పంచవటి మనదే!
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక నివేదన కాలమ్ (16-02-2024)
అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని
నరేంద్ర మోదీ శ్రీరామ వనవాస మార్గం గురించి వివరించారు. ఆ వివరాలకు సంస్కృత
రామాయణంలో వాల్మీకి రచించిన దానికీ తేడా ఉంది. అయోధ్య నుంచి ఉత్తరప్రదేశ్‌లోని
ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న భరద్వాజ ఆశ్రమానికి, మధ్యప్రదేశ్‌లోని
చిత్రకూటానికి, మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉన్న పంచవటికి,
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా లేపాక్షికి, కర్ణాటకలోని కిష్కింధకు, తమిళనాడులోని రామేశ్వరానికి,
అక్కడి నుంచి శ్రీలంకకు శ్రీరాముడు పయనించాడనడం సరికాదేమో! ప్రధాని
తన ప్రసంగంలో లేపాక్షి, నాసిక్‌లోని పంచవటుల గురించి
ప్రస్తావించారే కానీ... దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భధ్రాచల రామాలయం
సమీపంలోని పంచవటి గురించి కానీ, అసలు ఆ ఆలయం గురించి కానీ
కనీసం ప్రస్తావించలేదు. ఇది తెలుగువారిని ఒకింత నిరాశకు గురిచేసిందనాలి. అయోధ్య
నుంచి లంక దాకా శ్రీరాముడి ప్రస్థానం, తిరుగు ప్రయాణంలో
అయోధ్యకు వస్తూ సీతకు రాముడు చూపించిన ప్రదేశాలు వావిలికొలను సుబ్బారావు
(వాసుదాసు) గారి ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం’ (మందరం) వ్యాఖ్యానంలో వివరంగా ఉన్నాయి.
అరణ్యాలకు బయలుదేరిన సీతారామలక్ష్మణులు తామసా నదీ తీరం, ఉత్తరకోసల
దేశం, వేదశ్రుతి నది, గోమతీ నది,
దక్షిణ కోసల దేశ సరిహద్దులు దాటి... గంగానదీ తీరంలోని
శృంగబేరిపురాన్ని చేరారు. గుహుడి సాయంతో గంగను దాటి, గంగా
యమున సంగమ స్థలిలోని భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళారు. యమునను దాటి, నీలవన మార్గంలో పయనించి, మందాకినీ సరయూ నది దగ్గరలో
ఉన్న చిత్రకూటం చేరారు. అక్కడ వాల్మీకిని చూశారు. చిత్రకూటంలో లక్ష్మణుడు పర్ణశాల
నిర్మించాడు. భరతుడు చిత్రకూటానికి వచ్చి, వెళ్ళాక, వారు
అత్రి మహాముని ఆశ్రమానికీ, అనంతరం దండకారణ్యంలో ప్రవేశించి,
విరాధుణ్ణి సంహరించి, శరభంగ మహర్షి ఆశ్రమానికీ,
అటు నుంచి సుకీక్ష్ణాశ్రమానికీ, మాండకర్ణి
ఆశ్రమానికీ ప్రయాణించారు. అగస్త్యుణ్ణి ఆయన ఆశ్రమంలో దర్శించుకున్నారు. పంచవటి అనే
నివాస యోగ్యమైన స్థలం రెండు ఆమడల దూరంలో ఉందని అగస్త్యుడు సూచించాడు. అగస్త్యుడు
చెప్పిన మార్గంలో వెళ్తూ, దారిలో ఒక మర్రి చెట్టు మీద ఉన్న
జటాయువును రాముడు కలిశాడు. తరువాత సీతా లక్ష్మణ సమేతుడై పంచవటిని చేరుకున్నాడు.
అక్కడ పర్ణశాల నిర్మించమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు కుటీరాన్ని సిద్ధం
చేశాడు. అవే ఇప్పటికీ భద్రాచలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఎందరో భక్తులను
ఆకర్షిస్తున్న పంచవటి, పర్ణశాలలు. భద్రాచలం సమీపంలో ఉన్నది
పర్ణశాల కాదనీ, అది నాసిక్‌కు దగ్గరగా ఉందనీ చెప్పడం
పూర్తిగా సత్యదూరం.
పంచవటి గోదావరీ తీరంలో ఉందనేది నిర్వివాదాంశం. అక్కడ
గోదావరి ఉత్తరం నుంచి దక్షిణానికి పారుతూ ఉండాలి. ఎందుకంటే సీతాపహరణం తరువాత...
సీతను రావణుడు తీసుకువెళ్ళినది దక్షిణ దిక్కుగానని మృగాలు, పక్షులు
సూచించిన మేరకు... రామలక్ష్మణులు గోదావరీ తీరాన మొదట నైరుతి దిశగా వెళ్ళారు.
తరువాత దక్షిణంగా వెళ్ళారు. గోదావరీ తీరంలో వారు జటాయువును చూశారంటే, గోదావరి నది
జటాయువు పడిన స్థలం వరకూ, దక్షిణాభిముఖంగా పారుతూ ఉండాలి. జటాయువుకు గోదావరీ
జలాలతో నివాపాలు (తిలోదకాలు) విడిచారు.
అక్కడి నుంచి రామ లక్ష్మణులు తూర్పుగా వెళ్ళడానికి ఏరు
అడ్డం వస్తుంది కాబట్టి, నైరుతి దిశగానే మూడు కోసుల దూరం పయనించారు. కొంత తూర్పుగా
వెళ్తే కాని జటాయువు చెప్పిన దక్షిణ మార్గం కనిపించదు కాబట్టే, అక్కడి నుంచి మూడు
కోసులు తూర్పుగా వెళ్ళారనుకోవాలి. అంటే అప్పుడు వారు, ఇప్పటి భద్రాచలం దగ్గర, గోదావరి
నదికి దక్షిణాన ఉన్నారు. అలా వచ్చారు కాబట్టి గోదావరి దాటవలసిన పని లేదు. ఆ
కారణంవల్ల పంచవటి గోదావరి నదికి పడమటి తీరాన ఉందనే విషయం స్పష్టంగా అంగీకరించాలి.
తూర్పున ఉన్నట్టయితే గోదావరి దాటే ఉండాలి. ఇప్పటి పర్ణశాలే యదార్థమయిన పంచవటి
అయినా కావాలి. లేని పక్షంలో ఇప్పుడు అందరూ భావిస్తున్న పర్ణశాలకు ఎదురు ఒడ్డున,
చక్కటి పంచవటి ఉండేదని మాత్రం నిర్ధారణగా చెప్పవచ్చు.
నాసిక్ దగ్గర పంచవటి ఉన్నదనీ, అక్కడి
నుంచి దక్షిణంగా రామలక్ష్మణులు వెళ్ళేరనీ చేసే వాదన రామాయణానికి విరుద్ధం. పంచవటి
గోదావరీ నది పశ్చిమ తీరాన ఉందనడానికి స్థలం ఆధారంగా ఉంది. పర్ణశాలకు ఎదురుగా ఉన్న
గుట్ట దగ్గర రావణాసురుడు తన రథాన్ని నిలిపాడని అంటారు. కారణం... సీతాదేవిని
ఎత్తుకురాగానే రథం సిద్ధంగా ఉండాలి కాబట్టి. నదికి ఒక ఒడ్డున రథం, మరో ఒడ్డున సీత ఉంటే, సీతాపహరణం
సాధ్యమయ్యేది కాదనుకోవాలి. కాబట్టి పడమటి దిక్కున ఉన్న పంచవటి దగ్గర సీతాపహరణం
జరిగి ఉండాలి. అలాగే అక్కడికి సమీపంలోనే ‘సీతగుట్టలు’ అనే పెద్ద పర్వతం ఉంది.
ఖరుడు యుద్ధానికి వచ్చినప్పుడు, రామలక్ష్మణులు అక్కడ ఉన్న కారణంగా ఆ గుట్టలకు ఆ
పేరు వచ్చిందంటారు.
{ పంచవటికి దగ్గరలోనే పద్మ సరస్సు ఉందని ‘వాల్మీకి రామాయణం’
చెబుతోంది. అలాంటి పెద్ద చెరువొకటి ఉండేదని అక్కడ ఉండే కోయలు చెబుతూ ఉంటారు. ఆ
చెరువుకూ,
గోదావరికీ మధ్య పంచవటి ఉంది.}
హంపీ... పంప ఒకటి కాదు...
ఇప్పటి హంపీయే అప్పటి పంప అనీ, అక్కడే
పర్ణశాల ఉన్నదనీ అనడం కూడా సరికాదు. రామలక్ష్మణులు లంకకు వెళ్ళేటప్పుడు ఏ మార్గం
నుంచి వెళ్ళినా, తిరిగి వచ్చేటప్పుడు, విమానంలో తక్కువ
దూరంలో ప్రయాణించే విధంగా, లంక నుంచి సముద్రం దాటాక, రామేశ్వరం నుంచి అయోధ్యకు
వెళ్ళారనేది అందరూ అంగీకరించినదే. అలాంటప్పుడు ఎడమ వైపు కిష్కింధ, కుడివైపున పంచవటి ఉండి ఉండాలి. ఆ మార్గానికీ నాసిక్‌కూ సంబంధమే లేదు.
కాబట్టి పంచవటి, నాసిక్ కానే కాదు. కావడానికి వీల్లేదు.
