పాశ్చాత్య దేశాలకు పాకిన వేదంలోని భారత వైద్య విధానం
అప్రాకృత
కృత్రిమ సంతానం, శస్త్ర చికిత్స, అవయవాలు అతికించడం వేదకాలం నాటిదే
ఋగ్యజుస్సామాథర్వ
వేదాల సారం-13
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(26-02-2024)
‘బ్రహ్మయే
బ్రహ్మను పుష్కర క్షేత్రంలో ప్రతిష్టించాడు. అలా ప్రభవించిన బ్రహ్మ చింతించాడు.
సమస్త వాంఛలను, సమస్త లోకాలను, సమస్త దేవతలను, సమస్త వేదాలను, సమస్త యజ్ఞాలను, సమస్త శబ్దాలను, సమస్త వర్షాలను, స్థావర జంగమాత్మక సమస్త భూతాలను, ఒకే అక్షరంలో
అనుభవించడం ఎలా? అనుకుని అతడు బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు. “ఓమ్”
అనే అక్షరాన్ని దర్శించాడు. అది మూడు వర్ణాలది. నాలుగు మాత్రలది. సర్వ వ్యాపి
(గోపథ బ్రహ్మణం). ప్రణవంలోని మొదటి మూడు మంత్రాలతో ఋగ్యజుస్సామ వేదాలను
ప్రతిపాదించి చివరకు అన్నాడు. ప్రణవపు నాల్గవ మాత్రమకారం నుంచి జలాన్ని, చంద్రుడిని, అథర్వ వేదాన్ని,
స్వయాన్ని దర్శించాడు. ప్రణవపు చివరి మాత్ర అథర్వ వేదం అయినందున వేదాలలో అథర్వ
వేదం నాలుగవది అయింది’.
‘పూర్వం స్వయంభువ బ్రహ్మ సృష్టి
చేయాలనుకున్నాడు. తపస్సు ప్రారంభించాడు. తపస్సు వల్ల బ్రహ్మ రోమకూపాలన్నింటి నుంచి
స్వేదం ప్రవహించింది. ఆ స్వేద జలంలో బ్రహ్మ తన నీడ చూశాడు. అప్పుడు అతడి వీర్య
స్ఖలనం జరిగింది. జలంలో వీర్యం పడింది. స్వేదజల సహిత వీర్యం రెండు భాగాలు అయింది.
ఒక భాగపు వీర్యం పక్వం అయింది. అది “భృగు” మహర్షి రూపం దాల్చింది.
అప్పుడు బ్రహ్మ అంతర్థానం అయ్యాడు. భృగువుకు కనిపించలేదు. ఆ ఋషి బ్రహ్మను
దర్శించాలనుకున్నాడు. వ్యాకుల పడ్డాడు. బాధపడ్డాడు. భృగువు బాధను ఆకాశం భరించలేక
పోయింది. ఆకాశవాణి పలికింది. “అథార్వాగ్ ఏనమ్ ఏతాస్వేవాస్వ్యన్విచ్చ”,
అంటే, “నువ్వు చూడాలనుకుంటున్న వానిని జలమధ్యంలో అన్వేషించు” అని చెప్పింది.
ఆకాశవాణి భృగువును “అథర్వాక్” అని పిలిచింది. అందువలన భృగువు,
అథర్వుడు కూడా అయ్యాడు. తరువాత మిగిలిన రేతస్సు, జలం
పక్వమయ్యాయి. బ్రహ్మ నోటి నుండి వరుణ శబ్దం వెలువడింది. అతడి అవయవాల నుండి రసం
ప్రవహించింది. అందులోంచి “అంగిరస” మహర్షి ఆవిర్భవించాడు. అంగములలోని
రసం నుండి పుట్టాడు. అందువల్ల “అంగీరసుడు” అయ్యాడు’.
‘ఆ విధంగా బ్రహ్మ నుంచి అయోనిజులుగా భృగు,
అంగీరస మహర్షులు ఆవిర్భవించారు. పాశ్చాత్యులు భావిస్తున్నట్లు అయోనిజ జననాలు
పుక్కిటి పురాణాలు కావు. సనాతన, పురాతన, మహోన్నత భారత
సంస్కృతి, నాగరికత, తాత్త్వికతలను అర్థం చేసుకోలేని కుహనా
మేధావులు వారు. కృత్రిమ సంతానం ఆధునిక సైన్స్ కనుగొన్నదనడం శుద్ధ పొరపాటు. భారత
ఇతిహాసంలో ఏనాటి నుంచో అప్రాకృత కృత్రిమ సంతానం గురించి వివరంగా ఉన్నది.
కుమారస్వామి, ద్రోణుడు, ద్రోణి, కౌరవులు వీరంతా కృత్రిమ సంతానమే! అలాగే శస్త్ర చికిత్స (సర్జరీ) భారత
వైద్యంలో అనాదిగా ఉన్నది. అశ్వినులు భోజరాజు మెదడు ఆపరేషన్ చేసి చికిత్స చేసినట్లు
ఉన్నది. అవయవాలు అతికించడం ఘనంగా చెప్పుకుంటుంది అలోపతి వైద్యం. దక్షుడికి మేక తల, వినాయకుడికి ఏనుగు తల శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా అమర్చిన మహా
చరిత్ర ఆయుర్వేదానిది! యువనాశ్వుడు పురుషుడు. స్త్రీ సంపర్కం లేకుండా అతడికి గర్భం
కలిగించి మాంధాతను పుట్టించింది భారత వైద్య శాస్త్రం. భృగు, అంగీరసుల జన్మకు ఏదో
శాస్త్రాధారం ఉండి తీరాలి’.
‘భారత వైద్య విధానం ఇవ్వాళ పాశ్చాత్య
దేశాలకు పాకింది అంటే దాని బలం గుర్తించాలి. భారత ప్రజగా గర్వించాలి. బ్రహ్మ అథర్వ,
అంగిరసులను తపస్సు చేయమన్నాడు. వారు తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తున్నప్పుడు
బ్రహ్మ వారికి ఒక వేదాన్ని దర్శింప చేశాడు. దాన్ని “అథర్వ అంగిరో వేదం”
అన్నారు. అథర్వ, అంగిరసులు దర్శించి నందున దానికి ఆ పేరు
వచ్చింది. అథర్వ వేదానికి గల ఇతర నామాలలో “అధర్వాంగిరం” ఒకటి. అథర్వ, అంగిరసుల తపః ప్రభావంతో వారు ఎకర్చ, ద్విర్చాది
ఇరవై మంత్ర దళాలను దర్శించారు. అందువల్ల అథర్వ వేదంలో ఇరవై కాండలున్నాయి. ఈ వేదం
తపస్సు నుంచి ఆవిర్భవించింది. బ్రహ్మ జ్ఞానుల హృదయం నుంచి సంభవించింది. కాబట్టి
శ్రేష్టం. భృంగి రంగిరోవేదమే బ్రహ్మ వేదం అవుతున్నది. అంగిరస మనేది రసం.
అథర్వమనేది వైద్యం. వైద్యమే అమృతం అవుతున్నది. అమృతమే బ్రహ్మ. అథర్వ వేదానికి
బ్రహ్మ వేదమని కూడా పేరు. అథర్వ వేదంలో చికిత్స చెప్పబడింది. అందువల్ల అది భేషజ
వేదం అన్నారు. రస ప్రధానమైనందువల్ల రస వేదం అవుతున్నది. అథర్వ మంత్రాలు లభించిన
వారికి తిథి, నక్షత్ర, గ్రహ, చంద్రులతో సంబంధం లేకుండా సర్వసిద్ది కలుగుతుంది. అన్నీ లభిస్తాయి. అథర్వ
వేద మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి. అప్పుడే ఆ మంత్రాల ఫలితం లభిస్తుంది’.
‘సాయణాచార్యుడు పూర్వ, ఉత్తర
మీమాంసలను సంగ్రహంగా వ్యాఖ్యానించి, వేదాలకు అర్థం
చెప్పడానికి ఉద్యమించాడు. ఆముష్మిక ఫలాలను ప్రసాదించే నాలుగవ వేదాన్ని
వ్యాఖ్యానించాడు. అథర్వ వేదం వ్యాఖ్యానించే ముందర చెప్పిన శ్లోకాలలో హరిహరుడు తనను
అథర్వ వేదం వ్యాఖ్యానించమని కోరడాన్ని చెప్పాడు. సాయణాచార్యుడు ఒక్కడే చతుర్వేద
వ్యాఖ్యాత. అతడి వ్యాఖ్యానం లేని వేదం అర్థం కాదు. విజయనగర సామ్రాజ్య రాజుల పోషణలో
సాయణాచార్యుడు వేదాలకు భాష్యం రాశాడు. ప్రాక్, పాశ్చాత్య
విద్వాంసులందరూ సాయణాచార్యుడి భాష్యంతోనే వేదాన్ని అర్థం చేసుకున్నారు.
సాయణాచార్యుడు వివరించిన ప్రతిదానికీ పూర్వ ప్రమాణాలు చూపించాడు.
సాయణాచార్యుడు,
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం “ఆముష్మిక ఫల ప్రదములు”
అన్నాడు. ఆముష్మికం అంటే పరలోక సంబంధం. వేదంలో పరలోకం అంటే స్వర్గం మాత్రమే! దుఃఖం
లేని చోటు అన్నది యజుర్వేదం. వేదంలోని స్వర్గం పురాణాలలోని స్వర్గం లాంటిది కాదు.
అక్కడ రంభ, ఊర్వశి, మేనక వారి పొందులు
ఉండవు. ఇంద్రుడు నిరంతరం తపస్సులు చెడగొట్టడు. ప్రతిసారీ రాక్షసులు స్వర్గం మీదకు
దండెత్తరు. పురాణ స్వర్గంలో ఎవరూ ఎప్పటికీ ఉండరు. సంపాదించుకున్న పుణ్యం
క్షీణించగానే మానవ లోకంలోకి ప్రవేశిస్తారు. మన సనాతనులు ప్రతిదానికీ ఆధ్యాత్మిక
ముద్ర వేశారు. ఆధ్యాత్మికం, ఆముష్మికం మనసుకు సంబంధించింది
అనుకోవచ్చు. దేహానికి సంబంధించింది ఐహికం. ఆ దృష్టితో అథర్వ వేదంలో వైద్యం, వాస్తు లాంటి దేహ సౌఖ్యాలతో పాటు మానసిక విషయాలు చాలా ఉన్నాయి’.
‘అథర్వ వేదానికి బ్రహ్మ
వేదం, భిషగ్వేదం, క్షత్రవేదం అనే పేర్లున్నాయి. అంగిరో వేదం,
అథర్వ వేదం, అథర్వాంగిరో వేదాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. ఋగ్వేదంలో హోతను, యజుర్వేదంలో అధ్వర్యును, సామవేదంలో ఉద్గాతను, అథర్వాంగిరో వేదంలో బ్రహ్మను ఏర్పరుచుకోవాలి. అథర్వ యజ్ఞాన్ని బ్రహ్మ అనే
పురోహితుడు నిర్వహిస్తాడు. అందువల్ల అది బ్రహ్మ వేదం అయింది. ఋగ్వేదం ప్రకారం కర్మ
చేసిన వారి పితరులకు పాలనదులు ప్రవహిస్తాయి. యజస్సుల మంత్రాలకు పితరులకు ఘృత నదులు
ప్రవహిస్తాయి. సామవేద కర్మల పితరులకు సోమ నదులు ప్రవహిస్తాయి. అథర్వాంగిరో వేదకర్మ
చేసినవారి పితరులకు మధు నదులు ప్రవహిస్తాయి. బ్రహ్మ వేదంతో కూడని యజ్ఞం భ్రష్టం
అవుతుంది’.
‘భేషజమే బ్రహ్మ అంటారు. అథర్వణ౦ వైద్యం,
చికిత్స అనీ, వైద్యమే అమృతం అనీ,
అమృతమే బ్రహ్మ అనీ, ఆరోగ్యమే బ్రహ్మ! అనీ అంటారు. ఉపవేదాలు నాలుగున్నాయి. అవి
వరుసగా: ఆయుర్వేదం, గంధర్వ వేదం,
ధనుర్వేదం, అర్థ వేదం. ఈ నాలుగు ఉపవేదాలకు అథర్వ వేదం
యోనిప్రాయంగా కనిపిస్తుంది. వేదం శాస్త్రానికి మూలం అవుతుంది. ఆధారం అవుతుంది.
శాస్త్రం మాత్రమే కాదు, వేదం పురుషుడే సర్వం అవుతున్నాడు.
జరిగినది, జరగనున్నది సర్వం వేదమే! అథర్వ వేదంలో అనేక
చికిత్సలు ఉన్నాయి. ఇవి రెండు రకాలు. ఒకటి మూలికా చికిత్స,
రెండవది అభిచారం. మూలికా చికిత్స దేహానికి సంబంధించినది. వ్యాధి ఉపశమనానికి, నివారణకు, నిర్మూలించడానికీ ఉపయోగపడుతుంది.
అభిచారాదులు మనిషిగా, మానసికంగా సంతృప్తి పరచడానికి
ఉపకరిస్తాయి. ఇవి కాస్త మోటుగా, క్రూరంగా కూడా ఉంటాయి’.
‘ఈ వేదంలో
వీటికి బహుళ ప్రయోజనాలు కనిపిస్తాయి. యుద్ధాల్లో కూడా శత్రువును బలహీనపరిచే
ప్రయోగాలున్నాయి. వైద్యంలోనూ, అభిచారంలోనూ బహు విధానాలు చెప్పడం
జరిగింది. ఈ వేదంలో తొలి సూక్తమే “మేదాజన సూక్తం”. ఇది ధారణ శక్తి
కోసం చెప్పిన సూక్తం. జ్ఞాపకం పెంచడానికీ, నేర్పిన దాన్ని
మరవకుండడానికి చెప్పిన సూక్తం. వాత, పిత్త, కఫాదులు, శ్వాసకాస, గుండె జబ్బు,
కుష్టు, గండమాల, మూత్ర కృచ్చ్రం, ఉన్మాదం, యక్ష్మ, రాజయక్ష్మ మొదలైన ఎన్నో వ్యాధుల చికిత్స ఈ
వేదంలో వివరించడం జరిగింది.
కాకపోతే
అందులో చెప్పిన మూలికల ప్రస్తుతపు పేర్లు, అవి అందుబాటులో ఉన్నదీ-లేనిదీ తెలియదు.
క్రిములు, వాటివల్ల కలిగే రోగాలు, చికిత్స కూడా చెప్పబడింది.
“కంటికి కనిపించే, కనిపించని క్రిములను
నాశనం చేస్తున్నాను. రక్తమాంసాలను దూషితం చేసే అల్లమడు,
శల్గనామక క్రిములను నాశనం చేస్తున్నాను. ప్రాణ, అపానములారా!
ఈ దేహంలోనే ఉండండి. తొందర పడి విడిచి పోకండి. ఇతని అవయవాల పటుత్వం వార్ధక్యం దాకా
ఉంచండి” అని మంత్రం ఉంది.
‘అథర్వ వేదంలో అనేక రాజకీయ
విషయాలున్నాయి. రాజ్యం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ వివరంగా దర్శనం
ఇస్తుంది. సమితి, సభ, విశః, రాష్ట్రం, రాజ్యం మొదలైన వివరాలున్నాయి.
గ్రామాధికారులు, గ్రామ పాలన ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు
రాజును ఎలా ఎన్నుకోవడం, సమితిలో ప్రసంగాలు, ప్రవచనాలూ ఉన్నాయి. సేనలు, యుద్ధాలు కనిపిస్తాయి.
అథర్వ వేదం అనేక విషయాలను వివరిస్తుంది. అథర్వ వేదం అధ్యయనం విశ్వాసంతోనూ, శ్రద్ధ తోనూ, చేయాలి’.
(స్వర్గీయ
డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)
(ఇంతటితో
ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం సమాప్తం)