కాశీ, గయ యాత్రానుభవాల సమాహారం (రెండవ భాగం)
(వారణాశి
నుండి గయకు, పిండప్రదానం చేసి, గయ నుండి వారణాశికి)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(20-11-2023)
వారణాశి చేరుకున్న మొదటి రోజున మా ఐదుగురు బంధు మిత్ర బృందం
(డాక్టర్ మనోహర్ రావు, డాక్టర్ భరత్ బాబు, విజయ్ శంకర్, దర్శనమ్ శర్మ, నేను, కాలభైరవ మందిరం, దండపాణి ఆలయం, మహా కాళేశ్వరం, విశ్వేశ్వర లింగ స్పర్శ దర్శనం, క్షీరాభిషేకం, అన్నపూర్ణ అమ్మవారి ఆలయ
దర్శన, గర్భాలయంలో మూల విగ్రహానికి పాద నమస్కారం, శ్రీచక్ర
లింగ స్పర్శ, చివరగా, విశాలాక్షిమందిరంలో విశాలాక్షి, శక్తి పీఠం, శిఖర దర్శనం ముగించుకుని, మధ్యాహ్నం
మూడు గంటల సమయంలో కాశీ విశ్వనాధ ఆలయం ప్రాంగణం నుండి బయటకు వచ్చి, పది నిమషాలలో బ్రహ్మస్వ భవనం చేరుకున్నాం.
శ్రీఅన్నపూర్ణ, శ్రీవిశాలాక్షీ సమేత శ్రీ కాశీ
విశ్వనాథుని సన్నిధిలో ధార్మికులకోసం, మా వెంట వచ్చిన యువ ఆధ్యాత్మిక వేత్త దర్శనమ్
శర్మ చొరవతో, తెలుగువారు ఏర్పాటుచేసిన ప్రసిద్ఢ అశ్రమమే
బ్రహ్మస్వ భవనం. కాశీలోని కేదార ఘాట్ ప్రాంతంలో, సోనార్ పురా
ప్రధాన రహదారిలో, క్షీర సాగర్ స్వీట్ హౌస్ పక్క సందులో వుందిది. పూర్వాశ్రమంలో
జ్యోతిరప్తోర్యామయాజి, విద్వదాహితాగ్ని, వేదవిద్యానిధి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులుగా ప్రపంచానికి
తెలిసి, జీవితమంతా వేదధర్మ పరిరక్షణ దీక్షలో గడిపిన, ‘శ్రీశ్రీశ్రీ
బ్రహ్మానంద తీర్థ స్వామి’ మహాత్ముడి సత్సంకల్పం మేరకు ఈ భవనం ఏర్పాటయింది. ఈ
మహానుభావుడు, ఉదయం ఆతుర సన్యాసం
స్వీకరించి, సాయంకాలం శివసాయుజ్యం పొందారు.
మాణిక్య సోమయాజులు గారు వారి ధర్మపత్ని శ్రీమతి లలితా
సోమిదేవమ్మ గారితో కలిసి శేష జీవితాన్ని కాశీలో గడుపుతున్న నేపధ్యంలో వారి మదిలో మెదిలిన ఆలోచన కార్యరూపమే
ఇది. కాశీలో సదాచార సంపన్నులకు, ఆహితాగ్నులకు, తపోసంపన్నులకు,
యతీశ్వరులకు, యోగ్యమయిన వసతి, స్వయంపాకం
సౌకర్యం, భిక్షకు అనువయిన అశ్రమాలు లేవని సోమయాజులు గారు
అనుభవ పూర్వకంగా తెలుసుకుని ధార్మిక బ్రహ్మస్వ భవనం ఏర్పాటుకు సంకల్పించారు. వారి
సర్వాధ్యక్షతన బ్రహ్మస్వ భవనం ట్రస్టును, దర్శనమ్
వెంకటరమణ శర్మ అధ్యక్షులుగా, కాసుల చంద్రశేఖర శర్మ
కార్యర్యదర్శిగా, కాసుల రాధా కృష్ణ శర్మ కోశాధికారిగా, మరో 11 మంది తన శిష్యులతో,
ఔత్సాహిక ధార్మికులతో కలిసి నెలకొల్పారు.
