నరకద్వార దర్శనానంతరం ఉదాత్తరీతిలో
ధర్మరాజుకు సిద్ధించిన బ్రహ్మలోక సుఖ ప్రాప్తి
ఆస్వాదన-144
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (02-11-2023)
తన బంధుమిత్రులను చూడాలన్న ధర్మరాజు కోరికను మన్నించి ఇంద్రుడు,
తగిన దూతను రప్పించి, ఆయన కోరినట్లే వారందరినీ చూపించమని ఆజ్ఞాపించాడు. ధర్మరాజును
ఆ దూత తనవెంట తీసుకొని పోతుంటే నారదాది మహర్షులు కొందరు ఆయన్ను అనుసరించారు. వారలా
పోతుంటే ఒక చోట పెద్ద సింహాసనం మీద సకల భోగాలను అనుభవిస్తున్న దుర్యోధనుడు
కనిపించాడు ధర్మరాజుకు. అప్పుడు, తన వెంట వస్తున్న దేవముని శ్రేష్టులను
చూసిన ధర్మరాజు, తమనెన్నో కష్టాలు పెట్టిన దుర్యోధనుడు లాంటివాడితో కలిసి
స్వర్గంలో ఎలా వుండాలని, తనను తక్షణమే భీమార్జున
నకులసహదేవులు, ద్రౌపది వున్న చోటుకు తీసుకుపొమ్మని అంటూ
వెనుదిరిగాడు. (దీనర్థం స్వర్గంలో కూడా ధర్మరాజును మానుష భావం వదల్లేదని, పూర్వకథనంతా స్మరిస్తున్నాడని).
స్వర్గలోకమైన పుణ్యలోకంలో మనసులో కోపం,
ఈర్ష్య మొదలైన మనోవికారాలు వుండవచ్చా? అని ధర్మరాజును ప్రశ్నించాడు
నారదుడు. ఆ వికారాలను వదిలి సమత్వాన్ని పొందమని చెప్పాడు. అతడికి క్లేశాన్ని
కలిగించిన పాపకృత్యాలను మరచిపొమ్మని నారదుడు అన్నాడు. జవాబుగా ధర్మరాజు, మంచివారికి నిరంతరం అపకారం చేసిన పాపాత్ముడు, వంశం
నాశనం కావడానికి కారణమైన రాజాధముడు దుర్యోధనుడని, అతడు
దేవతలకు పూజనీయుడై స్వర్గంలో వుండడమేమిటని ప్రశ్నించాడు. అతడెలా వున్నా తనకేమీ
అబ్యంతరం లేదుకాని, తన తమ్ములను,
ద్రౌపదిని, కుమారులను, మాత్రం కనులారా చూడాలని, తనను వారున్న చోటుకు తక్షణం పంపమని కోరాడు. అలాగే తనకు కర్ణుడిని,
ద్రుపదుడిని, విరాటుడిని, యుధామన్యుడిని, శంఖుడు మొదలైన వారిని చూడాలని
వుందన్నాడు. తనవారెక్కడ వుంటే అక్కడే తనకు స్వర్గమని, తనను
అక్కడికి పంపమని ప్రార్థించాడు.
అలాగే చూపిస్తానని అంటూ దేవదూత ధర్మరాజును తీసుకుని
బయల్దేరాడు. అలా వెళ్తుంటే ఆ దారి అతి హేయంగా, దోమలతో,
ఈగలతో నిండి చీకటిగా వున్నది. క్రిములతో, పురుగులతో, రక్తమాంసాల గుట్టలతో, శవాల దుర్గంధంతో, భయంకరంగా వున్నది. ధర్మరాజు ఆ
దారిలో వెళ్లగా, అతి దారుణమైన వైతరణి అనే పేరున్న నదిని సమీపించాడు. అక్కడ నానా విధాలైన శిక్షలను
అనుభవిస్తున్న పాపకర్ములను చూశాడు. ధర్మరాజు వెళ్లాల్సిన చోటు అదేనని దేవదూత
అన్నాడు. భరించడానికి వీల్లేకుండా దుర్గంధం నిండిపోయిన ఆ ఘోరదృశ్యాన్ని చూడడం వల్ల
ధర్మరాజు మనస్సు వ్యధతో బాధపడ్డది. ఆ ఘోరాన్ని చూడలేక మరలి పోదామనుకొన్నాడు
ధర్మరాజు. ఆ సమయంలో అక్కడ కొన్ని కంఠస్వరాలు వినిపించాయి ధర్మరాజుకు. ఆయన
దేహానికున్న దివ్య పరిమళంతో కూడిన గాలి తమమీద వీచడం వల్ల తమ దుఃఖాలన్నీ
పటాపంచలయ్యాయని, తాము చాలా సుఖాన్ని పొందుతున్నామని, ఇంకా కొంచెం సేపు ఆయనక్కడే వుంటే తాము బతుకుతామని దాని సారాంశం.
ధర్మరాజు వారెవరని అడిగాడు. సమాధానంగా కర్ణుడినని,
భీముడినని, అర్జునుడినని, నకులుడినని,
సహదేవుడినని, ద్రౌపదినని,
ధృష్టద్యుమ్నుడినని, ద్రౌపదీ కుమారులమని మాటలు వినిపించాయి. (దుర్యోధనుడు
స్వర్గసుఖాలు అనుభవిస్తూ కనిపించగా, పాండవులు నరకకూపంలో
కనిపించడం విశేషమిక్కడ). ధర్మరాజు ఇదంతా చూసి వ్యాకులపడ్డాడు. వారు నరకానికి
రావడానికి తగిన పాపాలు ఏం చేశారని అనుకుంటూ, ఇంద్రాది దేవతలు
నీచులన్న భావానికి వచ్చాడు. సత్యనిష్ఠ, దయాగుణం, నిత్యదానశీలత గల పాండవులు నరకంలో
కష్టాల పాలు కావడం, ఎవరికీ మేలుచేయని దుర్యోధనుడు దేవతలకు
పూజనీయుడు కావడం అన్యాయంగా ధర్మరాజు మనసుకు తోచింది. ఇదంతా దేవతలు పన్నిన మాయా? లేక తాను కలగన్నానా? భ్రాంతా? అని మిక్కలి వ్యథ
చెందాడు. తాను తన తమ్ములదగ్గరే శాశ్వతంగా వుండిపోతానని,
స్వర్గానికి రానని అంటూ దేవదూతను వెళ్లమన్నాడు.
దేవదూత వేగంగా పోయి ఇంద్రుడికి అంతా వివరించాడు. ఇంద్రుడు
వెంటనే ఋషులతో, దేవతలతో కలిసి అక్కడికి వచ్చాడు. యమధర్మరాజు కూడా పుత్ర వాత్సల్యంతో
ధర్మరాజును ఓదార్చడానికి వచ్చాడక్కడికి. వారు రావడంతోనే అక్కడి సన్నివేశమంతా
తారుమారైంది. దుర్గంధం పోయింది. వైతరణీ నది లేకుండా పోయింది. మంచి వాసనతో కూడిని
వాయువు రాసాగింది. అక్కడికి వచ్చిన వారంతా ధర్మరాజు సద్గుణాలను ప్రశంసించారు.
దేవతలంతా ధర్మరాజును అక్కడి నుండి తీసుకుపోవడానికి వచ్చారని ఇంద్రుడు చెప్పాడు.
కోపం వదలమన్నాడు. ఆయనకు యోగం ప్రాప్తించిందని, బ్రహ్మలోక సుఖ
ప్రాప్తి సిద్ధించిందని, వికారాలన్నీ నశించాయని, ఇవన్నీ ఉదాత్తరీతిలో ఆయనకు సిద్ధించాయని అన్నాడు ఇంద్రుడు.
ఇంకా ఇలా చెప్పాడు ఇంద్రుడు. రాజన్న ప్రతి ఒక్కడికి
ఎట్లాగైనా నరకద్వార దర్శనం చేయవలసి రావడం తప్పేదికాదని, ఇది
వేదం చెప్పిన మాటని, రాజ్యపాలనలో సంకల్పితంగానో,
అసంకల్పితంగానో పాప పంకిలం రాజుకు అంటుకొనక తప్పదని,
కొన్నిటికి కర్తని, కొన్నిటికి ప్రేరకుడని, కొన్నిటికి
సాక్షని, అన్నిటికీ బాధ్యుడని, అందుకే నరకంలో పడడమో లేక
నరకద్వార దర్శనమో తప్పదని అన్నాడు. ధర్మజుడి పాపం చాలా తక్కువ కాబట్టి నరక దర్శన
భ్రమను పొందక తప్పలేదు. ఇక్కడ తిక్కనగారు ఒక అద్భుతమైన పద్యాన్ని రాశారు. అదిలా
సాగుతుంది.
సీ: పుణ్యంబులును
బాపములు రెండు జోకలై యుండు బుణ్యంబుల నొదవు నాక
సుఖము పాపంబుల జొప్పడు నరకదుః ఖము విను మున్ను
నాకంబు సుఖము
ననుభవించిన యట్టి యతడు పదంపడి యధిక నారక పీడా
ననుభవించు
మున్ను నారక దుఃఖమున బడ్డవా డనం తరమ నాకమున దా
బొరయు సౌఖ్య
తే: మల్పపుణ్యుండు
తొలి తొలి యమరతా సు ఖంబు గయికొని మరియు దుఃఖముల నొందు
భూరిపుణ్యుండు మునుమును ఘోర నిరయ యాతనల
నొంది వెండి సౌఖ్యంబు లొందు.
ఇంద్రుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు:
“ధర్మరాజా! జాగ్రత్తగా విను. పుణ్యపాపాలు రెండూ జంటగా వుంటాయి. ఒకదానితో ఒకటి
కలిసే వుంటాయి. పుణ్యం వల్ల స్వర్గం, పాపం వల్ల నరకం కలుగుతాయి.
తొలుత స్వర్గంలో సుఖం అనుభవించినవాడు పిదప నరకంలో చాలా బాధలు పడతాడు. తొలుత
నరకయాతన అనుభవించినవాడు ఆ తరువాతే స్వర్గసుఖాలు చవిచూస్తాడు. అల్పంగా పుణ్యం
చేసికొన్నవాడు తొలుత స్వర్గ సుఖాన్ని స్వీకరించి తరువాత చాలాకాలం నరకయాతన
అనుభవిస్తాడు. అధిక పుణ్యం చేసికొన్నవాడు మొదట నరకయాతన అనుభవించి తరువాత చాలాకాలం
స్వర్గసుఖాలు పొందుతాడు”.
(ఈ సందర్భాన్ని, పద్యాన్ని విశ్లేషిస్తూ, డాక్టర్ హెచ్ ఎస్ బ్రహ్మానంద ఇలా రాశారు: “భగవద్గీత గుణత్రయ, శ్రద్ధాత్రయలుగా చెప్పిన విషయ స్వర్వస్వ సారాంశం ఈ ఒక్క పద్యంలో వున్నది.
దైవత్వం సాత్త్వికసంపద. రాక్షసత్వం తామసికసంపద. మానవత్వం ఈ రెండు ధర్మాలలో వున్న
రాజసికసంపద. స్వత్త్వ ప్రధానమైన సుఖం తొలుత అమృతతుల్యంగా వుండి, తరువాత విషమై
ప్రాణం తీస్తుంది. ధర్మరాజుకు కలిగిన సందేహాలను నివృత్తి చేయడమే ఇంద్రుడి
తాత్పర్యం. దుర్యోధనుడు మహాల్ప పుణ్యుడు. అందువల్ల స్వర్గసుఖం తొలుత
అనుభవిస్తున్నాడు. తరువాత రౌరవాది నరకాలు సిద్ధంగా ఎట్లాగూ వున్నాయి. పాండవులు మహా
పుణ్యాత్ములు. అందువల్ల నరకబాదను ముందు పడుతున్నారు. చివరకు దీర్ఘమైన స్వర్గసుఖం
వున్నది వారికి. ధర్మరాజుకు రాచరికం వల్ల ఏర్పడిన పాపాంశ లేశం వల్లే నరకద్వార
దర్శనం కలిగింది”).