సీతారామలక్ష్మణులు చిత్రకూటం నుంచి దక్షిణంగా ఋక్షవంతానికి
వచ్చి, పశ్చిమాభిముఖంగా నాసిక్‌ను చేరినట్టయితే, మార్గమధ్యంలో వింధ్య పర్వతాన్ని,
నర్మద, తపతీ నదులను దాటి, విదర్భ మీదుగా
ప్రయాణించవలసి ఉంటుంది. వాటిని వారు దాటినట్టయితే, వాల్మీకి తప్పకుండా రాసేవాడు.
రామలక్ష్మణులు దక్షిణానికి వచ్చి, ఆ తరువాత ఆగ్నేయంగా
కిష్కింధకు వచ్చారనడం రామాయణానికి ప్రత్యక్ష విరుద్ధమని చెప్పాలి. నిజానికి, వారు
నైరుతి మూలగా, నైరుతిగా వెళ్ళి, కంబంధుణ్ణి
చంపి, పడమరగా వెళ్ళి, పంప (తుంగభద్ర)
చేరి, పడమరలో ఉన్న శబరి గుహకు వెళ్ళారు. జటాయువు గుట్ట దగ్గర
నుంచి నైరుతికి వస్తేనే కిష్కింధకు రాగలరు. అలాకాకుండా ఆగ్నేయ మూలగా వెళ్ళి ఉంటే, సముద్రతీరానికి
చేరేవారే తప్ప కిష్కింధకు కాదు. ఆగ్నేయమూలగా వారు ప్రయాణించారని రామాయణంలో ఒక్క
మాటయినా లేదు.
సీతారామలక్ష్మణుల వనవాసం చివర్లో... సీతాపహరణం కోసం రావణుడు, మారీచుడు
కలిసి దండకారణ్యంలోని రామచంద్రుడి ఆశ్రమానికి చేరుకున్నారని ‘వాల్మీకి రామాయణం’లో
ఉంది. పర్ణశాలకు ఉత్తరాన పర్వతాలు, తూర్పున గోదావరి, దక్షిణ, పడమర దిశల్లో అడవి ఉన్నాయి. రాముణ్ణి
మారీచుడు పడమరగానే తీసుకువెళ్ళాడు. రావణుడు వెళ్ళాల్సింది దక్షిణ మార్గాన కాబట్టి,
ఆ దోవలో రాముడు ఉండకూడదని మారీచుడు అలా చేశాడు. సీతను రావణుడు
అపహరించుకుపోతున్నప్పుడు, పర్ణశాలకు మైలు దూరంలోని వృక్షం దగ్గర జటాయువు
ఎదురయింది. రావణుడు, జటాయువు మధ్య యుద్ధం అయిదారు మైళ్ళ
దూరంలోని దుమ్మగూడెం దగ్గరున్న జటాయువు గుట్ట వరకూ సాగింది. రావణుడు సీతను
ఎత్తుకొని, పర్ణశాల నుంచి బయలుదేరి, కిష్కింధ
మీదుగా, పర్వతాలు, తటాకాలు దాటి,
సముద్రాన్ని సమీపించి, లంకకు పోయాడనుకోవాలి.
ఇవన్నీ పర్ణశాల ఎక్కడుందో తెలిపే అంశాలు.
సీతాన్వేషణలో భాగంగా రామలక్ష్మణులు క్రౌంచారణ్యం, మతంగవనం,
పంపానది ఒడ్డున ఉన్న ఋశ్యమూక పర్వతం మీదుగా వెళ్ళారు. అప్పటివరకూ
వారు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. శబరి ఆశ్రమానికి తూర్పు దిక్కులోనే పోవాలి
కాబట్టి, వారు పడమరగా వెళ్ళి, తూర్పుకు తిరగాల్సి ఉంటుంది.
నాసిక్ దగ్గర పంచవటి ఉన్నదనే వారి వాదనకు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఆ తరువాత వారు
కిష్కింధ వెళ్ళారు. రావణుడితో యుద్ధానికి వెళ్ళేదాకా ప్రస్రవణ పర్వతం మీద ఉన్నారు.
కిష్కింధకు ఆగ్నేయంగా ఉన్న లంకకు పోతూ మహేంద్ర పర్వతం ఎక్కారు. రావణ వధ అనంతరం
సీతా సమేతంగా అయోధ్యకు పుష్పక విమానం మీద తిరుగు ప్రయాణం కావడం, వనవాసంలో భాగం. ఆ
తిరుగు ప్రయాణంలో ఈ ప్రదేశాలన్నీ సీతకు రాముడు చూపించడం కొసమెరుపు.
(వాసుదాసు గారి ‘ఆంధ్రవాల్మీకి రామాయణం’
(మందరం) ఆధారంగా)
No comments:
Post a Comment