపాతం వున్నదని, దానివల్లే ఆమె చేసిన పుణ్యాలు ఫలించకపోవడం సంభవించి ఆమెకు అలాంటి దురవస్థ వచ్చిపడిందని అన్నాడు. అలా సమాధానం ఇచ్చిన ధర్మరాజు నిశ్చల ధ్యానంతో కూడిన సమాధిస్థితిని తన చిత్తంలో స్థిరంగా నిలుపుకొని ధైర్యం సడలకుండా, చలనం లేకుండా, వికారం లేకుండా, ద్రౌపది శవాన్ని వదలిపెట్టి ముందుకు సాగిపోయాడు. (ఈ మహాప్రస్థానం ‘భూ దశను దాటిపోయింది కాబట్టి ఉత్తరక్రియల ప్రసక్తి లేదు).

అలా వెళ్తుండగా సహదేవుడు చనిపోయి నేలమీద పడ్డాడు. అహంకారం లేనివాడు, అందరిలో మంచివాడైన సహదేవుడికి ఎందుకీ దురవస్థ అని అడిగాడు భీముడు. తనకంటే ఎక్కువ తెలిసినవాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడని సహదేవుడు ఎప్పుడూ హృదయంలో భావిస్తుంటాడని, అందుకే అలా జరిగిందని అంటూ ధర్మరాజు ముందుకు సాగాడు. మరి కాసేపటికి నకులుడి శరీరం నేలమీద వాలిపోయింది. అతి సుందరుడు, శౌర్యం, ధైర్యం వున్నవాడు, మంచితనం లాంటి మంచి గుణాలున్నవాడైన నకులుడిలాంటి వాడు ప్రపంచంలో ఎక్కడా వుండడని, అలాంటి పుణ్యాత్ముడికి ఎందుకీ నీచదశ, దురవస్థ కలిగిందని ప్రశ్నించాడు భీముడు. సమాధానంగా ధర్మరాజు, తనకు ధీటైనవాడు ఈ సృష్టిలోనే లేడని, లోకంలోని సౌందర్యమంతా తనకే వున్నదని నలుకుడు మనసులో ఎప్పుడూ అనుకుంటాడని ఆ అహంకార ఫలితమే ఈ కీడు అని అన్నాడు. అలా చెప్పి నిశ్చలంగా ముందుకు సాగాడు ధర్మారాజు. భీమార్జునులు, కుక్క అతడిని వెంబడించారు.

ద్రౌపది, తమ్ములు నకులసహదేవులు నేలకూలిపోవడాన్ని చూసిన అర్జునుడు కూడా ప్రాణాలు పోయి నేలమీద పడ్డాడు. ఏ రోజూ ఒక్క అసత్యం కూడా ఆడని పుణ్యచరిత్రుడు అలా పడిపోవడానికి కారణం ఏమిటని అన్నగారిని అడిగాడు భీముడు. అర్జునుడు కౌరవులందరినీ ఒకేరోజు యుద్ధంలో చంపేస్తానన్నాడని, కాని అట్లా చేయలేదని, చెప్పింది ఒకటి-చేసేది మరొకటి కావడం చాలా తప్పని, అంతేకాకుండా అతడు ధనుర్ధారులందరినీ నిందిస్తుంటాడని, అందువల్లే అలా జరిగిందని అంటూ ధర్మరాజు అర్జునుడి దేహాన్ని కూడా వదిలేసి ముందుకు సాగాడు. ఆ సమయంలో భీముడు దీనుడై నేలమీద వాలిపోయాడు. తనకెందుకు అలా జరుగుతున్నదో చెప్పమని అన్నగారిని అడిగాడు. అతడి పరాక్రమం నిరుపమానమని, కాని తిండి అత్యధికం కావడం వల్ల భయంకరుడై ఎవ్వరినీ లెక్క చేయకుండా  వ్యర్థపు మాటలు మాట్లడేవాడని, అదే భీముడు అలా కావడానికి కారణమని చెప్పాడు ధర్మారాజు. అలా అంటూ శునకం తన వెంట వస్తుంటే ముందుకు సాగిపోయాడు.

ఈ నేపధ్యంలో ఇంద్రుడు వచ్చి ధర్మరాజు ఎదురుగా నిలబడ్డాడు. వెంటనే ధర్మరాజు అతడికి నమస్కరించాడు. ధర్మరాజును తన దివ్యరథం మీద ఎక్కమని అడిగాడు ఇంద్రుడు. చనిపోయిన తన ప్రియమైన తమ్ములు, భార్య ద్రౌపది లేకుండా తాను స్వర్గానికి రాలేనని, వారంతా తనతోపాటు వచ్చే విధంగా చేయమని ప్రార్థించాడు ధర్మరాజు. ఆయన్ను చింతించవద్దనీ, ఆయన తమ్ములు, భార్య తమ దేహాలు విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్లారనీ, వారందరినీ ధర్మరాజు అక్కడ చూడవచ్చనీ, ఆయన్ను తనతో రమ్మనీ చెప్పాడు ఇంద్రుడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు, తన వెంట హస్తిననుండి వస్తున్న శునకాన్ని కూడా స్వర్గానికి తీసుకుపోవాలన్నాడు. కుక్కకు దివ్యత్వం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తూ ధర్మరాజు ఆలోచిస్తున్న విధానం అసాధ్యంగా వుందని చెప్తూ, ఆలస్యం చేయకుండా ఆయన్ను రథం ఎక్కమని అన్నాడు. కుక్కను వదిలేసి పొతే ధర్మరాజుకు ఏపాపం రాదని కూడా చెప్పాడు. స్వర్గసుఖం కొరకని తాను కుక్కను వదిలి పాపానికి ఒడికట్టలేనని ధర్మరాజు స్పష్టం చేశాడు. తనకు స్వర్గ సుఖం అవసరం లేదని, తపస్సు చేసుకుంటూ అడవుల్లో వుండి పోతానని చెప్పాడు. 

అప్పుడు యమధర్మరాజు కుక్క రూపాన్ని వదలి తన రూపాన్ని ధరించి వారి ఎదుట నిలిచాడు. ధర్మరాజు పవిత్రమైన మనోరీతిని తాను గుర్తించానని, గతంలో జరిగిన సంగతులను కూడా గుర్తు చేశాడు. ఇక నిశ్చింతగా, ఆయన దేహంతోనే యోగమార్గంలో పుణ్యలోకాలకు వెళ్లమని అన్నాడు. ఆ లోకాలలో అతడికి ఘనమైన సౌఖ్యాలు సంపూర్ణంగా, ఎన్నటికీ తరగకుండా లభిస్తాయని వరమిచ్చాడు. అప్పుడు గంధర్వులు, దేవఋషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, యముడు, ఇంద్రుడు, అంతా కలిసి పరమాదరంతో ధర్మరాజును గౌరవ పురస్సరంగా దివ్యరథంలో ఆసీనుడిని చేశారు. రథం కదులుతుండగా ఇరువైపులా తమ-తమ విమానాలను నడుపుకుంటూ అనుసరించారు. అలా ధర్మరాజు స్వర్గానికి బయల్దేరాడు.

అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు. ‘ధర్మరాజా! దానాలతో, తపస్సులతో పేరు తెచ్చుకున్న రాజులను గురించి విన్నాం. కానీ నీ ప్రశస్తమైన కీర్తికాంతులు అన్ని లోకాలలోనూ వ్యాపించడం వల్ల వారి కీర్తులన్నీ మాసిపోయాయి. ఆ రాజులు ఇలా సశరీరులై అమరత్వసిద్ధికై రాగాలిగారా?’. ఆ మాటలకు ధర్మరాజు, తన తమ్ముళ్లను చూసేదాకా తాను ఏదీ సుఖంగా భావించడంలేదని, తొందరగా తనకు వారున్న చోటు చూపించమని అడిగాడు. ధర్మరాజు అలా తొందరపడుతుంటే, ఆయన పుణ్యఫలం వల్ల ఉన్నతమైన పదవికి రాగలిగాడని, అందువల్ల, మునుపటిలాగా ఇంకా శోకంలో మునిగి వుండడం సముచితం కాదని అన్నాడు ఇంద్రుడు. ఎవరేమి చెప్పినా కళ్లారా తాను తన సోదరులను, భార్యను, పుత్రులను, మిత్రులను ఆదరంతో ఒక్కసారి చూడకుండా వుండలేనని, వారందరినీ చూసి మరలి వచ్చిన తరువాత ఈ సర్వభోగాలను స్తిమితమైన మనస్సుతో అనుభవిస్తానని, అదే తనకు మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుందని నొక్కి చెప్పాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, మహప్రస్థానికపర్వం, ఏకాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment