కేసీఆర్ సంపద సృష్టితోనే కాంగ్రెస్‌కు ఈ ధైర్యం!
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (28-11-2023)
(ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని గ్యారంటీలు
ఇచ్చినా, ఆ ధైర్యం కలగడానికి ఏకైక కారణం కేసీఆర్ తెలంగాణను
సంపన్న రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా చేయడమే. అన్ని రకాల సహజ
వనరులను సక్రమంగా ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యమే ఇంతటి సంపద
సృష్టికి కారణం)
ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు,
తెలంగాణాలో సంపద పెరిగిన అంశాన్ని చాలా చక్కగా వివరించారు. సంపద
దానంతట అదే పెరుగుతుందన్న ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ వాదనతో
ఏకీభవించకుండా, పెరగడానికి ప్రధాన కారణం, రాష్ట్రంలో కేసీఆర్ సారర్థ్యంలోని ‘ఎనేబ్లింగ్ గవర్నెన్స్’ అని స్పష్టం
చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వున్న రాష్ట్రం తెలంగాణ అని, దానికి కారణం కేవలం హైదరాబాద్ నగరం అంటే తాను అంగీకరించనని, అలా అయినట్లయితే హైదరాబాద్ కన్నా పెద్దవైన ముంబై, చెన్నై,
ఢిల్లీ నగరాలున్న రాష్ట్రాల తలసరి ఆదాయం కూడా అధికంగానే ఉండాలని
అన్నారు కేటీఆర్.
తమ పాలనకు క్రెడిట్ ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకుండా,
హైదరాబాద్ కారణాన తలసరి ఆదాయం పెరిగిందని అనడం సరికాదని,
ఒకప్పుడు కూడా హైదరాబాద్ వుందని, కాని అప్పుడు భారతదేశంలో
టాప్ కాదని, ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా తలసరి ఆదాయం
కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, లక్షా పద్నాలుగు వేల తలసరి ఆదాయం నుంచి మూడు లక్షల
పదిహేడు వేల రూపాయలకు పెరిగిందని, ‘ఎనేబ్లింగ్ గవర్నెన్స్’
లేకపోతే, సంపద సృష్టించబడకపోతే, వివిధ రంగాలలో పెట్టుబడులు రాకపోతే, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు కేటీఆర్.
పాత విషయాన్ని గుర్తు చేస్తూ, 2009లో ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండే వాగ్దానాలు చేసిందని,
అలా ఎందుకని అడిగితే మిగతా వాటిని చేయడానికి ఆర్థిక పరిమితి
ఒప్పుకోదు అని నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్నారని చెప్పారు. ఈ రోజు
కాంగ్రెస్ ‘ఆరు గ్యారంటీ’ల లాంటి వాగ్దానాలు చేయగలుగుతుందంటే, తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరపతిని గణనీయంగా
పెంచడమే కారణం అని కేటీఆర్ అన్నారు. అంటే గుండె లోతుల్లో, కేసీఆర్
సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ‘బంగారు తెలంగాణ’గా రూపుదిద్దుకున్నదని కాంగ్రెస్
పార్టీ అంగీకరించినట్లే.
ఇక వాగ్దానాల విషయానికొస్తే, బీఆర్ఎస్ పార్టీ తన
ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా చేసినవి: ‘కేసీఆర్ బీమా’ పేరుతో రేషన్ కార్డ్
వున్న 93 లక్షలమందికి లబ్ధి చేకూరేలా రూ.5లక్షల జీవిత బీమా సౌకర్యం; రేషన్ కార్డు వున్న ప్రతి వ్యక్తికీ లబ్ధి చేకూరేలా ‘తెలంగాణ అన్నపూర్ణ
పథకం’ పేరుతో సన్న బియ్యం సరఫరా; ఏటేటా దశలవారీగా పెరిగే
విధంగా ‘రైతు బంధు’ మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంపు; అదే విధంగా ‘ఆసరా పెన్షన్ల’ మొత్తాన్ని రూ.2,016 నుంచి రూ.5,016కు పెంపు;
దివ్యాంగుల పెన్షన్ రూ.4,016 నుంచి రూ.6,016కు పెంపు; రూ.400ల సబ్సిడీ ధరకు గ్యాస్ సిలిండర్ సరఫరా; ‘సౌభాగ్య
లక్ష్మి పథకం’ కింద నెలకు రూ.3వేల చెల్లింపు; ‘కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం’ కింద ఆరోగ్యశ్రీ
హెల్త్ కేర్ కవరేజ్‌ను రూ.10లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంపు... వంటివి ఉన్నాయి.
రాష్ట్ర ఖజానా మీద పడే భారాన్ని దృష్టిలో పెట్టుకుని, పెంచిన
మొత్తాలను ఒకేసారి చెల్లిస్తామని చెప్పకుండా, దశలవారీగా,
ఏటేటా పెంచుకుంటూ పోతామనడం కేసీఆర్ వాస్తవిక దృక్పథానికి నిదర్శనం.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ఆదరాబాదరగా
సరైన ఆలోచన చేయకుండా ‘ఆరు గారంటీలు’ అనే ఫాన్సీ పేరు తగిలించి మేనిఫెస్టో
విడుదలకన్నా చాలా ముందే కొన్ని వాగ్దానాలు చేసింది. ‘మహాలక్ష్మి పథకం’
పేరుతో మహిళలకు నెలకు ఉచిత ప్రయాణం కింద రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా; ‘రైతు భరోసా
పథకం’ కింద రైతులకు, కౌలుదార్లకు
రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు, వరి
పంటకు బోనస్ కింద రూ.500; ‘ఇందిరమ్మ గృహ పథకం’ కింద ఇళ్లులేని పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం,
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారందరికీ 250 చదరపు గజాల స్థలం; ‘యువ వికాసం పథకం’ కింద రూ.5లక్షల విలువ చేసే
విద్యా భరోసా కార్డు; ‘గృహ జ్యోతి పథకం’ కింద పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్; ‘చేయూత
పథకం’ కింద పెద్దలకు రూ.4వేల నెలవారీ పెన్షన్, రూ.10లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఉన్నాయి. వీటికి అదనంగా మేనిఫెస్టోలో
మరికొన్ని వాగ్దానాలున్నాయి.
ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆర్థిక శాఖ రంగ నిపుణులను వీటి
గురించి సంప్రదించినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ‘ఆరు
గారంటీల’కు, మేనిఫెస్టోలో చేసిన చేసిన మరికొన్ని ఆర్థికపరమైన
వాగ్దానాలకు, సుమారు రూ.2.15లక్షల కోట్లు అదనంగా
అవసరమవుతుందని ఖచ్చితంగా చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుసుకోవాల్సిన ఒక కఠోర వాస్తవం –
కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల ‘పాక్షిక అమలుకు’
మాత్రమే, ఎక్సైజ్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, మోటారు వాహనాల పన్నుల లాంటివి గణనీయంగా పెంచి సామాన్యుడి మీద భారం మోపారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ విజయం సాధిస్తే, ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలోనూ రానున్నదనేది విడమర్చి చెప్పకనే చెప్పాల్సిన
దీనర్థం. మరోరకంగా చెప్పాలంటే ‘బంగారు తెలంగాణ’ అనే ‘బంగారు బాతును’ ఒకేసారి పొందాలనే బంగారు గుడ్లకోసం, స్వార్థం కోసం, చంపిన చందాన వున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చోటుచేసుకున్న తెలంగాణ సమగ్ర, సమ్మిళిత
అభివృద్ధి ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారు. ఒక రాష్ట్రాభివృద్ధిని,
సంపద సృష్టిని, సమగ్రంగా విశ్లేషించడానికి
శాస్త్రీయమైన గీటురాళ్ళు– రాష్ట్ర రెవెన్యూ రాబడి, జీఎస్డీపీ
వృద్ధిరేటు, తలసరి ఆదాయం పెరుగుదల, తలసరి
విద్యుత్ వినియోగం పెరుగుదల తదితర అంశాలు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఈ అంశాల్లో
అట్టడుగు స్థానంలో వున్న తెలంగాణ నేడు అగ్రగామిగా, దేశంలోనే
వీటిల్లో మొదటి స్థానానికి చేరుకుంది.
మొత్తం రెవెన్యూ రాబడి 2014–15 నాటి రూ.51,042
కోట్లను గణనీయంగా అధిగమించి, మూడింతలు పైగా పెరిగి, 2022–23 నాటికి రూ.1,59,350
కోట్లకు చేరుకుంది. కేవలం రాష్ట్ర స్వంత రెవెన్యూ రాబడి 2014-15 నాటి రు 35,735 కోట్లకన్నా మూడున్నర రెట్లు పెరిగి 2022-2023 నాటికి రు 1,26,503 కోట్లకు చేరుకుంది. 2014లో
రూ.5.05లక్షల కోట్లున్న జీఎస్డీపీ రెండున్నర రెట్లకు పైగా పెరిగి 2023లో
రూ.13.27లక్షల కోట్లకు చేరుకుంది. 2014లో తలసరి ఆదాయం రూ.1,24,104 కాగా, ప్రస్తుతం రూ.3,17,115కు చేరుకుంది. ఇదే కాలంలో జాతీయ తలసరి ఆదాయం కేవలం రు 1,72,276 మాత్రమే.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సహా, అన్ని
రంగాలకు, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడం వల్ల, తలసరి సగటు విద్యుత్ వినియోగం, 2126 యూనిట్లకు
చేరుకుంది. ఇది జాతీయ తలసరి సగటు విద్యుత్ వినియోగం 1,255 యూనిట్ల
కంటే 70% అధికం. అలాగే స్థాపిత విద్యుత్ సామర్థ్యం 18756 మెగావాట్లకు చేరుకొని, త్వరలో 27,000 యూనిట్లకు చేరుకోనున్నది. గరిష్ట వినియోగం 15497 యూనిట్లగా
నమోదైంది. వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరా కోసం 2014-15 నుండి ఇప్పటి దాకా రు 39,200 కోట్లు సబ్సిడీగా
వ్యయం చేయడం జరిగింది. ఇవన్నీ సంపద సృష్టికి గీటురాళ్ళు.
ఇన్ఫర్మేషన్ టెక్నోలజి, పారిశ్రామిక రంగాలలో సాధించిన
అద్భుతమైన ప్రగతి సహితం, సంపద సృష్టికి సంకేతాలే. 2014–15లో
తెలంగాణ ప్రాంతంలో కేవలం 174 పారిశ్రామిక యూనిట్లు రూ.1806 కోట్ల పెట్టుబడితో 5051
మందికి మాత్రమే ఉపాధి కలిగించే పరిస్థితిలో వుండగా, 2022–23
నాటికి గణనీయమైన వృద్ధి సాధించి, రూ.2,60,121 కోట్ల
పెట్టుబడులతో, 22,776 పరిశ్రమల స్థాపనకు ఎదిగి, 17,55,319 మందికి ఉపాధి కలగచేయడం జరిగింది. 2013-14 లో రు 57,258 కోట్ల ఎగుమతులున్న ఐటీ రంగంలో 3,23,396 మందికి
మాత్రమే ఉద్యోగాలుండేవి. 2022-23 నాటికి ఎగుమతులు రు 2,41,275
కోట్లకు చేరుకొని, 9,05,715 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
పాలు, చేపలు, రొయ్యలు,
వరి, పత్తి, మొక్కజొన్న,
ఎర్ర పప్పు, బెంగాల్ పప్పు, వేరుశనగలు, సోయాబీన్ లాంటి ఉత్పత్తి గణనీయంగా
పెరిగింది. తదనుగుణంగా సంపద కూడా పెరిగింది. నీటి పారుదల రంగానికి గత తొమ్మిదిన్నర
సంవత్సరాలలో బడ్జెట్‌లో రూ.1.70లక్షల కోట్ల సింహభాగం కేటాయించి, వ్యయం చేయడంవల్ల, 2014–15 నాడు సాగులో వున్న 131
లక్షల ఎకరాల భూమి, 2023 కల్లా 268 లక్షల ఎకరాలకు చేరుకుంది.
రిజర్వాయర్ల సంఖ్య 41 నుంచి 157కు పెరిగింది. ఈ కారణాన 2015–16లో 45.71 లక్షల
మెట్రిక్ టన్నుల వరిపంట పండగా, 2023 నాటికి 350 లక్షల
మెట్రిక్ టన్నులకు చేరుకుంది. భారత ఆహార సంస్థకు అధిక మొత్తంలో ధాన్యం సరఫరా చేసే
రెండవ రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కింది. ఇదంతా సంపద సృష్టిలో
భాగమే.
ఆసరా పెన్షన్ల ద్వారా 2022-23 లో రు 10,360 వ్యయం చేసి 43.85 మందికి లబ్ది చేకూర్చడం జరిగింది.
సెప్టెంబర్ 2023 నాటికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లకు కలిపి రు 11,880 ఆర్ధిక సహాయం
చేయడం ద్వారా 13,46,676 మందికి లబ్ది చేకూరింది. 2022-23
వానాకాలం పంట వరకు రైతు బందు పధకం కింద 68,99,076 మంది రైతులకు రు 73,165 కోట్ల ఆర్ధిక సహాయం చేసింది
ప్రభుత్వం. ఇవన్నీ తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టికి నిదర్శనం. బహువిధాల పేదరికం 2014 నాటి 13.18% నుండి, 2023 కల్లా 5.8%
నికి తగ్గడానికి గీటురాళ్ళు.
అందుకే
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా, ఆ ధైర్యం
కలగడానికి ఏకైక కారణం కేసీఆర్ తెలంగాణను సంపన్న రాష్ట్రంగా, బంగారు
తెలంగాణగా చేయడమే. అన్ని రకాల సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి
కేసీఆర్ సారథ్యమే ఇంతటి సంపద సృష్టికి కారణం. ఇంత అభివృద్ధి జరిగిన నేపథ్యంలో
సహితం, కేసీఆర్ ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభలలో మాట్లాడుతూ,
రాష్ట్రాన్ని మరింత సుసంపన్నం చేసి, దేశంలో
ఎప్పటికీ తెలంగాణను అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిపి, బంగారు
తెలంగాణను స్థిరీకరించడమే తన ధ్యేయం అని, అందుకే ఎన్నికలలో
పోటీ చేస్తున్నామని నమ్రతతో చెప్పడం విశేషం.
Changing TRS as BRS is a big mistake by KCR thereby losing identity. But, yes. KCR and KTR are capable leaders. Telangana developed in the past ten years.
ReplyDeleteAs KCR did not maintain good relations with centre / Modi, Telangana suffered.
Again now, Telangana under congress rule may not get support from BJP at centre. Unfortunate indeed.
అదే లాజిక్ తో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన “సంపద సృష్టితోనే” మరింత అభివృద్ధి కోసం ప్రయత్నించడానికి TRS కు ఆ ధైర్యం వచ్చింది.
ReplyDeleteపైగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గార్లు పరిపాలన చేసింది బహు విస్తారమైన ఉమ్మడి రాష్ట్రం.