ధర్మరాజును అక్కడికి పంపడానికి కారణం భవిష్యత్తులో అతడికి
సర్వసుఖ ప్రాప్తి కలగడానికే అని అన్నాడు ఇంద్రుడు. కర్ణుడు,
భీమార్జున నకులసహదేవులు, ద్రౌపది మొదలైనవారు మున్ముందు
స్వర్గ సుఖాలు అనుభవిస్తారని చెప్పాడు. ఇంతవరకు ధర్మరాజు అల్ప దుఃఖాన్ని
అనుభవించాడని, ఇక తనతో కలిసి సుఖాలు అనుభవిస్తూ స్వర్గవిహారం
చేయమని అన్నాడు ఇంద్రుడు. షట్చక్రవర్తులు ఏరకమైన ఉన్నత స్థితిని పొందారో ఆ
స్థానాన్ని పొందమని ధర్మరాజుతో అన్నాడు. ఇలా అంటూ, ఆకాశగంగను
చూపించి అందులో స్నానం చేయమన్నాడు. అదే సమయంలో యమధర్మరాజు అక్కడికి వచ్చి, ధర్మరాజుతో, తాను ఆయన్ను మూడుసార్లు పరీక్షించానని, మూడు సార్లూ కొంచెమైన కదలిక కూడా ఆయనలో లేదని అన్నాడు. ఆయన బాగా
పరిశోధించబడ్డాడని, వ్యథను వదిలి సుఖంగా వుండమని చెప్పాడు.
ధర్మరాజు ఆకాశగంగలో శుభప్రదమైన మంగళస్నానం చేశాడు. ఆ
క్షణంలోనే మానుషదేహాన్ని వదలిపెట్టి దివ్యమైన పూజ్యదేహాన్ని పొందాడు. అంతటితో
అతడిలోని మనుష్య సహజమైన మనోవికారాలన్నీ మాయమయ్యాయి. ఆ తరువాత నారదాది మహర్షులతో,
ఇంద్రుడితో కలిసి పోతుంటే ఒక మనోహరమైన ప్రదేశంలో నరుడు (అర్జునుడు) నమస్కరిస్తూ
కొలుస్తున్న శ్రీమన్నారాయణమూర్తిని చూశాడు ధర్మరాజు. మరోవైపు మరుద్గణాల మధ్యన
భీముడిని, సూర్యసమూహంలో పదమూడవ వాడిగా కర్ణుడిని చూశాడు.
అశ్వినీదేవతల సమీపంలో నకులసహదేవులను చూశాడు. దివ్యప్రకాశంతో వెలుగుతున్న ద్రౌపదీ
మహాసతిని చూసి పోల్చుకోలేక ఆ మె ఎవరని అడిగాడు ఇంద్రుడిని ధర్మరాజు. ఆమె
మహాలక్ష్మి అని, ద్రౌపది అనే పేరుతో ద్రుపదుడి ఇంట్లో
అయోనిజగా మానవ రూపాన్ని పొందిన సాధ్వి అని, మహేశ్వరుడి
ఆజ్ఞతో అవతరించిందని, ఆమె పక్కన వున్న గంధర్వశ్రేష్ఠులు ఉపపాండవులని, గంధర్వ నాయకుడైన ధృతరాష్ట్రుడే ఆయన పెదతండ్రి అని వారిని చూపాడు
ఇంద్రుడు.
