వేదం సర్వ జనీనం, సర్వ కాలీనం, సనాతనం, పురాతనం, మహత్తమం,
మానవజాతికి
పరమాత్మ ప్రసాదించిన తొలి అక్షర గ్రంథం వేదం
ఋగ్యజుస్సామాథర్వ
వేదాల సారం-12
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(19-02-2024)
‘వేదం
మానవజాతికి పరమాత్మ ప్రసాదించిన తొలి అక్షర గ్రంథం. వేదం విషయంలో శ్రద్ధ కావాలి.
శ్రద్ధ కలవాడికి జ్ఞానం లభిస్తుంది. వేదాద్యయనానికి విధి నిషేధాలు లేవు.
తిట్టడానికీ కూడా వేదం చదవనూవచ్చు. అభ్యంతరం లేదు. వేదం రామాయణం,
భారతాదుల లాంటి కథా కావ్యం కాదు. వేదం కర్మ సాహిత్యం. చదవడం కొద్దిగా కష్టం
అనిపిస్తుంది. చదివినవే మళ్లీ చదవాల్సి రావచ్చును. ఒక్కొక్కసారి విసుగు కూడా కలగవచ్చును.
ఇది జీవితం లాంటిది. జీవితంలో చేసిన పనులే చేసేది,
అప్పుడప్పుడూ విసుగు కలుగుతుంది. వేదంలో వర్ణ వ్యవస్థను గురించిగాని, కులమతాలను గురించిన జాడలు కాని అంతగా కనిపించవు. వేదంలో ఎక్కడా
వేదాధ్యయనం కొందరికి మాత్రమే పరిమితమైనట్లుగాని, కొందరిని
నిషేధించినట్లు గాని, లేశ మాత్రం లేదు. అలాంటి ఆధారమే
కనిపించదు. వేదం ఎండలాంటిది. వెన్నెల లాంటిది. గాలి లాంటిది. నీరు లాంటిది.’
‘వ్యర్తజీవి నరకం చూస్తాడు. సార్థక
జీవికి అమృతం లభిస్తుంది. వేదం, జీవితం రెంటిలోనూ కష్టం తప్పక ఫలిస్తుంది.
వేదం వైరాగ్యం బోధిస్తుంది అనేది కేవలం అపప్రధ. వేదం జీవిత విరాట్ స్వరూపాన్ని
దర్శనం చేయిస్తుంది. జీవితం విశ్వరూపి. జీవితానిది విరాట్ స్వరూపం. దాన్ని
దర్శించగలగాలి. కష్టమే మరి! వేదం దర్శనం చేయిస్తుంది. వేద, వేదాంతాలు
సార్థక జీవితాన్ని ప్రభోధిస్తున్నాయి. జీవిత సుధను అందిస్తున్నాయి. వైరాగ్యం
బోధించినా జీవన గమనానికే ఉపదేశిస్తున్నాయి. వేదవేదాంగాలను వయస్సు మళ్లినవారూ, చావు దగ్గర పడ్డవారూ మాత్రమే చదవాలనడం పిచ్చి మాట. వాటి నిండా జీవితం
పరచుకొని ఉంది. బతకాల్సిన వాళ్లు చదవాలి. యువతీయువకులు చదవాలి. వాటిలో వాళ్లు
నేర్చుకునేవి చాలా ఉన్నాయి. వయసు మళ్లినవారు నేర్చుకోవాల్సినది ఏముంటుంది? అయినా జ్ఞానతృష్ణ తీరనివారికి భారత తాత్త్వికత కల్పతరువు. వేదం ఒక పూదోట.
ఇంట్లో పెట్టుకుంటే పరిమళిస్తుంది’.
‘వేదం సనాతనము,
పురాతనము, మహత్తమము, పవిత్రము, విశాలము, గహనము. ఉపమానానికి అందనిదే వేదం. వేదం అనే
పదం ఒక్కటే కాని అది అనంతం. ఈ అనంత వేదాన్ని ఆరాధించిన, ఆరాధించుతున్న, ఆరాధించనున్న వారు అనేకానేకులు. ఒక్క సూర్యుడే ఒక్కొక్క పరిశొధకునికి
ఒక్కొక్క రీతిగా కనిపించును, ఒక్క వేదం అనేది లెక్కకు మించిన
పరిశోధకులకు లెక్కకు మించిన రీతిగా కనిపించును. వేదాన్ని పరిశీలించిన, వ్యాఖ్యానించిన, విమర్శించిన వారు అనేకులు. వీరిలో
వేదాన్ని అధ్యయనం చేసి సద్విమర్శలు, దుర్విమర్షలు చేసినవారు
ఉన్నారు. అధ్యయనం చేసి దుర్విమర్శ చేసినవారిని అధ్యయనమే ఖండించవచ్చును. కాని
వేదాన్ని అధ్యయనం చేయకుండానే దాన్ని గురించి ఒక అభిప్రాయానికి వచ్చి దుష్ప్రచారం
చేసిన వారిని ఖండించడం అసంభవం. ఎందుకంటే వారెవరో తెలియదు. వారు ఏ ఆధారంతో అపోహలు
కలిగించారో అంతకంటేతెలియదు’.
‘వేదాన్ని గురించి అవ్యాఖ్య,
కువ్యాఖ్య చేసే వారు రెండు రకాలు. ఒకరేమో, సనాతనములం
అనిపించుకోవాలని అనుకునే స్వప్రయోజనపరులు. వీరు వాస్తవానికి సనాతనులు కారు. సనాతన
ముసుగు వేసుకున్నవారు. వేదం వారి స్వంత ఆస్తి అని భావించువారు. వీరికి ఏమీ
తెలియదు. ఇక పోతే, సర్వం వేదాల్లోనే ఉన్నదనే వారు రెండో రకం.
ఆధునికులం అనిపించుకోవాలనే ఉబలాటం ఉన్నవారు వీరు. వీరు వేదాన్ని పనికిరానిది గానూ, ఏదో ఒక వర్గానికి ఉపయోగ పడేదనే వారుగానూ ఉంటారు. వేదం మానవుని
మహిమాన్వితుడిగా దర్శించేది. మానవుని ఒక్కొక్కసారి దేవతలను మించినవారిగా చేసింది’.
‘వేదాధ్యయనం అంటే వల్లించడం మాత్రమేనా?
చాలామంది ఈనాటికీ అదే అనుకుంటున్నారు! వేదానికి సంబంధించిన కొన్ని కర్మల మంత్రాలు
వల్లించి వేదం చదివామంటున్నారు. వేదం చదివామన్న కొందరికి అక్షరాలు సహితం
రాకున్నవి. వేదం చెప్పేవారికి ఇది శ్రుతి అనీ, చదవాల్సిన
అవసరం లేదనే దురభిప్రాయం నేటికీ ఉంది. వేదం చదివి అర్థం గ్రహించినవారికి శుభాలు
కలుగుతాయి. పాప విముక్తుడు అవుతాడు. జ్ఞానం కలుగుతుంది. స్వర్గం లభిస్తుంది.
వేదానికి అర్థం తెలుసుకోరాదు అన్న వారున్నట్లే, అర్థం మాత్రం
తెలుసుకుంటే చాలును అనే వాళ్లూ ఉన్నారు. వేదం సస్వరంగా నేర్చుకొని అర్థం
తెలుసుకొన్న వాడే వాస్తవంగా వేదం చదివినవాడు. అయితే వేదం వల్లించడం దోషం కాదు.
అర్థం మాత్రం తెలుసుకోవడమూ తప్పు కాదు. రెండూ కలవడం ఉత్తమం’.
‘వేదంలోనే
సమస్తం ఉంది. వేదంలో లేనిది ఏదీ లేదు, ఆధునిక ఆవిష్క్రయలన్నీ
వేదంలోనే ఉన్నాయని నమ్మే వర్గం ఒకటుంది. వేదంలో ఏమీ లేదు, అంతా
ఛాదస్తం, అనేది ఒక వర్గం. ఒక వర్గపు ప్రయోజనాల కోసమే
రచించబడింది అనేది మరొక వర్గం. విచిత్రం ఏమంటే ఈ రెండు వర్గాలవారూ వేదాన్ని చదివిన
వారు కాదు. వీరు ఎవరో ఒకరి వ్యాఖ్యల మీద ఆధారపడిన వారు! అందుకే ముందు వేదం చదవాలి.
తరువాతనే వ్యాఖ్యానించాలి. వేదంలో వర్ణ వ్యవస్థను గురించిగాని, కులమతాలను గురించిన జాడలు కాని అంతగా కనిపించవు. వేదం అనగానే వైరాగ్యం
అనే ఒక అపార్థం అర్థంగా బహుళ ప్రచారంలోకి వచ్చింది. వాస్తవ సత్యం ఏమంటే వేదంలో
జీవితం, బ్రతకడం, ఆనందించడం ఉన్నది
తప్ప వైరాగ్యం అన్న పదమే కనిపించదు. వేదం సాంతం ఇహలోకాన్ని గురించే చెప్పింది.
అక్కడక్కడ స్వర్గ ప్రస్తావన ఉంది.’
‘సకల వేదాల రసం సామము అని అంటారు.
వేదాల్లో సామ వేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో మనస్సును, ప్రాణులలో చైతన్యాన్ని గొప్పగా చెప్పడం జరిగింది శ్రీమద్భగవద్గీతలో.
వేదాల్లో సామవేదం, యజుర్వేదంలో శతరుద్రియం శ్రేష్టమని
మహాభారతంలో ఉన్నది. ఛాందోగ్యంలో వాణి యొక్క రసం ఋక్కు అనీ,
ఋక్కు యొక్క రసం సామం అనీ, సామం యొక్క రసం గానమనీ చెప్పారు.
సామవేదమే వేదాలకు తలమానికమని మహర్షులు, తానే స్వయంగా సామ
వేదాన్నని కృష్ణ పరమాత్మ ప్రవచించారు. నాలుగు వేదాలలో పరిమాణంలో అన్నిటికన్నా
చిన్నది సామవేదం. ఋగ్వేదంలోని మంత్రాల సంఖ్య 10,580; శుక్ల యజుర్వేదంలో 1975; కృష్ణ యజుర్వేదంలో 2198; అథర్వ వేదంలో 5977 కాగా సామ వేదంలోని మంత్రాల సంఖ్య కేవలం 1875 మాత్రమే!
వాటిల్లోనూ 1504 ఋగ్వేద మంత్రాలు కాగా 99 మాత్రమే కొత్తవి. 272
పునరుక్తాలున్నాయి’.
‘సామ వేదంలో
రెండు భాగాలున్నాయి. ఒకటి పూర్వార్చిక, ఇంకోటి ఉత్తరార్చిక. మొదటి
దాంట్లో 4 అధ్యాయాలు, రెండో దాంట్లో 21 అధ్యాయాలు ఉన్నాయి.
సామవేదం పరిమాణానికి చిన్నదే కాని, ప్రభావానికి గొప్పది.
సామవేదపు కూర్పు ముద్దుగానూ, ముచ్చటగానూ, అందంగానూ ఉంది. పూర్వార్చిక లోని అధ్యాయాలను దేవతల పేర్ల మీదనే విభజించడం
జరిగింది. ఇది ఉపాసనకు ఎంతో సులభం. ప్రతి అధ్యాయం ఖండాలుగా విభజించడం జరిగింది.
ప్రతి ఖండానికీ మంత్ర సంఖ్య నియమం లేకున్నా సాధారణంగా పది మంత్రాలుంటాయి.
ఉత్తరార్చికలో 21 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయానికి ఖండాలున్నాయి. ప్రతి
ఖండానికి “తృ చ” లు ఉంటాయి. వీటికి మంత్ర సంఖ్యా నియమం లేదు.
ఒక్కొక్కసారి “తృచ” ఒక మంత్రంతోనే ముగుస్తుంది. ఎక్కువ “తృచ”
లు మూడు మంత్రాలతో ముగుస్తాయి. ఇవి ఉద్గాతలకు అనుకూలంగా,
గానానికి అందంగా, సుందరంగా, మధురంగా
ఉంటాయి’.
‘సామ వేదంలో
యజ్ఞయాగాది క్రతు నిర్వహణ, విధి, పశుహింస లాంటివి కనిపించవు. ఇది అహింసా
విధిగా, కేవలం ఉపాసనగా కనిపిస్తుంది. యజుర్వేదంలో లాగా
ఒకరికి హాని కలిగించే మంత్రాలు కాని, ప్రయోగాలు కానీ
కనిపించవు. సామవేద మంత్రాలు కేవలం దేవతలను స్తుతిస్తాయి. వారి గుణగణాలను
వర్ణిస్తాయి. ఉపాసకులకు శాంతి సౌభాగ్యాలను అర్థిస్తాయి. కొన్ని మంత్రాలు ఫలాపేక్ష
రహితాలు. కేవలం దేవతల గుణగణాల్ని స్తుతిస్తాయి. మానవునికి శాంతి, సౌభాగ్యం, సుఖం, ఆనందం
కలిగించేది సామవేదం.’
‘సామవేదమే
భారత సంగీత శాస్త్రానికి మూలం అవుతుంది. భారతీయ సంగీతం సామగానంతోనే మొదలైంది.
వేదాన్ని స్వర రహితంగా ఉచ్చరించడం నేర్పడానికి ఒక సమగ్ర శాస్త్రం ఉంది. దానిని
“శిక్ష” అంటారు. స్వర మండలంలో ఏడు స్వరాలు, మూడు గ్రామాలు, ఇరవై యొక్క మూర్ఛనలు, నలబై తొమ్మిది తానాలు ఉంటాయి.
సామగానానికి పది రకాల గుణ వృత్తులు చెప్పబడ్డాయి. సామగానం నాలుగు విధాలని చెప్పడం
జరిగింది. అవి వరుసగా: గ్రామగృహగానం, అరణ్యక గానం, ఊహ గానం, ఊహ్య గానం. సామ గాయకుడు ముందు ప్రణవాన్ని,
తరువాత గాయత్రిని ఉచ్చరించి సామగానం ప్రారంభించాలి. అతడు అంగుళులు
చాచి స్వరమండలం ఆలాపించాలని శిక్షా శాస్త్రం బోధిస్తున్నది’.
‘వేదం భగవంతుని వాక్కు. భగవంతుడు,
పరాత్పరుడు, ఈశ్వరుడు ఒక్కడే! నా ద్వితీయం, అంటే, రెండవ వాడు లేడు. సమస్త చరాచర ప్రకృతికి, సృష్టి, స్థితి, లయకారుడు
అతడే! అతని వాక్కునకు, వేదానికి జరామరణాదులు లేవు! వేదానికి
దేశాల హద్దులతో, మతాలతో, వర్ణాలతో, కులాలతో ప్రమేయం లేదు. అదితి భూమి. అది అవిభాజ్యం. వేదం సమస్త మానవాళికి
జీవితం, నీతి, ధర్మం నేర్పింది. వేద
ధర్మమే క్రీస్తు పూర్వపు మహా నాగరికతలకు కారణం. పారిశ్రామిక విప్లవం వచ్చి మనిషిని
మరగా మార్చే దాకా సమస్త ప్రపంచం గ్రామ జీవితమే! ఆ జీవితం ఏర్పరిచింది వేదమే!
వేదమే! వేదం సమస్త భూమండలాన్ని గురించి చెప్పింది. వసుదైవ కుటుంబం అన్నది’.
‘ఏ ప్రాణినీ
హింసించకు అంటుంది వేదం. పశుపక్ష్యాదులను, వృక్ష లతా గుల్మాదులను,
క్రిమి కీటకాదులను హింసించ రాదు. పృథివి, అప్, తేజో, వాయు, ఆకాశాలు పంచ
భూతాలు. భూతం అంటే ప్రాణం ఉన్నది అని అర్థం. అందువలన పంచ భూతాలను సహితం
హింసించరాదు. “అమ్మా! భూమీ! నిన్ను త్రవ్వక తప్పడం లేదు. బాధ
కలిగిస్తున్నాను. మన్నించు. మళ్లీ పూడుస్తాను” అని నేలను
త్రవ్వుతారెవారైనా. “వృక్ష శాఖా! నిన్ను వర్షం కొరకని నరుకుతున్నాను”
అని అంటారు. వేదం అందరికీ తెలియక పోవచ్చు. వేదం సంప్రదాయం మాత్రం అందరికీ తెలుసు.’
‘ఇప్పటికీ
పల్లెల్లో నేల త్రవ్వేప్పుడూ, చెట్టు కొట్టేప్పుడూ మొక్కుతారు. వేదం
మానవత, ప్రేమ, కరుణ, దయ, అహింసలను బోధించింది. అధ్వరం అహింసా యజ్ఞం!
బుద్ధుడి అహింసకు మూలాలు వేదంలో ఉన్నాయి. క్రీస్తు, గౌతమ బుద్ధుడి అహింస, కరుణలనే అవలంభించాడు. ప్రచారం చేశాడు. క్రైస్తవం అభినవ బౌద్ధమే! అన్యం
కాదు. బౌద్ధం నుంచి క్రైస్తవం వచ్చింది కాబట్టి క్రైస్తవపు మూలాలు సహితం వేదం
లోనివే! ఇక ఇస్లాం అంటే శాంతి, వినయం,
క్షేమం. ఇస్లాం మీద క్రైస్తవ ప్రభావం ఉన్నది కాబట్టి ఇస్లాం మూలాలు సహితం వేదం
లోనివే! మహాత్ముడి శాంతి, సామరస్యం,
అహింస, గ్రామ స్వరాజ్యం అన్నీ వేదం నుండి నడచి వచ్చినవే!’.
(డాక్టర్
దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)
No comments:
Post a Comment