ట్రస్టు సభ్యులు సోనార్ పురాలో 423
గజాల సువిశాల స్థలాన్ని ఎంపిక చేసుకుని, కొనుగోలు చేశారు. ‘బ్రహ్మస్వ భవనం - భూదాన
సంకల్పం’ అని వీరిచ్చిన పిలుపుకు విశ్వవ్యాప్త స్పందన లభించింది. పలువురి సంకల్ప
బలంతో, అచిరకాలంలోనే తాత్కాలిక ‘బ్రహ్మస్వ భవనం’ రూపుదిద్దుకొంది. ఆద్యతన
భవిష్యత్తులో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో, సమస్త వసతులతో
కూడిన ఐదంతస్తుల భవన నిర్మాణం కోసం కార్యాచరణను ప్రణాళిక రూపకల్పన జరిగింది. ఇటీవలి
పవిత్ర గంగా పుష్కరాల సందర్భంగా లక్ష మందికి అన్నప్రసాద వితరణ మహాయజ్ఞంతో ‘బ్రహ్మస్వ
భవనం ట్రస్టు’ ధార్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆ పరంపరలోనే, కంచి
కామకోటి పీఠం స్వామివారి చాతుర్మాస్య దీక్ష సందర్భంగా కాశీకి విచ్చేసిన 150 మంది అహితాజ్ఞులకు బ్రహ్మస్వ భవనంలో వసతి, స్వయంపాకంతో భోజన ఏర్పాట్లను
ట్రస్ట్ చేసింది.
ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మస్వ భవనంలో రెండు సోమయాగాలు, చండీ
మహారుద్రయాగాలు జరిగాయి. కాశీలో చాతుర్మాస్య దీక్ష చేసిన కంచి కామకోటి పీఠాధిపతులు
శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిశ్వరులు
శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి, శృంగేరి అనుబంధ శివగంగా మఠం శ్రీ
పురుషోత్తమ భారతీ స్వామి, పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ
అమృతానంద సరస్వతి స్వామి, బ్రహ్మస్వ భవనం సందర్శించి అనుగ్రహ భాషణం చేశారు.
అనునిత్యం, పెద్ద సంఖ్యలో, నిష్టాగరిష్టులు, అహితాజ్ఞులు, వేద పండితులు, బ్రహ్మస్వ
భవనం ట్రస్టులో మడితో, శుచిగా భోజనాన్ని స్వీకరిస్తున్నారు. నిత్యం, నాలుగు నెలల
పాటు, శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతి స్వామి వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవత
ప్రవచనామృతం జరిగింది. కార్తీక మాసంలో ప్రతిరోజు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం తో
పాటు, వందలాది మందికి అన్నప్రసాద వితరణ అందించడానికి ట్రస్టు ఏర్పాట్లు చేసింది. అంత్య
పుష్కరాల సందర్భంగా కూడా 12 రోజులపాటు మహా అన్న సమారాధనకు
ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మా అందరికీ బ్రహ్మస్వ భవనంలో, దర్శనమ్ వెంకటరమణ శర్మ గారు
భోజన వసతి ఏర్పాటు చేశారు. కాశీ చేరుకోవడానికి ముందర హైదరాబాద్ శంషాబాద్
విమానాశ్రయంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో చేసిన బ్రేక్ ఫాస్ట్ తరువాత, ఆకలితోవున్న మా
అందరికి అంత చక్కటి, రుచికరమైన, వేడి-వేడి, కొసరి-కొసరి వడ్డించిన భోజనం
ఇంకా, మరీమరీ గుర్తు వస్తూనే వున్నది. భోజనంలో వడ్డించిన ప్రతి పదార్ధం రుచిగా
వుండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భోజనం తయారు చేసిన పిల్లలమర్రి సుజాత గారికి, ఆప్యాయంగా ప్రతిపదార్ధం వడ్డన చేసిన కాశీ బ్రహ్మస్వ భవనం ట్రస్టు మేనేజర్
మకరాల మరీచిక గారికి, భవనంలోనే వున్న ధార్మికులు మల్లాది
వెంకట పూర్ణచంద్ర శాస్త్రి గారికి, మా బంధుమిత్ర బృందం పక్షాన మరోమారు ధన్యవాదాలు.
మాతో పాటు, ప్రోటోకాల్ (పోలీసు) అధికారులు సంతోష్ తివారి,
మరో సంతోష్, కార్ల డ్రైవర్లు రిషి ప్రజాపతి, సంజయ్ యాదవ్ లు కూడా తృప్తిగా, సంతోషంగా అక్కడే భోజనం చేశారు.
బ్రహ్మస్వ భవనంలో విశ్రాంతి తీసుకుని, అరగంట
ప్రయాణం చేసి, ‘నమో ఘాట్’ కు
చేరుకున్నాం. అద్భుతంగా అక్కడి పరిసరాల నిర్వహణకు, యాత్రీకులకు
సౌకర్యాలు సమకూర్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి,
బనారస్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు. మా
వెంటవున్న ప్రోటోకాల్ అధికారుల సహాయంతో, గంగానదిలో ఘాట్లు
చూస్తూ తిరగడానికి, దర్శనమ్ శర్మ, ప్రోటోకాల్ అధికారుల సూచన
మేరకు, ప్రత్యక్షంగా గంగా హారతి తిలకించడానికి, కేవలం మాకోసమే
అద్దెకు, ఒక బోటును ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిరోజూ కాశీలో
నిర్వహించే గంగా హారతి దృశ్యాలను, విదేశీయులతో సహా, వేలాది
మంది తిలకిస్తుంటారు. హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక, పడవలలో
కూర్చుని చూడడానికి, యాత్రీకులు మాలాగే దశాశ్వమేధ
ఘాటుకు చూడడానికి చేరుకుంటారు.
గంగానదిలో సుమారు గంటన్నర బోటు షికారు చేశాం అందరం. నది
మధ్యలో గంగాజలాలతో సంప్రోక్షణ చేసుకున్నాం. కేదార్ ఘాట్, రాజ్
ఘాట్, సిందియా ఘాట్, మందిర్ ఘాట్, ఇటీవల ఆధునీకరించబడిన మోడీ లలితా ఘాట్, తదిర ఘాట్లను బోటు ప్రయాణంలో
తిలకించాం. హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్ లలో శవాల దహనం
గమనించాం. చివరకు దశాశ్వమేధ్ ఘాట్ చేరుకొని, సంతృప్తిగా 7
గంగా హారతులను కనులారా చూశాం. నమో ఘాట్ కు చేరుకొని, మొదటి
రోజు బిజీ-బిజీ కార్యక్రమాన్ని ముగించుకుని, తిరుగు ప్రయాణమై, నేరుగా సర్క్యూట్ హౌజ్ ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లి, మాకు కేటాయించిన గదులలో స్నానపానాదులు ముగించుకుని,
అక్కడ ఏర్పాటుచేసిన రుచికరమైన ఆహారాన్ని తీసుకుని, మర్నాడు
ఉదయమే గయకు పోవాల్సి ఉన్నందున త్వరగా నిద్రకు ఉపక్రమించాం.
మర్నాడు అక్టోబర్ 31 ఉదయాన్నే
స్నానాదులు పూర్తిచేసుకుని, అనుకున్న ప్రకారం గంటలు 5-30 కల్లా డ్రైవర్లు రిషి
ప్రజాపతి, సంజయ్ యాదవ్ లు గెస్ట్ హౌజ్ లో తయారుగా వుండడంతో, గయకు బయల్దేరాం. వెంట
బనారస్ కమీషనర్ కౌశల్ రాజ్ శర్మ ఏర్పాటుచేసిన ప్రోటోకాల్ అధికారి సంతోష్ తివారీ
కూడా వచ్చారు. ఉదయమే బయల్దేరుతామన్న సమాచారాన్ని గయలో మాకు ఏర్పాట్ల కోసం ఆ జిల్లా
కలెక్టర్ త్యాగరాజన్ గారు నియమించిన కలెక్టర్ కార్యాలయ అధికారి మనీష కుమార్ కు
తెలియచేశాం.
కాశీ నుండి గయకు చేరుకోవదానికి ఏడెనిమిది గంటలు పడుతుందనీ,
రహదారి బాగుండదనీ, ఉదయం బయల్దేరి పోయి అక్కడ కార్యక్రమాలు
ముగించుకుని తిరిగి అదేరోజు రావడం కష్టతరమనీ, మా ప్రయాణానికి
ముందర మమ్మల్ని చాలామంది హెచ్చరించారు. అందుకే ముందు జాగ్రత్తగా కనీసం రెండు,
వీలుంటే మూడు ప్రభుత్వ గదుల వసతి ఏర్పాటు చేయమని కోరాం. అయితే, మార్గమద్యంలో రిలయన్స్ రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి, వారణాశి
నుండి గయకు 250 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేయడానికి కేవలం 5-30 గంటల సమయం మాత్రమే
పట్టింది. డ్రైవర్లు రిషి ప్రజాపతి, సంజయ్ యాదవ్ లు జాగ్రత్తగా,
వేగంగా నడిపారు. గూగులమ్మ సహాయంతో సర్క్యూట్ హౌజ్ చేరుకొని,
మనీష కుమార్ ను కలిసి, మరోమారు స్నానం చేసి, తడిబట్టలతో, అక్కడే మాకోసం వేచి వున్న పండిట్ కన్హయ్యన్ రావుతో కలిసి,
పిండ ప్రదానం చేసే ‘విష్ణుపథ్’ ప్రదేశానికి చేరుకున్నాం.
విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పబడే పవిత్ర ఫల్గు నది ఒడ్డు,
పిండ ప్రదానం నిర్వహించే స్థలాలో, అతి ముఖ్యమైనదని అనాదిగా వస్తున్న నమ్మకం. ఫల్గు
నదిలో వర్షాకాలంలో మాత్రమే నీరు నిండుగా వుంటుంది. ఇతర సమయంలో నదీ గర్భం బాహ్యంగా
పొడిగా ఉంటుంది. సీతాదేవి ఈ నదిని శపించిందని అంటారు. నది మెట్లెక్కి పైకొస్తే విష్ణుపాదం
ఆలయం, దానికి ఎదురుగా సీతా కుండ్ అని, సీతాదేవి తన
మామగారికి పిండ దానము చేసిన ఒక చిన్న ఆలయం వున్నాయి. ఇంకా, అక్కడే ఒక భారీ వట వృక్షం (మర్రి వృక్షం), మరి
కొన్ని ప్రదేశాలున్నాయి. అక్షయ వత్, విష్ణు పాదం ఆలయానికి సమీపంలో ఉంది. అలాగే మంగళగౌరి
దేవాలయం కూడా వున్నాయి.
పిండ ప్రదానం చేసేవారిని ఫల్గు నదిలో స్నానం చేయమంటారు
బ్రాహ్మణులు. కాని, వయసు రీత్యా, కాళ్లు
అంతగా సహకరించలేని కారణాన, మేము మాత్రం, ప్రత్యామ్నాయంగా, నదిలోని పవిత్ర జలాలను బ్రాహ్మణుడి ద్వారా తెప్పించుకుని శిరస్సు మీద, శరీరం మీద చిలకరించుకున్నాం. బ్రాహ్మణులు, నది నుండి సుమారు 40 మెట్ల
పైభాగాన, అందుబాటులో ఉన్న 48 వేదికలలో, ఏదైనా ఒక వేదికపై కార్యక్రమాన్ని
నిర్వహిస్తారు. బ్రాహ్మణుడు దొరకడం కొంచెం ఇబ్బందికరమే అని తెలిసినందున, మేము ఆ ఏర్పాట్లు ముందే చేసుకున్నాం. పిండ ప్రదానం కార్యక్రమం, హిందూ ధర్మ
శాస్త్రం ప్రకారం, మరణించిన ఆత్మలకు శాంతిని కలిగించడానికి
అనాదిగా వస్తున్న ఏకైక వైదిక మతపరమైన ఆధ్యాత్మిక ప్రక్రియ.
మాకు కేటాయించిన బ్రాహ్మణ పండిట్,
కన్హయ్యన్ రావు పూర్వీకులు అంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతానికి
చెందినవారు. గత నాలుగైదు తరాలుగా గయలో స్థిరపడ్డారు. పిండ ప్రదానం కార్యక్రమం
చేసేవారు ఏ ప్రాంతానికి చెందినవారో, ఆప్రాంతం నేపధ్యం వున్న
బ్రాహ్మణుడే కార్యక్రమం నిర్వహించే ఆనవాయితీ వున్నదక్కడ. ఇతరులు జోక్యం చేసుకుంటే
మధ్యలో ఇబ్బందులు తలెత్తిన సందర్భాలున్నాయట. కార్యక్రమానికి పూర్వరంగంలో తెలంగాణకు
చెందిన పండిట్ ఒకరు, ఒక పుస్తకం తీసుకుని మాదగ్గరికి వచ్చి
మా పేర్లన్నీ నమోదు చేసుకున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే,
భవిష్యత్తులో మా వంశీకులు ఎవరైనా వస్తే, వారి పూర్వీకులమైన మా వివరాలు
తెలియచేయడానికని సమాధానం ఇచ్చాడు.
మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం ఆరంభానికి ముందు, ఒకటి
రెండు చుక్కలు తేనె కలిపిన అన్నం ఇచ్చి, చిన్న-చిన్న బంతుల ఆకారంలో 64 పిండాలను
చేయించారు. పిండ ప్రదానం చేస్తున్నవారి మరణించిన తల్లి-తండ్రులతో ఆరంభించి, గోత్రనామాలతో, చేసేవారి పై మూడు తరాలవారికి
తర్పణాలు ఇప్పిస్తాడు బ్రాహ్మణుడు. పిండ ప్రదానం చేస్తున్నవారికి సంబంధించి,
మరణించిన దగ్గరి, దూరపు బందువులకు,
స్నేహితులకు కూడా అలానే చేయిస్తారు. జంతువులకు, పశు పక్ష్యాదులకు కూడా చేయించాడు
బ్రాహ్మణుడు. గంటన్నర
పైగా జరిగిన కార్యక్రమం పూర్తయిన తరువాత ఫల్గు నదిలో పిండాలను వదిలిపెట్టాలి. కాళ్లు
సహకరించక పోయినా, వెంట ఉన్నవారి సహాయంతో మెట్లుదిగి, నదిలోకి వెళ్లి పిండాలను వదిలాం. తరువాత, విష్ణుపాదం, మంగళ గౌరి, అక్షయ
వత్ కు వెళ్లి శాస్త్రోక్తంగా ఆచరించాల్సిన విధులను నిర్వహించి, శక్తి మేరకు బ్రాహ్మణుడికి పారితోషికం ఇచ్చి, గెస్ట్
హౌజ్ కు వెళ్లాం.
గెస్ట్ హౌజ్ లో మరోమారు స్నానం చేసి,
భోజనాదులు ముగించుకుని, సుమారు నాలుగు గంటల ప్రాంతంలో బయల్దేరి, మధ్యలో ఒకటి-రెండు సార్లు టీ తాగడానికి ఆగి, రాత్రి
తొమ్మిదిన్నర గంటల కల్లా వారణాశి గెస్ట్ హౌజ్ కు చేరుకున్నాం. మేము వెళ్లే
సమయానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అదే గెస్ట్ హౌజ్ లో బస
చేస్తున్నప్పటికీ, మాకు కించిత్తు అసౌకర్యం కలగకుండా,
సెక్యూరిటీ సిబ్బంది ఏరకమైన ఇబ్బంది కలగనీయకుండా, కార్లతోసహా లోపలికి
వెళ్ళనిచ్చారు. స్నానపానాదులు ముగించుకుని, గెస్ట్ హౌజ్ వారు
ఏర్పాటు చేసిన ఆహారం తీసుకుని, ఆ రాత్రికి విశ్రమించాం.
(ఇంకా వుంది)
well explained Sir
ReplyDelete