ఆ తరువాత కర్ణుడిని, సాత్యకిని, కృతవర్మాది యదువీరులను, అభిమన్యుడిని, పాండురాజుని, కుంతి, మాద్రీదేవులను,
భీష్ముడిని, ద్రోణుడిని, ద్రుపదుడిని, విరాటుడిని,
ఘతోత్కచుడిని ఇతరులను చూపించాడు ఇంద్రుడు ధర్మరాజుకు. వీరంతా శాశ్వతంగా
స్వర్గలోకంలోనే వున్నారా? లేక,
మనుష్యాది జన్మలు ఎత్తారా అనేది దేవరహస్యం.
ప్రద్యుమ్నుడు సనత్కుమారుడితో కలిశాడు. ధృతరాష్ట్రుడు
గాంధారి కలిసి కుబేర లోకంలో చేరాడు. పాండురాజు తన ఇద్దరు భార్యలతో స్వర్గలోకంలో నిలిచిపోయాడు.
అభిమన్యుడు చంద్రుడిలో కలిశాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలిశాడు. శకుని
ద్వాపరయుగాధిదైవతంతో కలిసిపోయాడు. దుర్యోధనుడు కలిపురుషుడిలో లీనమయ్యాడు.
దుశ్శాసనాదులు రాక్షసగణాలతో కలిసిపోయారు. కర్ణుడు సూర్యుడిని కలిశాడు. భీష్ముడు
అష్ట వసువులలో నిలిచిపోయాడు. ద్రుపదుడు, విరాటుడు, ధృష్టకేతువు, భూరిశ్రవుడు,
శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు, విశ్వదేవతలను చేరారు. ధృష్టద్యుమ్నుడు అగ్నిదేవుడిలో కలిశాడు. ధర్మరాజు, అప్పటికే ఆయన శరీరంలో ప్రవేశించిన విదురుడు, యమధర్మరాజులో కలిసిపోయారు.
(దీనర్థం విదురుడు కూడా ధర్మరాజు లాగా యమాంశజుడే అని). బలరాముడు అనంతుడిలో
కలిసిపోయాడు. వృష్టిభోజాంధక వీరులంతా గుహ్యకగణంలో కలిసిపోయారు. పదహారువేలమంది
గోపాంగనలు సరస్వతీ నదీజలాలలో మునిగి అప్సరసల రూపం పొంది నారాయణుడి సమీపంలో
తిరుగుతున్నారు. రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో లీనమైంది. సత్యభామాది మిగిలిన ఏడుగురు
కృష్ణపత్నులు కూడా మూలభూతమైన, అష్టలక్ష్మీ స్వరూపం (ఆది, ధాన్య, దైర్య, గజ, సంతాన, విజయ, విద్యా, ధన లక్ష్మీలు) కలిగిన, లక్ష్మీదేవి దివ్యశరీరంలో ప్రవేశించారు. మొత్తం
మీద మహాభారత యుద్ధంలో చనిపోయిన వారంతా వారివారికి తగ్గట్లుగా సుర, అసుర, యక్ష, గుహ్యక, గంధర్వ గణాలలో చేరిపోయారు.
ఈ విధంగా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు పాండవ-కౌరవులకు
సంబంధించిన ఇతిహాసాన్ని ఉపకథలతో సహా కలిపి మొత్తం కథనంతా వివరణాత్మకంగా, స్పష్టంగా
చెప్పాడు. వేదవ్యాసుడి అనుగ్రహం వల్ల, ఆయన అనుమతితో, ఆయన దయతో పుట్టిన బుద్ధి
విశేషం వల్ల సమస్త విషయాలను తాను వివరించగా, అది విని జనమేజయ మహారాజు
పుణ్యాత్ముడు, ధన్యుడు, బ్రహ్మజ్ఞాన
వేత్త అయ్యాడని అన్నాడు వైశంపాయనుడు. వైశంపాయన మహర్షి జనమేజయుడికి సర్పయాగ సమయంలో
ఈ భారతకథను చెప్తుండగా, ఆ సభలో వున్న వ్యాసుడి శిష్యుడు, పండిత శ్రేష్ఠుడైన సూతుడి కొడుకు ఉగ్రశ్రవుడు అనేవాడు అంతా మిక్కిలి ఏకాగ్రతతో
విన్నాడు. ఉగ్రశ్రవుడు గొప్ప కథకుడు. వ్యాసుడి అనుగ్రహం వల్ల ఆ కథను సమగ్రంగా
వివరించే శక్తి అతడికి అబ్బింది. అతడు నైమిశారణ్యంలో శౌనకుడనే విద్యాగురువు.
మరికొందరు మహామునులు సత్రయాగం చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లి, వారి కోరిక మీద, మహాభారతకథను చెప్పాడు.
జనమేజయ మహారాజు సర్పయాగ కర్మలను అనుష్టిస్తున్న సమయంలో
వైశంపాయన మహర్షి చెప్పిన భారతకథను విని సంతోషించాడు. సర్పాల ఆపదను తీర్చిన
అస్తీకుడిని పూజించి పంపించాడు. బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు కానుకలిచ్చాడు. వైశంపాయన
మహర్షిని, వేదవ్యాసుడిని పూజించాడు. ఆ తరువాత, వైభవంగా హస్తినాపురం వెళ్లాడు.
పాండవుల కీర్తిని ప్రకటించడానికి, ఇంకా
కొంతమంది రాజుల కథలను ప్రజలకు తెలియచేయడానికి, వాసుదేవుడి
లీలా విశేషాలను వివరించడానికి, సర్వదేవతా గణాల పుట్టుక, సాయుజ్యం విశదం చేయడానికి, సకల ధర్మాలను తెలపడానికి, పంచమవేదమని పేరుపొందిన మహాభారత సంహితను వేదవ్యాసుడు మూడు సంవత్సరాలలో
నిర్మించాడు. ఇందులోలేని ధర్మం మరెక్కడా కనిపించదు.
ఈ మహేతిహాసాన్ని పర్వదినాలలో వింటే సర్వపాపాలు నశిస్తాయి.
స్వర్గం లభిస్తుంది. సంకల్పించి గాఢమైన భక్తితో వింటే ముక్తి కూడా లభిస్తుంది.
ప్రారంభం మొదలు ఈ పుణ్యకథను ఎవరు వింటారో వారికి ఆ క్షణమే బ్రహ్మహత్యాపాపం మొదలైన
మహాపాపసమూహాలు కూడా నశిస్తాయి. దైవ, పితృకార్యాలు జరిపేటప్పుడు ఏ
పుణ్యాత్ముడు బ్రాహ్మణులకు ఈ మహాభారతాన్ని వినిపిస్తాడో అతడు ఆయా పుణ్యకార్యాల
ఫలితాన్ని పొందుతాడు. పవిత్రమైన భారతేతిహాసం చెవుల్లో ఏకొంత చిలికినా, సర్వపాపాలూ
వెంటనే విరిగిపోతాయి. రాజులు ఈ కథను విని విజయలక్ష్మిని పొందుతారు. బ్రాహ్మణులు
శత్రువులను జయిస్తారు. భారతాన్ని కోరికతో విన్నా, భక్తితో
చదివినా, సంపద, ఆయుస్సు, యశస్సు, సంతోషం, చదువు
కలుగుతాయి. వారికి ఏ కోరికైనా అతి శీఘ్రంగా ఫలిస్తుంది. మహాభారత తాత్పర్యం ఎవరికీ
స్ఫురిస్తుందో ఆ భాగ్యవంతుడికి సకల వేదోపనిషత్సారం కరతలామలకం అవుతుంది. జనులు
అతడిని కీర్తిస్తారు. భారతేతిహాసం “జయ” మనే పేరుతో వెలుగుతూ ముల్లోకాలలోనూ
ప్రఖ్యాతమై వ్యాపించింది.
అందుకే అంటారు “వింటే భారతం వినాలి-తింటే గారెలు
తినాలి” అనే తెలుగువారి సామెతగా.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, స్వర్గారోహణపర్వం, ఏకాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment