Sunday, February 4, 2024

సంస్కృతి, విశ్వాసం, ధర్మం, న్యాయం, సత్యం, జీవన విధానమే భారత తాత్వికత ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-10 : వనం జ్వాలా నరసింహారావు

 సంస్కృతి, విశ్వాసం, ధర్మం, న్యాయం, సత్యం, 

జీవన విధానమే భారత తాత్వికత

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-10

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (5-2-2024)

‘భారతం ఒక నేల, ఒక దేశం మాత్రమే కాదు. భారతం ఒక సంస్కృతి, ఒక విశ్వాసం, ఒక ధర్మం, ఒక న్యాయం. ఒక సత్యం. అదొక జీవన విధానం. అది ఆకాశమంతటిది! భూగోళమంతటిది! సముద్రమంతటిది! భారతదేశం కర్మ భూమి. కర్మ అంటే పని. కార్మికుడు అంటే పనిచేసేవాడు. కర్మభూమి అంటే పని, కృషి, నైపుణ్యానికి విలువ ఇచ్చే దేశం అని అర్థం. మానవుడు స్వశక్తితో దేవత కాగలడని నమ్మకం కలిగించిన కర్మ భూమి, భారత భూమి. కర్మ, పని, పరిశ్రమ, నైపుణ్యం లాంటి వాటికి అంతటి గౌరవం, స్థాయి, అంతస్తు కలిగించిన భారతతాత్వికత జడం కాదు. భారత తాత్వికత కాల ప్రవాహం వంటిది. అది స్రవంతి! భారత సిద్దాంతం ఒకటి కాదు, అనేకం. మన తత్త్వం, ప్రకృతి తత్త్వం. భిన్నత్వంలో ఏకత్వం మన జీవన విధానం. వేదాలకు భిన్నమైన జైన, బౌద్ధ, చార్వాకాలతో మనం సహజీవనం చేశాం. ఇస్లాం, క్రైస్తవంతో సహజీవనం చేస్తున్నాం. భారత ధర్మం, సిద్దాంతం, తాత్త్వికత, గతాన్ని ధ్వంసం చేయదు. భవిష్యత్తును శాసించదు. సకల ఆలోచనా విధానాలతో గంగా ప్రవాహం లాగా నిరంతరం పవిత్రంగా ప్రవహిస్తుంటుంది. భారతీయులంతా బహు దేవతారాధకులు. ఇది భారతీయ మతం. ఆ జాతి స్వభావం. దాని నాగరికత. దాని సంస్కృతి.’

‘వేదానికి మనిషి మీద, అతని సంకల్పం మీద అనంత విశ్వాసం. నరుడు “అహం బ్రహ్మాస్మి”, అంటే, బ్రహ్మ వరకు చేరుకోగలడు. ముందు అతడు మానవుడు కావాలి. మానవ సమాజానికి హితవు చేకూర్చిన వారిని దేవతలు అనవచ్చు. ప్రకృతి శక్తులైన సూర్య, చంద్ర, అగ్ని మున్నగు వాటితోనే సకల చరాచర సృష్టి జీవిస్తున్నది, నశిస్తున్నది కాబట్టి వీరు దేవతలు. పృథివి, అప్ జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచ భూతాలు. ఇవి సమస్త సృష్టి, స్థితి, లయాలకు కారణం అవుతున్నాయి. అయితే వేదంలో పంచ భూతాల వంటి నిర్వచనం లేదు. కాబట్టి దేవతల సంఖ్య స్పష్టంగా లేదు.’

‘అయినప్పటికీ ఒక ఋజువు ప్రకారం దేవతల సంఖ్య 33 గా నిర్ణయించడం జరిగింది. వేదంలో 33 దేవతల వర్గీకరణ ఇలా ఉంది: 11 మంది భూమి మీద (అగ్ని, జలం లాంటి వారు), 11 మంది అంతరిక్ష వాసులు (నాకవాసులు, ఇంద్రాదులు), 11 మంది ద్యులోక వాసులు (సూర్య చంద్రాదులు). వేదంలో ఈ సంఖ్య అంతటితో ఆగినట్లు కనిపించదు. రోలు, మండుకము, సోమము, ఋతువులు, దాతలు, రాజులు, ఇలా పెక్కురు దేవతలున్నారు. వృక్ష, లతా, గుల్మాదులు మానవ జాతి మనుగడకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఉదాహరణకు, వేదం వృక్ష ప్రాధాన్యతను గుర్తించింది. వృక్ష, లతా, గుల్మాదులను దేవతల్లో చేర్చింది. సూర్య చంద్రాదులు తమకున్న శక్తుల వల్ల దేవతలైనారు. ఇంద్రుడు, అశ్వినులు, ఋతువులు, కేవలం తమ పరిశ్రమతోనే దేవతలైనారు. మానవ వికాసానికి తోడ్పడిన పనిముట్లు సహితం దేవతలైనాయి. రోలు, రోకలి, రుబ్బురాయి లాంటి మానవ వికాసానికి తోడ్పడిన వాటిని శుభకార్యాలలో పూజిస్తాం. కప్పను దేవతను చేసి స్తుతిస్తాం.’

         ‘అవతరించడం, అంతరించడం ప్రకృతి ధర్మం. సృష్టిలో పరాత్పరుడికి తప్ప ఎవరికీ శాశ్వతత్వం లేదు. అన్నీ మారాలి, అన్నీ అంతరించాలి. కాల వ్యత్యాసం అంతే. సూర్యచంద్రాదులు కూడా అంతరించవలసినవారే! ఋగ్వేదంలో సోమము దేవత అయింది. దానికి అంతటి ప్రభావం ఉండవచ్చు! ఇంద్రాదులకు అదే శక్తిని ప్రసాదించింది. అంతటి సోమము కాలగర్భంలో కలిసి పోయింది. అవతరించడం, అంతరించడం, దేవతలకు వర్తిస్తుంది. వేదంనాటి దేవతలు నేడు లేరు. వారికి ఆరాధన లేదు. వేదంలో అవతారాలు లేవు. ఒక్క చోట వామనుడి ప్రస్తావన వస్తుంది. అప్పటి వామనుడు అవతార పురుషుడు కాదు. అవతారాల సిద్దాంతానిది మహా ఇతిహాసం! వేదంలో దేవతలు నిరాకారులుగానే స్తుతించబడినారు. ఆరాధించబడినారు. వేదాల్లో విగ్రహారాధన లేదు. వేదం నిండా కామ్య కర్మలే! హవిస్సులు అర్పించడం వరాలు కొనిక్కోవడానికే! కామ్య కర్మలు యజమానులు స్వయంగా చేయరు. పురోహితులతో చేయిస్తారు.’

         ‘పరమాత్మ సత్య స్వరూపుడు. సత్య దర్శనానికి మానవ జాతి సాంతం, దేశకాల వ్యత్యాసం లేకుండా, నిరంతరం అన్వేషిస్తున్నది. ఇంతవరకు ఎంతటి మహర్షులకు, అవతార పురుషులకూ సత్య దర్శనమే కాలేదు. సృష్టి, స్థితి, లయకారుడగు పరమాత్మ అగమ్య గోచరుడు. అనిర్వచనీయుడు. అతడి, లేదా, ఆమె రూపగుణాలను దర్శించిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. పరమాత్మ లభించడు. అందడు. ఆ పరాశక్తి, పరాత్పరుడు, మహోన్నతుడు. అతడు నరుడికి అందడు. మానవుడి జ్ఞానం సర్వేశ్వరుడిని ఎరుగుటకు సాధ్యపడదు. ఆ శక్తే, ఆ పరాత్పరుడే సమస్తాన్ని సృష్టించాడు. ఆధారం లేకుండానే భూమిని, సూర్యచంద్రాది గ్రహనక్షత్రాదులను సృష్టించాడు. విశ్వం, భూమి, సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులకు పరమేశ్వరుడే ఆధారభూతుడు.’

         ‘మానవుడు దర్బలాంటి దుర్బలుడు. వ్యాపారం కోసం ఎన్నో యంత్రాలను కనుగొన్నాడు. అయినా, ప్రకృతిని, మానవ ప్రకృతిని, వ్యక్తిగా తన ప్రకృతిని అర్థం చేసుకోలేకపోయాడు. కాకపోతే మానవుడి దగ్గర ఒక మహత్తున్నది. అదే, ఆలోచన, అన్వేషణ. అది ఆగదు. ఆదిమానవుడి నుంచి భగవంతుడి కోసం అన్వేషిస్తూనే ఉన్నా, భగవంతుడు కనిపించలేదు. మారుగా, భగవంతుడి ప్రతిరూపాలను కల్పించాడు, సృష్టించాడు. అలాంటి ఈశ్వరుడి ప్రతిరూపాలే దేవతలు. మహాత్ములు, యోగులు, అవతారాలు, ప్రవక్తలు. వీరిలో ఎవరూ భగవంతుడి సంపూర్ణ రూపాన్ని దర్శించలేదు. అందరూ భగవదంశను మాత్రం దర్శించగలిగారు. భగవంతుడుని మాత్రం కానేకాదు’.

‘పరాత్పరుడు అందనివాడు. యోగులు, ప్రవక్తలు వారికి అందిన వారిని మనకు చూపారు. పరాత్పరుడు సత్యం, దేవాదులు విశ్వాసం. వేదం సత్యాన్వేషణమే. సూర్య, చంద్ర, అగ్ని, వాయువులు భగవంతులు కారు. వారు భగవంతుడి అంశామాత్రులే. పరాత్పరుడు కర్త. సూర్య చంద్రాదులు అతని సృష్టి మాత్రమే. వారు అశాశ్వతులు. వారికి అంతం ఉంది. భగవానుడు శాశ్వతుడు. అనంతుడు. ఎవరు భూమిని సృష్టించారో, ఎవని బలం సత్యమగునో, ఎవడు ఆకాశంలో ఆనందవర్థకమగు జలరాశిని సృష్ట్టించాడో, అతడెవరో తెలియలేదు. ఎవడు అనే ప్రశ్న మాత్రమే మిగిలింది. ఒక విషయం స్పష్టం. ఉన్నది ఒకే సర్వేశ్వరుడు. అతడే సృష్టి, స్థితి, లయ కర్త.’

         ‘కౌత్స ఋషి వేదానికి అర్థం ఉండదనీ, వేదార్థం తెలిసికోరాదనీ సిద్దాంతరీకించాడు. దీనికేదైనా బలమైన కారణం ఉండి ఉండాలి. ఋషి స్వప్రయోజనం మాత్రం కాదు. వేదం అందరూ చదువరాదనీ, నిషేధించాలనీ అనడం వల్ల కొందరిలో ఆగ్రహం ఉన్న మాట వాస్తవం. అయితే, నాలుగు వేదాల్లోనూ, ఎక్కడా వేదాధ్యయనాన్ని గూర్చి నిషేధాలున్న దాఖలాలు లేవు. మహర్షులు, మహాత్ములు, కులం, మతం లాంటి మామూలు విషయాలకు లొంగారు. వారికి, తమవంటివే సమస్త ప్రాణులు. వేద పఠనాన్ని గురించిన నిషేధానికి కారణం, వేదకర్మలే ఉపాధిగా జీవించే కొందరు స్వప్రయోజన పరులు ప్రక్షిప్తంగా చేర్చి ఉండవచ్చు. ఇప్పుడు వేదం సకల జనులకూ అందుబాటులోకి వచ్చింది, అన్య మతస్తులు కూడా వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. అంతకు ముందు నిషేధాలు వాస్తవంగా ఉన్నా అవి ఇప్పుడు ఆవిరి అయిపోయాయి. ప్రస్తుతం వేదాధ్యయనానికి శ్రద్ధ మాత్రమే కావాలి, అవసరం కూడా.’

         ‘వేదం సూర్యుడి లాంటిది. సూర్యకాంతి లాంటిది. వేదం కుల, మత, ప్రాంత, దేశాలకు అతీతం అయింది. అది సకల మానవాళికి చెందింది. వెలుగునూ, అగ్గిని మూటకట్టి దాయగల మొనగాడు లేడు. కులమతాలకు అతీతంగా అందరికీ వేదం అందాలనేది భగవత్ సంకల్పం. కుల, మత వివక్ష లేకుండా వేదాన్ని సకల జనులూ తాకాలి. పూజించాలి. అధ్యయనం చేయాలి. వ్యాఖ్యానించాలి. వేదం కన్నా ప్రాచీన గ్రంథం లేదు. వేదాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు. వేదం నుంచి కర్మ ఆశించవద్దు. జ్ఞానం ఆశించాలి. వేదానికి అర్థం ఉంది. దాన్ని తెలుసుకోలేని వాడు అంధుడు అవుతున్నాడు. అంధునికి  వేద కర్మ కనిపిస్తుంది. వేదార్థం కనిపించదు. వేదం చదివి అర్థం చేసుకున్నవాడికి సకల శుభాలు కలుగుతాయి. జ్ఞాన తేజస్సు పాపాలను కడిగి వేస్తుంది. అతనికి స్వర్గం ప్రాప్తిస్తుంది అని అన్నాడు యాస్క ఋషి.’

ఖమ్మం జిల్లా వల్లభి గ్రామ వాస్తవ్యుడు స్కందస్వామి, ఉద్గీత, వేంకటస్వామి వేదానికి వ్యాఖ్యానం రచించారు. ఆంధ్ర బ్రాహ్మణుడు సాయణాచార్యుడు వేద వ్యాఖ్య రచించాడు. వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్య విద్వాంసులు సాయణుని వ్యాఖ్య ఆధారంగానే వేదాన్ని అర్థం చేసుకున్నారు.  తెలుగువారు వేదం వ్యాఖ్యకు అపారమైన సేవలు చేసారు.’

         ‘ఆదునిక భారతీయ వ్యాఖ్యాతల్లో గొప్ప సంఘ సంస్కర్త, మహర్షి దయానందుడు అగ్రగణ్యుడు. వేదాన్ని గురించి అంతకు ముందు ఎరుగనంతటి ప్రచారం చేశాడు. వర్ణ వ్యత్యాసం లేకుండా సకల జనులకూ వేదం ఉపదేశించాడు. ఆర్యసమాజం స్థాపించాడు. ఆసేతు హిమనగం అనేకులను బ్రాహ్మణులను చేశాడు. నేటి ఆర్య సమాజీయులకు వేదం ప్రమాణం కాదు కాని దయానందుడు ప్రమాణం! దయానందుడికి మాత్రం వేదం ప్రమాణం. భారతీయులకు ఒకే గ్రంథం వేదం, ఒకే ఈశ్వరుడు ఉండాలని ప్రయత్నించారు దయానందులు. భారత ధర్మం అచ్చంగా గ్రంథం మీద ఆధారపడి లేదు. సదాచారాలు, సంప్రదాయాలు దీనికి మూలాధారం. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంప్రదాయం. ఆది శంకరుడు సహితం అద్వైతం ద్వారా ఏకేశ్వర ప్రతిపాదన చేసి సరిదిద్దుకున్నారు. దయానందుడు వేదాన్ని కర్మ మార్గంగా అంగీకరించాడు. వేదం జ్ఞాన మార్గమనీ, ఆధ్యాత్మిక ఔన్నత్యమనీ అంటారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణలు, పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, విభిన్న తాత్త్వికతలనూ, సిద్ధాంతాలనూ ప్రతిపాదించినా సహజీవనం చేస్తాయి. వేదాన్ని వ్యాఖ్యానించిన అరవిందులు వేదాలకు అంతరార్థాలు వెలికి తీసే ప్రయత్నం చేశారు.’

          ‘శుక్ల యజుర్వేదానికి “శ్రీమద్వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత” అనే పూర్తి పేరు రావడాన్ని గురించి మహీదర భాష్యం వివరించింది. తొలుత వేదం బ్రహ్మ నుంచి పరంపరగా లభించింది. వ్యాసమహర్షి మనుష్యుల మందమతిత్వాన్ని గురించి ఆలోచించి, వేదాన్ని ఋగ్యజుస్సామాథర్వణ అనే నాలుగుగా విభజించాడు. వాటిని వేద వ్యాసుడు పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించాడు. వారు వారి శిష్యులకు ఉపదేశించారు. అలా పరంపరంగా వేదం సహస్రశాఖలయింది. తరువాత వ్యాస వైశంపాయనుడు యాజ్ఞ్యవల్క్యాదులగు తన శిష్యులకు యజుర్వేదం ఉపదేశించాడు.’

ఒకప్పుడు వైశంపాయనునికి దైవికంగా, ఏదోకారణాన కోపం వచ్చింది. అప్పుడు యాజ్ఞ్యవల్క్యుడిని తన శిష్యత్వం నుంచి బహిష్కరించాడు. యోగ బలంకల యాజ్ఞ్యవల్క్యుడు తను నేర్చిన విద్యను వాంతి చేశాడు. గురువు ఆజ్ఞాపించగానే, వైశంపాయనుడి ఇతర శిష్యులు తిత్తిరి పక్షులు అయినారు. యాజ్ఞ్యవల్క్యుడు వాంతిచేసిన విద్యను భుజించారు. ఆ యజస్సులో బుద్ధిమలినాలు అయ్యారు. అందువలన కృష్ణ యజస్సులు అయినాయి. అప్పుడు యాజ్ఞ్యవల్క్యుడు బాధపడ్డాడు. అతడు సూర్యుడిని ఆరాధించాడు. సూర్యుడి నుండి శుక్ల యజస్సులను అందుకున్నాడు. ఆ యజస్సులను జాబాలి, బౌధేయ, కాణ్వ, మాద్యందినాది పదిహేను మంది శిష్యులకు బోధించాడు. వాజసని పుత్రుడు యాజ్ఞ్యవల్క్యుడు కావున వాజసనేయి అయింది. మాద్యందిన మహర్షికి లభించినందున మాధ్యందిన అయింది. ఆ విధంగా ఈ వేదం “శ్రీమద్వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత” అయింది.’ 

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

No comments:

Post a Comment