Sunday, October 15, 2023

శ్రీకృష్ణుడికి, బలరాముడికి పితృయజ్ఞాన్ని నిర్వర్తించిన అర్జునుడు ఆస్వాదన-142 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణుడికి, బలరాముడికి పితృయజ్ఞాన్ని నిర్వర్తించిన అర్జునుడు

ఆస్వాదన-142

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (16-10-2023)

శ్రీకృష్ణుడు పంపిన దారుకుడు హస్తినాపురానికి వెళ్లి, పాండవులను చూసి, యాదవులు ఒకరినొకరు కొట్టుకొని చావడాన్ని, బలరామకృష్ణులు అడవిలో వున్న విషయాన్ని, కృష్ణుడు తనను హస్తినలు పంపిన విషయాన్ని సవివరంగా చెప్పాడు. ఇది విని పాండవులు దుఃఖంతో కుంగిపోయారు. యాదవుల మరణం విన్న ద్రౌపది, సుభద్ర మొదలైన అంతఃపుర స్త్రీలు హాహాకారాలు చేస్తూ ఏడ్చారు. శ్రీకృష్ణుడు తీసుకొని రమ్మన్నాడని అర్జునుడికి చెప్పాడు దారుకుడు. ధర్మరాజు అనుమతి తీసుకొని (బలరామకృష్ణులు ఇంకా బతికే వున్నారని భావిస్తున్న) అర్జునుడు తక్షణమే బయల్దేరి ద్వారకకు చేరాడు. దైన్యావస్తలో వున్న ద్వారకను చూశాడు. అర్జునుడి మనస్సు పరితాపం పొందింది. అర్జునుడు రాజసౌధానికి వెళ్లాడు. అక్కడ శ్రీకృష్ణుడి పదహారువేలమంది ప్రియభార్యలు సంక్షోభిస్తూ అర్జునుడి దగ్గరికి వచ్చారు. వారి అవస్త చూసిన అర్జునుడు నేలమీద పడిపోయాడు. రుక్మిణీసత్యభామలిద్దరూ పెద్దగా ఏడ్చారు. మిగిలిన శ్రీకృష్ణుడి రాణులు ఇక తమకు దిక్కెవ్వరని దైన్యంతో ఏడ్చారు.

అర్జునుడు అందరినీ ఓదార్చాడు. ఆ తరువాత దారుకుడు తనతో ఆర్జునుడిని తీసుకొని వసుదేవుడి దగ్గరకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ, ఎలా వున్నాడోననీ, ఆ విషయం చెప్పేవారెవరనీ, పెద్ద దుఃఖం వచ్చింది అర్జునుడికి. వసుదేవుడిని అడుగుదామనుకుంటే అయన కూడా దుఃఖిస్తూ కన్పించాడు. దైవం కోపించడంతో యాదవులంతా నిష్కారణంగా ఒకరినొకరు చంపుకొన్నారని ఆ విషయాలను చెప్పాడు వసుదేవుడు అర్జునుడికి. ఇదంతా చూస్తూ శ్రీకృష్ణుడు ఉపేక్ష చేశాడనీ, యుద్ధాన్ని మాన్పించలేదనీ, బహుశా ఆ విధంగా యాదవులంతా చావడం తప్పనిసరైన విషయంగా ఆయన భావించాడేమో అని అన్నాడు వసుదేవుడు. కృష్ణుడు తన దగ్గరికి వచ్చిన సంగతి, తనను ఓదార్చిన సంగతి, అర్జునుడు రాబోతున్న సంగతి, అతడి ద్వారా బందువులను రక్షించుకోమని చెప్పిన సంగతి, కొద్ది రోజుల్లోనే సముద్రం ద్వారకానగరాన్ని ముంచివేయబోతున్న సంగతి, తనకు తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని అడిగిన సంగతి అర్జునుడికి వివరించాడు వసుదేవుడు. యాదవులందరికీ అర్జునుడే అగ్నిసంస్కారం చేస్తాడని కూడా శ్రీకృష్ణుడు చెప్పాడని అన్నాడు. కృష్ణుడు చెప్పినట్లు చేయమని అన్నాడు.

ధర్మరాజు తనకు సూచించిన విధంగా ద్వారకలోని పిల్లలను, ఆడవారిని కావాల్సినంత ధనంతో ఇంద్రప్రస్థపురానికి చేరుస్తానని అన్నాడు అర్జునుడు. ఆ తరువాత ద్వారకావాసులందరినీ ఒక్కచోట చేర్చి వారికి నాటికి ఏడోరోజున సముద్రం ద్వారకను ముంచబోతున్న  సంగతి చెప్పి, అంతా నగరం విడిచి పోవాల్సిన అవసరాన్ని తెలియపర్చాడు. ఇంద్రప్రస్థనగరానికి కృష్ణుడి మనుమడైన వజ్రుడిని రాజుగా చేస్తానని, అతడి రక్షణలో అంతా అక్కడే వుండమని అన్నాడు వారితో అర్జునుడు. ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పాడు. మంత్రులను ప్రయాణానికి కావాల్సిన అన్ని హంగులనూ సిద్ధం చేయమని పురమాయించాడు.

ఆ మర్నాడు ఉదయం కాబోతుండగా వసుదేవ మహారాజు దేహాన్ని వదిలేసి పుణ్యలోకాలకు పోయాడు. నలుగురు భార్యలు సహగమనానికి సిద్ధమయ్యారు. శ్రీకృష్ణుడు (వసుదేవుడికి) చెప్పినట్లే అర్జునుడు వసుదేవుడి పితృకార్యాన్ని, దహనకాండను జరిపించాడు. బంధువులను ఓదార్చిన అర్జునుడు మర్నాడు దారుకుడితో కలిసి యాదవవీరులు యుద్ధం చేసి చనిపోయిన ప్రదేశానికి పోయి వారికి అగ్నిసంస్కారం చేశాడు. యాదవ స్త్రీలను ద్వారకకు పొమ్మని చెప్పి తాను బలరామకృష్ణులను వెతకడానికి అడవిలోకి వెళ్లాడు. ఎలా వెతకాలో, ఎక్కడ వెతకాలో తెలియక దిక్కు తప్పిపోయి అడవిలో కొన్ని రోజులు అలా-అలా తిరుగుతుంటే ఒక బోయవాడు శ్రీకృష్ణుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడికి పోయిన అర్జునుడు, పడివున్న శ్రీకృష్ణుడి కళేబరాన్ని చూసి మూర్ఛపోయి నేలమీద పడ్డాడు. కాసేపటికి తెప్పరిల్లి అమితంగా దుఃఖించాడు. కృష్ణుడి పాదంలో వున్న గాయాన్ని గుర్తించాడు. కృష్ణుడి శరీరావయాలలో ఎలాంటి మార్పు కాని, వికారం కాని లేదు.

కృష్ణుడి మరణవార్త నగరంలో పొక్కకుండా దాచిపెట్టాలని తన వెంట ఉన్నవారితో అన్నాడు. మరణవార్త చెప్తే ప్రయాణసన్నాహాలు ఆగిపోయే ప్రమాదం వున్నదని భావించాడు అర్జునుడు. ఎందుకంటే మర్నాడు సూర్యోదయం కాగానే సముద్రం ద్వారకను ఆక్రమించుకోనున్నది కాబట్టి. అర్జునుడు గాఢంగా శ్రీకృష్ణుడిని తలచుకొంటూ పితృయజ్ఞాన్ని నిర్వర్తించాడు. ఆ తరువాత ఆ ప్రాంతంలోనే వెతకగా బలరాముడి దేహం కూడా కనిపించింది. ఆ కళేబరాన్ని కూడా చితాగ్నిలో ఆహుతి చేశాడు అర్జునుడు.

ద్వారకకు చేరిన అర్జునుడు అన్ని పనులను ఆ రాత్రికి రాత్రే పూర్తిచేసి సూర్యోదయం కాకపూర్వమే ప్రజలను, జీవరాసులను, ధనాన్ని, సామాన్లను ద్వారకానగరం దాటించాడు. వారిలో శ్రీకృష్ణుడి పదహారువేలమంది భార్యలు, అష్టమహిషులు, బలరాముడి భార్యలు మొదలైనవారున్నారు. వారలా బయల్దేరిన కాసేపటికే ఒక్కుమ్మడిగా సముద్రం ద్వారకానగరాన్ని ముంచి వేసింది. మార్గమధ్యంలో వారు పంచవటం అనే ప్రదేశంలో విడిది చేసినప్పుడు గజదొంగలు ప్రయాణిస్తున్నవారి ఆభరణాలు అపహరించడం విశేషం. అర్జునుడి గాండీవ ప్రయోగం ఆ కిరాతకులను ఏమీ చేయలేక పోయింది. అర్జునుడికి ఆ సమయంలో ఒక్క మంత్రం కూడా స్ఫురణకు రాలేదు. ఇదంతా దైవం ప్రతికూలంగా వుండడమే అని భావించాడు అర్జునుడు. అమ్ములపొదులు ఖాళీ అయిపోయాయి కాసేపటికి. దైవం తన సహాయం మానగానే అర్జునుడి పరాక్రమం ఇట్లా అయిందని అర్థం చేసుకోవాలి!

అర్జునుడు ఏదోవిధంగా ఆ కిరాతకుల విజృంభణాన్ని కొంతసేపు అరికట్టి రుక్మిణి మొదలైన అష్టభార్యలను, బలదేవుడి భార్యలను, కొంతమంది యాదవ స్త్రీలను కాపాడగలిగాడు. సాధ్యమైనంత దోపిడీ చేసి, ధనాన్ని కొల్లగొట్టిన ఆ కిరాతకులు వెళ్లిపోయారు. ఆ తరువాత అందరినీ వెంటబెట్టుకొని కురుక్షేత్రానికి వెళ్లాడు అర్జునుడు. కృతవర్మ కొడుకును మృత్తికావతపురాన్ని ఏలుకోవడానికి అభిషేకం చేసి, అతడిని తల్లితో, సోదరులతో అక్కడ వుండమన్నాడు. సాత్యకి కుమారుడిని సరస్వతి అనే నగరానికి అభిషేకం చేశాడు. మిగతావారిని ఇంద్రప్రస్థపురానికి తీసుకెళ్లి వజ్రుడిని ఆ నగరానికి ప్రభువుగా పట్టం కట్టాడు. అక్రూరుడి భార్యా పిల్లలను వజ్రుడికి అప్పచెప్పాడు.  

ఈ నేపధ్యంలో ఒకనాడు అర్జునుడు బలరామకృష్ణుల మరణ వార్తను వారి పత్నులకు చెప్పాడు. ద్వారక సముద్రంలో మునిగే సమయం ఆసన్నమైనందున అప్పుడు అ ఆవిషయం చెప్పలేకపోయానని అన్నాడు వారితో. తన తప్పును మన్నించమని అడిగాడు. రుక్మిణి, జాంబవతి మొదలైన స్త్రీలు సహగమనం చేస్తామన్నారు. వారు కోరిన విధంగానే అర్జునుడు వారి అగ్నికార్యం నిర్వహించాడు. సత్యభామ మొదలైన స్త్రీలు అడవుల్లో తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

ఇదంతా జరిగిన తరువాత అర్జునుడు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లాడు. శ్రీకృష్ణ బలరాములు తనువులు వదిలిపెట్టిన సంగతి విచారంతో చెప్పాడు ఆయనకు. యాదవులు తుంగపరకలతో కొట్టుకొని చనిపోయిన విషయం కూడా చెప్పాడు. తాను యాదవ స్త్రీలను, బాలవృద్ధులను వెంట తీసుకొస్తుండగా బోయలు ఎదిరించిన సంగతి, తన అస్త్రశస్త్రాలు పని చేయని సంగతి, వారు దోచుకున్న సంగతి కూడా చెప్పాడు. అది విని వేదవ్యాసుడు అర్జునుడికి హితోపదేశం చేశాడు. శ్రీకృష్ణుడికి యాదవ నాశనం ముందే తెలుసని, అయినప్పటికీ, కాలవిధికి అడ్డు ఎందుకు తగలాలని ఉపేక్షించి ఉన్నాడని, అదే శ్రీకృష్ణుడు కాలం అడ్డు తిరగడం వల్ల అర్జునుడికి బోయలతో జరిగిన పోరులో కాపాడలేకపోయాడని అన్నాడు. భూభారాన్ని తొలగించడానికి అవతారమెత్తిన నారాయణుడు దాన్ని అపూర్వంగా నిర్వహించి, ముసలితనం, మృత్యువు లేనిది, కళాతీతమైనది, వికృతిలేనిదై ప్రకాశిస్తుండే తన ‘సత్’ స్టానాన్ని ఉపశమం పొందినవాడై చేరాడని చెప్పాడు. భూభారం తొలగింది కాబట్టే అస్త్ర సంపద ఆర్జునుడిని వదలి వెళ్లిపోయిందని అన్నాడు.

ఇంక ఇలా అన్నాడు వేదవ్యాసుడు: ‘అయిన కాలంలో బుద్ధి, శక్తి ప్రకాశిస్తాయి. కాలం అడ్డు తిరిగితే నశిస్తాయి. అందువల్ల జ్ఞానులకు గర్వం కాని, శోకం కాని వుండవు. సృష్టిలో అంతా కాలాధీనంగా వుంటుంది. అందువల్ల తక్కిన ఆలోచనలు మాని పాండవులు నిశ్చింతగా దేహాలు విడిచిపెట్టి ఉత్తమగతికి వెళ్లాలి’. వేదవ్యాసుడి మాటలు విన్న అర్జునుడు శోకం, మొహం పోయిన ముఖంతో ఆనందం పొంది, ఆయన్ను వీడ్కొని, హస్తినాపురానికి పోయి , ధర్మరాజును కలిసి జరిగిన విషయమంతా వివరించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, మౌసలపర్వం, ఏకాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment