కాశీ, గయ యాత్రానుభవాల సమాహారం (మొదటి భాగం)
‘సంకల్పం
ఎక్కడ వుంటే మార్గం కూడా అక్కడే వుంటుంది’
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(06-11-2023)
‘సంకల్పం ఎక్కడ వుంటే మార్గం కూడా అక్కడే వుంటుంది’ అన్న
ఆంగ్ల సామెత,
ఐదుగురు బంధు, మిత్ర బృందంతో కూడిన, ఇటీవలి మా కాశీ, గయ యాత్రానుభవం నిర్ద్వందంగా ఋజువు చేసింది. సంకల్పానికి తోడు దైవబలం,
దైవం మానుష రూపేణా అన్న విధంగా పరిచయాల రూపంలోని మానవ బలం, వెళ్లిన ప్రతిచోటా తారసపడ్డ వ్యక్తుల మంచితనం అనే బలం కలిసొచ్చాయి. అలాగే
ఉత్తరప్రదేశ్ బనారస్ జిల్లా, బీహార్ గయ జిల్లా అధికారుల సహాయ
సహకారాలు, ఆదరాభిమానాలు, ప్రభుత్వ
అతిథి గృహాల సిబ్బంది నమ్రత, అక్కడ వారు సమకూర్చిన ఆహార, వసతి సౌకర్యాలు మరింత తోడ్పడ్డాయి.
ఇంకా విశేషం, మా బృందంలోని ముగ్గురు సీనియర్
సిటిజన్లను ఇద్దరు బనారస్ ప్రోటోకాల్ పోలీసు అధికారులు, అనుక్షణం
కంటికి రెప్పలా కాపాడుతూ, మా వెంటనే వుంటూ భద్రంగా చూసుకున్న
వైనం, ఏవిధమైన కించిత్తు ఇబ్బంది కలగకుండా నేరుగా
దైవదర్శనానికి చేసిన ఏర్పాట్లు, దేవాలయంలో వీవీఐపీ లాంజ్ లో
కూర్చునే అవకాశం, వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ
విమానాశ్రయంలో దిగినప్పటి నుండి, తిరుగు ప్రయాణానికి
విమానాశ్రయం చేరుకునేవరకు రెండు ఇన్నోవా కార్లలో అహర్నిశలు మావెంట వున్న కార్ల
డ్రైవర్ల (రిషి ప్రజాపతి, సంజయ్ యాదవ్) నిబద్ధత, నైపుణ్యం, అన్నిటినీ మించి బ్రహ్మస్వ భవనం ట్రస్ట్
వారి ఆతిథ్యంలో వడ్డించిన అద్భుతమైన పలహారం, భోజనం, ఇలా, ఇలా ఎన్నో మా యాత్రలో కలిగిన మరపురాని, మరవలేని, మధురానుభూతులు. వీటి నేపధ్యంలో విజయవంతంగా
సాగిందే మా ఐదుగురి మూడు రోజుల పర్యటన.
సుమారు పక్షం రోజుల క్రితం ఒక సాయింత్రం నేను, మా శ్రీమతి కలిసి,
ఆమె అన్నయ్య డాక్టర్ మనోహర్ రావు గారింటికి వెళ్లాం. సంభాషణ మధ్యలో
యధాలాపంగా గయలో పితృదేవతలకు పిండ ప్రదానం ప్రస్తావన వచ్చింది. మా తల్లితండ్రులు
ఇద్దరూ, మనోహర్ రావు తల్లితండ్రులు ఇద్దరూ స్వర్గస్తులై చాలా
సంవత్సరాలైనప్పటికీ సమయం లభించనందువల్ల లేదా సమయం రానందువల్ల, ఈ ఆలోచన అంతవరకూ రాలేదు. ఆలోచన వచ్చింది మనోహర్ రావుకే. సంకల్పం ఆయనదే.
ముందుగా కాశీ వెళ్లి, అక్కడి నుండి గయకు వెళ్దామని తక్షణమే
తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నాం.
కార్యాచరణ కొరకు కాశీకి పలుమార్లు వెళ్లి వచ్చిన అనుభవం
వున్న దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకుడు మరుమాముల వెంకట రమణ శర్మ (దర్శనమ్
శర్మ) గారిని సంప్రదించాం. మావెంట ఆయనగారుంటే మాకు కొండంత బలం అని చెప్పాం. ఆయన
అంగీకరించి అక్టోబర్ 30, 31, నవంబర్ 1 తేదీలలో తనకు అనుకూలం అని అన్నారు.
ఒకటి-రెండు రోజుల వ్యవధిలో మాతో కలిసిపోవడానికి మా శ్రీమతికి, మనోహర్ కు అన్నయ్య గారి కొడుకు డాక్టర్ భరత్ బాబు; మా
తోడల్లుడు మనోహర్ బావగారు విజయ్ శంకర్; మా శ్రీమతికి,
మనోహర్ కు మేనమామ శ్రీనివాస రావు వస్తామని చెప్పడం, టికెట్లు కొనడం జరిగిపోయింది. కారణాంతరాల వల్ల శ్రీనివాసరావు చివరి
క్షణంలో రాలేకపోయాడు.
బయల్దేరడానికి వారం-పది రోజుల వ్యవధి వుండడం వల్ల కాశీ, గయలలో
వుండడానికి, దైవ దర్శనానికి, విమానాశ్రయం
నుండి బయల్దేరినప్పటి నుండి తిరిగి చేరుకున్నదాకా రవాణా సౌకర్యానికి, ఇతర రకాలైన సహాయానికి నాకు తెలిసిన వారిని సంప్రదించాలని భావించాను.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలంగాణ కాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసులో నీతి ఆయోగ్ సంస్థలో DG DMEO గా పని చేస్తున్న సంజయ్ కుమార్ ను ఫోన్లో
సంప్రదించాను. బనారస్ (కాశీ) లో ఏర్పాట్ల విషయంలో తప్పక సహాయం చేస్తానన్నాడు.
మర్నాడు సంజయ్ వ్యక్తిగత కార్యదర్శి రితు తక్రాల్ ఫోన్ చేసి బనారస్ కమీషనర్, కలెక్టర్,
ఐఏఎస్
అధికారి కౌశల్ రాజ్ శర్మ గారికి మెయిల్ పంపమని మా అవసరాలు చెప్పమని, వాటికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతాయని
చెప్పింది.
రితు తక్రాల్ సూచన మేరకు నేను మెయిల్ పంపడం, ఆయన గారు స్పందించి స్థానిక సర్క్యూట్ హౌజ్
(ప్రభుత్వ అతిథి గృహం) లో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మా అయిదుగురికి వసతి, దైవ దర్శనానికి, అద్దె
చెల్లింపు పద్దతి ప్రకారం గయకు పోయి రావడంతో సహా కాశీలో తిరగడానికి ఇన్నోవా
కార్లను ఏర్పాటు చేస్తున్నట్లు, మాకు సహాయంగా
ఒక ప్రోటోకాల్ అధికారిని కూడా నియమిస్తున్నట్లు పేఏ ద్వారా జవాబిచ్చి, ఆయన కంటాక్ట్ నంబర్లను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ
అనుసంధానం చేసింది సంజయ్ కుమార్ వ్యక్తిగత కార్యదర్శి రితు తక్రాల్.
అయితే ఇవన్నీ జరిగేలోపు ముందు జాగ్రత్తగా, మానవ సహజమైన ఆదుర్తాతో, కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేసిన, ఒకప్పటి (నేను ఇఎంఆర్ఐలో పనిచేసిన
రోజుల్లో) నా సీనియర్ సహోద్యోగి వెంకట్ చెంగవల్లి గారికి మా పర్యటన గురించి చెప్పి, దైవదర్శనానికి ఏర్పాటు చేయమని కోరాను. ఆయనగారు మావివరాలు తీసుకుని
వారణాశి పోలీస్ కమీషనర్, గుంటూరుకు చెందిన తెలుగువాడు, సీనియర్ ఐపీఎస్ పోలీసు అధికారి, అశోక్ జైన్ గారికి
పంపాడు. 24 గంటల్లో ఆయనగారి కార్యాలయం నుండి ఫోన్ రావడం, ఒక
ప్రోటోకాల్ అధికారిని నియమించడం జరిగింది. బనారస్ కమీషనర్, కలెక్టర్,
ఐఏఎస్
అధికారి కౌశల్ రాజ్ శర్మ; పోలీస్
కమీషనర్, ఐపీఎస్ పోలీసు అధికారి, అశోక జైన్ ఏర్పాటు చేసిన
ఇద్దరూ పోలీసు అధికారులే కావడం మా అదృష్టం.
కాశీలో ఏర్పాట్ల తరువాత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శిగా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన
సలహాదారుడుగా వున్న, బీహార్ రాష్ట్రానికి చెందిన, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ గారిని, గయ పర్యటనలో సహాయం చేయమని కోరాను. ఆయన గారు గయ కలెక్టర్ డాక్టర్ ఎస్ఎం
త్యాగరాజన్ గారికి మెసేజ్ పంపడం, ప్రభుత్వ
నిబంధనల ప్రకారం మాకు అతిథి గృహంలో వసతి, పిండ ప్రదానం
చేయించడానికి పండిట్ ఏర్పాటు జరిగాయి. మా వెంట ఒక అధికారి వుండే ఏర్పాటు కూడా
చేయడం జరిగింది.
అనుకున్న ప్రకారం అక్టోబర్ 30 వ తేదీ ఉదయం ఇండిగో విమానంలో బయల్దేరిన
మేము 11-30 గంటలకల్లా వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం
చేరుకొని బయటకోచ్చేసరికి సుమారు 12 గంటలైంది. బనారస్ జిల్లా కమీషనర్ (జిల్లా
కలక్టర్ కూడా) గారు ఏర్పాటు చేసిన సంతోష్ తివారి అనే ప్రోటోకాల్ (పోలీసు) అధికారి
రెండు ఇన్నోవా కార్లతో మాకోసం బయట వుండి మమ్మల్ని రిసీవ్ చేసుకుని, నేరుగా
సర్క్యూట్ హౌజ్ ప్రభుత్వ అతిథి గృహానికి తీసుకెళ్లారు. సౌకర్యమైన మూడు గదులను మాకు
కేటాయించారు. అక్కడ బనారస్ పోలీసు కమీషనర్ గారు ఏర్పాటు చేసిన మరో అధికారి (ఆయన
పేరు కూడా సంతోష్) మమ్మల్ని కలిశారు. వారిరువురి సూచన మేరకు త్వరగా తయారై అందరం
దైవ దర్శనానికి వెళ్లాం.
దర్శనమ్ శర్మ గారి సలహా మేరకు మొట్టమొదట కాలభైరవ మందిరం
వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మావెంట వున్న ప్రోటోకాల్ పోలీసు అధికారులు ఇద్దరూ
కూడా అదే సరైన పధ్ధతి అన్నారు. హెడ్ పోస్టాఫీసు సమీపంలోని పురాతన దేవాలయమైన కాల
భైరవ మందిరం,
ప్రధాన దేవతైన శివుడికి అంకితం చేయడం జరిగింది. కార్లలో సమీపంలో
దిగి, ఇరుకు గొందుల్లో నడుచుకుంటూ అక్కడికి చేరుకున్నాం.
కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. ముందుగా కాలభైరవుడి దర్శించుకుని,
ఆయన అనుమతి తీసుకుని, విశ్వేశ్వర దర్శనం
చేసుకోవాలని పురాణ కథనం వివరిస్తుంది.
తదనుగుణంగా భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుడిని
దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఆనవాయితీ
ప్రకారం మా బంధుమిత్ర
బృందం కాలభైరవుడిని దర్శించుకుని, ఆలయం బయట వున్న
దుకాణంలో కూర్చున్న వ్యక్తితో (నలుపు రంగు) ‘కాలభైరవ రక్ష’ కట్టించుకుని, ‘కాశీ దారం’ మెడలో వేయించుకున్నాం.
దండపాణి ఆలయాన్ని దర్శనం చేసుకోకుండా కాశీ యాత్ర సంపూర్ణం
కాదని అంటారు. అందుకే అక్కడి నుండి ఇరుకు సందు-గొందులలో నడుచుకుంటూ, కొంచెం
దూరంలో, విశ్వనాథ్ ఆలయానికి దక్షిణాన వున్న దండపాణి ఆలయానికి
చేరుకున్నాం. దండపాణిని కాశీకి పరిపాలకుడుగా శివుడు నియమించాడని అంటారు. కాశీలోకి
ఎవరు రాగలరో నిర్ణయించే శక్తి దండపాణికి వుందని నమ్మకం. ‘దండపాణి’ అంటే కర్ర
పట్టుకునేవాడు అని అర్థం. స్కంద పురాణం ప్రకారం విశ్వనాథుడి దర్శనానికి వెళ్లే
ముందర దండపాణి దర్శనం చేసుకోవాలి. అక్కడ వున్న పూజారి ‘దండపాణి’ దండంతో మమ్మల్ని
వంగమని వీపుమీద కొట్టాడు. దండపాణి ఆలయం పక్కనే వున్న మహా కాళేశ్వరంలో అభిషేకం
చేసుకుని, అక్కడి భస్వ రేఖలు నుదుటిమీద ధరించి, నంది మీద చేయి పెట్టి శివలింగ దర్శనం చేసుకున్నాం.
అక్కడినుండి బయటకు వచ్చి, నడుచుకుంటూ కార్ల
వద్దకు వచ్చి, ఎక్కి, ‘కాశీ విశ్వనాధ
ప్రధాన ఆలయం’ లోకి ప్రముఖులు వెళ్లడానికి అనుమతిచ్చే ప్రధాన ద్వారం గేట్ నంబర్ 4
చేరుకున్నాం. ఆ ద్వారం లోనుంచి నేరుగా మమ్మల్ని ప్రముఖులను అనుమతిచ్చే దేవాలయ
ప్రాంగణంలోని లాంజ్ కు తీసుకుని వెళ్లారు మా వెంట వున్న ప్రోటోకాల్ అధికారులు.
పాతిక సంవత్సరాల క్రితం చూసిన దేవాలయ ప్రాంగణానికి ఆధునీకరించబడిన ఇప్పటి
ప్రాంగణానికి పోలికే లేదు. అంత అత్యత్భుతంగా మార్పు చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర
మోడీ ప్రాతినిధ్యంవహించే నియోజకవర్గం వారణాశి కావడమే దీనికి కారణమని అందరూ
అన్నారక్కడ. అయిదు-పది నిమిషాలు అక్కడే కూర్చుని,
కాళ్లు-చేతులు శుభ్రం చేసుకుని, పాదరక్షలు లాంజ్ బయట వదిలి
మొదలు విశ్వనాధ మందిరంలోకి వెళ్ళాం.
మందిరంలోని ప్రధాన ఆలయంలో లింగాకారంగా కొలువై ఉన్న
విశ్వేశ్వరుడు లేదా విశ్వనాధుడు పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ
విశ్వేశ్వర లింగం దర్శనం అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. వారణాశి నగరాన్ని ఈ
దేవాలయం పేరుతో పిలుస్తారు. దీన్ని శివుడికి అంకితం చేయడం జరిగింది. స్పర్శ దర్శనం
చేసుకోవడం ద్వారా, లింగాన్ని స్పృశించి, అలౌకిక అనుభూతి పొంది, క్షీరాభిషేకం కూడా చేశాం అందరం. విశ్వేశ్వరుడిని అలంకరించిన తెల్ల
జిల్లేడు మాలలు, ఇతర పుష్ప మాలలను, మా
మెడలో వేశారు పూజారులు. అభిషేక జలాలతో కూడా మమ్మల్ని సంప్రోక్షణ చేశారు అర్చకులు.
తరువాత అదే ప్రాంగణంలో కొలువై వున్న అన్నపూర్ణామందిరానికి వెళ్లాం. ఆలయ ప్రధాన
దేవత అన్నపూర్ణాదేవి పార్వతీ మాత అవతారమే.
విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిదేవిని
దర్శించడం ఆచారం. కాశీ నగరాన్ని ఆహార సమస్య నుండి అన్నపూర్ణాదేవి రక్షిస్తుందని
నమ్మకం. అన్నపూర్ణ, శివుడి భార్య పార్వతి ఆహారం, రూపానికి సంబంధించిన దేవత. అన్నపూర్ణ ఆహారంతో సంతోషించిన శివుడు, వారణాశిని స్థాపించి, ఆమెను అధిష్టాన దేవతగా
నియమిస్తాడు. విశాలాక్షి దేవతను ప్రారంభ కాలంలో అన్నపూర్ణతో గుర్తించేవారట. అయితే
కాలక్రమేణా ఒక ప్రత్యేకమైన దేవతగా మారింది, ఫలితంగా రెండు
ఆలయాలు ఏర్పడ్డాయని ఒక నమ్మకం. అన్నపూర్ణ అమ్మవారి గర్భాలయంలో మూల విగ్రహం వెళ్లి
పాద నమస్కారం చేసి, అర్చకుడు ఇచ్చిన కుంకుమ, ఒడి బియ్యం, అన్నపూర్ణ ప్రసాదంగా స్వీకరించాం.
పక్కనే (లోతులో వున్న) వున్న శ్రీచక్ర లింగాన్ని స్పర్శించాం.
అదే ప్రాంగణంలో చివరగా విశాలాక్షిమందిరం వెళ్లాం.
విశాలాక్షి ఆలయం విశాలాక్షి దేవతకి అంకితం చేసిన హిందూ దేవాలయం. ఈ ఆలయం అష్టాదశ
శక్తిపీఠాలలో ఒక శక్తి పీఠంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర ప్రదేశంలో సతీదేవి
చెవిపోగులు పడ్డాయని చెబుతారు. 'విశాలమైన కన్నులు' కలిగినందున
విశాలాక్షి అనే పేరు వచ్చింది ఇక్కడి దేవతకు. గర్భగుడిలో రెండు దేవతా చిత్రాలు
పక్కపక్కనే ఉంటాయి. విశాలాక్షి దగ్గర ముందు వెనుకల విగ్రహాలున్నాయి. ముఖ్యంగా
వెనుక వున్న ప్రధాన విగ్రహాన్నే శక్తి పీఠం అంటారు. ఆలయం ప్రదక్షిణ చేసి, గర్భాలయం పైన వున్న శిఖర దర్శనం చేసుకున్నాం. మద్యాహ్నం ఒకటిన్నర గంటల
ప్రాంతంలో కాలభైరవ మందిరం చేరుకున్న మాకు, ఈ మొత్తం ఆలయాల
దర్శనం చేసుకోవడానికి పట్టిన సమయం కేవలం గంటన్నర మాత్రమే. మధ్యాహ్నం మూడు గంటల
సమయంలో కాశీ విశ్వనాధ ప్రధాన ఆలయం ప్రాంగణం నుండి బయటకు వచ్చి, పది నిమషాలలో బ్రహ్మస్వ భవనం చేరుకున్నాం.
No comments:
Post a Comment